50 ఏళ్లు దాటిన పెద్దల కోసం హైదరాబాద్‌లో స్వయంవరం: ప్రెస్ రివ్యూ

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

50 ఏళ్లు దాటిన పెద్దలకు హైదరాబాద్‌లో స్వయంవరం జరిగినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

ఎల్డర్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌, తోడు-నీడ, అనుబంధ్ ఫౌండేషన్‌ సంయుక్తాధ్వర్యంలో తొలిసారి హైదరాబాద్‌లో పెద్దల స్వయంవరం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఆదివారం దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో నిర్వహించిన పెద్దల స్వయంవరానికి విశేష స్పందన లభించింది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పెద్దలు హాజరయ్యారు. 50-90 ఏళ్ల వయసువారిలో అసలు పెళ్లి కానివారు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారు దాదాపు 400 మంది వరకు వచ్చారని కథనంలో రాశారు.

భర్త చేతిలో మోసపోయిన మహిళలు, భార్య చేతిలో మోసానికి గురైన భర్తలు, భార్యను కోల్పోయిన భర్తలు, భార్య చనిపోవడంతో పిల్లలు తమను పట్టించుకోని వారు ఇందులో పాల్గొని తమ సహచరులు ఎలా ఉండాలో అభిప్రాయాలు తెలియజేశారు.

కౌన్సెలింగ్‌ తర్వాత వివాహ ఒప్పంద తేదీని నిర్ణయించి, రిజిస్ట్రార్‌ సహాయంతో ఉచితంగా పెళ్లి చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ.. ఒక వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయిన స్త్రీలు, పురుషులు ఒంటరిగా జీవించలేక ఎంతో బాధ పడుతుంటారని చెప్పారు. అలాంటి పెద్దలు నిస్సంకోచంగా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.

ఇరిగేషన్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైరైన ఈశ్వర్‌ ప్రసాద్‌ (64), విజయ అనే మహిళను ఇష్టపడ్డారు.

ఈశ్వర్‌ ప్రసాద్‌ రెండేళ్లుగా ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థలో సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కటైన ఆ జంటను అతిథులు అభినందించారని ఆంధ్రజ్యోతి రాసింది.

తిరుమల

ఫొటో సోర్స్, facebook

తిరుమలకు 30 శాతం తగ్గిన భక్తులు

కరోనావైరస్ వల్ల తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 30 శాతం తగ్గిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

వ్యాధి నియంత్రణను కాంక్షిస్తూ తిరుమలలో ఈనెల 26, 27, 28 తేదీల్లో ధన్వంతరి హోమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నామని ఆయన తెలిపారు.

చెన్నైలోని జీఎస్‌చెట్టి రోడ్‌లో అలనాటి నటి కాంచన విరాళంగా ఇచ్చిన స్థలంలో పద్మావతి అమ్మవారి ఆలయాన్ని టీటీడీ నిర్మించనుంది. దీనికి ఏప్రిల్ 9న భూమిపూజ చేస్తారని కథనంలో రాశారు.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఆహ్వాన లేఖ అందించారు.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ... చెన్నైలో శ్రీవారి మహా ఆలయ నిర్మాణానికి ఈసీఆర్, ఓఎమ్మార్ కూడలిలోని 11 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పినట్లు ఈనాడు వివరించింది.

విజయసాయిరెడ్డి

ఫొటో సోర్స్, FB/VIJAYASAIREDDYOFFICIAL

సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం: విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారని సాక్షి సహా అన్ని ప్రధాన పత్రికలూ ప్రచురించాయి.

ఇది అప్రజాస్వామికమని, దీన్ని తాము సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు.

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఆ హోదాను దుర్వినియోగం చేస్తే శిక్షించే అధికారం న్యాయస్థానానికి మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు.

అదేవిధంగా కేంద్రానికి, గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంలో తప్పేమీ లేదన్నారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను ఖూనీ చేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కరోనావైరస్‌ కంటే అత్యంత ప్రమాదకర వ్యక్తి అని ఆయన మండిపడ్డారని సాక్షి రాసింది.

ఆదివారం విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి రాష్ట్రంలో కరోనా ప్రభావంపై ఆరోగ్య శాఖ కార్యదర్శిని, సీఎస్‌ను, ప్రభుత్వంలో ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం శోచనీయమన్నారని కథనంలో వివరించారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, FB/@KTRTRS

మిషన్ హైదరాబాద్: కేటీఆర్

హైదరాబాద్‌ను మిషన్ మోడ్‌తో విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో సాగు, తాగునీటి, పవర్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్టే.. హైదరాబాద్‌ను మిషన్‌ మోడ్‌తో విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.

రాష్ట్రానికే హైదరాబాద్‌ ఆర్థిక చోదకశక్తిగా అవతరించిందని.. ఏటా రూ.10వేల కోట్ల చొప్పున రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారని పత్రిక తెలిపింది.

ఆదివారం అసెంబ్లీలో పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ అంటే జీహెచ్‌ఎంసీ మాత్రమే కాదని.. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు విస్తరించిన నగరమని చెప్పారు.

అందుకే, ఓఆర్‌ఆర్‌ వరకూ ప్రత్యేకంగా సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌కు రూపకల్పన చేశామని తెలిపారు. వచ్చే వర్షాకాలం ముగిశాక పనులను చేపడతామని.. ఇందుకు సంబంధించి రోడ్లు తవ్వేక్రమంలో ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తిచేశారని కథనంలో రాశారు.

రాష్ట్రంలో పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకే కొత్త మున్సిపల్‌ చట్టానికి రూపకల్పన చేశామని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణలోని 38 పట్టణాల్లో నిలిచిపోయిన మిషన్‌ భగీరథ పనులను పూర్తిచేయడానికి రూ.800 కోట్లు కేటాయిస్తున్నట్టు కేటీఆర్ చెప్పినట్లు నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)