గిల్, అక్షర్ పటేల్ విజృంభణతో తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్ విజయం

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

బర్మింగ్‌హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది.

ఇంగ్లండ్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

భారత జట్టులో అక్షర్ పటేల్ (4 వికెట్లు, 57 పరుగులు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (80 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఆకట్టుకున్న బౌలర్లు

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. బెతెల్, డకెట్‌లు తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అయితే, 13 ఓవర్లో భారత జట్టుకు గుర్నూర్ బ్రేక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో బెతెల్, డకెట్‌లను ఔట్ చేశాడు.

ఆ మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్ హ్యారీ బ్రూక్‌(1)ను జస్‌ప్రీత్ బుమ్రా పెవిలియన్ చేర్చగా.. జోస్ బట్లర్(5), సామ్ కరణ్(0)లను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

మరికొద్దిసేపటికే విల్ జాక్స్(20)ను శివమ్ దూబే ఔట్ చేశాడు. దాంతో 107 పరుగులకే ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

కానీ, జోరూట్, లియామ్ డాసన్ చక్కని బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, లియామ్ డాసన్(68) ఔటయ్యాక ఇంగ్లండ్ మరోసారి కోలుకోలేకపోయింది. ఆర్చర్(12), ఆదిల్ రషీద్(1), జోష్ టంగ్(0)లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఆ జట్టు 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4, ప్రసిధ్ కృష్ణ , గుర్నూర్ బ్రార్‌లు చెరి రెండు వికెట్లు బుమ్రా, శివం దూబేలు చెరో వికెట్ తీశారు.

గిల్ రిటైర్డ్ హర్ట్

259 పరుగుల లక్ష్య ఛేదనలో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (5)లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

ఈ పరిస్థితుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. అయ్యర్ కాస్త నిదానంగా ఆడినా, గిల్ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కానీ, కీలక సమయంలో గిల్ గాయంతో మైదానం వీడటం, ఆ తర్వాత అయ్యర్(35 పరుగులు), కేఎల్ రాహుల్ (1) వెంటవెంటనే ఔటవడంతో భారత్ 160 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్), అక్షర్ పటేల్ (57 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

వీరిద్దరూ ఐదో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, మరో 28 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.

మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ జూలై 16న, మూడో మ్యాచ్ జూలై 19న జరగనున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)