You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యా చమురును బహిష్కరించాలన్న జెలియెన్‌స్కీ.. ఆ ఊసెత్తని ఈయూ

రష్యా నుంచి దిగుమతులను బహిష్కరించాలని, ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు, చమురు ఉత్పత్తులను తిరస్కరించాలని జెలియెన్‌స్కీ పిలుపునిచ్చారు. యుక్రెయిన్ మీద దండయాత్రను రష్యా విరమించుకోలేదని, కాబట్టి రష్యా మీద కఠినమైన కొత్త ఆంక్షలను విధించాల్సిన అవసరముందని చెప్పారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర 12వ రోజున ఏం జరిగింది?

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర మొదలై సోమవారానికి 12 రోజులైంది. ఈ సంఘర్షణలో సోమవారం నాడు జరిగిన కీలక పరిణామాలివీ...

    • యుక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య మూడో విడత చర్చలు జరుగుతున్నాయి.
    • క్రైమియాను రష్యా భూభాగంగాను;దోన్యస్క్, లూహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా యుక్రెయిన్ గుర్తించి తీరాలని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.
    • అలాగే.. యుక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించి, నాటో వంటి ఏదైనా బృందంలో చేరే అవకాశాన్ని తిరస్కరించి తీరాలని కూడా పెస్కోవ్ చెప్పారు. ఈ షరతులను యుక్రెయిన్ అమలు చేస్తే తమ సైనిక చర్యలు ‘ఒక్క క్షణంలో’ నిలిచిపోతాయని రష్యా చెప్పింది.
    • యుక్రెయిన్ నగరాల నుంచి ఆ దేశ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ, మానవతా కారిడార్ల ఏర్పాటు ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన అనైతికమని యుక్రెయిన్ విమర్శించింది.
    • రష్యా ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం.. కీయెవ్ నుంచి తరలిపోయే ప్రజలు రష్యా మిత్రపక్షమైన బెలారుస్‌కు, ఖార్కియెవ్ నుంచి వెళ్లే వారిని రష్యాకు తరలించటం జరుగుతుంది.
    • రష్యా బలగాల ముట్టడిలో ఉన్న మరియపూల్, సుమీ నగరాల నుంచి తరలిపోయే వారిని యుక్రెయిన్‌లోని ఇతర నగరాలకు, రష్యా నగరాలకు తరలిస్తారు.
    • రష్యా బలగాలు ఆస్పత్రులు, నర్సరీలు, స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని, పౌరులు సైతం ఈ దాడుల బారిన పడుతున్నారని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
    • పౌరులను లక్ష్యంగా చేసుకున్నామనే ఆరోపణలను రష్యా తిరస్కరిస్తోంది. యుక్రెయిన్ ‘జాతీయవాదులు, నయా-నాజీలు’ లక్ష్యంగా ప్రత్యేక సైనిక చర్యలు చేపడుతున్నామని చెప్తోంది.
    • చమురు ధరలు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగిపోయాయి. బ్యారల్‌ ధర 139 డాలర్లకు చేరుకుంది. బ్రిటన్‌లో లీటరు పెట్రోల్ ధర సగటున 155 పెన్నీలకు పెరిగిపోయింది.
    • రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా సూచించిన నేపథ్యంలో చమురు ధరలు ఇలా అమాంతం పెరిగిపోయాయి.
    • రష్యా మీద మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించాలని, ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను నిషేధించాలని యూరప్ దేశాలకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ పిలుపునిచ్చారు.
    • అయితే.. బ్రసెల్స్‌లో సమావేశమైన యూరోపియన్.. రష్యా చమురు దిగుమతులపై నిషేధం గురించి చర్చించలేదు. యూరప్ దేశాలు తమ సహజ వాయువులో 40 శాతాన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఆ దేశాలకు దిగుమతయ్యే చమురులో నాలుగో వంతు రష్యా నుంచే వస్తుంది.
    • యూరప్ దేశాలు రష్యా చమురు, గ్యాస్ వినియోగాన్ని రాత్రికి రాత్రి ఆపివేయలేవని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు దిగుమతుల మీద ఆంక్షలు విధించేట్లయితే ఆ పని ‘జాగ్రత్త’గా చేయాలని నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రట్ చెప్పారు.
    • యుక్రెయిన్‌కు సాయంగా బ్రిటన్ మరో 17.5 కోట్ల పౌండ్లు అందిస్తుందని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దీంతో యుక్రెయిన్‌కు బ్రిటన్ అందించే సాయం మొత్తం 40 కోట్ల పౌండ్లకు (సుమారు రూ. 4,043 కోట్లు) పెరుగుతుందని చెప్పారు.
    • యుక్రెయిన్ మీద ‘అన్యాయమైన దండయాత్రలో భాగస్వామ్య’మున్న పది మంది రష్యా ప్రముఖుల మీద కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు.

