‘చదువుకోవాలని కూర్చుంటే చాలు పోర్న్ వీడియోలు చూడాలనిపించేది.. 12 ఏళ్ల వయసు నుంచే అలవాటైపోయింది’

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, మయా డేవిస్, స్మితా ముందాసద్, అనా క్రాస్లీ
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

టీమ్ జీబీ మాజీ డైవర్ ఫ్రెడ్డీ ఉడ్‌వర్డ్ తన టీనేజ్ వయసులోనే ఒక విషయం గ్రహించారు. తనకు పోర్న్ చూడటం ఒక పెద్ద వ్యసనంగా మారినట్లు ఆయన గుర్తించారు.

"చదువుకుందామని కూర్చున్న ప్రతిసారీ, ఏదోలా ఆ సైట్లు ఓపెన్ చేయాలనే ఆలోచనే నా మనసులో మెదిలేది" అని ఆయన వెల్లడించారు.

12 ఏళ్ల వయసు వచ్చేసరికల్లా తాను 'హార్డ్‌కోర్' సైట్లను రోజూ చూడటం మొదలుపెట్టినట్లు ఆయన చెప్పారు.

ఆ తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగినప్పటికీ... ఆయన రోజుకు చాలాసార్లు అడల్ట్ కంటెంట్ చూసేవారు.

ఇప్పుడు ఆయన వయస్సు 30 ఏళ్లు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా ఈ అలవాటు నుంచి ఎలా బయటపడ్డారో బీబీసీకి ఫ్రెడ్డీ వివరించారు.

''నేను పోర్న్ చూడటం మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అని అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. 'నేను అసలు పోర్న్ జోలికే వెళ్లని వ్యక్తిని' అనే స్థాయికి మన ఆలోచనా విధానం మారాలి. కానీ, అలా మనసును మార్చుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు'' అని ఆయన చెప్పారు.

మరి ఈ పోర్న్ అలవాటు, హద్దులు దాటి సమస్యగా మారిందని గుర్తించడం ఎలా? దాన్ని ఎలా అధిగమించాలి?

ఒకప్పుడు రోజులో అనేక సార్లు పోర్న్ చూసేవాడినని టీమ్ జీబీ మాజీ డైవర్ ఫ్రెడ్డీ వుడ్‌వర్డ్  చెప్పారు
ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు రోజులో అనేక సార్లు పోర్న్ చూసేవాడినని టీమ్ జీబీ మాజీ డైవర్ ఫ్రెడ్డీ వుడ్‌వర్డ్ చెప్పారు

మనం వాడుకలో 'పోర్న్ అడిక్షన్' అని అంటున్నప్పటికీ... దీనికి ఒక ప్రత్యేకమైన జబ్బుగా అధికారిక గుర్తింపేమీ లేదు.

"చాలామందికి పోర్న్ చూడటం వల్ల సమస్యలు వస్తున్నాయని మాకు తెలుసు" అని సెక్స్ అండ్ రిలేషన్‌షిప్ సైకోథెరపిస్ట్ సిల్వా నెవెస్ అన్నారు. ఇటీవల తమ ప్రైవేట్ క్లినిక్‌కి వచ్చే క్లయింట్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని సిల్వా నెవెస్ చెప్పారు.

అయితే డ్రగ్స్ లాంటి వాటికి బానిసైనట్లే ఇది కూడా ఒక రకమైన "అడిక్షన్" అవుతుందా? దీనికి ఎలాంటి చికిత్స అందించాలి? అనే విషయాలపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ప్రజలు అతిగా పోర్న్ చూసే అలవాటుతో ఇబ్బంది పడుతున్నారని చాలామంది డాక్టర్లు చెబుతున్నారని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు క్యాంప్‌బెల్ ఇన్స్ అన్నారు. కానీ, దీనికి గల కారణాలు, సరైన చికిత్స విధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

దీనర్థం ఏంటంటే... తాము ఈ అలవాటుకు బానిసయ్యామని ఆందోళన చెందుతున్నవారికి సంబంధించి, నిర్దిష్టమైన లక్షణాలు గానీ, లేదా ఇదే కచ్చితమైన చికిత్స అని చెప్పడానికి ఒక స్పష్టమైన జాబితా ఏదీ లేదు.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించిన "కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ డిజార్డర్" (అదుపు తప్పిన లైంగిక ప్రవర్తనా లోపం)గా కొందరు వైద్యులు దీన్ని పరిగణిస్తారు.

