‘ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్.. విధుల్లో చేరని వారిని తీసుకోం’- ప్రెస్‌ రివ్యూ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఫొటో సోర్స్, TWITTER/TELANGANA CMO

ప్రచురణ

సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నట్లు ఈనాడు తెలిపింది. ఇప్పటివరకు సంస్థ రూ.150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. ఇది పూడ్చలేని లోటు అని అన్నారు.

సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచితంగా సమ్మెకు వెళ్లాయని, ఎట్టి పరిస్థితుల్లో వాటితో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడువులోగా విధుల్లో చేరని వారిని మళ్లీ తీసుకునే అవకాశం లేదన్నారు.

వెంటనే ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని, మరిన్ని బస్సులు అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె అసంబద్ధమని న్యాయస్థానంలో బలమైన వాదన వినిపించాలన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఎండీ నియామకం సాధ్యంకాదని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానానికి వివరించాలని ఆయన సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో సేవలందించాలని, మొత్తం అన్ని బస్సులు నడపాలని, పకడ్బందీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శి సునిల్‌శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు సమావేశం జరిగింది.

''ఆర్టీసీలో సమ్మె దురుద్దేశ పూరితం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ఇచ్చింది. దీని ద్వారా 67 శాతం అదనంగా వేతనం పెరిగింది. ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్టీసీకి కేవలం రూ. 1600 కోట్లను ఇచ్చింది. ఇందులో తెలంగాణ వాటా రూ. 712 కోట్లు మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ. 3300 కోట్ల మేరకు సాయం అందించింది. రూ. 800 కోట్ల గ్యారంటీ ఇచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయలేరు. వేతనాలు పెంచినా సంస్థ పనితీరు మెరుగు కాలేదు. లాభాలు రాలేదు. రూ. 5000 కోట్ల నష్టంతో సంస్థ ఉంది’’ అని పేర్కొన్నారు.

‘‘బతుకమ్మ, దసరా పండుగల సమయంలో సంస్థ, ప్రజల గురించి పట్టించుకోకుండా సంఘాలు వ్యవహరించాయి. ఈ సమయంలో సంస్థకు భారీగా ఆదాయం వచ్చేది. ఈ నెల అయిదో తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 150 కోట్లను సంస్థ నష్టపోయింది. దీనికి సంఘాలే బాధ్యత వహించాలి. సమ్మె ద్వారా వారేమీ సాధించలేరు. ప్రభుత్వంపై వారి ఒత్తిడి ఏమాత్రం పనిచేయదు’’ అని కేసీఆర్ చెప్పారని ఈనాడు వెల్లడించింది.

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

ఏపీలో నేత కార్మికులకు రూ. 24 వేలు

ఆంధ్రప్రదేశ్‌లో మగ్గంపై జీవనం సాగిస్తున్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది. 'వైఎస్సార్‌ నేతన్న పథకం' పేరుతో ఈ మొత్తం అందిస్తారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబరు 21న ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగింది. పీపీఏల సంక్షోభానికి.. గత ప్రభుత్వం అవసరానికి మించి ఒప్పందాలు చేసుకోవడమే కారణమని సమావేశం విమర్శించింది.

గత పాలకులు కుదుర్చుకున్న పీపీఏల కారణంగా డిస్కంలు బకాయిల్లో కూరుకుపోయాయని.. వాటి చెల్లింపులకు డిస్కంలు రూ.4,741 కోట్లకు బాండ్లు జారీచేసేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈ బాండ్లను జారీచేస్తుంది. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాలు, రవాణా మంత్రి పేర్నినాని విలేఖరులకు వెల్లడించారు.

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నవంబరు 21వ తేదీ నుంచి దీన్ని అమలుచేస్తారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సమీపంలో గుజరాత్‌ స్టేట్‌ పెట్రో కెమికల్‌ కార్పొరేషన్‌ చమురు నిల్వల అన్వేషణ కోసం సముద్రంలో చేపట్టిన తవ్వకాల వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు అందించే పరిహారాన్ని కూడా అదేరోజు చెల్లిస్తారు.

