అరగంటలో ఫుల్ బాటిల్ తాగిన వ్యక్తి మృతి : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
మద్యం మత్తులో పందెం కాసిన ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''స్నేహితులు సరదాగా అన్న మాటల్ని సీరియస్‌గా తీసుకున్నాడు. అరగంటలో ఫుట్ బాటిల్ మొత్తం తాగేస్తానంటూ సవాల్ చేశాడు. అన్నట్టుగానే గటగటా మద్యం తాగిన అతడు. చివరికి ప్రాణాలను కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో చోటు చేసుకుందీ ఘటన. గోసంగి కాలనీకి చెందిన కడమంచి కాశయ్య (35) పాత సామాన్లు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటలకు కాశయ్య తనింట్లోనే స్నేహితులైన దుర్గయ్య, సాయిలుతో కలిసి మద్యం తాగాడు.
కాసేపటికే కాశయ్య తూలుతుండటంతో కొద్దిపాటి మద్యానికే మత్తెక్కిందా అంటూ.. స్నేహితులు హేళన చేశారు. దీన్ని అవమానంగా భావించిన కాశయ్య, అదే రాత్రి స్నేహితులతో ఫుల్‌బాటిల్ తెప్పించుకున్నాడు. అరగంటలో మొత్తం తాగేస్తానంటూ పందెం కాశాడు. మద్యాన్ని గటగటా గొంతులో పోసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం కాశయ్య నిద్ర లేవకపోవడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించార''ని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సంక్రాంతి బండి దోపిడీ
పండక్కి హైదరాబాద్, సికింద్రాబాద్ ల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు రైలు రిజర్వేషన్ డౌరక్క ప్రత్యేక బండ్ల చార్జీలు మోతతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు సెకండ్ ఏసీ టికెట్ ధర రూ.5000 దాటేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని 'ఈనాడు' కథనం తెలిపింది.
''తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు ఎక్కడకు వెళ్లినా పండక్కి సొంతూళ్లలో వాలిపోతారు. 14న భోగి 1న సంక్రాంతి పండుగలు. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణాలు మొదలయ్యాయి. సికింద్రాబాద్, నాంపల్లి కాచిగూడ స్టేషన్ లో రద్దీ మొదలైంది. రెండో శనివారం కావడంతో 11న, 12న ఆదివారం, 18 సోమవారం వరకు భారీ రద్దీ కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో రెగ్యులర్ రైళ్లలో వెయిట్ లిస్ట్ పరిమితి దాటిపోయి రిగ్రెట్‌కు చేరుకుంది. ఒక్కో రైలులో ఏకంగా నాలుగైదు వందల మందికి వెయిట్ లిస్ట్ టికెట్లు ఇవ్వడంతో.. బోగీల్లో కాలయినా మోపలేని పరిస్థితులు తలెత్తనున్నాయి. ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం నెల్లూరు, చిత్తూరు, అనంతపురం వైపు వెళ్లే రైళ్లకు డిమాండ్ భారీగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రత్యేక రైళ్ల సంఖ్యను 80 శాతం మేర పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే చెబుతున్నా రద్దీ రోజుల్లో మాత్రం అందుకు అనుగుణంగా అవి లేకపోవడం ఇబ్బందిగా చూసింది. ప్రత్యేక రైళ్లు అంటేనే ఎన్ని గంటలు ఆలస్యంగా గమ్యం చేరుతాయో తెలియదు. అయినా వీటిని ద.మ.రైల్వే వీలైనంతా సొమ్ము చేసుకుంటోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook
249 మంది వైద్య విద్యార్థులపై వేటు
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ) ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిందని 'సాక్షి' కథనం తెలిపింది.
''కేఎంసీలో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 249 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. పరీక్షలు రాయకుండా శుక్రవారం వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కేఎంసీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తృతీయ సంవత్సరానికి చెందిన 176 మంది ఎస్పీఎం సబ్జెక్టులో, ద్వితీయ సంవత్సరానికి చెందిన 15 మంది ఫార్మకాలజీలో, 18 మంది పేథాలజీ, 40 మంది మైక్రోబయాలజీ తరగతులకు సక్రమంగా హాజరుకాలేదు. వారి హాజరు 75 శాతం కంటే తక్కువగా ఉండటంతో పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవగా.. పోలీసులు వారికి నచ్చజెప్పి సామరస్య పూర్వకంగా పరిశీలించుకోవాలన్నారు.
కాగా ఆయా విభాగాల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండటం వల్లే పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించామని, ఈనెల 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఉందని, విద్యార్థుల విన్నపాన్ని పరిశీలించి వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామని కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్య చెప్పార''ని ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
క్యాంపస్ ఆవరణలో చిరుత
తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించిందని 'సాక్షి' కథనం తెలిపింది.
''శుక్రవారం ఉదయం క్యాంపస్‌లోని హాస్టల్ విద్యార్థులకు చిరుత కనిపించడంతో భయాందోళన చెందారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎంబీఏ కాలేజీ సమీపంలో చిరుత కన్పించినట్లు విద్యార్థి స్వామి, రిజిస్ట్రార్ నసీమ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్, ఇందల్వాయి రేంజ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి ఆసిఫుద్దీన్ నేతృత్వంలో సిబ్బంది చిరుత పాదముద్రలు, వెంట్రుకల కోసం వెతికారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఘంటా చంద్రశేఖర్ తెలిపార''ని ఆ కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/aparnamadireddy
అమెరికాలో మేయర్ రేసులో అపర్ణ మాదిరెడ్డి
అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త అపర్ణ మాదిరెడ్డి నవంబర్‌లో జరుగనున్న శాన్మ్రోన్ నగర మేయర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''కాలిఫోర్నియా రాష్ర్టంలోని శాన్మ్రోన్ నగరం నుంచి మేయర్ అభ్యర్థిగా ఆమె బరిలో నిలువనున్నారు. అమెరికాలో 'అర్వాసాఫ్ట్' పేరిట సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్ సంస్థను నిర్వహిస్తున్న అపర్ణకు భర్త, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం కాంట్రా కోస్టా రాష్ర్ట జనగణన 2020 కమిటీకి ప్రతినిధిగా, సిటీ ఓపెన్ స్పేస్ అడ్వైజరీ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న అపర్ణ.. భౌగోళిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. గతంలో సిటీ కౌన్సిల్ సభ్యురాలుగా కూడా ఆమె పనిచేశారు. తనకున్న నాయకత్వ అనుభవంతో శాన్మ్రోన్ నగరాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పార''ని ఆ కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డోనల్డ్ ట్రంప్‌తో తలపడనున్న ఆసియా 'మీమ్' కింగ్
- ‘మీకు ఇలాంటి రిపోర్టర్స్ ఎక్కడ దొరుకుతారు...’ మోదీ, ఇమ్రాన్ ఖాన్‌లను ఒకే ప్రశ్న అడిగిన డోనల్డ్ ట్రంప్
- ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు కారణమైన ఫోన్ సంభాషణ ఇదే
- నరేంద్ర మోదీ 'ఫాదర్ ఆఫ్ ఇండియా': అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- బెంజమిన్ నెతన్యాహు: ఇజ్రాయెల్ ఆర్మీ కమాండో నుంచి.. ఐదోసారి దేశ ప్రధాని రేసు వరకూ...
- డమ్మీ తుపాకీతో రెస్టారెంట్‌కు వచ్చిన 'కిమ్'
- సభావేదికపైనే ముద్దు.. వివాదంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























