కరోనావైరస్: నిజామాబాద్‌లో కరోనా మృతులు ఆటోలో తరలింపు - ప్రెస్‌రివ్యూ

కరోనా మృతుడు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నిజామాబాద్ జిల్లాలో ఆటోలో తరలిస్తున్న కరోనా బాధితుడి మృతదేహం
ప్రచురణ

కరోనా మృతులను ఇళ్లకు చేర్చడంలో, బంధువులకు అప్పగించడంలో అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో వ్యహరిస్తున్నారంటూ ఈనాడు పత్రిక కథనాలు ఇచ్చింది. హైదరాబాద్ ఉస్మానియా మార్చురిలో ఒకవ్యక్తి మృతదేహాన్ని మరో కుటుంబానికి అప్పగించినట్లు ఓ కథనంలో పేర్కొంది.

మృతదేహాల అప్పగింతలో పొరపాటు జరగడంతో మరో మృతుడి బంధువులు శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సదరు వ్యక్తి బంధువులు శవం కోసం రావడంతో అసలు విషయం బైటపడినట్లు ఈ కథనంలో పేర్కొంది. బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఇరు వర్గాలకు పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

మరోవైపు హైదరాబాద్ లోని ఈఎస్ఐ స్మశాన వాటికకు కరోనా మృతదేహాలు వెల్లువెత్తుతుండటంతో అక్కడ సిబ్బంది శవాలను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని ఓ కథనంలో ఈనాడు పేర్కొంది. సగం కాలిన శవాలను అలాగే వదిలేస్తున్నారని, వాటిని కుక్కలు పీక్కు తింటున్నా పట్టించుకోవడం లేదని కథనంలో పేర్కొంది.

ఇటు నిజామబాద్ జిల్లాలో ఓ కరోనా బాధితుడి మృతదేహాన్ని ఆటోలో వేసుకుని తీసుకెళ్లిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. నిబంధనల ప్రకారం అంబులెన్స్‌లో కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య మృతదేహాలను తరలించాల్సి ఉండగా, ఆటోలో తరలించిన తీరు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఆ కథనంలో పేర్కొంది.

అయితే మృతుడి బంధువులే బలవంతంగా శవాన్ని తీసుకెళ్లారని ఆసుపత్రి వర్గాలు తర్వాత వివరణ ఇచ్చినట్లు ఈ కథనం పేర్కొంది.

వరవరరావు

ఫొటో సోర్స్, facebook/Varavara Rao

వరవరరావును రక్షించండి... తెలంగాణ సర్కారుకు వినతులు

మహారాష్ట్ర జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావుకు తగిన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆయన సహచరుడు తమకు సమాచారం ఇచ్చారని వరవరరావు సతీమణి హేమలత చెప్పినట్లు ఈ కథనంలో పేర్కొంది. వరవరరావు తనతో మాట్లాడారని, కానీ ఆయన మాటలు మొద్దుబారిపోయినట్లుగా ఉన్నాయని హేమలత పేర్కొన్నారు.

జైలు అధికారులు చెబుతున్నదానికి, వరవరరావు చెబుతున్నదానికి పొంతన లేదని ఆమె అన్నారు. ఈ విషయంలో కల్పించుకుని ఆయనకు సరైన వైద్యం అందేలా చూడాలని హేమలత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటకలో ఘోరం: ప్రేమికుడి ఇంటిపై దాడి... అయిదుగురి హత్య

యువతీ యువకుల ప్రేమ వ్యవహారంలో యువకుడి కుటుంబ సభ్యులపై దాడి చేసిన యువతి బంధువులు ఐదుగురిని దారుణంగా హత్య చేసిన ఘటనను ఆంధ్రజ్యోతి సహా పలు పత్రికలు ప్రముఖంగా రాశాయి. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులోని సుక్కాలపేటలో ఒకే వీధిలో ఉంటున్న యువతీ యువకులు ప్రేమలో పడ్డారు.

అయితే ఈ విషయంలో అబ్బాయి, అమ్మాయి కుటుంబాలు తరచూ గొడవ పడుతున్నాయి. నిన్న సాయంత్రం వారిద్దరు వీధిలో జంటగా కనిపించడంలో గొడవ తీవ్రమైంది. అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై కత్తులు, కొడవళ్లతో దాడి చేశారు. ఆ ప్రేమ జంట భయంతో పోలీస్ స్టేషన్ కు పరుగు తీసింది.

ఈలోగా యువకుడి ఇంటిపై దాడి చేసిన యువతి బంధువులు ఐదుగురిని నరికి చంపారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యువతీ యువకులిద్దరూ పెళ్లి చేసుకున్నారని అనుమానంతో అమ్మాయి తరఫువారు ఈ దాడికి దిగినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. ప్రస్తుతం ఆ యువజంట పరారీలో ఉన్నట్లు తన కథనంలో వెల్లడించింది.

తల్లి ఫేస్బుక్ స్నేహితుడి ఘాతుకం... తండ్రి బలవన్మరణం

ఒక మహిళ ఫేస్ బుక్ స్నేహితుడు ఆమె కూతురిని హత్యచేయగా, కూతురి మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనను నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. నువ్వు లేని లోకంలో నేనుండలేను అంటూ ఆ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటనను ఈ కథనంలో పేర్కొంది.

నల్గొండ జిల్లా ఘట్ కేసర్ కు చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ స్నేహితడు, ఆమె ఐదేళ్ల కుమార్తెను గొంతు కోసి హత్య చేశాడు. ఈ నెల 2న జరిగిన ఈ ఘటన తర్వాత చిన్నారి తండ్రి కల్యాణరావు తీవ్ర డిప్రెషన్ కు లోనయ్యారు. కూతురు మరణాన్ని తట్టుకోలేక తానూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

భార్యను ఆమె పుట్టింటికి పంపి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారిని హత్య చేసిన మహిళ స్నేహితుడు కరుణాకర్ అనే వ్యక్తి ప్రస్తుతం పోలీస్ రిమాండ్ లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)