ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు మద్యం దుకాణాల్లో నేటితో అమ్మకాలకు తెర: ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు మద్యం షాపుల్లో విక్రయాలు సోమవారం నుంచి ఆగిపోతున్నాయని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
రాష్ట్ర రాజకీయాలను.. ప్రభుత్వ ఖజానాను ప్రభావితం చేసిన మద్యం అమ్మకాల్లో ఇకపై సమూల మార్పులు రానున్నాయి. ప్రైవేటు మద్యం షాపులు కనుమరుగై.. వాటి స్థానంలో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.
ప్రైవేటు మద్యం దుకాణాలకు సెప్టెంబరు 30వ తేదీ అంటే సోమవారమే చివరి రోజు. మంగళవారం (1వ తేదీ) నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుందని ఆంధ్రజ్యోతి చెప్పింది.
సరుకునంతా విక్రయించేసి షాపులను ఖాళీచేసే పనిలో ప్రైవేటు మద్యం వ్యాపారులు బిజీగా ఉండగా, ఎక్సైజ్ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరుకు నింపి.. సిబ్బందిని సమకూర్చుకుని.. కొత్తగా అమ్మకాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయి. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి.. 3,448 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తోందని కథనంలో వివరించారు.
గతంలో పాలసీ గడువు ముగిసినా మళ్లీ ప్రైవేటు వ్యాపారులే వస్తారు కాబట్టి, పాత వ్యాపారులు సరుకును కొత్తవారికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ షాపుల వల్ల ఆ అవకాశం లేదు. దీంతో ప్రైవేటు మద్యం షాపులన్నీ ఖాళీ చేస్తున్నారు.
రాష్ట్రంలో మద్యం కొరత రాకుండా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ప్రభుత్వ షాపులకు సరుకును చేర్చింది. ఒక్కో షాపునకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల విలువైన మద్యాన్ని చేర్చింది. షాపుల్లో సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తిచేసి, వారికి శిక్షణ ఇచ్చింది.
1వ తేదీ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని షాపులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/YSR Congress Party - YSRCP
30 రోజుల్లో విధుల్లో చేరకపోతే ఉద్యోగం లేనట్లే
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు 30 రోజుల్లో ఉద్యోగంలో చేరకపోతే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగిస్తారని ఈనాడు కథనం ప్రచురించింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సోమవారం నుంచి నియామక పత్రాలు అందజేయనున్నారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాల్గొని మొదటి నియామక పత్రాన్ని అందజేయనున్నారు. పురపాలక, పంచాయతీ రాజ్ శాఖలు సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి దాదాపు 5000 మంది హాజరు కానున్నారు. జిల్లాల్లో మంత్రుల చేతులమీదుగా నియామక పత్రాలు అందిస్తారు.
దీనికి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను విడుదల చేసింది.
- గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రం అందుకున్న 30 రోజుల్లో విధుల్లో చేరాలి. లేదంటే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగించనున్నారు.
- విధుల్లో చేరే అభ్యర్థులు ప్రభుత్వ వైద్యశాల నుంచి తీసుకున్న శారీరక దారుఢ్య ధ్రువపత్రం విధిగా అందించాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాంకులు, కార్పొరేషన్లలో ఇప్పటికే పనిచేస్తున్నట్లయితే వాటి నుంచి బయటకు వచ్చినట్లుగా సంబంధిత శాఖలు, సంస్థలు ఇచ్చే ధ్రువపత్రాన్ని అందజేయాలి.
- అభ్యర్థులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు తర్వాత ఎప్పడైనా బోగస్ అని బయటపడితే ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.
- రెండేళ్ల శిక్షణ కాలంలో నెలకు రూ.15 వేలు వేతనం చెల్లిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ప్రతిభ కనపరిస్తే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుని శాశ్వత స్కేలులో తీసుకుంటారు. లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. శిక్షణ కాలంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
- మూడేళ్లలో విధి నిర్వహణలో విఫలమైనా, ఉద్యోగం వదిలి వెళ్లాలనుకున్నా ప్రభుత్వం తరఫున అప్పటివరకూ అందుకున్న భత్యాలు, గౌరవ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలి.
