తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. నాడు 2జీ స్పెక్ట్రమ్‌లో కుంభకోణం అని గొడవ చేశారు.. ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్ స్కామ్ కాదా?

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘ఎన్‌డీఏలో ఎన్‌పీఏ దందా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ బాగా పనిచేస్తే ఎన్‌పీఏలు తగ్గాలి కదా? కానీ 10 రెట్లు ఎందుకు పెరిగింది? దేశంలో 2 లక్షల కోట్ల ఎన్‌పీఏ 20 లక్షల కోట్లకు పెరిగిందంటే.. ఇది దేనికి సంకేతం? మీ పనితనమా? దోపిడీయా? బ్యాంకుల రుణాల ఎగవేతలు లక్షల కోట్లకు పెరుగుతాయి? ఇది ప్రగతికి సంకేతమా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

    ఆయన ఇంకా ఏమన్నారంటే...

    ‘‘దేశంలో ఎక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది? మేక్ ఇన్ ఇండియా అన్నారు. మరి పతంగుల మాంజా, దీపావళి టపాసులు, షేవింగ్ చేసుకునే బ్లేడ్లు కూడా చైనా నుంచి ఎందుకు వస్తున్నాయి? మొబైల్ ఫోన్లు, పీపీయే కిట్లు, నేషనల్ ఫ్లాగ్స్ కూడా చైనా నుంచి వస్తే.. ఇది మేక్ ఇన్ ఇండియానా? దిగుమతులు తగ్గాలా? పెరగాలా?

    భారతదేశపు భూమిలో 50 శాతం భూమి సాగుయోగ్యమైన భూమి. ప్రపంచంలో మరే దేశానికీ ఇలాంటి అవకాశం లేదు. ప్రతి ఎకరానికీ నీళ్లు ఇవ్వగలిగే సదుపాయం ఉంది. ఇవ్వాళ కూడా కందిపప్పు, పామాయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఇదా నీతి ఆయోగ్ మేధో సంపత్తి? కేంద్ర ప్రభుత్వ ప్రజ్ఞ. మీ కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల నూనెగింజలు పండించాల్సిన రైతులు దిల్లీ సరిహద్దు దగ్గర నిరసనలు చేస్తున్నారు.

    అంతా ప్రైవేటైజేషన్. ఎయిర్‌పోర్టు, రైల్వేలు, కరెంటు అన్నీ. ఇదేం దౌర్భాగ్యం. బ్యాంకుల రుణాల ఎగవేత. బ్యాంకుల లూటీలు ఏమిటి? బ్యాంకులు లూటీ చేసి బయటి దేశాలకు పారిపోతున్నారు. మొదటి దశలో మేధో సంపత్తి వలస పోయింది. ఇవ్వాళ పెట్టుబడులు వలస పోతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్నాయి. శ్రీలంక లాంటి పరిస్థితులు వస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    కానీ..రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీ పథకాలు ఇస్తుంటే..అవి ఉచిత పథకాలు, వాటిని నిలిపివేయాలని చెప్తారా? పేద ప్రజల నోళ్లు కొట్టి కాకులకు గద్దలకు వేయాలా? ఇదెక్కడి నీతి?

    అప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌ వేలంలో అన్యాయం జరిగినట్లు పెడబొబ్బలు పెట్టారు? మరి ఈ రోజు 5జీ వేలం సంగతేమిటి? 5 లక్షలకు ఎస్టిమేట్ వేస్తే.. లక్షా యాభై వేల కోట్లే వస్తాయా? ఇది కుంభకోణం కాదా?

    ఒకవైపు గాలి తప్ప అన్నిటి మీదా జీఎస్‌టీ పన్నులు వేస్తున్నారు. పాల మీద, స్మశానాల మీద, అల్పాదాయ వర్గాల మీద జీఎస్‌టీ పన్ను వేస్తారు.

    రాష్ట్రాల అభివృద్ధిని కుంటు పరచకండి. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన భారతదేశంగా ఉంటుంది. అదే నిజమైన సమాఖ్య స్ఫూర్తి. దానిని పాటించండి.

    ఇప్పుడు మాటలుగా అడుగుతున్నాం. అవసరమైతే కలిసివచ్చే వారిని కలుపుకుని బలీయమైన ఉద్యమాలను కూడా నిర్మిస్తాం. మోదీ నాకు మిత్రుడు. వ్యక్తిగత విభేదాల్లేవు. కానీ సంఘర్షణ తప్పదు.’’ అని కేసీఆర్ మీడియా సమావేశంలో అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘నేనే దేవుణ్ని అన్న హిరణ్యకశిపుడు.. పొట్టుపొట్టు అయిండు’

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘ఏదైనా ముఖ్యమైన నిర్ణయం మీద నీతి ఆయోగ్‌లో చర్చ చేస్తున్నారా? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా? లేదంటే ఇంపీరియల్ డిక్టేటరిజమా?’’ అని కేసీఆర్ కేంద్రం తీరును విమర్శించారు.

