You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: 'అమరావతిలో నిర్మాణాలు ఆపొద్దు' - సీఎం వై.ఎస్. జగన్ :ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతులు పనులను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''ఆర్భాటాలకు వెళ్లకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పనులపై సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సీఎం జగన్ సోమవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణం, భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన(ఎల్‌పీఎస్) లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహ నిర్మాణం వంటి ఇప్పటికే చేపట్టిన పనులన్నీ కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ పనుల పరిమాణం, ఖర్చు తగ్గించాలని సీఎం ఆదేశించారు. వాటికి అవసరమైన నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పార''ని ఆ కథనంలో తెలిపారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎంపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆకస్మికంగా భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన అక్కడ ఎవరితో, ఏ అంశంపై చర్చించారో బయటకు రాలేదు కానీ, దాదాపు గంటకుపైగా ఆయన బీజేపీ కార్యాలయంలో గడిపినట్లుగా సమాచారం అంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఇలా బీజేపీ ఆఫీసువైపు రావడం ఇతర ఎంపీలను ఆశ్చర్యానికి గురి చేసింది. విజయసాయిరెడ్డికి, మిథున్ రెడ్డికి చెప్పకుండా, కేంద్రమంత్రులనే కాదు నేరుగా ప్రధానిని కూడా కలవద్దని జగన్ కట్టడి చేశారు.
పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని స్పష్టం చేశారు. కానీ రఘురామకృష్ణం రాజు మాత్రం లోక్‌సభలో తొలిరోజే మాతృభాషకు అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఆయనను సెంట్రల్ హాల్లో ఆప్యాయంగా పలుకరించడంతో పరిస్థితి మారిపోయింది. వెంటనే జగన్ ఎంపీని అమరావతికి పిలిపించి వివరణ తీసుకున్నారు. అంతకుముందు సుజనాచౌదరి వైసీపీకి చెందిన ఎంపీలు కొంతమంది టచ్‌లో ఉన్నారని, తమతో కలిసిరావాలనుకున్నవాళ్లే కలుస్తున్నారని చెప్పి కలకలం రేపారు.
అయితే, ఈ వ్యాఖ్యలను రఘురామ కృష్టంరాజు తోసిపుచ్చారు. తాము ఎవరితోనూ టచ్‌లో లేమన్నారు. అలా అన్న ఒక్క రోజులోనే రఘురామకృష్ణం రాజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో వైసీపీ వర్గాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయ''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ట్రయల్ రన్
మెట్రో కారిడార్-2 (జేబీఎస్- ఫలక్‌నుమా)లోని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం త్వరలో అందుబాటులోకి రానుందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''ఇప్పటికే మెట్రో కారిడార్-1, 3 ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, త్వరలో కారిడార్-2లో కూడా మెట్రో రైలు పరుగులు పెట్టనున్నది. ఇందుకోసం సోమవారం ట్రయల్ రన్ ప్రారంభించారు. 11 కిలోమీటర్ల పొడవుగల ఈ కారిడార్‌లో జేబీఎస్, పరేడ్‌గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ దవాఖాన, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్ తదితర స్టేషన్లున్నాయి. సీఎంఆర్‌ఎస్ భద్రతా ధ్రువీకరణ అనంతరం ప్రయాణికులకు ఈ కారిడార్‌ను అందుబాటులోకి తేనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి, పలువురు అధికారులు, సాంకేతిక నిపుణులు ట్రయల్ రన్ సందర్భంగా మెట్రోలో ప్రయాణించి.. సాంకేతిక, భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణించడానికి 16 నిమిషాల సమయం పడుతుందని, రోడ్డు మార్గంలో 45 నిమిషాల వరకు పడుతుందని తెలిపారు. కొద్ది వారాలపాటు నిర్వహించే ట్రయల్ రన్‌లో సాంకేతిక అంశాలు, పనితీరు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించనున్నట్టు చెప్పారు. ట్రయల్ రన్‌లో పరీక్షించే అంశాలను ఆన్‌లైన్ ద్వారా కెనడాలోని ఎంఎస్ థేల్స్‌కు పంపుతార''ని తెలిపారు.