ఈ పరిహారాన్ని గుజరాత్‌ కార్పొరేషన్‌ ఇస్తే సరేనని.. లేకుంటే రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే మత్స్యకారులు బోట్లకు వాడే డీజిల్‌కు లీటరుకు రూ.9 సబ్సిడీ ఇవ్వాలని, నిర్దేశిత బంకుల్లో డీజిల్‌ కొట్టించుకున్నప్పుడే ఈ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఇసుక ఇబ్బందులపైనా మంత్రివర్గంలో చర్చించామని..అయితే ప్రస్తుతం వరదలు రావడంతో నిస్సహాయత వ్యక్తం చేయడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఈ నెలాఖరుకు ఇసుక కొరత తీరే అవకాశాలున్నాయని చెప్పారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువ

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

అంచనాలకు మించి దరఖాస్తులు

తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయని, ఎక్సైజ్ అధికారుల అంచనాలకు మించి రాష్ట్రంలో దాదాపు 46 వేల దరఖాస్తులు వచ్చాయని నమస్తే తెలంగాణ పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. చివరిరోజు అర్ధరాత్రి దాటాక కూడా మద్యం వ్యాపారులు దరఖాస్తులు అందజేసేందుకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది.

9వ తేదీ నుంచి ఎక్సైజ్ అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దరఖాస్తుల సమర్పణకు బుధవారం చివరిరోజు కావడంతో మద్యం వ్యాపారులు ఉదయం నుంచే పెద్దసంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. 9వ తేదీ నుంచి మంగళవారం వరకు 20 వేల దరఖాస్తులు రాగా, బుధవారం ఒక్కరోజే అనూహ్యంగా సుమారు 26 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నది.

ఈ దఫా మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకుగాను బుధవారం అర్ధరాత్రి సమయానికి దాదాపు 46 వేల దరఖాస్తుల ద్వారా రూ.920 కోట్లు వచ్చినట్టు తెలుస్తున్నది.

ఒక్కో దరఖాస్తు ఫారానికి రూ.2 లక్షల ఫీజు (నాన్ రీఫండబుల్) నిర్ణయించిన నేపథ్యంలో ఆదాయం అనూహ్యంగా పెరిగింది. రెండేండ్ల కిందట మద్యం దుకాణాలకు జారీచేసిన నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫారానికి రూ.లక్ష ఫీజు నిర్ణయించారు. అప్పట్లో 41,119 దరఖాస్తులు వచ్చాయి. దీంతో రూ.411.19 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈసారి దరఖాస్తు ఫారం ధర పెంచడంతో అప్లికేషన్లు తగ్గే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ అధికారులు అంచనావేశారు. కానీ, దరఖాస్తులు పెరిగి.. ఆదాయం పెరిగిందని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

కల్కి భగవాన్

ఫొటో సోర్స్, Sri bhagavan/fb

కల్కి ఆశ్రమాల్లో ఐటీ సోదాలు

ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కల్కి ఆశ్రమాలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారని సాక్షి తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 40 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు దాదాపు రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

చెన్నై సమీపంలో నేమం గ్రామంలో ఉన్న కల్కి ఆశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గోవర్దనపురంలో నివసిస్తున్న కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణాజీ, కోడలు పిత్రాజీ, సహాయ కార్యదర్శి లోకేష్‌ దాసాజీలను వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు.

చెన్నై గ్రీమ్స్‌రోడ్డులోని కల్కి ఆశ్రమంలోనూ తనిఖీలు జరిగాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ప్రధాన ఆశ్రమం, కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద ఉన్న సత్యలోకం ఆశ్రమంలో ఐటీ దాడులు జరిగాయి.

కల్కి ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి నేటి వరకు భూముల కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడులు, ఆశ్రమానికి భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల పేరిట సాగించిన వసూళ్లు, గ్రామాల అభివృద్ధి పేరుతో చేసిన వసూళ్లు వంటి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది.

ఐటీ దాడుల సమయంలో కల్కి భగవాన్, అమ్మ భగవాన్‌ అందుబాటులో లేరు. రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు అందిన సమాచారం మేరకే ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోందని సాక్షి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)