మద్యానికి బదులు మత్తు కలిగించే మందులకు అలవాటుపడుతున్న యువత, ఎందుకిలా చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాకీ వేక్ఫీల్డ్, ఇసాబెల్లె షా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీసు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
స్నేహితులతో రాత్రి బయటకు వెళ్లే ముందు, చైనీస్ యూనివర్సిటీ విద్యార్థిని మెయ్ (అసలు పేరు కాదు)కు గొంతు బిగుసుకుపోయినట్లు, చేతులు చెమటలు పట్టేసినట్లు అనిపించేది. తాను ఏదైనా తప్పుగా మాట్లాడతానేమోనని తీవ్ర భయానికి గురయ్యేవారు.
ఆ సమయంలో ఆమె సోషల్ మీడియాలో ప్రిస్క్రిప్షన్ మందులను చూశారు.
మూర్ఛ, ఆందోళన, నరాల నొప్పుల చికిత్సకు ఉపయోగించే ప్రెగాబాలిన్తో పాటు, గుండె జబ్బుల చికిత్సలో వాడే, ఆందోళనకరమైన శారీరక లక్షణాలను తగ్గించగల బీటా బ్లాకర్‌ను ఆన్లైన్లో అక్రమంగా కొనుగోలు చేశారు.
అది తీసుకున్న తర్వాత తన అనుభవాలను ఆమె వివరించారు. ‘‘నేను ఎంతో ఉత్సాహంగా ఉండేదాన్ని. గదిలో అందరికంటే ఆసక్తికరమైన వ్యక్తి నేనేననిపించేది. ఇది ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఒకేసారి 10 డ్రింక్స్ తాగినట్లుగా అనిపించేది’’ అని ఆమె చెప్పారు.
ఈ మందులను అధిక మోతాదులో తీసుకున్నప్పుడు మత్తులో ఉన్న అనుభూతి కలుగుతుంది.

వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ మందులు తీసుకోవడం చాలా ప్రమాదకరమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ మందులను దీర్ఘకాలికంగా వాడటం వల్ల చివరకు వ్యసనంగా మారుతుంది.
ఈ మందులను మానుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆందోళన పెరగడం, నిద్రలేమి, ఆత్మహత్య ఆలోచనలు కలుగుతున్నట్లు వారు నివేదిస్తున్నారు.
'మెయ్' విషయంలో, స్నేహితులతో బయటికి వెళ్లే రాత్రుల సమయంలో వీటిని తీసుకోవడం మొదలైన అలవాటు క్రమంగా ఇతర సాధారణ సామాజిక కార్యక్రమాలకు కూడా పాకింది. ఆమె ఇప్పుడు ఈ మందులను ప్రతిరోజూ తీసుకుంటున్నారు.
‘‘ఇది లేకుండా నేను ఇల్లు కదలలేను’’ అని ఆమె చెప్పారు.
మెయ్ ఒక్కరే కాదు. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది యువత ఆల్కహాల్‌కి ప్రత్యామ్నాయంగా ప్రిస్క్రిప్షన్ మందులను, ఇతర ప్రయోగాత్మకమైన పదార్థాలను వాడుతున్నారు.
1997, 2012 మధ్య జన్మించిన జెన్ జెడ్ తరంలో ఆందోళన గత తరానికి చెందిన వారికన్నా ఎక్కువగా ఉంది.
1990 నుంచి 2021 వరకు 10-24 ఏళ్ల వయస్సు గలవారిలో ప్రపంచవ్యాప్తంగా యాంగ్జైటీ డిజార్డర్ కేసులు 1 కోటి నుంచి 1.6 కోట్లకు పెరిగాయని ఒక అధ్యయనం వెల్లడించింది.
కరోనా మహమ్మారి ముందు స్థాయిలతో పోలిస్తే యువతలో ఆందోళన రేట్లు పెరిగినట్లు 61 అధ్యయనాల పరిశీలనలో తేలింది.
మద్యం సేవించడానికి బదులు ‘ఆరోగ్యకరమైన’ ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ, హ్యాంగోవర్ లేని సోషల్ డ్రగ్స్‌గా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన పదార్థాలకు ఒక కొత్త మార్కెట్‌ను సృష్టించింది.
"[ఈ మందులను] మరింత మరింత సురక్షితమైన, అధునాతనమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కానీ, ఇది కేవలం భ్రమ మాత్రమే" అని టీసైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన అడిక్షన్ రీసెర్చర్ లియామ్ నోలెస్ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మందులను సామాజిక అవసరాల కోసం ఎంతమంది యువత ఉపయోగిస్తున్నారనే దానిపై కచ్చితమైన సంఖ్యను తెలుసుకోవడం అసాధ్యం. వాటిని చాలామంది అక్రమంగా పొందుతుండటమే దీనికి కారణం.
