నన్ను కావాలనే టార్గెట్ చేశారు: హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ -ప్రెస్ రివ్యూ

నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ప్రచురణ

తనను కావాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందంటూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

కరోనావైరస్‌ వ్యాపించే పెను ముప్పు పొంచి ఉన్నందున స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం కారణంగానే ప్రభుత్వం తనను టార్గెట్‌ చేసిందని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైకోర్టుకు తెలిపారు.

ఎన్నికలు వాయిదా వేయకుంటే రాష్ట్రం కరోనావైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారి ఉండేదని, తద్వారా దారుణ పరిణామాలకు కేంద్ర బిందువయ్యేదని, అయితే అలా వాయిదా వేయడం వల్లనే ప్రభుత్వం తనతో ఘర్షణకు దిగిందని ఆయన తన పిటిషన్‌లో వివరించారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని, దురుద్దేశంతోనే తనను తొలగించిందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని కుదిస్తూ చట్టవిరుద్ధంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు సర్వీసు నిబంధనలను మారుస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు.

ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపునకు సంబంధించి హైకోర్టులో మరో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) దాఖలయ్యాయి. ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది తాండవ యోగేశ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ వ్యాజ్యాలు దాఖలు చేసినట్టు ఆంధ్రజ్యోతి ఈ కథనంలో పేర్కొంది.

కరోనావైరస్:అమెరికాలో 40 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన వారు మృతి

ఫొటో సోర్స్, GETYY IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:అమెరికాలో 40 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన వారు మృతి

అమెరికాలో 40 మంది భారతీయ సంతతివారు మృతి

అమెరికాలో ఉంటున్న భారతీయులు, భారత సంతతికి చెందిన వారిలో 40 మంది కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

అమెరికాలో కొనసాగుతున్న కోవిడ్-19 విధ్వంసానికి ఇప్పటి వరకు 40 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మందికి కరోనావైరస్ సోకిందని నిర్ధరణ అయ్యింది.

మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరితో పాటు కేరళకు చెందిన 17మంది, ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు భారతీయ సమాజ పెద్దలు వెల్లడించారు.

మరణించిన వారిలో 21 ఏళ్ల యువకుడు మినహా మిగిలిన వారంతా 60 ఏళ్లు పైబడిన వృద్ధులేనని వారు తెలిపారు.

మృతుల్లో సునోవా అనలిటికల్ ఇన్‌కార్పొరేషన్ సీఈఓ హనుమంతరావు మారెపల్లి, ఇండియన్ స్క్వేర్‌కి చెందిన ప్రముఖుడు అమిన్ చంద్రకాంత్, న్యూజెర్సీకి చెందిన మహేంద్రపటేల్ తదితరులు ఉన్నట్టు వివరించారు.

న్యూజెర్సీలో 400మంది, న్యూయార్క్‌లో మరో వెయ్యిమందికి పాజిటివ్ వచ్చిందని, వీరిలో ఎక్కువమంది ట్యాక్సీ డ్రైవర్లేనని చెప్పారు.

అమెరికాలో ఉంటున్న భారత సమాజ నేతల్లో కొందరికి కూడా కరోనా సోకినట్టు చెబుతున్నారు. ప్లాస్మా దాతల కోసం వారు ఆన్‌లైన్లో అన్వేషణ కొనసాగిస్తున్నారని ఈనాడు ఈ కథనంలో తెలిపింది.

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

వైరస్ మాటున లిక్కర్ దందా

తెలంగాణలో కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకొని గత 20 రోజులుగా యథేచ్ఛగా లిక్కర్‌ దందా సాగుతోందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

కరోనావైరస్‌ నియంత్రణ కోసం ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా ఆ రోజున రాష్ట్రంలోని వైన్‌షాపులన్నీ మూతపడ్డాయి.

కానీ అదే రోజు సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతోపాటు వైన్‌షాపుల మూసివేతకు ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎక్సైజ్‌ శాఖ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

దీంతో వైన్‌షాపులను మూసేయాలని ప్రకటించినా వాటిని సీజ్‌ చేయలేదు. ఈ పరిణామమే లిక్కర్‌ వ్యాపారులకు కలిసొచ్చింది.

అధికారికంగా ఎక్సైజ్‌ అధికారులు షాపులు సీజ్‌ చేయకపోవడంతో దొడ్డిదారిన షాపుల్లోని సరకును బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తూ రెండు, మూడింతల ధరకు దళారుల సాయంతో విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎక్సైజ్‌ వర్గాలు ఈ విషయంలో కళ్లు మూసుకొని వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఎక్కువ పెట్టుబడులు, లైసెన్సు ఫీజులు చెల్లించే బార్ల యజమానులు మాత్రం అల్లాడిపోతున్నారని ఎప్పుడెప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందా అని ఎదురు చూస్తున్నారని సాక్షి పత్రిక ఈ కథనంలో చెప్పుకొచ్చింది.

ఆపరేటర్ ఎవ్వరైనా ఒక్కటే సెట్‌టాప్ బాక్స్-ట్రాయ్ సరికొత్త సిఫారసు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆపరేటర్ ఎవ్వరైనా ఒక్కటే సెట్‌టాప్ బాక్స్-ట్రాయ్ సరికొత్త సిఫారసు

కేబుల్ టీవీ, డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్త

ఇకపై కేబుల్‌ టీవీ, డీటీహెచ్‌ సర్వీస్‌ ఆపరేటర్లు ఎవ్వరైనా ఒక్కటే సెట్‌టాప్ బాక్సు ఉండాలని ట్రాయ్ సిఫారసు చేసినట్టు నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇకపై సెట్‌టాప్‌ బాక్సుల్లో ఇంటర్ పోర్టబిలిటి సపోర్ట్ తప్పనిసరి చేసేందుకు అవసరమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని ట్రాయ్‌ శనివారం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు సూచించింది.

వినియోగదారులు కొత్త సెట్‌టాప్‌ బాక్సును కొనుగోలు చేయకుండానే తమ సర్వీస్‌ ప్రొవైడర్‌ను మార్చుకొనేందుకు ఈ సరికొత్త సెట్‌టాప్ బాక్సులు వీలుకల్పిస్తాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని డీటీహెచ్‌, కేబుల్‌ టీవీ నెట్‌వర్కులు తమ వినియోగదారులకు అందిస్తున్న సెట్‌టాప్ బాక్సుల్లో అటువంటి సౌకర్యం లేదు.

దీంతో వినియోగదారులు సర్వీస్‌ ప్రొవైడర్‌ను మార్చుకోవాలంటే కొత్త సెట్‌టాప్‌ బాక్సును కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ట్రాయ్ సరికొత్త సిఫారసు కారణంగా వినియోగదారులపై ఆ మేరకు భారం తగ్గనుంది. ఈ మార్పులను అమలు చేసేందుకు డీటీహెచ్ కంపెనీలకు 6 నెలలు గడువు ఇవ్వాలని ట్రాయ్ పేర్కొందని నమస్తే తెలంగాణ ఈ కథనంలో తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)