హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో 300 మంది చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో 2018 మే నుంచి ఏడాదిపాటు 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయని, ఇన్‌పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదిక వెల్లడించిందని సాక్షి తెలిపింది.
300 మందిలో 100 మందిని జనరల్ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(పీఐసీయూ) నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్‌ఐసీయూ) నుంచి ఎంపిక చేశారు. వీరిపై యాంటీబయోటిక్ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్ ప్రయోగించారు. తద్వారా వారిపై అవెలా పనిచేశాయో వివరాలు సేకరించారు. ఔషధ సామర్థ్యాన్ని నిర్ధరణ చేశారు. ఈ కాలంలో ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగినట్లు తేలింది.
ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనగా, కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వారికి సహాయకులుగా ఉన్నారు. నిలోఫర్‌లో పదేళ్లుగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని నివేదిక తెలిపింది.
గత పదేళ్లలో 13 ట్రయల్స్ జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ అమర వీరుల స్మృతివనం నిర్మించేది ఎప్పుడు? -కోదండరాం
ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అమర వీరులకు స్మృతివనాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించలేకపోయిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారని సాక్షి రాసింది.
అమరుల స్మృతివనాన్ని నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అన్ని సంఘాలను కలుపుకొని పోరాడతామని ఆయన చెప్పారు.
శనివారం హైదరాబాద్‌లో అసెంబ్లీ సమీపంలోని తెలంగాణ అమరుల స్తూపం వద్ద, ఉద్యమంలో అమరులైన వారికి టీజేఎస్ నేతలతో కలిసి కోదండరాం నివాళులు అర్పించారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేసేందుకు వెళుతున్న సర్పంచ్‌లను ప్రభుత్వం అరెస్ట్ చేయడం సరికాదని, ఈ విషయంలో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) రజత్‌కుమార్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, Facebook
ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు 3500
అక్టోబరు 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 3,500 మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఉపముఖ్యమంత్రి(ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖ) కళత్తూరు నారాయణస్వామి చెప్పారని ఈనాడు తెలిపింది.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ దుకాణాలు తెరిచి ఉంటాయని ఆయన చెప్పారు.
నిర్వహణలో అక్రమాలకు అవకాశం లేకుండా ఒక్కో ఎస్‌ఐ, ఒక్కో సీఐకి 10 చొప్పున దుకాణాల బాధ్యతలను అప్పగించామని నారాయణస్వామి వివరించారు.
శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం అమ్మకాల మీద ఆధారపడినవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, FB/Klnbjp
ఏపీలో దేవుడి భూములకు రక్షణ లేదు: కన్నా లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో పాలన లేదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
రాష్ట్రంలో దేవుడి భూములకు రక్షణ లేదని, ఇళ్ల నిర్మాణాలకు ఇసుక లేదని, భవన కూలీలకు పనిలేదని, ఉన్నదల్లా కేవలం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు మాత్రమేనని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తగినంత పనిలేక ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఆయన నేతృత్వంలో బీజేపీ బృందం శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసింది.
ఇసుకను దిగుమతి చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని కన్నా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- జగన్ క్యాబినెట్: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు
- ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?
- ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