    ‘‘అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతాడు. డైరెక్ట్‌గా. మొత్తం భారతదేశంలో ఏకస్వామ్య పార్టీ ఉంటుంది, మిగతా వాటిని మింగేస్తాం, అని ఓపెన్‌గా చెప్తారు. ఇదేనా టీమ్ ఇండియా.?

    ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇవే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి కదా? చర్యకు ప్రతి చర్య ఉంటుంది కదా?

    ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారా? ఇవన్నీ ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయి? ఏం తమాషాగా ఉందా? ఇంత అహంకారమా? బెంగాల్‌లో, తెలంగాణలో, తమిళనాడులో ప్రకటిస్తారు.

    ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? ఏమైనా మాట్లాడితే జైల్లో వేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇదేం పద్ధతి?

    టెంపరరీ ఫేజ్ కదా. హిరణ్యకశిపుడు కూడా నేనే దేవుణ్ని, నన్నే మొక్కాలి అన్నాడు. చివరికి ఏమైంది? పొట్టుపొట్టు అయిండు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

  3. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘తెలంగాణకు గత ఏడాది కేంద్రం నుంచి రూ. 5 వేల కోట్లు కూడా ఇవ్వలేదు’

    తెలంగాణ రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరంలో 1.95 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చిన డబ్బు రూ.5 వేల కోట్లు కూడా లేదు.

    కేంద్ర ప్రభుత్వ అవార్డులు, నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకోని డిపార్ట్‌మెంటే లేదు తెలంగాణలో. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు.

    మరొక విషయం.. తెలంగాణకు రూ.6,000 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం నిర్దిష్టంగా సిఫారసు చేసింది. కానీ ఐదు పైసలు కూడా ఇవ్వలేదు.

    పైగా రావాల్సిన వాటిలో బకాయిలు పెడతారు. ఇవ్వాళ కూడా తెలంగాణకు 3,200 కోట్లు బకాయిలు ఉంది కేంద్ర ప్రభుత్వం.

  4. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘నీతి ఆయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని చెప్పినా.. 24 పైసలు కూడా ఇవ్వలేదు’

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని, మిషన్ భగీరధకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది. మొత్తం రూ.24 కోట్లు ఇవ్వాలని చెప్పింది. ఆరేళ్లు దాటినా 24 పైసలు కూడా ఇవ్వలేదు’’ అని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    నీతి ఆయోగ్ కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని కాకెత్తుకుపోయింది. దాని అజెండాను ఎవరు తయారు చేస్తారో, ఎక్కడ చేస్తారో తెలీదు. సమస్యలను ఎలా పరిష్కరించాలి, అందరం కలిసి ఏం చేద్దాం అనే ముచ్చట లేదు. ఆలోచన లేదు.

    దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. దేశంలో ద్వేషం, అసహనం పెరిగిపోయింది. దేశ రాజధానిలో సైతం పట్టపగలు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. అన్ని రంగాల్లో దేశం సర్వనాశనమైపోయింది. అంతర్జాతీయ విపణిలో మన పరువు రోజు రోజుకూ పోతోంది.

    కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాల వాటా ఇవ్వాలి. కానీ దాదాపు 13, 14 లక్షల కోట్లు రాష్ట్రాల వాటాను సెస్సుల పేరుతో ఎగ్గొట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా? ఇది టీమ్ ఇండియా చేసే పనేనా? ఏ నీతి ఆయోగ్ సమావేశంలోనైనా చర్చకు ఆస్కారముంటుందా? నీతి ఆయోగ్ సమావేశమైతే ఒక భజన మండలి. అందులో ముఖ్యమంత్రుల స్థాయి వారికి కూడా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు

  5. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘నీతి ఆయోగ్ నిరర్ధక, నిష్క్రియా సంస్థగా మారిపోయింది’

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘బీజేపీ ప్రభుత్వం ఏడేళ్ల కిందట ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన నీతి ఆయోగ్.. దురదృష్ట వశాత్తూ ఒక నిరర్థక సంస్థగా, నిష్క్రియాపరమైన సంస్థగా మారిపోయింది’’ అని కేసీఆర్ విమర్శించారు.

