రీల్స్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయా, పిల్లల్లో డిప్రెషన్‌కు కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక ధిమాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
మన మానసిక ఆరోగ్యం గురించి ఎలా తెలుసుకోవచ్చు.
మన ఇబ్బంది తీవ్రమైన అనారోగ్యంగా ఎప్పుడు మారుతుంది?
డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్న వారు ఎప్పుడు వైద్య సాయం తీసుకోవాలి?
మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కోమల్‌ప్రీత్ కౌర్‌తో బీబీసీ మాట్లాడింది.


సైకాలజిస్ట్ అంటే మానసిక ఆరోగ్య నిపుణులు. మన ఆలోచనలను, భావాలను, ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో మనకు సాయం చేస్తారు.
కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా భావోద్వేగపరమైన ఇబ్బందులను అధిగమించడానికి సాయపడతారు.
సైకియాట్రిస్ట్ అంటే వైద్యులు. మందులతో రోగులకు చికిత్స చేస్తారు.
సైకాలజిస్టులు మందులు ఇవ్వరు.
మానసిక సమస్యలు తీవ్రమైనప్పుడు మందులు అవసరమవుతాయి. వాటిని సైకియాట్రిస్ట్ సూచిస్తారు.
చాలా సందర్భాల్లో సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఇద్దరూ ఓ టీమ్‌లా పనిచేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఒక వ్యక్తి రెండు వారాల కంటే ఎక్కువ కాలం నుంచి ఇబ్బంది పడుతుంటే, కారణం లేకుండా ఆందోళన చెందుతుంటే, ఎక్కువగా లేదా చాలా తక్కువగా నిద్రపోతుంటే, ఆకలి ఎక్కువగా లేదా తక్కువగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.
చాలా ఎక్కువ ఒత్తిడి లేదా ఆందోళనకు గురవుతుండడం, ఇతరులకు దూరంగా ఉండడం, ఎవరినీ కలవకపోతుండడం, గతంలో సంతోషంగా చేసిన పనులను ఇప్పుడు చేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏదో సమస్య ఉన్నట్టు అర్ధం.
అప్పుడు మానసిక ఆరోగ్య నిపుణుల సాయం తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images

సాధారణ బాధ ఒక పరిస్థితి వల్ల వస్తుంది. కొంత సమయం తర్వాత తగ్గిపోతుంది. కానీ డిప్రెషన్ వల్ల వచ్చే బాధ చాలాకాలం పాటు ఉంటుంది.
దాని ప్రభావం శరీరంపై కూడా కనిపిస్తుంది. సరిగ్గా నిద్రపోలేరు. సరిగ్గా తినలేరు. తాగలేరు. ఇతరులతో మాట్లాడడం, కలవడం కూడా మానేస్తారు.
దీని ప్రభావం రోజువారీ జీవితంపై, సంబంధాలపై కూడా పడుతుంది.

కొన్ని విషయాలు మన జన్యువులపై ఆధారపడి ఉంటాయి. మరికొన్ని మన చుట్టూ ఉన్న పరిస్థితులు, వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీ కుటుంబంలో ఎవరికైనా డిప్రెషన్ వంటి సమస్య ఉంటే, మీకు కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు.
అలాంటి వ్యక్తులు తమ గురించి తాము ప్రతికూలంగా ఆలోచిస్తారు. ప్రపంచం గురించి, భవిష్యత్తు గురించి కూడా ప్రతికూలంగా ఆలోచిస్తారు. తమ భవిష్యత్తుపై వారికి ఎలాంటి ఆశ కనిపించదు. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images

సైకోథెరపీ ఇస్తారు. ఉదాహరణకు సీబీటీ (కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ). వ్యక్తి ఆలోచనా విధానాన్ని మార్చడంలో నేరుగా సాయపడుతుంది. అలాగే డీబీటీ (డయలెక్టికల్ బిహేవియర్ థెరపీ)ని ఇస్తారు. ఇది వ్యక్తి భావోద్వేగాలపై నేరుగా పనిచేస్తుంది.
హిప్నోథెరపీ, ఎన్ఎల్‌పీ వంటి థెరపీలను కూడా ఇస్తారు. కొత్తగా ఆలోచించడం, కొత్త ఆలోచనావిధానాలను ఏర్పరుచుకోవడంలో ఇవి సాయపడతాయి. గెస్టాల్ట్ థెరపీ అనేది శరీరం, మెదడు, భావోద్వేగాలకు సంబంధించిన సమస్యలపై పనిచేస్తుంది.

