పృథ్వీపై పోసాని కృష్ణమురళి ఫైర్:'రైతులను అలాంటి మాటలు అన్నందుకు నువ్వు సిగ్గుపడాలి' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/posanikrishnamurali/Manjunath Halvi
రైతులపై సినీనటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్న రైతులు రోడ్డుకీడ్చావ్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, 'ప్రజల జీవితాలు బాగుపడతాయని భావించి ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని త్యాగం చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా? రైతులు ప్యాంటు, షర్ట్ వేసుకోకూడదా? రైతు ఆడపడుచులు ఖరీదైన బట్టలు వేసుకోకూడదా? పంటలు పండే భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చిన మహిళలు రెండు బంగారు గాజులు వేసుకొనేందుకు కూడా అర్హులు కాదా? వాళ్లు ఫోన్ చేతిలో పెట్టుకొని మాట్లాడకూడదా? ఇలాంటి మాటలు అన్నందుకు నువ్వు సిగ్గుపడాలి."
"రైతులను, అమరావతి ఆడపడుచులను పెయిడ్ ఆర్టిస్ట్ అనడం ఎంత సిగ్గుచేటు? వైకాపా అధినేత, సీఎం జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఏడాదిన్నర పాటు జనంలో తిరిగినా ఎప్పుడూ తేలిగ్గా మాట్లాడలేదు. సీఎం అయిన తర్వాత ఏ కులం పేరూ ఎత్తలేదు. జగనను, ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు మీలాంటి వాళ్లు పుట్టారు... సిగ్గుపడండి' అంటూ ధ్వజమెత్తారు.
తనకు పృథ్వీ పై ఎలాంటి కక్షా లేదన్నారు. పోరాటం చేస్తున్న అమరావతి రైతుల పట్ల తప్పుగా మాట్లాడినందుకు రైతులకు, రైతు ఆడపడుచులకు భేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం నైతికత, వెంకటేశ్వర స్వామి పై గౌరవం ఉన్నా వెంటనే అమరావతి రైతులు, ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని.. అప్పుడే ఆ దేవుడు క్షమిస్తాడని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అందరినీ సమభావంతో చూస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం భ్రష్టుపట్టిస్తున్నారంటూ పోసాని విమర్శించార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్‌లో బిక్కుబిక్కుమంటున్న 8 వేల మంది తెలంగాణవాసులు
ఇరాక్ కేంద్రంగా ఇరాన్, అమెరికా మధ్య దాడుల నేపథ్యంలో ఇరాక్‌లో 8 వేల మంది తెలంగాణ ప్రజలు భయంభయంగా గడుపుతున్నారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''బుధవారం తెల్లవారు జామున 3గంటలకు దాడి జరిగిన ఎర్బిల్ ప్రాంతానికి తాము కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోయినట్లు తెలుగు గల్ఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్(టీజీడబ్ల్యూఈఏ) ప్రెసిడెంట్ దక్షిణ మూర్తి చెప్పారు.
ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 8వేల మంది తెలంగాణ వాసులు ప్రతీ క్షణం ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడులతో ఎర్బిన్‌లో పరిస్థితులు చాల దారుణంగా ఉన్నాయన్నారు. ఇరాన్ జరిపిన దాడి వల్ల ఇక్కడ ఉంటున్న 8వేల మంది తెలంగాణ ప్రవాసులకు ప్రతీ క్షణం టెన్షన్ టెన్షన్‌గా గడుస్తుందని మూర్తి వెల్లడించారు. తాము ఉంటున్న ప్రాంతానికి చాలా దగ్గరగా ఈ దాడి జరిగింది. కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. 8వేల మంది తెలంగాణ వాసుల్లో అధికంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు మూర్తి తెలిపారు. వీరిలో చాలా మంది భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నార''ని ఆ కథనంలో వివరించారు.

హత్యలు 80, రేప్‌లు 91, కిడ్నాప్‌లు 289
భారతదేశంలో 2018లో రోజుకు సగటున 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 కిడ్నాప్‌లు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌ఆర్‌సీబీ)-2018 నివేదిక తెలిపిందని 'సాక్షి'లో కథనం ప్రచురించారు.
''2018లో మొత్తమ్మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువైంది. అయితే ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం 388.6 (2017) నుంచి 383.5(2018)కు తగ్గిందని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో తెలిపింది.
వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో గత ఏడాది సుమారు 10,349 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది. దేశం మొత్తమ్మీద వేర్వేరు కారణాల వల్ల సుమారు 1.34 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్న వారు 7.7 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2017 సంవత్సరం నాటి రైతుల ఆత్మహత్యలతో పోల్చితే 2018లో ఆత్మహత్యలు 3.6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 'పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయా, గోవా, చండీగఢ్, దామన్ అండ్ దయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చెరిలలో రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలుదారులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడలేదు' అని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. వ్యవసాయ కూలీఉలు మొత్తం 4,586 మంది ఆత్మహత్యలకు పాల్పడగా వీరిలో 4071 మంది పురుషులు, 515 మంది మహిళలు ఉన్నారు. అన్ని రకాల ఆత్మహత్యల్లో 17,972తో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. తమిళనాడు (13,896), పశ్చిమబెంగాల్ (13,255) రాష్ట్రాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
2018లో 29,017 హత్య కేసులు నమోదయ్యాయని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.7 శాతం ఎక్కువని నివేదిక తెలిపింది. వివాదాల కారణంగా జరిగిన హత్యలు 9,623 కాగా, వ్యక్తిగత ద్వేషం, పగ వంటి కారణాలతో 3,875 మంది హత్యకు గురయ్యారు. లాభం కోసం చేసిన హత్యల సంఖ్య 2,995. కిడ్నాపింగ్, ఎత్తుకెళ్లడం వంటి నేరాల సంఖ్య 2018లో ఎక్కువైంది. 2017లో మొత్తం 95,893 కిడ్నాప్ కేసులు నమోదు కాగా, 2018లో ఈ సంఖ్య 10.3 శాతం పెరిగి 1.05 లక్షలకు చేరింది. కిడ్నాపైన వారిలో 80 వేల కంటే ఎక్కువ మంది మహిళలు కాగా, పురుషుల సంఖ్య 24,665 మాత్రమే. అంతేకాదు.. కిడ్నాపైన మొత్తం 1.05 లక్షల మందిలో 63,356 మంది బాలబాలికలు కావడం గమనార్హం. కిడ్నాపైన వారిలో 92,137 మంది (22,755 మంది పురుషులు, 69, 382 మంది మహిళలు)ని పోలీసులు కిడ్నాప్ చెర నుంచి విడిపించగలిగారు. మొత్తం 91, 709 మందిని సజీవంగా వెనక్కు తీసుకు రాగలిగితే.. 428 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్షరోద్యమంలో విద్యార్థిలోకం
అక్షర తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి సామాజిక బాధ్యత (ఎస్‌ఎస్‌ఆర్) కింద డిగ్రీ, పీజీ విద్యార్థులను భాగస్వాములను చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిద్ధమవుతుందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''ఈచ్‌వన్-టీచ్‌వన్ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు కనీసం రెండు క్రెడిట్ పాయింట్లు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నది. 'డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్టువర్క్ (ఇంటర్న్‌షిప్)లో భాగం గా సామాజిక బాధ్యత కింద ప్రతివిద్యార్థి గ్రామాలవారీగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి ప్రాజెక్టు వర్క్‌ను చివరి సెమిస్టర్‌లో 90 రోజుల్లో ఎప్పుడైనా పూర్తిచేయాలి.
ఇది ఈ విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించిందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన ఈచ్‌వన్-టీచ్‌వన్‌లో విద్యార్థులను పెద్దసంఖ్యలో భాగస్వాములను చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే వర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించి అక్షర తెలంగాణలో డిగ్రీ, పీజీ విద్యార్థుల పాత్ర, వారి ప్రాజెక్టు, క్రెడిట్ పాయింట్ల గురించి చర్చిస్తామన్నార''ని ఆ కథనంలో వివరించారు.
ఇవికూడా చదవండి:
- ఇరాన్: సులేమానీ హత్య బిన్ లాడెన్ మృతి కన్నా ఎందుకు ముఖ్యమైనది...
- కాసిం సులేమానీ హత్య... ట్రంప్ మళ్లీ గెలిచేందుకు ఉపయోగపడుతుందా?
- 'ఆ 19 మందిని నేనే చంపాను. కానీ, అందులో నా తప్పేమీ లేదు'
- "జేఎన్‌యూ వీసీని వెంటనే తొలగించాలి": బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
- బ్రిటన్ రాజకుటుంబ బాధ్యతల నుంచి వైదొలగుతామన్న హ్యారీ-మేఘన్ జంట
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
- ఎగిరే టాక్సీలు.. కాన్సెప్ట్ కార్లు... స్మార్ట్ బైకులు... సీఈఎస్ 2020 టెక్నాలజీ షో
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