    ‘‘ప్రధానమంత్రికి నాలుగు కార్యక్రమాలు చెప్పి భజన చేసే మండలిగా మారిపోయింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో నీతి ఆయోగ్‌లో నీతి అంతే ఉంది’’ అని ఆయన ఎద్దేవా చేశారు.

    ఆయన ఇంకా ఏం చెప్పారంటే...

    ‘‘ స్వతంత్ర పోరాట కాలంలో ఓ సందర్భంలో జరిగిన అనేక మేధోమధనాల పర్యవసానంగా.. ఏ దేశమైనా, సమాజమైనా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలి, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రణాళికలు ఉండాలి, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఈ కర్తవ్యాన్ని అప్పగించాలి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అని నిర్ణయాలు చేశారు. వాటి స్వరూపమే గతంలో మనకున్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా’’ అని కేసీఆర్ చెప్పారు.

    వార్షిక ప్రణాళికలు ఉండాలి, పంచవర్ష ప్రణాళికలు ఉండాలి.. వాటిని అనుసరించి 20, 30 సంవత్సరాల విజన్ కూడా ఉండాలని ఆలోచించారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగా ప్లానింగ్ కమిషన్ మనుగడలోకి వచ్చింది. పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఎల్ఐసీ వంటివి నిర్మించారు.’’

    ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మంచి సలహాలు ఇస్తే స్వీకరించే ప్రధానమంత్రులు ఉండేవారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    2014లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. వారు నీతి ఆయోగ్ అని తెచ్చారు.

    నీతి ఆయోగ్ అంటే.. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయం. సహకార సమాఖ్య స్ఫూర్తిని తెస్తామని, ముఖ్యమంత్రులందరినీ ఇందులో సభ్యులను చేస్తామని, దీనిని టీమ్ ఇండియా అని పిలుస్తామని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. నిజంగానే దేశానికి మంచి రోజులు వచ్చాయని నేను ఆశపడ్డా. కానీ మోదీ వాగ్దానాలు, బీజేపీ వాగ్దానాలు, నీతి ఆయోగ్ సృష్టి పెద్ద జోక్‌గా మారిపోయింది.

    తాగటానికి మంచి నీళ్లు లేవు. పంటలకు నీళ్లు దొరకవు. కరెంటు దొరకదు. పని చేయటానికి ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులందరూ రోడ్డున పడుతున్నారు.

    దేశం నుంచి లక్షల కోట్లు పెరిగిపోతున్నాయి. ఉపాధి హామీ కూలీలు కూడా 15, 16 రాష్ట్రాల నుంచి దేశ రాజధాని జంతర్ మంతర్ పోయి నిరసన చేసే పరిస్థితి ఉంది.

    బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టారు. అదుపు లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం. విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు. జీడీపీ పతనం. ఎన్నడూ లేనంత తీవ్రస్థాయి నిరుద్యోగిత. రూపాయి అయితే చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోతోంది.

    మరి నీతి ఆయోగ్ ఏం చేస్తున్నట్లు? ఏం సాధించినట్లు? అది నిరర్ధక సంస్థగా మారిపోయిందని బాధ్యతా రహితంగా అనలేదు. చాలా బాధతోని అంటున్నా.

  6. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: కేసీఆర్ ప్రకటన

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయటానికి.. రేపు దిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బహిష్కరిస్తున్నా’’ అని సీఎం కె.చంద్రశేఖరరావు ప్రకటించారు.

    ఆయన శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

    నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోవటం లేదంటూ ఆయన తప్పుపట్టారు. ‘‘నా నిరసనను బహిరంగ లేఖ ద్వారా ప్రధానమంత్రికి స్వయంగా తెలియజేస్తున్నా’’ అని చెప్పారు.

    ఆ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.

    ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
  7. లంపీ వైరస్: ఒక్కసారిగా వేల సంఖ్యలో ఆవులు ఎందుకు చనిపోతున్నాయి, వీటికి సోకిన వ్యాధికి చికిత్స అంత కష్టమా?

  8. దిల్లీలో చంద్రబాబు.. స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎంపీ కేశినేని నాని అసహనం, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    దిల్లీలో చంద్రబాబు.. స్వాగతం చెప్పేందుకు ఎంపీ కేశినేని నాని అసహనం

    ఫొటో సోర్స్, UGC

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన సందర్భంగా ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు చర్చనీయాంశంగా మారింది.

    చంద్రబాబు దిల్లీకి చేరుకున్న సందర్భంగా ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఆ సమయంలో పార్టీ అధినేతకు బొకే అందించాలని కేశినేని నానిని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆహ్వానించారు.