శారీరక ఆరోగ్యం బాగోలేకపోతే తరచుగా అనారోగ్యానికి గురైనట్టే, మానసిక ఆరోగ్యం బాగోలేకపోతే తరచూ మానసిక అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది.
మానసిక ఆరోగ్యం బాగా లేకపోతే ప్రతిదాన్నీ ప్రతికూలంగా చూస్తుంటారు. ప్రవర్తనావిధానం కూడా ప్రతికూలంగా ఉంటుంది.
మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైంది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిరోజూ కనీసం అరగంట సమయాన్ని మన కోసం కేటాయించుకోవాలి. వ్యాయామం చేయాలి. నడవాలి. మంచి ఆహారం తినాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
ఆహారంతో ఆలోచనలకు సంబంధం ఉందన్నది నిజమే.
ధ్యానం చేయాలి. దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇవన్నీ యాంటీ-వైరస్‌లలా పనిచేసి ప్రతిరోజూ చురుగ్గా, సానుకూలంగా ఉండేలా సాయపడతాయి.
వాటి వల్ల సంతోషానికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి.

ఒత్తిడి పరిస్థితులను బట్టి వస్తుంది. పరిస్థితులు సరిగ్గా మారితే ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.
గతంలోని బాధాకరమైన విషయాలను పదే పదే గుర్తుచేసుకుంటూ వాటి నుంచి బయటపడలేకపోవడాన్ని డిప్రెషన్ అంటారు.
భవిష్యత్తు గురించి ఏదైనా బాధ ఉండటాన్ని ఆందోళన అంటారు.
కారణం ఉన్నా లేకపోయినా ఆందోళన కలగొచ్చు.
ఆ ఆందోళన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయడం మొదలైతే అది సమస్యగా మారుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస రీల్స్‌ను చూస్తుంటే ఒక రీల్‌లో ఒక భావోద్వేగం, రెండో రీల్‌లో మరొక భావోద్వేగం, మూడవ రీల్‌లో ఇంకొక భావోద్వేగం ఉంటుంది.
దీంతో భావోద్వేగాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. వాటిని సరిగ్గా అర్ధం చేసుకునే, నియంత్రించుకునే అవకాశం ఉండదు.
మన భావోద్వేగాలను ఎలా అర్ధం చేసుకోవాలో మనకు తెలియడం లేదు.
అంతేకాకుండా మనం స్క్రీన్‌పై ఎన్ని విషయాలను చూస్తామో అవన్నీ మన మెదడులో కూడా ఒకేసారి నడుస్తుంటాయి. దీంతో మెదడు మొద్దుబారిపోతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్ధం కాకుండా పోతుంది.

