రాంగోపాల్ వర్మ నా పేరు వాడుకుంటున్నారు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/DrKAPaul
రామ్‌గోపాల్ వర్మ రూపొందించి ఈ నెల 29న విడుదల కానున్న 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాలో తన డైలాగ్స్, ఫొటోలు, వీడియోలు వాడటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''తన పేరుని వాడుకుని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ పాపులారిటీని సంపాదిస్తున్నాడని కె.ఎ.పాల్ అన్నారు. ఈ సినిమా పరంగా ఇప్పటికే సెన్సార్ బోర్డ్, లాయర్లను మేనేజ్ చేయడానికి వర్మకు రూ.5 కోట్లు ముట్టాయని ఆరోపించిన పాల్, తాను న్యాయం కోసం కోర్టుకు వెళతానే తప్ప ప్రభుత్వం దగ్గరకు వెళ్లనని అన్నారు.
2015లో రజినీ కాంత్ అనుమతి లేకుండా ఆయన ఫొటోలను వాడుకుంటే .. అలా వాడుకున్న ఓ సినిమాను నిలిపివేశారని కేఏ పాల్ అన్నారు. కమ్మ కులాన్ని అవమానించి రెడ్డి కులాన్ని గొప్పగా చూపారు. ఇలాంటి వివాదస్పద మైన ఓ సినిమాను పంజాబ్‌లో తీస్తే ప్రభుత్వమే ఆ సినిమాను ఆపేసిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సినిమాలు లేకుండా రోజూ వర్మ నా గురించి మాట్లాడుతున్నాడు. ఇకపై వర్మ ఆటలు సాగవన్నారు కేఏ పాల్'' అని ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సింగపూర్‌లో అమరావతి ప్రకంపనలు
ఏపీ రాజధాని అమరావతిలో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం వైదొలగడంపై ఆ దేశంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయని 'ఈనాడు' కథనం తెలిపింది.
''అమరావతి సహా విదేశాల్లో సింగపూర్ సంస్థ పెట్టుబడులకు సంబంధించి బ్రాడ్ బ్రోయర్ అనే విపక్ష నేత తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచిన పోస్టును సింగపూర్ ప్రభుత్వం ఖండించింది.
ఆ వ్యాఖ్యలపై తొలిసారి తప్పుడు వార్తల నిరోధక చట్టం ప్రయోగించింది. అమరావతిలో సింగపూర్ సంస్థలు భారీ ఖర్చేమీ పెట్టలేదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో అసత్య, తప్పుడు వార్తల ప్రచారాన్ని నిరోధించేందుకు సింగపూర్ ప్రభుత్వం ఇటీవలే 'ప్రొటెక్షన్ ఫ్రం ఆన్‌లైన్ ఫాల్స్‌హుడ్స్ అండ్ మానిప్యులేషన్ చట్టం అమల్లోకి తెచ్చింది. విదేశాల్లో సింగపూర్ సంస్థల పెట్టుబడులకు సంబంధించి బోయర్ చేసిన వ్యాఖ్యలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయని, ఆ పోస్టును తొలగించాలని బోయర్‌కు సూచించింది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, TRSPARTYONLINE/FACEBOOK
ఆర్టీసీ కార్మికుల భవితవ్యం తేలేది నేడే
తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని 'సాక్షి' కథనం తెలిపింది.
''గురు, శుక్రవారాల్లో నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఆర్టీసీకి కొత్త రూపు ఇవ్వనుంది. 52 రోజులపాటు కొనసాగిన సమ్మె, 30 మందికిపైగా కార్మికుల మృతి, తాత్కాలిక సిబ్బంది బస్సులు నడుపుతున్న సమయంలో జరిగిన ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడం వంటి పరిణామాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండటం, పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్నందున వారి భవితవ్యాన్ని తేల్చకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో రెండు రోజులపాటైనా సరే మంత్రివర్గ భేటీ నిర్వహించి ఈ విషయాన్ని తేల్చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కేబినెట్ సమావేశం కొనసాగుతుందని, ఈ భేటీలో ఆర్టీసీ అంశం పూర్తిగా తేలని పక్షంలో శుక్రవారం కూడా సమావేశం కొనసాగనుందని అధికార వర్గాలు వెల్లడించాయ''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, NAmastetelangana
పిలిచినా పట్టించుకోలేదని చంపేశాడు!
అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్‌కు చెందిన యువతి రూత్‌జార్జిపై (19) లైంగికదాడి, హత్య కేసులో దారుణ విషయాలు వెల్లడయ్యాయని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''తను పిలిచినా (విజిల్ వేసినా) పట్టించుకోలేదన్న ఆగ్రహంతోనే నిందితుడు డొనాల్డ్ తర్మన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు వెల్లడించారు. షికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఆనర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జార్జి మృతదేహాన్ని మంగళవారం వర్సిటీ క్యాంపస్‌లోని పార్కింగ్ గ్యారేజీలో ఆమె కారులోనే గుర్తించిన విషయం తెలిసిందే. నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ జేమ్స్ ముర్ఫీ నేరం వివరాలను కోర్టుకు వెల్లడించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున క్యాంపస్ నుంచి పార్కింగ్ గ్యారేజికి వెళ్తున్నప్పుడు తాను పిలిచినా ఆమె స్పందించకపోవడం తర్మన్‌కు ఆగ్రహం కలిగించింది. దీంతో అతడు జార్జిని అనుసరించాడు.. ఆమె అందంగా ఉందని భావించిన అతడు, ఆమెతో మాట్లాడాలనుకొన్నాడు. అయితే ఆమె పట్టించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన తర్మన్ వెనుకనుంచి ఆమె మెడను పట్టుకుని, స్పృహ కోల్పోయేవరకు ఊపిరి సలుపకుండా చేశాడు.
అనంతరం ఆమెను కారు వెనుక సీటులోకి లాక్కెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారిద్దరికీ అంతకుముందు ఎలాంటి పరిచయం లేదని ప్రాసిక్యూటర్ చెప్పారు. జార్జిని తర్మన్ అనుసరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిందని తెలిపారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య, లైంగికదాడి అభియోగాలు నమోదుచేసినట్లు చెప్పార''ని ఆ కథనంలో రాశారు.
ఇవి కూడా చదవండి
- 'ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు
- వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి 'బ్రెయిన్‌వాష్' చేస్తున్న చైనా
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టాలని ఈమె 7 లక్షలు అప్పుచేసి డిస్నీలాండ్ వెళ్లారు
- మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది
- మహారాష్ట్ర: నాలుగు రోజులకే సీఎం ఫడణవీస్ రాజీనామా, ఈ రాజకీయాలు చెబుతున్నదేంటి?
- మహారాష్ట్ర: ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రే ఎన్నిక...
- 'రాజుల కోట' నుంచి అమూల్యమైన వజ్రాలను ఎత్తుకెళ్లిన దొంగలు
- పోర్న్ తారల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు తొలగిస్తోంది?
- అబ్బాయిలకు శిక్షణనిస్తే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయా
- అమెజాన్ అలెక్సా మరింత స్మార్ట్ అవుతోంది... మీకు తోడుగా ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమవుతోంది
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- హిట్లర్ ఇంట్లో పోలీస్ స్టేషన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