"ఇది ఎలాంటి అలవాటంటే... మన ప్రవర్తన మన చేతుల్లో లేనట్లు అనిపిస్తుంది, తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. దీన్ని అదుపు చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాదు" అని సెక్స్ అండ్ పోర్న్ అడిక్షన్ సెంటర్ అయిన 'లారెల్ సెంటర్' సైకోథెరపిస్ట్ డాక్టర్ పౌలా హాల్ వివరించారు.

లైంగికతతో సహా 'ఏ విషయానికైనా' మనుషులు బానిసలయ్యే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్‌ఎస్) కూడా చెబుతోంది.

మరి పోర్న్ చూడటం హద్దులు దాటి సమస్యగా మారిందని తెలుసుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మరి పోర్న్ చూడటం హద్దులు దాటి సమస్యగా మారిందని తెలుసుకోవడం ఎలా?

'దీన్నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కాలేదు'

మరి పోర్న్ చూడటం హద్దులు దాటి సమస్యగా మారిందని తెలుసుకోవడం ఎలా?

"మీరు రోజూ ఎన్నిసార్లు చూశారు, ఎంత సమయం గడిపారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. అది మీ జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తోందో అనేదే అసలు పాయింట్" అని నెవెస్ అంటున్నారు.

రాత్రంతా పోర్న్ చూస్తూ కూర్చోవడం వల్ల ఆఫీసుకు లేటుగా వెళ్లడం, కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని దీనికే కేటాయించడం, లేదా ఆఖరికి ఆఫీసులో ఉన్నప్పుడు కూడా చూడటం వంటివి జరగొచ్చని నెవెస్ చెప్పారు.

ఈ అలవాటును తగ్గించుకోవడానికి లేదా మానుకోవడానికి ప్రయత్నించినప్పుడు అలా చేయడం మీ వల్ల అవుతోందా? అలాగే, మునుపటిలా పోర్న్ చూడటంలో ఏమాత్రం ఆనందం అనిపించకపోయినా కూడా బలవంతంగా చూస్తూనే ఉన్నారా? అనే ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోవడం చాలా ముఖ్యమని ఈ అంశంపై పరిశోధన చేస్తున్న ఇన్స్ తెలిపారు.

ఈ అలవాటు నుంచి బయటపడుతున్నట్లు చెప్పుకునే క్రెయిగ్ విషయానికి వస్తే... తనకు 35 ఏళ్ల వయస్సున్నప్పుడు వచ్చిన కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలోనే ఈ విషయంలో నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు.

"లాక్‌డౌన్ వరకు నాకు ఇది ఇంత పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఆ సమయంలో పెరిగిన ఒత్తిడి, ఒంటరితనం ఈ సమస్యను మరింత తీవ్రం చేశాయి" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

"దీని పట్టు నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కాలేదు" అని ఆయన అన్నారు.

అయితే, సామాజిక, నైతిక లేదా మతపరమైన కారణాల వల్ల కూడా చాలామంది తమ పోర్న్ అలవాటు గురించి ఆందోళన చెందుతుంటారని ఇన్స్ అన్నారు. కానీ, దానికే మీ ప్రవర్తన కంట్రోల్ తప్పిందని భావించాల్సిన అవసరం లేదని ఇన్స్ స్పష్టం చేశారు.

"ఉదాహరణకు ఒకరు వారంలో మూడుసార్లు, అయిదేసి నిమిషాల చొప్పున పోర్న్ చూసి అపరాధభావానికి లోను కావొచ్చు. అలాగే రోజంతా పోర్న్ చూసే కొందరిలో ఇది చాలా సాధారణ విషయమే అనే భావన ఉండొచ్చు'' అని నెవెస్ ఉదహరించారు.

డాక్టర్ పౌలా హాల్ కూడా ఇలాగే చెబుతున్నారు.

