You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం' - ఏపీ ఆర్థిక మంత్రి : ప్రెస్ రివ్యూ
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి చెప్పారంటూ 'ఈనాడు' కథనం తెలిపింది.
'అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని, అది 13 జిల్లాలకు విస్తరించాలని బుగ్గన అన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారం కారణంగా బాధిత గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం కనుగొంటుంద’న్నారు.
కడప జిల్లా సచివాలయంలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' అమలుపై ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, గృహ నిర్మాణ మంత్రి రంగనాథరాజు, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషాలతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
'కెప్టెన్' అజహరుద్దీన్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ తొలిసారి క్రికెట్ పరిపాలనలోకి అడుగు పెట్టారని ‘సాక్షి’ పత్రిక కథనం తెలిపింది.
‘‘శుక్రవారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో అజహర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ పోటీల్లో సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌పై 74 ఓట్ల తేడాతో అజ్జూ విజయం సాధించాడు. పోలైన 223 ఓట్లలో మాజీ కెప్టెన్‌కు 147 ఓట్లు రాగా, ప్రకాశ్‌చంద్‌కు 73 ఓట్లు పడ్డాయి. మూడో అభ్యరి్థగా ఉన్న దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో అజహర్ ప్యానెల్ మొత్తం ఆరు పదవులనూ గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది.
ఇదే గ్రూప్‌కు చెందిన జాన్ మనోజ్ (ఉపాధ్యక్షుడు), విజయానంద్ (కార్యదర్శి), నరేశ్ శర్మ (సంయుక్త కార్యదర్శి), సురేందర్ అగర్వాల్ (కోశాధికారి), అనురాధ (కౌన్సిలర్) ఎన్నికయ్యారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సిఫారసుల అనంతరం తొలిసారి అంతర్జాతీయ క్రికెటర్లకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.
రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సమయంలోనే అజహర్ అధ్యక్ష పదవికి పోటీ పడే ప్రయత్నం చేశాడు. అయితే ప్రత్యర్థిగా పోటీ చేసిన జి.వివేకానంద్... మాజీ సారథి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి అజహర్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేయగలిగాడు.
రెండేళ్లు ఓపిక పట్టిన అనంతరం అజహర్ మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో నిలిచాడు. ఈ సారి అజహర్ నామినేషన్‌కు ఇబ్బంది రాకపోగా...'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' కారణంగా వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. 2017 ఎన్నికల సమయంలో తన నామినేషన్ తిరస్కరించడంలో హెచ్‌సీఏ అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రకాశ్‌చంద్ జైన్‌ను ఇప్పుడు అజహర్ ఓడించార’ని ఆ కథనంలో తెలిపారు.
వలంటీర్ వేధింపులతో యువతి ఆత్మహత్య: చంద్రబాబు
ప్రభుత్వం నియమించిన వలంటీర్ ఉద్యోగాలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.
‘‘వలంటీర్లతో పెద్ద ప్రమాదం వచ్చి పడిందని చంద్రబాబు అన్నారు. ఓ అమ్మాయిని వాంఛ తీర్చమని వలంటీర్ వేధించాడన్నారు. దానికి ఒక అమ్మాయి ద్వారా సంప్రదింపులు జరిపి.. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ వలంటీర్ ఆమెపై దాడి చేశాడన్నారు. ఆ అవమానం భరించలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని వివరించారు.
ఇలాంటి అఘాయిత్యాలు ఇంకెన్ని చూడాలో అర్థం కావట్లేదన్నారు. వలంటీర్ ఉద్యోగం మీ కార్యకర్తలకు ఇవ్వమని అసలు ఎవరడిగారని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. అయినా ఆ ఉద్యోగంతో ఏం లాభమని నిలదీశారు.
రూ.5వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి వలంటీర్ జాబ్ అంటారా? అని దుయ్యబట్టారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగాలు ఇచ్చి.. తామేదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చేసినట్లుగా కథలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పైగా వలంటీర్లేమో ఇలాంటి అకృత్యాలు చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లి డిస్టర్బ్ చేయడం, మగాళ్లు ఇళ్లల్లో లేనప్పుడు వెళ్లి డోర్లు కొట్టడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి పనులు ఎంత నీచమన్నారు. వీటిని చూస్తుంటే ఎంతో బాధేస్తుందన్నారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే... ఒక్కరైనా స్పందించారా?, ప్రాణమంటే లెక్కలేదా? అని ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశార’ని ఆ కథనంలో రాశారు.
మందుల కుంభకోణంలో అరెస్టులు మొదలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అరెస్టులపర్వం మొదలైందని ‘నమస్తే తెలంగాణ’ కథనంప్రచురించింది.
‘‘గురు, శుక్రవారాల్లో రికార్డుస్థాయిలో 23 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలుచేసిన ఏసీబీ అధికారులు.. పలు కీలకపత్రాలను, ఇతర ఆధారాలను సేకరించారు. వాటి ఆధారంగా కేసులో కీలక సూత్రధారులుగా భావిస్తున్న ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ దేవికారాణి, ఐఎంఎస్ వరంగల్ జేడీ డాక్టర్ కే పద్మను శుక్రవారం అరెస్టు చేసినట్టు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఓ ప్రకటనలో తెలిపారు.
వీరితోపాటు ఐఎంఎస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ (స్టోర్స్) డాక్టర్ కే వసంత ఇందిర, శంషాబాద్ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ గ్రేడ్-2 ఫార్మసిస్టు ఎం రాధిక, ఐఎంఎస్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వీ హర్షవర్ధన్, ఓమ్ని మెడి రిప్రజెంటేటివ్ సీహెచ్ శివనాగరాజు, ఓమ్ని మెడి ఎండీ కే శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టుచేసినట్టు పేర్కొన్నారు. వీరినీ సిటీ సివిల్‌కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. వైద్యపరీక్షలు జరిపి వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నకిలీ ఇం డెంట్లు, అనుమతి లేని ఏజెన్సీలతో మందుల కొనుగోళ్లు సహా వివిధ రకాలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో వీరందరిపైనా 13(1)(సీ)(డీ), 7(ఏ), 13(1)(ఏ), 13(2), 477(ఏ), 465, 468, 471, 420 రెడ్‌విత్120-బీ, 34ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశార’ని ఆ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఐఫోన్ 11 కెమెరాలను చూస్తే భయమేస్తోందా... అయితే మీకు ట్రైపోఫోబియా ఉన్నట్లే
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- బడి పిల్లలకు కూరకు బదులు ఉప్పు: వార్త రాసిన జర్నలిస్టుపై యూపీ పోలీసుల కేసు
- అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
- అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు
- ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?
- ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)