పవన్ కల్యాణ్: 'వైసీపీ మూడు వేల పింఛనుపై మాట మార్చింది' -ప్రెస్ రివ్యూ

పవన్

ఫొటో సోర్స్, JSP

ప్రచురణ

వృద్ధులకు రూ.3 వేల పెన్షన్‌పై వైసీపీ మాట మార్చిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఎన్నికల ముందు వృద్ధులకు రూ .3 వేల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ తీరా గెలిచాక రూ. 2,250 చేతిలో పెట్టి అంచెలంచెలుగా పెంచుతామని మాట మార్చిందని పవన్‌ విమర్శించారు. మద్యపానాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామని ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారని, కానీ అది జరగదని ఆయనతో పాటు అందరికీ తెలుసని చెప్పారు.

మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలతో అందలమెక్కాలని కలలో కూడా తాను అనుకోలేదని పవన్ తెలిపారు.

బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాయకులతో ఆయన సమావేశమయ్యారు. జనసేన పార్టీ నిర్మాణం ఓటమి తర్వాతే మొదలైందన్నారు.

పవన్‌ రోడ్ల మీద తిరిగితే పార్టీ బలపడుతుందని సలహాలు ఇస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రోడ్లపై తిరగరని, జగన్ మీద కేసులు లేకపోతే ఆయనా జనంలో తిరిగేవారు కాదని పవన్ వ్యాఖ్యానించారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, FB/Amit Shah

తెలంగాణలో అమిత్ షా క్రియాశీల సభ్యత్వం

తెలంగాణలో బీజేపీ సభ్యత్వాల్ని భారీగా పెంచాలని ఇప్పటికే రాష్ట్ర పార్టీకి స్పష్టం చేసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారని ఈనాడు తెలిపింది.

గుజరాత్‌లో సాధారణ సభ్యత్వం ఉండగా, తెలంగాణ నుంచి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని అమిత్ షా నిర్ణయించారు. ఈ సభ్యత్వం రావాలంటే ముందు 50 మందిని పార్టీలో చేర్పించాలి. ఇంటింటికీ వెళ్లి వీరిని చేర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయన ఈ నెల 16న లేదా 17న తెలంగాణ పర్యటనకు రానున్నారు.

జులై 6న దేశవ్యాప్తంగా ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదులో తొలిరోజునే హైదరాబాద్‌కు వచ్చిన కమల దళపతి తెలంగాణకు తానిస్తున్న ప్రాధాన్యంపై పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపించారు. తాజాగా రాష్ట్రంలో క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని ఆయన నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒకచోట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కమ్ముకున్న మేఘాలు, వర్షపాతంలో లోటు

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్: ఈసారి ఖరీఫ్ సాగు 15 ఏళ్లలోనే అత్యల్పం

ఆంధ్రప్రదేశ్‌లో గత 15 ఏళ్లలో ఈ మారు ఖరీఫ్‌లో అత్యంత తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయని ప్రజాశక్తి తన కథనంలో తెలిపింది.

ఖరీఫ్‌కు జూన్‌, జులై మాసాలు అత్యంత కీలకం. వర్షాభావం వలన జులై ఆఖరుకు కావాల్సిన సాధారణ సాగు కంటే 30 శాతం తగ్గింది. సుమారు ఆరు లక్షల హెక్టార్లు తగ్గినట్లు బుధవారం వ్యవసాయశాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

జులై ఆఖరు నాటికి మొక్కజొన్న తప్ప అన్ని పంటలూ సాధారణం కంటే తక్కువ సాగయ్యాయి. మొత్తంగా అన్ని పంటలూ ఈ పాటికి కావాల్సిన సాగులో 5.89 లక్షల హెక్టార్లు (30 శాతం) తక్కువగా సాగయ్యాయి. ప్రధానమైన వరి 1.46 లక్షల హెక్టార్లు (23 శాతం) తగ్గింది.

రాష్ట్రవ్యాప్తంగా జూలై ఆఖరుకు పడాల్సిన వర్షంలో 27 శాతం తక్కువ నమోదైంది. ఇప్పటికి సగటున 245 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 178.4 మిమీ కురిసింది. ఇదే సమయానికి నిరుడు 214.8 మిమీ, ముందటేడు 237.3 మిమీ పడింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా ఎనిమిది జిల్లాల్లో తక్కువ స్థాయిలో వానలు పడ్డాయి.

వారం రోజుల నుంచి అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వలన కొన్ని జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు ఎండుతున్న పంటలకు ఊపిరి పోశాయి. మెట్ట సేద్యం స్వల్పంగా పుంజుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు: రైస్‌మిల్లుల ఏర్పాటుకు వ్యాపారుల ఉత్సాహం

తెలంగాణలో దాదాపు 18.25 లక్షల కరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైస్ మిల్లర్లకు ఆశలు పెరిగాయని, వివిధ జిల్లాల్లో కొత్తగా పారాబాయిల్డ్ రైస్ మిల్లుల ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్నారని సాక్షి తెలిపింది.

నాలుగైదు జిల్లాలకు కూడలి కావడం, జాతీయ రహదారి, రైల్వేలైన్ కనెక్టివిటీతోపాటు రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో కామారెడ్డి జిల్లాలో రైస్‌మిల్లుల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకొస్తున్నారు.

జిల్లాలో కొత్తగా 20 మిల్లుల ఏర్పాటుకు వారు ఏర్పాట్లు చేసుకున్నారు. పొరుగున ఉన్న సిరిసిల్ల జిల్లాలో కూడా రైస్‌మిల్లులు నిర్మిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటికే 934 పారాబాయిల్డ్ రైస్ మిల్లులు, 1,127 రా రైస్‌ మిల్లులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)