    కానీ దానిని కేసినేని నాని అసహనంగా తిరస్కరించారు. ‘మీరే ఇవ్వండి’ అన్నట్లుగా ఆయన చేతులతో సైగ చేసి, దూరంగానే నిలబడి ఫొటోలు దిగారు.

    కాగా, పార్టీ అధినేతపై కేశినేని నాని అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    శనివారం హైదరాబాద్ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలుస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో జరిగే ఆజాది కా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశం లో పాల్గొంటారు.రాత్రికి దిల్లీ నుంచి మళ్లీ హైదరాబాద్ కి చేరుకుంటారు.

    చంద్రబాబు, కేశినేని నాని

    ఫొటో సోర్స్, UGC

    చంద్రబాబు దిల్లీ పర్యటనలో కేశినేని నాని వ్యవహారశైలిపై రాజకీయంగా చర్చ సాగుతోంది.

    కొంతకాలంగా టీడీపీ నాయకత్వం పట్ల నాని అసంతృప్తిగా ఉన్నారు. పలు సందర్భాల్లో తన అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శించారు.

    అయితే ఇటీవల కేశినేని నాని కుమార్తె వివాహ వేడుకలో చంద్రబాబు, నారా లోకేష్ వంటి వారితో ఆయన సన్నిహితంగా మెలిగారు. దాంతో అంతా సర్డుమణుగుతుందని టీడీపీ శ్రేణులు భావించాయి.

    విజయవాడ కేంద్రంగా ఇటీవల కేశినేని నాని సోదరుడు చిన్ని కొంత దూకుడుగా కనిపిస్తున్నారు. రాజకీయంగా క్రియాశీలంగా మారే ప్రయత్నంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల బరిలో దిగాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

    దాంతో నాని స్థానంలో చిన్నికి టీడీపీలో కొందరు సహకరిస్తున్నారనే కథనాలు వచ్చాయి. విజయవాడ నగర టీడీపీలో నాయకులుగా ఉన్న బోండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులతో కేశినేని నాని కి విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి అధిష్టానం ఆశీస్సులు అందుతున్నాయనే అభిప్రాయం గతంలో నాని వ్యక్త పరిచారు. ఇతర కారణాలు కూడా కలిసి రావడంతో టీడీపీ కి విజయవాడ ఎంపి దూరం అవుతారన్న ఊహాగానాలు వినిపించాయి.

    తాజాగా అధినేత పట్ల ఆయన స్పందించిన తీరు అలాంటి అంచనాలకు ఊతమిచ్చేలా కనిపిస్తోంది.

  9. క్రిస్ హెమ్స్‌వర్త్‌: ‘నువ్వు లెజెండ్‌’.. మీరాబాయి చానుకు థోర్ హీరో ప్రశంస

  10. మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?

  11. జమ్మూ కశ్మీర్ పై ఓఐసీ ప్రకటనను ఖండించిన భారత్

    అరిందమ్ బాగ్చి

    ఫొటో సోర్స్, ANI

    జమ్మూ కశ్మీర్ పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) చేసిన ప్రకటన మత విద్వేషాలను రగిల్చే విధంగా ఉందని అంటూ భారత్ ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించింది.

    ఓఐసీ చేసే ఇలాంటి ప్రకటనలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే మతపరమైన ఎజెండాను ప్రచారం చేసేందుకు అంకితం అయిందనే విషయాన్ని తెలియచేస్తాయని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.

    ఓఐసీ సెక్రెటరీ జనరల్ చేసిన ప్రకటన మత విద్వేషాలను రగిల్చే విధంగా ఉందని అన్నారు. జమ్మూ, కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, వక్కాణించారు.

    జమ్మూ కశ్మీర్ లో మూడేళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయాలకు ఫలితంగా ఇప్పుడిప్పుడేసామాజిక ఆర్ధిక అభివృద్ధి కనిపిస్తోంది" అని అన్నారు.

    "మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వారి ఆదేశాల మేరకు ఓఐసీ ఇటువంటి ప్రకటనలు చేస్తోంది" అని అరిందమ్ బాగ్చి అన్నారు.

    కశ్మీర్ లో ఆర్టికల్ 370ను తొలగించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఓఐసి శుక్రవారం కశ్మీర్‌లో మానవ హక్కుల గురించి ప్రస్తావిస్తూ భారత్ తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల కనుగుణంగా జమ్మూ కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఓఐసి అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.

