ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ని ఎన్నుకోవడం చెల్లదని తెలిపింది. ఈ మేరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
జూలై 8,9 తేదీలలో మంగళగిరి సమీపంలో ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ సందర్భంగా రెండో రోజు నిర్వహించిన సమావేశాల్లో పార్టీ రాజ్యాంగం సవరిస్తున్నట్టు తీర్మానం చేశారు. ఆ వెంటనే ఈ ఎన్నిక జరిగింది.
వైఎస్ జగన్ ని పార్టీ శాశ్వత అధ్యక్ష హోదాలో ఎన్నుకుంటూ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్లీనరీలో ఆమోదించారు. అదే నెల 22న ఈసీకి ఈ వివరాలు తెలియజేశారు. కానీ వివరణ కోరుతూ
ఆగష్టు 1, 5, తేదీలలో ఎన్నికల సంఘం లేఖలు రాసినా ఆపార్టీ నుంచి తగిన స్పందన లేదని తెలిపింది. ఆగష్టు 23నాడు పార్టీ తరుపున అందిన లేఖలో అంశాలు చెల్లవని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కూడా నిర్ధిష్ట కాలపరిమితిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. శాశ్వత అధ్యక్షుడు అన్నది ప్రజాస్వామ్య విరుద్దం అంటూ ప్రస్తావించింది. పార్టీలకు తరచూ ఎన్నికలు జరగాలని తెలిపింది.
శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఎన్నికల సంఘం నియమాలకు విరుద్దం అని స్పష్టం చేసింది.
వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న వైసీపీ..
వైసీపీ నాయకత్వం ఈసీకి తెలియజేసిన అంశాలు ఆసక్తిగా ఉన్నాయి. తమ పార్టీ రాజ్యాంగాన్ని ఫిబ్రవరిలో సవరించినట్టు పేర్కొనడం విశేషం. దానిపై మీడియాలో కథనాలు వచ్చాయని తెలిపినట్టు ఈసీ ప్రస్తావించడం ఆసక్తిగా కనిపిస్తోంది. ఆ కథనాలపై విచారణ చేస్తున్నామని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానమని వైసీపీ పేర్కోన్నట్టు ఈసీలో లేఖలో ఉండడం చర్చనీయాంశం అవుతోంది.
వైసీపీ వాదనను తోసిపుచ్చుతూ ఈసీ స్పష్టత కోరింది.
పార్టీ అంతర్గత విచారణ చేసి వెంటనే స్పందించాలని కోరింది. త్వరగా దీనిపై స్పష్టతనిస్తూ బహిరంగ ప్రకటన చేయాలని ఆదేశించింది. అస్సష్టత తొలగించేలా చర్యలుండాలని ఎన్నికల సంఘం తెలిపింది.
శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక అనేది సమంజసం కాదని, ఇలాంటివాటిపై స్పష్టత ఇవ్వకపోతే ఇతర పార్టీల్లో గందరగోళం నెలకొంటుందని, దీనిని మిగతా పార్టీలు కూడా అనుసరించే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.
జగన్ మోహన్ రెడ్డి ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న తీరు మీద సమాధానం కోరినా స్పందించకపోవడం పట్ల ఈసీ సీరియస్ అయ్యింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికను అంగీకరించడమా లేదా తిరస్కరించడమా అన్నది తేల్చుకుండా తాత్సార్యం చేయడాన్ని నిలదీసింది. ఈసీ లేఖలోని అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించి, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ పేర్కొనడం గమనార్హం.