కాక్రోచ్ జనతా పార్టీ: అభిజిత్ దీప్కే‌ పై జైపూర్‌లో దాడి, ఆయన ఏమన్నారంటే..

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ ఫలితాల్లో గందరగోళం విద్యా వ్యవస్థ, నిరుద్యోగం వంటి సమస్యలపై జైపూర్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది.

ఈ కార్యక్రమానికి హాజరైన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో అభిజీత్ దీప్కేను మద్దతుదారులు భుజాలపై మోసుకెళ్తుండగా గుంపులోని కొంతమంది యువకులు అకస్మాత్తుగా ఆయనపై దాడి చేయడం కనిపిస్తుంది.

ఆ తర్వాత దాడి చేసిన వారిని అక్కడున్న యువకులు కొట్టారు. అయితే వాళ్లను వదిలివేయాలని అభిజిత్ దీప్కే వేదికపై నుంచి కోరారు.

అభిజిత్ దీప్కేపై చేయి చేసుకున్న వారిని పోలీసులు అరెస్టు చేశారని కాక్రోచ్ జనతా పార్టీ మీడియా ఇన్‌చార్జ్ అభిషేక్ జైన్ బీబీసీతో చెప్పారు.

"అభిజిత్ దీప్కేపై చేయి చేసుకున్న ముగ్గురితో సహా ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నాం. వీరికి ఏదైనా సంస్థతో సంబంధాలున్నాయా లేదా అని దర్యాప్తు చేస్తున్నాం" అని జైపూర్ సౌత్ డీసీపీ రాజర్షి రాజ్ వర్మ బీబీసీ ప్రతినిధికి ఫోన్‌లో తెలిపారు.

దాడి చేసింది జాతీయ పార్టీ వారేనన్న సీజేపీ

ఈ సంఘటన తర్వాత అభిజిత్ దీప్కే ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ దాడి భయానికి, పిరికితనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.

"భౌతిక దాడి భయానికి, పిరికితనానికి సంకేతం. మేము శాంతియుతంగా మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాము" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో రాశారు.

"నేను గాంధీ, అంబేడ్కర్ అనుచరుడిని. ఈ పోరాటాన్ని శాంతి, ప్రేమతో కొనసాగిస్తాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి" అని ఆ మెసేజ్‌లో కోరారు.

"దీప్కే‌పై దాడి చేసిన వారందరూ ఒక జాతీయ పార్టీకి చెందినవారే. వారి ముఖాలను గుర్తించాం. వాళ్లందరిని ప్రజల ముందు పెడతాం" అని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో తెలిపారు.

అభిజిత్‌పై జరిగిన దాడి పిరికిపంద చర్య అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా విమర్శించారు.

దీనికి సంబంధించి ఆయన ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.

"భయంతో ఉన్న, అవినీతిపరుడైన రాజుకి చెందిన గూండాలు ఇలాంటి పనులు మాత్రమే చేయగలరు. నీట్ వంటి పరీక్ష పత్రాలను లీక్ చేసి లక్షలమంది యువత భవిష్యత్తును నాశనం చేసేది వీళ్లే. దేశ యువత విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తుంటే వీళ్ళు యువత మీద దాడి చేస్తున్నారు. ఇది పిరికిపంద చర్య" అని సిసోడియా తన మెసేజ్‌లో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)