ఫొటో సోర్స్, Getty Images

అన్నింటికన్నా ముందుగా సోషల్ మీడియా చాలా పెద్ద కారణం. అదే సమయంలో పిల్లలు ఒకరితో ఒకరు తమను తాము ఎక్కువగా పోల్చుకుంటారు. తల్లిదండ్రుల నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది. సమాజం నుండి కూడా ఒత్తిడి ఉంటుంది. పిల్లలుతమపై తాము పెట్టుకునే అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
వాటిని అందుకోలేకపోతే పిల్లలు ప్రతికూల ఆలోచనలవైపు వెళ్లిపోతారు. తమతో తామే ప్రతికూలంగా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. దీంతో వాళ్లు క్రమంగా డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే పిల్లలు అడిగిన ప్రతీది ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పిల్లలకు 'నో' అంటే ఏంటో, తిరస్కరణను ఎలా ఎదుర్కోవాలో తెలియకుండా పోతోంది.
ఎప్పుడైనా వాళ్లకు 'నో' చెప్పినా, బయటినుంచి వాళ్లకు 'నో' ఎదురైనా వాళ్లు దాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
పిల్లలు అడిగే పదివిషయాల్లో నాలుగింటికి సరైనవైతేనే వాటిని ఒప్పుకోవాలి. అయితే ఏ విషయానికైనా నో చెప్పాల్సివస్తే దానికి కారణాన్ని పిల్లలకు వివరించాలి.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పచ్చి మట్టిలా ఉంటారు. కుండలు చేసే వ్యక్తి పచ్చి మట్టికి ఎలా ఆకారం ఇస్తారో అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఒక ఆకారం ఇస్తారు.
పిల్లలు మంచి పనిచేస్తే, వారి ప్రయత్నాలను తల్లిదండ్రులు ప్రశంసించాలి.
దీనివల్ల 'నేను ప్రయత్నించాను, అందుకే ఈ ఫలితం వచ్చింది' అనే భావన పిల్లల్లో కలుగుతుంది.
అయితే మనం పిల్లలను వాళ్ల ముందే ఎక్కువ పొగిడితే వాళ్లకు అహంకారం పెరగొచ్చు.
పిల్లలకు ముద్రలు వేయొకూడదు. అంటే వాళ్లను నిరుత్సాహపరిచే మాటలు చెప్పకూడదు. ఉదాహరణకు 'నువ్వు చాలా సోమరివి. నువ్వు ఫెయిల్ అవుతావు' వంటివి.
ఇలాంటి మాటలు మాట్లాడితే పిల్లలకు మనం నష్టం చేస్తున్నట్టు. వాళ్లు కూడా తమను తాము అలాగే చూడడం మొదలుపెడతారు.
'నువ్వు చెడ్డ' అని పిల్లలతో ఎప్పుడూ చెప్పకూడదు. 'నువ్వు చేస్తున్నది తప్పు పని' అని మాత్రమే చెప్పాలి.
అలాగే పిల్లలతో మంచి సమయం గడపాలి. వాళ్లకు అవసరంలేని సలహాలు ఇవ్వకూడదు. వారితో ఆటలాడాలి. పిల్లలకు, తల్లిదండ్రుల మధ్య అనుబంధం తగ్గిపోతోంది. ఈ అనుబంధాన్ని మళ్లీ పెంచడం చాలా అవసరం.
పిల్లలు చెప్పేది వినాలి. తల్లిదండ్రులు తమను అర్థం చేసుకోవడం లేదని పిల్లలు భావిస్తున్నారు.
పిల్లలు తాము తప్పుచేశామని తల్లిదండ్రులతో చెప్తే తల్లిదండ్రులు వారిని తిట్టడం మొదలుపెడతారు. అలాంటి పరిస్థితిలో ఆ పిల్లలు ఏం చేస్తారు? తమకు జరిగిన విషయాలను తర్వాతిసారి చెప్పడం మానేస్తారు. అందుకే పిల్లలతో పాటు కూర్చుని వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images

మనం పనిచేసేచోటు కూడా మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ముందుగా వ్యక్తిగత జీవితం, ఉద్యోగ జీవితానికి మధ్య సమతుల్యత పాటించడం నేర్చుకోవాలి.
ఆఫీసు విషయాలను ఆఫీసులోనే వదిలేసి ఇంటికెళ్లాలి. ఇంట్లో సమస్యలను ఆఫీసుకు తీసుకెళ్లకూడదు. ఈ సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.
ఇంటికి వెళ్లేటప్పుడు ఆఫీసు సమస్యలన్నింటినీ మనతో పాటు తీసుకెళ్లకూడదు. అలాగే ఇంటి సమస్యలను ఆఫీసుకు తీసుకెళ్లకూడదు.
మన వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల మధ్య ఒక హద్దును ఏర్పరుచుకోవడం నేర్చుకోవాలి.
శ్వాసకు సంబంధించి వ్యాయామాలను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.
ఉదాహరణకు బాక్స్ బ్రీతింగ్, బటర్ ఫ్లై బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, 4-7-8 బ్రీతింగ్.
గంట లేదా రెండు గంటలకు ఓ సారి సమయం దొరికినప్పుడల్లా ఈ శ్వాస వ్యాయామాలను చేయాలి. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. మనం ప్రశాంతంగా ఉండడానికి సాయపడుతుంది.
మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. ఆఫీసులోనైనా, ఇంట్లోనైనా తోటివాళ్లతో, కుటుంబసభ్యులతో మన సంబంధాలు బాగుంటాయి. ఇవన్నీ సరిగ్గా ఉంటే మిగతా విషయాలు కూడా వాటంతట అవే సరిగ్గా మారతాయి.