ఓటుకు కోట్లు కేసును తొందరగా విచారించాలి
'ఓటుకు కోట్లు' కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారని 'సాక్షి' కథనం తెలిపింది.
''ఈ కేసును 2019 ఫిబ్రవరిలో విచారిస్తామంటూ 2018 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు కేసు విచారణకు రాలేదని, శీఘ్రగతిన విచారించాలని అభ్యర్థించారు. ఆళ్ల తరపున న్యాయవాది అల్లంకి రమేష్ సోమవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్‌లో ప్రతివాదులైన నాటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి 2017 మార్చి 6న సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. తర్వాత ఈ పిటిషన్ విచారణకు రాలేదు. త్వరగా విచారించాలని కోరుతూ ఆళ్ల తొలిసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలు చేయగా 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డితో కూడిన ధర్మాసనం 2018 నవంబరు 2న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పిటిషన్ విచారణకు రాలేదు.
'ఓటుకు కోట్లు' కేసులో ఏసీబీ దర్యాప్తు సక్రమంగా లేదని, చంద్రబాబు పాత్రపై అధికారులు దర్యాప్తు చేయడం లేదని పేర్కొంటూ 2016 ఆగస్టు 8న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని అదే ఏడాది ఆగస్టు 29న ఏసీబీని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు 2016 సెప్టెంబర్ 1న హైకోర్టును ఆశ్రయించగా ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆళ్ల సుప్రీం కోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం 2017 మార్చి 6న ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, నాటి సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చింది. ఇది వినాల్సిన కేసని.. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తామని పేర్కొంటూ ఆ సమయంలో నోటీసులు జారీ చేసింది.
2017 మార్చి 6న సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుపై తగినంత ఆసక్తి చూపడంలేదని, ప్రతివాదులు పలుకుబడి కలిగిన వారైనందున ఆలస్యమైతే సాక్షులను ప్రభావితం చేయవచ్చని పిటిషనర్ తొలిసారి శీఘ్ర విచారణ కోరిన సమయంలో నివేదించారు. వీటితోపాటు మరో కొన్ని అంశాలను జోడిస్తూ తాజాగా రెండోసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలుచేశారు. 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసినా ఇప్పటివరకు కేసు లిస్ట్ కాలేదని... పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదులు రిజిస్ట్రీలో విచారించినా ఫలితం లేదన్నారు. దీన్ని విచారణ కేసుల జాబితాలో చేర్చకపోవడానికి కారణాలు తెలియడం లేదని నివేదించార''ని ఆ కథనంలో చెప్పారు.
ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర
తెలంగాణలో 2020 ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని 'సాక్షి' కథనంలో తెలిపారు.
''జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం సంక్షేమ భవన్‌లో మేడారం జాతర ఏర్పా ట్లపై ఆమె సమావేశం నిర్వహించారు. జాతరకు డిసెంబర్ చివరి వారం నుం చే భక్తుల తాకిడి ఉంటుందని, కాబట్టి డిసెంబర్ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
పార్కిం గ్, వసతుల కల్పనలో లోపాలు ఉండద్దన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించేందుకు వీలుగా పర్యా టక ప్రాంతాలపై ప్రచారం చేయాలన్నారు. జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. పాలు, పాల ఉత్పత్తుల సరఫ రా కోసం విజయ డైరీని భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసిందని, వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని వెచ్చిస్తామని మంత్రి చెప్పార''ని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ అలెక్సా మరింత స్మార్ట్ అవుతోంది... మీకు తోడుగా ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమవుతోంది
- మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు
- గూగుల్ డుప్లెక్స్: మీ పని గూగుల్ చేసి పెడుతుంది!
- టీఎస్ఆర్టీసీ సమ్మె: ‘షరతులు లేకుండా ఆహ్వానిస్తే... వచ్చి విధుల్లో చేరతాం’ - జేఏసీ
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- హిట్లర్ ఇంట్లో పోలీస్ స్టేషన్
- సిరియా, ఇరాన్ దళాలపై ‘విస్తృతంగా దాడులు’ చేశామన్న ఇజ్రాయెల్
- ఇసుక కొరత ప్రపంచమంతటా ఎందుకు ఏర్పడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)