ప్రెగాబాలిన్ మొత్తం ప్రపంచ వినియోగం 2008 నుంచి 2018 మధ్య నాలుగు రెట్లు పెరిగినట్లు నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అదేవిధంగా ప్రెగాబాలిన్ దుర్వినియోగం, దానివల్ల కలిగే మరణాలు కూడా గణనీయంగా పెరిగాయి.
చైనాలో 2024లో ప్రెగాబాలిన్ దుర్వినియోగానికి సంబంధించిన మొదటి కేసు రిపోర్టులు బయటికి వచ్చాయి. ఈ ఏడాది ఆ మందుపై నియంత్రణలను మరింత కఠినతరం చేయాలని చైనా ప్రభుత్వం తన ప్లాన్లను ప్రకటించింది.
ఈ ఏడాది మే నెలలో భారత్ కూడా దీని వినియోగాన్ని నియంత్రిస్తూ ఆంక్షలు విధించింది.
జోర్డాన్, యుక్రెయిన్లలో కూడా ఈ మందుల దుర్వినియోగం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
సోషల్ మీడియాలో ఈ మందులకు సంబంధించి హ్యాష్‌ట్యాగ్‌లు వేలకొద్దీ వీడియోలను చూపిస్తున్నాయి.
యూజర్లు వివిధ మందులను కలిపి తమదైన శైలిలో కాక్టెయిల్ తయారు చేసుకోవడాన్ని ఆన్లైన్లో "స్టాకింగ్" అని పిలుస్తూ ప్రోత్సహిస్తున్నారు.
సోషల్ మీడియా కేవలం ఈ పదార్థాలను యువతకు పరిచయం చేయడమే కాకుండా, వాటిని సులభంగా పొందేలా కూడా చేస్తోంది.
తమ ప్రొఫైళ్ల ద్వారా ఈ మందులను విక్రయిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లను బీబీసీ వరల్డ్ సర్వీస్ కనుగొంది.
చైనీస్ సోషల్ మీడియా ద్వారానే తాను ఈ మందులను కొనుగోలు చేసినట్లు మెయ్ తెలిపారు.
"ఇక్కడ విక్రయించే వేలకొద్దీ పోస్టులు ఉన్నాయి. సోషల్ మీడియాలో వీటిని కనుగొనడం, ఆర్డర్ చేయడం చాలా సులభం" అని మెయ్ చెప్పారు.
ఈ సమస్య కేవలం చైనాకే పరిమితం కాదు. యుక్రెయిన్‌కు చెందిన 26 ఏళ్ల కస్టమర్ సర్వీస్ వర్కర్ లోరా కూడా ఈ మందులను ఆన్లైన్లో లేదా స్నేహితుల ద్వారా కొనుగోలు చేయడం చాలా సులభమని బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'మద్యం సేవించని తరం'
యువత మద్యం సేవించడానికి క్రమంగా దూరం అవుతున్న తరుణంలో ఈ పదార్థాలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. దీనివల్ల జెన్ జెడ్ తరానికి 'సోబర్ జనరేషన్' (మద్యం ముట్టని తరం) అనే పేరు వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా 2025లో ఆల్కహాల్ స్టాక్స్ 830 బిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.79,46,258 కోట్లు) పడిపోయినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదికలో వెల్లడైంది.
పెరుగుతున్న ఖర్చులు, ఆరోగ్య సమస్యల దృష్ట్యా యువత తమ మద్యపాన అలవాట్లను మార్చుకోవడం వల్లే ఈ ధోరణి కనిపిస్తోందని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఉపశమనం కోసం ప్రెగాబాలిన్ ఉపయోగిస్తున్న చాలామంది యువత తమ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారని అడిక్షన్ రీసెర్చర్ నోలెస్ చెప్పారు.
"ప్రజలు శరీరంలో కేలరీలు పెరగడం, బరువుపై దాని ప్రభావం లేదా వృద్ధాప్య ఛాయలు రావడం వంటి వాటిని కోరుకోవడం లేదు" అని ఆయన తెలిపారు.
ఆల్కహాల్ కనీసం ఏడు రకాల క్యాన్సర్లతో ముడిపడి ఉంది. అంతేకాకుండా, ఏ మోతాదులో ఆల్కహాల్ సేవించినా అది ప్రమాదకరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) 2023లో హెచ్చరించింది.
మెయ్ తీసుకునే మందులు వల్ల కలిగే హాని, అధికంగా మద్యం తాగడం వల్ల కలిగే హానికంటే తక్కువ కావొచ్చునని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన న్యూరోసైకోఫార్మకాలజిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ నట్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రెగాబాలిన్‌ను ఎక్కువ మోతాదులో వాడినప్పుడు పరిస్థితి మారుతుందని ఆయన హెచ్చరించారు.
