You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏపీ సీఎం వైఎస్ జగన్: ‘కిట్ల కొనుగోలులో నిజాయతీగా వ్యవహరించారు, అధికారుల ఆలోచన భేష్’ - ప్రెస్ రివ్యూ
కరోనావైరస్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు చాలా నిజాయతీగా వ్యవహరించారని, కేంద్రం కన్నా తక్కువ ధరకే వాటిని ఆర్డర్ చేశారని రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం రాసింది.
దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ కిట్లను మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ ధరకు ఏపీ కొనుగోలు చేయడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ విషయంలో అధికారుల నిజాయతీగా వ్యవహరించారని సీఎం జగన్ అన్నారు.
‘‘రాష్ట్రానికి కిట్లు అత్యవసరమని కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోవాలని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి ఇచ్చిన కంపెనీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్డర్ ఇచ్చింది. ఐసీఎంఆర్ ఒక్కో కిట్ కొనుగోలుకు రూ.795 చొప్పున ఆర్డర్ ఇస్తే.. అది తెలిసి కూడా రూ.65 తక్కువ రేటుకు మన అధికారులు ఆర్డర్ ఇచ్చారు’’ అని జగన్ చెప్పారు.
ప్రభుత్వ సొమ్మును కాపాడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆలోచన చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రశంసించారు. చాలా నిజాయితీతో ఆలోచన చేసి ఆర్డర్ చేశారని తెలిపారు.
సదరు కంపెనీ ఏ రాష్ట్రానికైనా ఒకవేళ తక్కువ ధరకు అమ్మితే ఆ రేటు ప్రకారమే చెల్లిస్తామని పర్చేజ్ ఆర్డర్‌లో మన అధికారులు షరతు పెట్టారని, ఫలితంగా కిట్ల రేటు తగ్గబోతోంది అని ఆయన తెలిపారు.
‘‘ఇలాంటి ఆలోచన సాధారణంగా ఎవరూ చేయరు. రాజీ పడకుండా కిట్లను వేగంగా తెప్పించడానికి అధికారులు తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. కిట్లకు ఇప్పటి వరకూ 25 శాతం చెల్లింపులే జరిగాయి. మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయటి దేశంలో తయారయ్యాయి. ఇప్పుడు మన దేశంలో తయారు చేయడానికి అదే కంపెనీకి ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది. దీనివల్ల కిట్ రేటు తగ్గింది. మనం పెట్టిన షరతు కారణంగా రేటు కూడా తగ్గబోతోంది. దీనికి కూడా కంపెనీ అంగీకరించింది. ఇందుకు అధికారులను అభినందిస్తున్నాను’’ అని జగన్ అన్నారు.
‘బయటకు వచ్చేవారు చిరునామా తెలిపే పత్రం తెచ్చుకోవాలి’
కరోనావైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ నిబంధనలను మంగళవారం నుంచి తెలంగాణలో మరింత కఠినంగా అమలు చేయబోతున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేసినట్లు ‘ఈనాడు’ దినపత్రిక వార్త రాసింది.
విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు రోజుకు ఒక్కో రంగు గుర్తింపుకార్డు ఇవ్వమని ఆయా శాఖలకు విజ్ఞప్తి చేసినట్లు డీజీపీ చెప్పారు.
‘‘వ్యక్తిగత దూరం పాటించటంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వంతులవారీగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, విధులకు వెళ్లని వారూ రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉండటం వల్ల వారిని అడ్డుకోవడం కష్టంగా ఉంది. అందుకే ఏరోజు ఎవరు హాజరవుతున్నారో వారికి నిర్దుష్టమైన రంగు గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరాం’’ అని వివరించారు.
నిత్యావసరాలు, ఇతర అత్యవసర సేవలు అందించేవారి కోసం గతంలో మూడు కమిషనరేట్లకు కలిపి 15వేల పాస్‌లు ఇచ్చామని, ఇవి దుర్వినియోగమవుతున్నట్లు గుర్తించామని డీజీపీ తెలిపారు. వీటన్నింటనీ రద్దు చేయబోతున్నట్లు చెప్పారు.
కొత్తపాస్‌లిచ్చే వరకూ పాతవి కొనసాగుతాయని, నిర్ణీత మార్గంలోనే వెళ్లేందుకు మాత్రమే అనుమతించేలా కొత్త పాస్‌లు ఉంటాయని అన్నారు.
‘‘నిత్యావసరాల కోసం బయటకు వచ్చేవారు 3కి.మీ. దూరమే ప్రయాణించవచ్చు. ఇంతకు మించి ముందుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. అందుకే ఇకపై బయటకు వచ్చేవారు ఇంటి చిరునామాకు సంబంధించిన పత్రం వెంట తెచ్చుకోవాలి’’ అని డీజీపీ అన్నారు.
ఆసుపత్రులకు వెళ్లేవారు కూడా సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ‘‘కారణం లేకుండా రోడ్డుమీదకు వచ్చిన 1,21,000 వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్నామని, వీటన్నింటిపైనా కేసులు నమోదు చేసి న్యాయస్థానానికి అప్పగించనున్నామని డీజీపీ వివరించారు.
పేదలకు ఆహారం పంచేవారు ఇక జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోవాలని, ఎవరికి వారు పంపిణీ చేస్తామంటే కుదరదని అన్నారు.
గచ్చిబౌలిలో అందుబాటులోకి టిమ్స్ ఆసుపత్రి
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన కోవిడ్–19 ఆసుపత్రి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) సోమవారం అందుబాటులోకి వచ్చినట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.
హంగూ ఆర్భాటాలు, ప్రారంభ వేడుకలు లేకుండానే కరోనావైరస్ కోసం పూర్తి స్థాయి ఆసుపత్రిగా టిమ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
1,500 పడకలతో కూడిన ఈ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలను సిద్దం చేశారు.
ఈ ఆసుపత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇందులో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆసుపత్రిని సెంట్రల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సోమవారం పరిశీలించి, సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)