"నేను బానిసను.. లేదా 'కాదు' అనే ఆలోచన నుంచి బయటపడి, ఆ అలవాటు మీ చదువును, మీ బంధాలను ఎంతవరకు దెబ్బతీస్తోందనే దానిపై మాత్రమే దృష్టి పెట్టాలి" అని పౌలా హాల్ సూచించారు.

ఏఐ ద్వారా రూపొందించే పోర్న్ వల్ల ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని హాల్, నెవెస్ ఇద్దరూ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏఐ ద్వారా రూపొందించే పోర్న్ వల్ల ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని హాల్, నెవెస్ ఇద్దరూ అంటున్నారు

టీవీ ప్రెజెంటర్ ఓరే ఒడుబా తన 30 ఏళ్ల పోర్న్ అడిక్షన్ గురించి నిరుడు బహిరంగంగా మాట్లాడారు. తొమ్మిదేళ్ల వయసులోనే మొదలైన ఈ అలవాటు... "నా జీవితాన్ని లోపల నుంచి నాశనం చేస్తూ వచ్చింది" అని ఆయన చెప్పారు.

"చిన్నతనంలో నాకు ఎదురైన మానసిక బాధల నుంచి తప్పించుకునే క్రమంలో ఇది అలవాటుగా మారింది'' అని ఈ అలవాటును వదిలించుకోవడానికి ముందు 'వీ నీడ్ టు టాక్' అనే పాడ్‌కాస్ట్‌లో ఆయన చెప్పారు.

అసలు ఇలాంటి ప్రవర్తనకు గల మూల కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు, దీనిపై మరింత విస్తృతమైన పరిశోధన జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

"దీనిపై శాస్త్రీయ అధ్యయనాలు వేగవంతం అయినప్పటికీ... స్పష్టత రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది" అని ఇన్స్ అంటున్నారు.

జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు లేదా రిలేషన్‌షిప్స్ దెబ్బతినడం వంటి వాటి నుంచి తాత్కాలికంగా దృష్టి మళ్లించుకునే క్రమంలో ఈ అలవాటు మొదలవ్వచ్చని హాల్ అంటున్నారు.

అలాగే చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు, తీవ్రమైన మానసిక ఆందోళనలు, లేదా తమపై తమకు నమ్మకం లేకపోవడం వంటివి ఈ అలవాటును మానకుండా అడ్డుపడతాయని ఆమె తెలిపారు.

పోర్న్ అనేది "జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా ఆశ్రయించే ఒక సాధనంలా మారిపోయిందని ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న క్రెయిగ్ అన్నారు.

తన ఆలోచనా విధానంలో మార్పు వచ్చి ఈ అలవాటు నుంచి బయటపడ్డానని చెప్పారు. అయితే గతంలో 'నా జీవితం పాడైపోయింది. ఇక దీన్నుంచి బయటపడే మార్గమే లేదు' అని అనుకునేవాడినని క్రెయిగ్ గుర్తు చేసుకున్నారు.

డిజిటల్ వాతావరణం, ఆల్గోరిథమ్‌లు ప్రజలను 'కావాలనే ఈ అలవాటులో కూరుకుపోయేలా చేస్తున్నాయి' అని హల్ అన్నారు.

అలాగే ఏఐ ద్వారా రూపొందించే పోర్న్ వల్ల ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని హాల్, నెవెస్ ఇద్దరూ అంటున్నారు.

ఇది ప్రజలు "తమకు ఎలాంటి కంటెంట్ కావాలో సరిగ్గా అలాంటి కంటెంట్‌నే తయారు చేసుకునేలా" వీలు కల్పిస్తోందని నెవెస్ వివరించారు.

పోర్న్ అలవాటు గురించి మీకు ఆందోళనగా ఉంటే, అనుభవజ్ఞుడైన ఒక నిపుణుడి సలహా తీసుకోవాలని ఇన్స్ సలహా ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

'రోజుకో అడుగు వేస్తూ ముందుకు సాగాలి'

పోర్న్ అలవాటు గురించి మీకు ఆందోళనగా ఉంటే, అనుభవజ్ఞుడైన ఒక నిపుణుడి సలహా తీసుకోవాలని ఇన్స్ సలహా ఇస్తున్నారు.

