టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్: ‘తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. పిల్లల ఫొటో చూసి ఆగిపోయా’ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కుంగుబాటు (డిప్రెషన్‌) కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ ప్రవీణ్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సాక్షి తెలిపింది.

హరిద్వార్‌ రహదారిపై తన లైసెన్డ్స్‌ రివాల్వర్‌తో షూట్‌ చేసుకుందామనుకున్నానని, అయితే చిరునవ్వుతో ఉన్న తన పిల్లల ఫొటో చూశాక ధైర్యం రాలేదని ప్రవీణ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు.

టీమిండియాలో చోటు కోల్పోవడంతో పాటు ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ ముగియడం లాంటి కారణాలతో తాను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఈ క్రమంలో 'ఇవన్నీ ఏమిటీ, ఇక జీవితాన్ని ముగిద్దాం' అనుకున్నానని అతడు తెలిపాడు.

"కెరీర్‌ ఆరంభంలో నన్ను అందరూ మెచ్చుకున్నారు. ఇంగ్లండ్‌ సిరీస్‌ అనంతరం టెస్టు క్రికెట్‌పై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అనూహ్యంగా నన్ను జట్టు నుంచి తప్పించారు. మళ్లీ అవకాశాలు ఇవ్వలేదు. ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ ముగిసిపోవడంతో పూర్తిగా నిరాశ చెందాను. డిప్రెషన్‌తో నరకం చూశాను. డిప్రెషన్‌ను భారత్‌లో ఎవరూ అర్థం చేసుకోరని ఎవరికీ చెప్పలేదు. దీంతో ఇవన్నీ ఏంటి? ఇక జీవితాన్ని ముగిద్దాం? అనుకొని మీరట్‌(ఉత్తర్‌ప్రదేశ్) నుంచి హరిద్వార్‌(ఉత్తరాఖండ్‌)కు నా లైసెన్డ్స్‌ రివాల్వర్‌తో బయల్దేరాను. జాతీయ రహదారిపై కారును పక్కకు ఆపి తుపాకీతో కాల్చుకుందామనుకున్నాను. నవ్వుతున్న నా పిల్లల ఫొటో చూశాక మనసు రాలేదు. ఎందుకంటే నేను చనిపోతే వారు అనాథలవుతారు. అమాయకులైన నా పిల్లలు నా కారణంగా రోడ్డున పడతారు. ఇవన్నీ ఆలోచించి నా నిర్ణయం మార్చుకున్నా. ఇప్పుడంతా కూల్‌. బాగానే ఉన్నాను. ప్రస్తుతం క్రికెట్‌ కోచింగ్‌ వైపు అడుగులు వేస్తున్నా'అని ప్రవీణ్‌ వివరించాడు.

ప్రవీణ్‌ 2007 నవంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మార్చి 30, 2012లో దక్షిణాఫ్రికాపై తన చివరి మ్యాచ్ ఆడాడు. భారత్ తరుపున ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 112 వికెట్లు తీశాడు.

కాశిం అరెస్టు: రోజూ పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌ పరారీలో ఉన్నారని చెబుతారా- హైకోర్టు

''ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా నిత్యం విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న కాశిం పరారీలో ఉన్నారని చెబుతారా'' అంటూ పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

మావోయిస్టు సానుభూతిపరులుగా పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నవారు చెబుతున్న అంశాలను పరిశీలిస్తే పోలీసు చర్యలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించిందని ఈనాడు తన కథనంలో చెప్పింది. "అర్ధరాత్రి.. లేదంటే తెల్లవారుజామున అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడం మామూలైపోయింది. ఇలాంటి పలు పిటిషన్లపై మేం విచారణ చేపడుతున్నాం" అని కోర్టు చెప్పిందని రాసింది.

ఈనాడు కథనం ప్రకారం- విప్లవ రచయితల సంఘం(విరసం) కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కాశింను అక్రమంగా నిర్బంధించారంటూ ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నివాసంలో ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదివారం విచారణ చేపట్టింది.

''పోలీసులు తనిఖీల పేరుతో ఇళ్లలోకి చొరబడి మావోయిస్టుల సాహిత్యాన్ని పెట్టి బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటున్నారని అరెస్టయిన వారు చెబుతున్నారు. ఇలాంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదు. కాశీంకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తులో పురోగతి, మావోయిస్టుల తరఫున డబ్బు వసూలు చేస్తున్నారనడానికి, సమావేశాల్లో పాల్గొన్నారనడానికి సంబంధించి ఆధారాలతో ఈ నెల 23లోగా కౌంటరు అఫిడవిట్ దాఖలు చేయండి'' అని పోలీసులను ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు కాశింను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచాలంది.

సంగారెడ్డి జిల్లాలో సరైన వసతుల్లేవని, చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘునాథ్‌ కోరారు. ధర్మాసనం స్పందిస్తూ మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా చర్లపల్లి జైలుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతానికి ఆయన్ను సంగారెడ్డి జైలుకు తరలించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్‌ పోలీసులు ఆదివారం ఉదయం కాశింను బంజారాహిల్స్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. హైకోర్టు ఆయన నుంచి వాంగ్మూలాన్ని తీసుకుంది.

