వైఎస్ షర్మిల హైదరాబాదులో తన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు.
లోటస్ పాండ్ వద్ద పోలీసులు చుట్టుముట్టారని, పార్టీ కార్యకర్తలను కూడా లోపలకు రానివ్వట్లేదని సమాచారం.
నిన్న బొల్లారం పోలీస్ స్టేషన్‌లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఫీఎస్‌లో ఏడుగురు పార్టీ నేతలను అరెస్ట్ చేశారు.
పాదయాత్రకి అనుమతి ఇచ్చి, అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసే వరకు దీక్ష ఆపనని వైఎస్ షర్మిల చెబుతున్నారు.
పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదంటూ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
"ఒక మహిళ 3500 కిమీ పాదయాత్ర చేస్తూ, ప్రజలకున్న సమస్యలు ఎత్తిచూపుతూ.. మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఎందుకివ్వలేదు, మైనారిటీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు, పోడు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు, అని మేం అడగడం తప్పా? ఇన్ని కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందా? నర్సంపేటలో మేం ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే టీఆర్ఎస్ గూండాలే లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేశారు. మేం బాధితులం. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మా పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
"కేసీఆర్ మరోసారి నియంత అని నిరూపించుకున్నారు. గౌరవ హైకోర్టు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినా కేసీఆర్ అనుమతి ఇవ్వడం లేదు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. న్యాయస్థానం అంటే కేసీఆర్‌కు గౌరవం లేదు. పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెడితే, మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
వైెెఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుల్ని విడుదల చేయండి. పాదయాత్రకు అనుమతి ఇవ్వండి. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష ఆగదు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోదు ఈ షర్మిల" అని ఆమె మీడియాతో అన్నారు.
షర్మిలకు అపోలో డాక్టర్ చంద్ర శేఖర్ వైద్య పరీక్షలు జరిపారు.
ఆమె మంచి నీళ్ళు కూడా తాగట్లేదని, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతోందని, ఇదిలా కొనసాగితే కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని డాక్టర్ చంద్ర శేఖర్ చెప్పారు.
షర్మిలకు రక్తపరీక్షలు నివహించారని, సాయంత్రం మరో సారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.