"దీనిని మత్తు పదార్థంలా ఉపయోగించి మత్తు ఎక్కించుకుంటే, వారు వ్యసనపరులయ్యే ప్రమాదం ఉంది" అని ఆయన చెప్పారు.
ప్రెగాబాలిన్ ఎక్కువ మోతాదులో వాడటం వల్ల శ్వాసక్రియ మందగిస్తుంది. కొన్ని కేసుల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు. ఎక్కువగా బీటా బ్లాకర్లు తీసుకున్నా..కళ్లు తిరగడం, ప్రమాదకరమైన రీతిలో గుండె వేగం నెమ్మదించడం లాంటివి జరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
వ్యసన భయం
ఈ మందులతో కలిగే శారీరక హానిని, ఆల్కహాల్ ప్రమాదంతో పోల్చడం వల్ల మరింత ప్రాథమికమైన ప్రశ్నను విస్మరించే అవకాశం ఉందని కింగ్స్ కాలేజీ లండన్‌కు చెందిన సైకాలజిస్ట్ ప్రొఫెసర్ ఎమిలీజోన్స్ అన్నారు.
కెమికల్ సాయంతో మాత్రమే సోషలైజ్ కాగలమని మనుషులు నమ్మడం మొదలుపెడితే ఏమవుతుంది?
''ఆల్కహాల్‌ను అధిక మొత్తంలో తీసుకోవడం ప్రమాదకరం. కానీ, వైద్యుల పర్యవేక్షణ లేకుండా నిత్యం మందులు తీసుకోవడం కూడా ప్రమాదకరం'' అని ఎమిలీజోన్స్ చెప్పారు.
ఈ మందులు లేకపోతే తమ సామర్థ్యం విషయంలో ప్రజలు కాలక్రమేణా నమ్మకాన్ని కోల్పోతున్నారని జోన్స్ అన్నారు.
లోరా అనే యువతి ఈ అనుభవాన్నే ఎదుర్కొంది. పార్టీల సమయంలో వాడిన ఈ మందులు తర్వాత పనిలో కూడా అవసరమయ్యాయి.
అయితే, రెండు వారాలు ఆ మందులు అందుబాటులో లేనప్పుడు తీవ్రమైన డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు.
''నాకేమైందో అర్థం కాలేదు. చాలా ఆందోళనగా అనిపించింది. తినలేకపోయాను, స్నేహితులను చూడలేకపోయాను, కలవలేకపోయాను'' అని లోరా చెప్పారు.
బ్లాక్ మార్కెట్ ముప్పు
ప్రభుత్వాలు ఈ మందులపై ఆంక్షలు కఠినతరం చేస్తుండగా, ఇది బ్లాక్ మార్కెట్‌కు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు వీటిని నిషేధించడం వల్ల ప్రజలు వీటిని తీసుకోవడం ఆపుతారని కాదని యుక్రేనియన్ హార్మ్-రిడక్షన్ ఆర్గనైజేషన్ అధిపతి, ఎపిడెమాలజిస్ట్ మైకిటా లాపిన్ చెప్పారు.
''పదార్థాలను నిషేధించడం వల్ల ప్రజలు నకిలీ లేదా అనుమానాస్పద నాణ్యత గల బ్లాక్ మార్కెట్ మందులను ఆశ్రయించి ఓవర్ డోస్ ప్రమాదాల బారిన పడుతున్నారు'' అని తెలిపారు.
షాపుల్లో కొనే ఆల్కహాల్ బాటిల్స్‌పై దాని పరిమాణం, యూనిట్లు స్పష్టంగా ముద్రించి ఉంటాయని, కానీ ఆన్లైన్లో కొనే ప్రెగాబాలిన్ విషయంలో ఆ కచ్చితత్వం ఉండదని లియామ్ నోలెస్ హెచ్చరించారు.
ఈ మందులను రిక్రియేషనల్ మోతాదులో తీసుకుంటున్న చాలామందిలాగే మెయ్ కూడా వీటిని పూర్తిగా మానుకోగలనో లేదోనని భయపడుతున్నారు.
"ఇది భయానకంగా ఉంది, ఇది లేకుండా నేను ఎలా తట్టుకోవాలో నాకు తెలియడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(ఈ కథనంలో పేర్కొన్న సమస్యలతో మీరు లేదా మీ పరిచయస్తులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, స్థానిక వైద్యుడిని సంప్రదించడం ద్వారా సలహాను లేదా తగిన సహాయ సంస్థల మార్గదర్శకత్వాన్ని పొందవచ్చు.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































