తెలంగాణ: రాత్రికి రాత్రే 56మంది ఐఏఎస్‌ల బదిలీ, 21జిల్లాలకు కొత్త కలెక్టర్లు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
పరిపాలన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినట్లు ఈనాడు దినపత్రికలో ప్రచురించిన ఓ కథనం పేర్కొంది. ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది.
''సీనియర్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు సహా 54 మంది అధికారులకు స్థాన చలనం కలిగింది. 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం కదిలించింది. ఆరుగురికి పోస్టింగులు ఇవ్వలేదు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు చిత్రా రామచంద్రన్, అథర్‌సిన్హాల స్థానాలను మార్చింది. చిత్రా రామచంద్రన్‌కు కీలకమైన విద్యాశాఖను అప్పగించింది. అథర్‌సిన్హాను సాధారణ పరిపాలన శాఖ నుంచి పశుసంవర్థక శాఖలో నియమించింది. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ శాఖను జనార్దన్ రెడ్డికి కేటాయించింది. ఈ శాఖ ముఖ్య కార్యదర్శిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్న పార్థసారథిని అనూహ్యంగా ఈపీటీఆర్‌ఐలో నియమించింది.
పలువురు ఐఏఎస్‌లకు కలెక్టరుగా పదోన్నతులు కల్పించింది. 2016 బ్యాచ్ అధికారులను వివిధ జిల్లాల్లో నియమించింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని భావిస్తున్నారు'' అని ఈనాడు తన కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
మందు మానేయాలా.. అయితే ప్రభుత్వ ఆస్పత్రికి రండి
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో డ్రగ్ డి-అడిక్షన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు 'సాక్షి' దినపత్రిక ఓ కథనంలో తెలిపింది.
''రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, వైద్య శాఖలు సంయుక్తంగా ఈ కేంద్రాల్ని నెలకొల్పనున్నాయి. ఈ మేరకు జిల్లా ఆస్పత్రుల్లో డి-అడిక్షన్ కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వ్యసనపరుల్ని మద్యం మాన్పించి వారికి చికిత్స అందించడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మెడికల్ ఆఫీసరుగా ఓ సైకియాట్రిస్ట్ ఆ కేంద్రంలో ఉంటారు.


ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యికిపైగా ప్రైవేటు, ఎన్జీవోల ఆధ్వర్యంలో డి-అడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రైవేటు కేంద్రాలకు దీటుగా సేవలందించేలా జిల్లా ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలను ఏర్పాట్లు చేయనున్నారు.
కేరళ, పంజాబ్‌లలో అక్కడి ప్రభుత్వాలే భారీగా వెచ్చించి డి-అడిక్షన్ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. కేరళలో ఆ సెంటర్ల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అక్కడి విధానాల్ని మన వైద్య, ఎక్సైజ్ అధికారులు అధ్యయనం చేశారు. ఏపీలో కూడా మెరుగైన వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు'' అని సాక్షి తన కథనంలో వివరించింది.

ఫొటో సోర్స్, TELANGANA I&PR
మేడారం... ఒక్కరోజే మిగిలున్నా పూర్తికాని పనులు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా ఒక్కరోజే మిగిలున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో పేర్కొంది.
''మేడారం మహా జాతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించింది. వీటితో వీఐపీ పార్కింగ్ స్థలాన్ని చదును చేయడం, ట్రైబల్ వెల్ఫేర్ రోడ్ల అభివృద్ధి, ఆశ్రమ పాఠశాల వద్ద అధికారులకు సౌకర్యాలు కల్పించాలి. కానీ, ఊరట్టం నుంచి కొండాయికి వెళ్లే రోడ్డు కానీ ఇతర ఏజెన్సీ రోడ్లకు కానీ ఎక్కడా పిడికెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. వీఐపీ పార్కింగ్ ప్లేస్‌లో పనులు అసంపూర్తిగా చేపట్టి వదిలేశారు. కీలకమైన పనులు చేసే ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు రూ.19 కోట్లు కేటాయించారు. మరుగుదొడ్లు అన్నీ నిర్మించేశామని అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ, ఊరట్టం, నార్లాపూర్, వనం రోడ్లలో ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి.
చాలాచోట్ల మరుగుదొడ్లకు డోర్లు లేకపోవడం, ఉన్నచోట శుభ్రత లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతర మొదలు కాకముందే మరుగుదొడ్లు ఊడిపోతున్నాయి. బుధవారం నుంచి జాతర ప్రారంభం కానుంది. కానీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్.. ఏ శాఖ పనులైనా అరకొరగానే అయ్యాయి. మరుగు దొడ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, షెడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పేలా లేవు.
జాతరలో వసతులకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. కొన్ని పనులకు టెండర్లు నిర్వహించగా.. మరికొన్ని నామినేషన్‌పై అప్పగించారు. డిసెంబరు 15లోగా పూర్తి చేయాలని అప్పటి ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి కాంట్రాక్టర్లకు ఆదేశిస్తే.. ఆ గడువు పూర్తికాకముందే డిసెంబరు 31 వరకు డెడ్‌లైన్ విధిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటన జారీ చేశారు. అయినా పూర్తికాకపోవడంతో సంక్రాంతిలోపు పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఆ గడువును జనవరి 25కు; జనవరి 30కి పొడిగించారు'' అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
3 రోజుల్లో 31 కిలోల బంగారం పట్టివేత
మూడురోజుల్లో రూ.13.3 కోట్ల విలువైన 31.5 కిలోల అక్రమ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకొన్నారని 'నమస్తే తెలంగాణ' ఓ కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం... నాలుగు వేర్వేరు కేసుల్లో 12 మందిని అదుపులోకి తీసుకొన్నట్టు డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అదనపు డైరెక్టర్ జనరల్ డీపీ నాయుడు చెప్పారు. చెన్నైలో కొనుగోలు చేసిన అక్రమ బంగారం వరంగల్ కేంద్రంగా ముఠాను నడుపుతున్న కీలకవ్యక్తికి చేరుతున్నట్టు అధికారులు గుర్తించారు.
డీఆర్‌ఐ హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు యూనిట్లు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. గతనెల 31న జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికుల బ్యాగుల్లో నుంచి రూ.3.05 కోట్ల విలువైన 7,228 గ్రాముల అక్రమ బంగారం పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున విజయవాడ రైల్వేస్టేషన్‌లో చెన్నై- వరంగల్ రైలులో తనిఖీలు జరిపి ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ. 2.99 కోట్ల విలువైన 7,077 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అదేరోజు రాత్రి టీఎస్‌ఆర్టీసీ బస్సులో 6,470 గ్రాముల బంగారాన్ని పట్టుకొన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వస్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా 10,709.44 గ్రాముల బంగారం లభించింది. నాలుగు వేర్వేరు కేసుల్లో మొత్తం 31.5 కిలోల బంగారం పట్టుబడింది.

ఇవి కూడా చదవండి:
- ‘నా కూతురి బొమ్మ టార్చిలైట్ నా ప్రాణాలు కాపాడింది’
- India Vs New Zealand: ఐదో టీ20లో విజయంతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్
- కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది?
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్‌పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- మీ జుట్టు తెల్లబడుతోందా? అయితే కారణం అదే కావొచ్చు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