    భారత ప్రభుత్వం 2019లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించి ఆర్టికల్ 370 ను రద్దు చేసింది.

  12. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే

    జగ్‌దీప్ ధన్‌ఖర్, మార్గరెట్ ఆల్వా

    ఫొటో సోర్స్, ANI

    16వ భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు శనివారం ఓటింగ్ జరగనుంది.

    ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.

    రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు.

    ఈ సారి ఎన్డీయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖర్ పేరును ప్రకటించింది.

    మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా విపక్షాలు ప్రకటించాయి.

    కానీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖర్‌కు తమ మద్దతు ప్రకటించింది.

    జగ్‌దీప్ ధన్‌ఖర్

    రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లాలో కిథానా గ్రామంలో 1951లో మే 18న, జన్మించారు.

    ఆయన ఐదవ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నారు.

    ఆ తర్వాత చితోర్ గఢ్ సైనిక్ స్కూలులో చదువుకున్నారు.

    జైపూర్ మహారాజ కాలేజీ నుంచి బి.ఎస్ సి హానర్స్ డిగ్రీ పొందారు

    రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా సంపాదించారు. ఆయన చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు.

    మార్గరెట్ ఆల్వా

    దక్షిణకర్ణాటకకు చెందిన మార్గరెట్ ఆల్వా న్యాయవాద వృత్తిని అభ్యసించారు.

    కాంగ్రెస్‌లో చేరి పలు దశల్లో పార్టీ పదవులను చేపట్టారు.

    1974 నుంచి 1998 వరకు నాలుగుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.

    1999లో కర్ణాటకలోని కనారా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

    2009 నుంచి 2012 వరకు ఉత్తరాఖండ్ గవర్నర్‌గా, 2012 నుంచి 2014 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. అదే సమయంలో గుజరాత్, గోవా రాష్ట్రాలకు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.

  13. భారత కొత్త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. ఎన్నికల్లో ఘన విజయం

  14. గోదావరి వరద: మునిగిపోయిన ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ టెంట్లు వేసుకుని కొండలపైనే ఎందుకు గడుపుతున్నారు?

  15. బర్మింగ్‌హామ్: బోర్న్‌విల్లే గ్రామంలో క్యాడ్‌బరీ చాక్లెట్‌ మ్యూజియం..

  16. హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?

  17. తెలుగు సినిమా: షూటింగ్స్ బంద్...యాక్షన్ ఎప్పుడు

  18. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  19. ఆముద: ఐదో ఏటనే కాలు కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో నిలబడిన భారత అథ్లెట్

  20. థాయ్‌లాండ్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

    థాయ్‌లాండ్ నైట్ క్లబ్ అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, SAWANG ROJANATHAMMASATHAN RESCUE FOUNDATION

    థాయ్‌లాండ్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగిన దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది వరకూ గాయపడ్డారు.

    చోన్బురి ప్రావిన్స్‌లోని సట్టాహిప్ జిల్లాలో గల మౌంటెయిన్ బి నైట్‌క్లబ్‌లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 1:00 గంట సమయంలో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. ఇది బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ప్రమాదం నుంచి బయటపడటానికి జనం అరుపులు, కేకలతో పరుగులు తీయటం.. వారిలో కొందరి ఒంటి మీద దుస్తులకు మంటలు అంటుకుని ఉండటం కొన్ని వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది.

    నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగటానికి కారణమేమిటన్నది ఇంకా తెలియరాలేదు. క్లబ్ గోడలమీద ఉన్న మండేస్వభావం గల పదార్థాల వల్ల మంటలు తీవ్రమై ఉండవచ్చునని సహాయ సిబ్బంది చెప్తున్నారు.

    మంటలను అదుపులోకి తీసుకురావటానికి అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకు పైగా పోరాడారని స్థానిక మీడియా పేర్కొంది.

    క్లబ్‌లో లైవ్ మ్యూజిక్ ప్రదర్శన జరుగుతున్న సమయంలో మంటలు మొదలైనట్లు కనిపిస్తోందని చెప్తున్నారు. మరణించిన వారి మృతదేహాలు ఎక్కువగా ప్రవేశద్వారం దగ్గర, బాత్‌రూంలలో, డీజే బూత్ వద్ద కనిపించాయి.

    ఈ అగ్నిప్రమాదంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ప్రధానమంత్రి ప్రయుత్ చాన్-ఓచా ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు.

    థాయ్‌లాండ్ నైట్ క్లబ్ అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, SAWANG ROJANATHAMMASATHAN RESCUE FOUNDATION