ఒక అర్హత కలిగిన సైకాలజిస్ట్ దీనికి బాగా సహాయపడగలరని, ఎందుకంటే వారు మీ మానసిక ఆరోగ్యాన్ని పూర్తిస్థాయిలో పరిశీలిస్తారని ఇన్స్ అన్నారు.

"పోర్న్ అలవాటుతో పాటు ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఉండటం సర్వసాధారణం" అని ఆయన అన్నారు.

క్రెయిగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన తన మానసిక ఆరోగ్యం కోసం థెరపీ ప్రారంభించే వరకు, తన పోర్న్ అలవాటు ఎంత హానికరమో గుర్తించలేకపోయారు.

తన మానసిక సమస్యలకు ఈ పోర్న్ అలవాటు కూడా ఒక ముఖ్య కారణమని ఆయన తర్వాత తెలుసుకున్నారు.

'ఆల్కహాలిక్స్ అనానిమస్' తయారు చేసిన 12-స్టెప్ ప్రోగ్రామ్‌లో చేరాల్సిందిగా క్రెయిగ్‌కు థెరపిస్ట్ సూచించారు. ఈ విధానమే తను ఈ సమస్య నుంచి బయటపడటానికి సహాయపడిందని క్రెయిగ్ చెప్పారు.

"ఈ అలవాటు నుంచి బయటపడటం నాకు అంత తేలిగ్గా ఏమీ అనిపించలేదు. ప్రస్తుతం నేను మంచి స్థితిలోనే ఉన్నాను. ప్రతిరోజుని ఒక కొత్త రోజని అనుకుంటూ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాను'' అని క్రెయిగ్ అన్నారు.

మీకు సరిపోయే సరైన పరిష్కారాన్ని ఎంచుకోవడానికి మంచి రీసెర్చ్ చేయాలని, ఆన్‌లైన్‌లో దొరికే సాధారణ సలహాలను గుడ్డిగా నమ్మవద్దని ఇన్స్ హెచ్చరిస్తున్నారు.

కొందరు నిపుణులు పోర్న్‌ను పూర్తిగా మానేసేలా సహాయపడితే... మరికొందరు తమ జీవితాన్ని దెబ్బతీసుకోకుండా పరిమితంగా ఎలా ఉంచుకోవాలో నేర్పిస్తారని నెవెస్ చెప్పారు.

ఈ సమస్య వెనుక ఉన్న మూల కారణాలను అర్థం చేసుకోవడమే చికిత్సలో అత్యంత కీలకమైన భాగమని హాల్ అంటున్నారు.

మీ డివైజ్‌లలో ఆయా సైట్లను బ్లాక్ చేసే సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడం వంటి కొన్ని పద్ధతులను మీరు స్వయంగా పాటించవచ్చని ఆమె సూచించారు.

అలాగే ఏ సమయాల్లో లేదా ఏ పరిస్థితుల్లో (ఉదాహరణకు ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు) మీ మనసు ఈ అలవాటు వైపు మళ్లుతోందో గుర్తించి... ఆ సమయంలో పోర్న్‌కు బదులుగా వేరే ఏం చేయాలనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆమె చెప్పారు.

అయితే చివరికి ఎన్‌హెచ్‌ఎస్ నుంచి దీనిపై మరింత మద్దతు లభించాలని, ముఖ్యంగా ఈ అలవాటు జీవితాన్ని నాశనం చేయకముందే ప్రాథమిక దశలోనే నిరోధించేలా చర్యలు ఉండాలని ఆమె అన్నారు.

"చిన్న వయసులోనే పిల్లలు ఇలాంటి పోర్న్ అలవాట్లకు బానిసలవుతున్నారనే వార్తలు వినడం ఆందోళన కలిగిస్తోంది'' అని ఆరోగ్య, సామాజిక సంరక్షణ శాఖ ప్రతినిధి ఒకరు అన్నారు.

"పిల్లలు ఇలాంటి హానికరమైన కంటెంట్‌ను చూడకుండా ఆపడానికి మేం తీసుకొచ్చిన ఆన్‌లైన్ భద్రతా చట్టాల ప్రాముఖ్యతను ఇది మరోసారి గుర్తుచేస్తోంది" అని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)