"నాకు మావోయిస్టులతో ఎటువంటి సంబంధాలు లేవు. ఆ భావజాలాన్ని ప్రచారం చేయడంగానీ, వారి కోసం నిధులు సేకరించడం, డబ్బు పంపిణీ, విప్లవ సాహిత్యం అందజేయడం, కరపత్రాల పంపిణీ వంటివి చేయడం లేదు. ఈ నెల 18న ఉదయం పోలీసులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని నా ఇంటి తాళాన్ని పగులగొట్టి సోదాలు చేశారు. ముగ్గురు పోలీసు దుస్తుల్లో ఉండగా 30 మందిదాకా సివిల్‌ దుస్తుల్లో వచ్చారు. నా లైబ్రరీలో పోలీసులే మావోయిస్టు సాహిత్యాన్ని పెట్టి దొరికినట్లు ప్రకటించారు'' అని కాశిం చెప్పారు.

"మందల శ్యాంసుందర్‌రెడ్డి అనే వ్యక్తి 2016లో పోలీసుల ముందు లొంగిపోయి, కాశిం మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడంతోపాటు వారి తరపున డబ్బు వసూలు చేస్తున్నట్లు చెప్పినట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మరి నాటి నుంచి ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? కాశిం ఇటీవల క్యాంపస్‌లో కుల రాజకీయాలను ప్రశ్నిస్తూ పుస్తకాన్ని ముద్రించిన తరువాతనే అరెస్ట్‌ చేశారు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

"మా ముందున్న రిమాండ్‌ డైరీని పరిశీలిస్తే కాశింపై ఐదు కేసులున్నాయి. 2006 నుంచి 2019 వరకు క్రిమినల్‌ చర్యల్లో పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నా ఇప్పటిదాకా అరెస్ట్‌ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయన సమాజానికి, రాష్ట్రానికి ప్రమాదకారిగా మారారని చూపుతున్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ దాఖలు చేసే కౌంటర్‌లో వీటన్నింటి వివరాలుండాలి' అని కోర్టు స్పష్టం చేసింది.

ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల కోసం దావోస్ చేరుకున్న కేటీఆర్

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) 50వ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు దావోస్ చేరుకున్నారని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఆయన ఆదివారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ చేరుకున్నారు. సోమవారం నుంచి 24వ తేదీవరకు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అధిపతులు, కేంద్ర మంత్రులు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల సీఈవోలు, అధిపతులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.

ఆయా దేశాలు, రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారు వివరిస్తారు.

తెలంగాణలో అమలుచేస్తున్న టీఎస్‌ఐపాస్‌ పారిశ్రామిక విధానం గురించి పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్‌ వివరించనున్నారు. ఫార్మా, లైఫ్‌ సైన్సెన్‌, టైక్స్‌టైల్‌, డిఫెన్స్‌, మెడికల్‌ డివైజెస్‌ రంగాల్లో రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతలను వివరించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.

ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. ఈ నెల 24 రాత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

శ్రీవారి లడ్డూపై రాయితీ నిలిపివేత అమల్లోకి

తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) ఇస్తున్న రాయితీ నిలిచిపోయిందని, ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రాయితీ నిలిపివేత అమల్లోకి వచ్చిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ప్రతి భక్తుడికీ ఒక లడ్డూను ఉచితంగా ఇస్తూ, అదనంగా కావాలనుకునే వారికి ఒక్కొక్క లడ్డూను రూ.50కి విక్రయిస్తున్నారు. లడ్డూ రాయితీ రద్దుపై భక్తుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా 'నష్ట నివారణ చర్య' పేరుతో టీటీడీ తన నిర్ణయం మేరకే ముందుకు సాగింది.

నూతన విధానం 20వ తేదీ నుంచి అమలవుతుందని గతంలోనే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి పరిమితి లేకుండా భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే, ఆన్‌లైన్‌ ద్వారా ఏప్రిల్‌ వరకు విడుదల చేసిన ఆర్జిత సేవలు, రూ.300 టికెట్లపై మాత్రం ఇప్పుడున్న రాయితీ విధానంలోనే లడ్డూలు ఇస్తారు. మే నుంచి ఆన్‌లైన్‌ కోటాలోనూ కొత్త విధానాన్ని అమలు చేస్తారు.

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ- సోమవారం నుంచి ఉచిత లడ్డూ పథకం.. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్లు, శ్రీవాణి ట్రస్టు, వీఐపీ, వారపుసేవలు తదితర అన్ని విధానాల్లో దర్శనం చేసుకున్న భక్తులందరికీ వర్తిస్తుందని తెలిపారు.

ప్రస్తుతం కొండకు నడిచి వచ్చే 20 వేల మంది భక్తులకు మాత్రమే రూ.40 విలువ చేసే 175 గ్రాముల లడ్డూను ఉచితంగా ఇస్తున్నామని, ఇక నుంచి అందరికీ ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పారు. అదనపు లడ్డూల విక్రయానికి ప్రత్యేకంగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ప్రస్తుతం సిఫారసు లేఖలపై శ్రీవారి ఆలయం లోపల వగపడి కౌంటర్‌లో మాత్రమే విక్రయిస్తున్న పెద్దలడ్డూలు, వడల విక్రయాలను కూడా సోమవారం నుంచి బయట లడ్డూ వితరణశాలకు తరలిస్తున్నట్లు ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ అధికారుల అనుమతితో సిఫారసులపైనే వీటిని ఆలయం బయట 44వ నంబరు కౌంటర్‌లో విక్రయిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)