నిబంధనలు పరిమితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఒక నెల నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఈనాడు కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మరో 30 వేల కోట్లివ్వండి
రిజర్వు బ్యాంకును కేంద్రం మరో 30వేల కోట్లు ఇవ్వాలని కోరుతోందని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.
రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న మిగులు నిధులపై కేంద్ర ప్రభుత్వం మరోమారు కన్నేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేయడానికి ఆపసోపాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం..తాజాగా ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్ కింద రూ.30 వేల కోట్లు చెల్లించాలని కోరబోతోందని కథనంలో చెప్పారు.
నెల రోజుల క్రితం రూ.1.76 లక్షల కోట్ల నిధులను కేటాయించడానికి సెంట్రల్ బ్యాంక్ అంగీకరించిన విషయం తెలిసిందే. కార్పొరేట్ ట్యాక్స్‌ను పదిశాతం తగ్గించడం, సంస్థాగత మదుపరులపై సర్చార్జిని ఎత్తివేయడంతో ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయని నమస్తే తెలంగాణ వివరించింది.
వచ్చే మార్చి నాటికి ఆర్బీఐ నుంచి రూ.25 వేల నుంచి రూ.30 వేల కోట్ల వరకు మధ్యంతర డివిడెండ్ కింద కోరవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అటు డివిడెండ్‌తోపాటు ఖజానాను నింపే చర్యలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, జాతీయ చిన్న పొదుపు మొత్తాలను వినియోగించుకోవడం వంటి చర్యలు చేపట్టొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అని కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఉల్లి ఎగుమతులపై నిషేధం
ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం ఎగుమతులను నిషేధించిందని సాక్షిసహా అన్ని ప్రధాన పత్రికలూ రాశాయి.
వంటింట్లో మంటరేపుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధించడంతోపాటు దేశంలోని వ్యాపారుల వద్ద ఉండే ఉల్లి నిల్వలపై పరిమితులను విధించింది.
రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్ వ్యాపారులు 500క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోరాదని కేంద్రం స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పినట్లు కథనంలో రాశారు.
దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఉల్లి దిగుబడులు తగ్గడం, డిమాండ్ అనూహ్యంగా పెరగడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అక్రమ నిల్వలను అరికట్టేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు అన్ని రాష్ట్రాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిందని సాక్షి చెప్పింది.
కేంద్రం నిర్ణయంతో బంగ్లాదేశ్, శ్రీలంకలకు ఉల్లి ఎగుమతులు తక్షణమే నిలిచిపోనున్నాయి. సాధారణంగా ఉల్లి నిల్వలపై పరిమితులు విధించాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తుండగా ఈసారి మాత్రం ఏకంగా కేంద్రమే నేరుగా రంగంలోకి దిగి అన్ని రాష్ట్రాల్లో ఉల్లి నిల్వలపై పరిమితి విధించడం గమనార్హం.
మరోవైపు ఉల్లి ధరల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు 50 వేల టన్నుల బఫర్ స్టాక్‌ను కేంద్రం దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తోందని కథనంలో వివరించారు.
ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీ సహా వివిధ రాష్ట్రాల బహిరంగ మార్కెట్‌లలో ఉల్లి ధర కిలోకు రూ.60 నుంచి రూ.80 మధ్య పలుకుతోంది అని కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- గుర్తింపు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు, ఆటపైనే నా దృష్టి: కోనేరు హంపి
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- సెప్టెంబర్ 17: విలీనమా? విమోచనా?... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి?- అభిప్రాయం
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- గోధ్రా కేసు: మరణ శిక్ష పడిన దోషులందరికీ శిక్ష తగ్గింపు
- హార్దిక్ పటేల్: ‘పటేళ్లలో సింహం’
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























