You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుడికి నాలుగు గంటలపాటు చిత్రహింసలు.. తర్వాత సజీవ దహనం - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్‌లో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఓ గిరిజనుడిని సాటి గిరిజనులు నాలుగు గంటలపాటు చిత్రహింసలు పెట్టి గ్రామం నడిబొడ్డున కర్రలు పేర్చి, ఆయనపై పెట్రోలు పోసి సజీవ దహనం చేశారని ఈనాడు తెలిపింది.
ఈనాడు కథనం ప్రకారం- విశాఖ మన్యంలోని డుంబ్రిగుడ మండలం పుట్టుబంద గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన గిరిజనుడి పేరు కిల్లో జయరాం. వయసు 54 సంవత్సరాలు.
జయరాంను మంగళవారం మధ్యాహ్నం కొందరు గిరిజనులు పంచాయితీ ఉందని పిలిచారు. ఆయనతోపాటు భార్య, కుమార్తె పంచాయితీకి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటికి వచ్చేశారు.
తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ కొందరు గిరిజనులు ఆయన ఇంటికి వెళ్లి పిలిచారు. జయరాం వెళ్లగానే, అప్పటికే అక్కడున్నవారు ఆయన్ను తాళ్లతో కట్టేసి దుడ్డుకర్రలతో చితకబాదారు. భార్య చెల్లమ్మ, కుమార్తె కమల అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు ఆగలేదు. నాలుగు గంటలపాటు చిత్రహింసలు కొనసాగాయి.
చివరకు జయరాం కాళ్లు, చేతులు కట్టి గ్రామ నడిబొడ్డున కర్రలు పేర్చి రోడ్డుపైనే సజీవ దహనం చేశారని భార్య, కుమార్తె ఆవేదన వ్యక్తంచేశారు. అడ్డుపడేందుకు ప్రయత్నించినవారిని ఆయుధాలతో చంపుతామని బెదిరించారు. తాము ప్రాణభయంతో కొండగుట్టలు ఎక్కి రాత్రికి రాత్రే వేరే గ్రామానికి పారిపోయినట్లు జయరాం భార్య, కుమార్తె చెప్పారు.
మహాత్మా గాంధీతో మోదీకి పోలికా?: అసదుద్దీన్ ఒవైసీ
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీని భారత జాతిపిత అని అభివర్ణించడం పట్ల ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారని నమస్తే తెలంగాణ తెలిపింది.
జాతిపిత మహాత్మాగాంధీతో మోదీకి ఏ మాత్రం పోలికలు లేవని ఆయన విమర్శించారు.
బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు.
"ప్రధాని మోదీని జాతిపిత అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనం. భారత చరిత్ర తెలియకుండా అయన అలా మాట్లాడుతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. అందుకే ఆయన జాతిపిత అయ్యారు. దేశం కోసం ఎంతో త్యాగం చేసిన జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌లకు కూడా ఆ బిరుదు దక్కలేదు. అసలు గాంధీకి మోదీకి పోలికెక్కడిది" అని ఆయన ప్రశ్నించారు.
దేశంలోనే అత్యంత ధనవంతుల్లో నలుగురు తెలుగువారు
దేశంలోనే అత్యంత ధనవంతులంటూ 100 మంది పేర్లతో ఐఐఎఫ్ఎల్ వెల్త్ సంస్థ విడుదల చేసిన జాబితాలో తెలుగువారు నలుగురు ఉన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
బుధవారం విడుదలైన ఈ జాబితాలో రూ.రూ.3,80,700 కోట్ల ఆస్తితో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. రూ.1,86,500 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో హిందుజా కుటుంబం నిలిచింది.
జాబితాలోని తెలుగువారిలో పీపీ రెడ్డి, పీవీకే రెడ్డి, దివీస్ కిరణ్, దివీస్ నీలిమ ఉన్నారు.
రూ.13,400 కోట్లతో మేఘా చైర్మన్ పీపీ రెడ్డి 57వ స్థానంలో ఉన్నారు. రూ.12,900 కోట్లతో 63వ స్థానంలో మేఘా ఎండీ పీవీకే రెడ్డి నిలిచారు.
దివీస్ కిరణ్ 83వ స్థానంలో, దివీస్ నీలిమ 89వ స్థానంలో ఉన్నారు.
రైతు రుణ ఉపశమన పథకం రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో రుణ ఉపశమన పథకం రద్దయిందని, నాలుగో, అయిదో విడతల సొమ్ము విడుదలకు టీడీపీ ప్రభుత్వం మార్చి 10న ఇచ్చిన జీవోను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఈనాడు తెలిపింది. దీంతో రూ.24 వేల కోట్ల రుణాల మాఫీ లక్ష్యంతో చేపట్టిన పథకం రూ.15,279 కోట్లకే పరిమితమైనట్లయింది.
గత జీవో ప్రకారం ఈ రెండు విడతల కింద 33 లక్షల మంది రైతులకు రూ.7,582 కోట్లు అందాల్సి ఉంది.
జులైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, మంతెన రామరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రుణమాఫీ అంశం పరిశీలనలో ఉందని ప్రభుత్వం చెప్పింది. రెండు నెలల వ్యవధిలోనే దీనికి సంబంధించిన జీవోను రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
- ఆ అందమైన అలవాటు వేణుమాధవ్‌కు ఉండేది: ఎల్బీ శ్రీరాం
- ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు కారణమైన ఫోన్ సంభాషణ ఇదే
- ‘పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే జైలు’.. ఇండోనేసియాలో ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- భారతదేశంలో నమోదైన మాతృ భాషలు 19,569 - హిందీ కింద వర్గీకరించిన మాతృభాషలు ఎన్ని?
- హువావే: ఈ చైనా ఫోన్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీ ఎలా అయింది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా!
- గుండెపోటు మనుషులకే ఎందుకొస్తుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)