వాటాపరంగా చూస్తే రోహిత్ శర్మ కన్నా విలియమ్సనే ముందంజ - ప్రెస్ రివ్యూ

విలియమ్సన్

ఫొటో సోర్స్, ALLSPORT/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, విలియమ్సన్
ప్రచురణ

క్రికెట్ ప్రపంచ కప్‌లో ఓ జట్టు చేసిన మొత్తం పరుగుల్లో ఒక్క బ్యాట్స్‌మెన్ వాటా పరంగా చూసుకుంటే న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందరి కంటే ముందున్నాడని నమస్తే తెలంగాణ రాసింది.

కివీస్ స్కోర్లలో 30.23 శాతం ఒక్క విలియమ్సన్ బ్యాట్‌ నుంచే వచ్చాయి.

పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ (29.05) కూడా ఈ అంశంలో విలియమ్సన్ కంటే వెనుకే ఉన్నాడు.

ఈ ఒక్క ఉదాహరణ చాలు న్యూజిలాండ్ జట్టు అతడిపై ఎంతగా ఆధారపడుతున్నదో చెప్పడానికి.

జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి విలియమ్సన్ నేనున్నానంటూ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నాడు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సహచరులంతా వెనుదిరిగినా తీవ్ర ఒత్తిడిలో కూడా అదరక బెదరక ఎదురు నిలిచిన విలియమ్సన్ అద్భుత శతకంతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు.

టోర్నీలో అతడు ఇప్పటివరకు 481 పరుగులు చేశాడు.

నోట్లు

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/GETYIMAGES

సినిమా, టీవీ రంగంలో పెద్దయెత్తున పన్ను ఎగవేతలు: కాగ్

వినోద రంగంలో పెద్దమొత్తంలో పన్ను ఎగవేతలు జరుగుతున్నట్లు కాగ్‌ గుర్తించిందని ఈనాడు తెలిపింది.

టెలివిజన్‌, రేడియో, మ్యూజిక్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, సినిమాలు, యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, బ్రాడ్‌కాస్టింగ్‌, స్పోర్ట్స్‌, అమ్యూజ్‌మెంట్‌ రంగాలు దేశంలో నానాటికీ విస్తరిస్తున్నప్పటికీ వాటినుంచి వచ్చే ఆదాయం మాత్రం ఆ స్థాయిలో ఉండటంలేదని కాగ్ చెప్పింది.

ఈ రంగం నుంచి వస్తున్న ఆదాయాల గురించి తెలుసుకోడానికి కాగ్‌ 2013-14 నుంచి 2016-17 వరకు ఆడిటింగ్‌ నిర్వహించింది.

ఆదాయపు పన్నుశాఖ ఎంత సమర్థంగా పనిచేస్తుందో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని శాఖలు ఎంత సమన్వయంతో ఉన్నాయో, ఎంతమేరకు పన్ను ఎగవేత జరిగిందో తెలుసుకోడానికి ఈ ప్రయత్నం చేసింది. పన్ను నిబంధనల్లో ఉన్న అస్పష్టత, లోపాల ఆధారంగా ఎంతమేరకు పన్ను ఎగవేత జరుగుతుందో కనిపెట్టడానికి కసరత్తు జరిపింది.

2013-14 నుంచి 2016-17 మధ్యకాలంలో దాఖలైన 13,031 అసెస్‌మెంట్లలో 6,516 అసెస్‌మెంట్లను కాగ్ తనిఖీ చేసింది. అందులో 726 చోట్ల లోపాలున్నట్లు తేల్చింది. వీటివల్ల ప్రభుత్వానికి రూ. 2,267.82 కోట్ల మేర ఆదాయం నష్టం జరిగినట్లు వెల్లడించింది.

తాము కొన్నింటిని మాత్రమే పరిశీలించామని, ఇప్పటికైనా కేంద్ర ఆర్థికశాఖ మొత్తం అన్ని అసెస్‌మెంట్లను తనిఖీ చేయించాలని కాగ్‌ సిఫార్సు చేసింది. వినోద రంగానికి సంబంధించిన అసెసీలు సమర్పించిన అసెస్‌మెంట్లపై కాగ్‌ జరిపిన పరిశీలన నివేదికను కేంద్ర ఆర్థికశాఖ సోమవారం పార్లమెంటు ముందు పెట్టింది.

కాగ్‌ తన పరిశీలనలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని వినోదరంగ సంస్థల అసెస్‌మెంట్లలోని లోపాలను కనిపెట్టింది.

కె.వేణుగోపాల్‌ (కేవీ ఫిలిమ్స్‌), వీర వెంకట దానయ్య దాసరి (డీవీవీ దానయ్య)లతో పాటు ఆర్కా లీజర్‌ అండ్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌, సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రైవేట్‌ లిమిటెడ్‌, ప్రకాశ్‌ ఆర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి పలు సంస్థలకు చెందిన అసెస్‌మెంట్‌ లోపాలను కాగ్ నివేదిక వెల్లడించింది.

తెలంగాణ: విద్యుత్ స్తంభంపై రైతు మృతి

తెలంగాణలోని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామ శివారులో విద్యుత్ స్తంభం ఎక్కిన ఒక రైతు విద్యుదాఘాతంతో చనిపోయారని నవ తెలంగాణ తెలిపింది.

గ్రామ శివారులోని రైతు మంద పోచయ్య పొలం వద్ద బోర్ మోటార్‌కు సంబంధించిన విద్యుత్ సర్వీస్ వైర్ తెగిపోయింది.

దాన్ని సరిచేసేందుకు ఆయన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఆపేశారు.

కరెంటు స్తంభం పైకెక్కి వైర్లను సరిచేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు స్విచ్ ఆన్ చేయడంతో కరెంటు సరఫరా అయి, స్తంభంపైనే పోచయ్య ప్రాణాలు వదిలారని నవ తెలంగాణ తెలిపింది.

ఎస్ఐ రమేష్‌బాబును వివరణ కోరగా, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.

పోచయ్య వయసు 45 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

ఒకే రోజు 792.82 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ప్రతికూల దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు వరుసగా రెండో రోజు సోమవారం స్టాక్ మార్కెట్‌ క్షీణతకు కారణమయ్యాయని, బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన కొన్ని ప్రతిపాదనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ఆంధ్రజ్యోతి రాసింది.

సెన్సెక్స్‌ ఏకంగా 792.82 పాయింట్లు (2 శాతం) నష్టపోయి 38,720.57 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్‌కు ఇదే ఒక రోజు అతిపెద్ద నష్టం. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 907 పాయింట్లు క్షీణించింది.

స్టాక్ మార్కెట్ రెండు రోజుల్లో మొత్తంగా 1,188 పాయింట్లు కోల్పోయింది.

సోమవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 252.55 పాయింట్లు (2.14 శాతం) కోల్పోయి 11,558.60 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)