ఇల్లు, పిల్లలు, కెరీర్, ఆర్థిక పరిస్థితి - వీటన్నింటినీ సమతుల్యం చేసుకోవడం మహిళలకు పెద్ద సవాల్. ఒక మహిళ ఉద్యోగానికి వెళ్లినప్పుడు కూడా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు? భర్త ఏం చేస్తున్నాడు? ఇంటికి వెళ్లిన తర్వాత ఏ పనులు చేయాలి? ఇంటికి అతిథులు వస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఆమె మనసులో ఒకేసారి మెదులుతూ ఉంటాయి.
మధ్యమధ్యలో విరామం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఉద్యోగం చేసే మహిళల మనసులో నిరంతరం నడిచే ఈ ఆలోచనలు వారి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి.
ఉద్యోగం చేయని మహిళలకు కూడా ఇలాంటి సమస్య ఉంది.
కొంతమంది మహిళలు చదువుకున్నప్పటికీ పెళ్లి తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికి ఉద్యోగం చేయడం లేదు.
తమ సమయాన్నంతా పిల్లలకు, భర్తకు, కుటుంబానికి కేటాయిస్తున్నారు.
పిల్లలు పెద్దవాళ్లయిపోయి వాళ్ల జీవితాలతో బిజీగా ఉన్నప్పుడు ఆ మహిళ ఒంటరిదాన్ని అయిపోయినట్టు భావించడం మొదలుపెడతారు. డిప్రెషన్‌లోకి వెళ్లవచ్చు.
పనికిరానిదానిగా మారిపోయాననే ప్రతికూల ఆలోచనలు ఆమెకు రావడం మొదలవుతాయి. ఆ తర్వాత డిప్రెషన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

సెల్ఫ్ లవ్..అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన కోసం మనం కొంత సమయం కేటాయించుకోవాలి. మనకు ఇష్టమైన పనులు చేయాలి.
అవి మనలో సంతోషాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తాయి. వ్యాయామం, ఆహారం, నిద్రపై పూర్తిగా శ్రద్ధపెట్టాలి. చక్కగా రెడీ అవ్వాలి.
చాలామంది మహిళలు 'ఎక్కడికీ వెళ్లడం లేదు కదా. ఎందుకు రెడీ అవ్వడం?' అని అనుకుంటారు.
కానీ మనం అలా రెడీ అయితే మనకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతం మెదడుకు వెళ్తుంది. దీంతో సంతోషానికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి. ఇది చాలా ముఖ్యం.
మంచి ఆహారం తీసుకోవాలి. ధ్యానం చేయాలి. శ్వాస వ్యాయామాలు అందరూ చేయాలి.
గృహిణి అయినా, ఉద్యోగం చేసే మహిళ అయినా, మరెవరైనా సరే ప్రతిఒక్కరూ వీటిని పాటించాలి. ఇవన్నీ మానసిక సమస్యలను దూరంగా ఉంచడానికి సాయపడతాయి.

కచ్చితంగా ఉంటుంది. ఒంటరిగా ప్రయాణం చేయాలి. మనకు ఏది నచ్చుతుందో అది చేయాలి. మనకు నచ్చిన పని చేసినప్పుడు మనం సంతోషంగా ఉంటాం.
మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ కూడా మంచి వాతావరణం ఏర్పరుస్తాం. ముందే చెప్పినట్టు మనం లోపల సంతోషంగా ఉంటే బయట కూడా సహజంగానే సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
(రచయిత మానసిక వైద్య నిపుణురాలు. ఇందులో సూచించిన అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మానసిక సమస్యల పరిష్కారానికి మీ సమీపంలోని వైద్య నిపుణుడిని సంప్రదించి సలహాలు తీసుకోండి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