    ఇవి ఇప్పటివరకూ ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.

  2. యుక్రెయిన్‌కు మరో 17.5 కోట్ల పౌండ్లు సాయం ప్రకటించిన బ్రిటన్

    యుక్రెయిన్‌కు సాయంగా బ్రిటన్ మరో 17.5 కోట్ల పౌండ్లు అందిస్తుందని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

    దీంతో యుక్రెయిన్‌కు బ్రిటన్ అందించే సాయం మొత్తం 40 కోట్ల పౌండ్లకు (సుమారు రూ. 4,043 కోట్లు) పెరుగుతుందని చెప్పారు.

    బోరిస్ జాన్సన్ సోమవారం నాడు లండన్‌లో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రట్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

    ‘రాత్రికి రాత్రి రష్యా చమురు వినియోగాన్ని ఆపలేం’

    యూరప్ దేశాలు రష్యా చమురు, గ్యాస్ వినియోగాన్ని రాత్రికి రాత్రి ఆపివేయలేవని బోరిస్ వ్యాఖ్యానించారు.

    ‘‘వేర్వేరు దేశాలు వేర్వేరు విధాలుగా ఆధారపడి ఉన్నాయి. దానిని మనం దృష్టిలో ఉంచుకోవాలి. చమురు, గ్యాస్ వినియోగాన్ని రాత్రికి రాత్రి ఆపివేయలేం. అవి రష్యా నుంచి వచ్చేవే అయినా సరే’’ అని ఆయన పేర్కొన్నారు.

    ‘‘ఈ విషయంలో అన్ని దేశాలూ కలిసి ఒకే దిశలో పయనించాల్సి ఉంది. అందరికీ అవసరమైన ప్రత్యామ్నాయ సరఫరాలు ఉండేలా చూసుకుని, అందరం కలిసి ఈ పని చేస్తాం’’ అని చెప్పారు.

    యూరప్‌లోని చాలా దేశాలు రష్యా సరఫరాల మీద ఆధారపడి ఉన్నాయని రట్ అంగీకరించారు. ఏదైనా నిషేధం విధించేట్లయితే అది ‘‘జాగ్రత్తగా’’ చేయాలని వ్యాఖ్యానించారు.

    పది మంది రష్యా ప్రముఖులపై ఆంక్షలు: కెనడా ప్రధాని

    యుక్రెయిన్ మీద ‘అన్యాయమైన దండయాత్రలో భాగస్వామ్య’మున్న పది మంది వ్యక్తుల మీద కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు.

    ఆ పది మంది వ్యక్తుల్లో మాజీ, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు చెప్పారు.

    బ్రిటన్, నెదర్లాండ్స్ ప్రధానులతో కలసి మాట్లాడిన ట్రూడో.. రష్యా జైలులో పెట్టిన రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ తయారు చేసిన జాబితా నుంచి ఈ పది మంది వ్యక్తులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

  3. ‘చివరి వరకూ నా ఆస్పత్రిలోనే ఉంటా’: ఓ యుక్రెయిన్ డాక్టర్

    బీబీసీ న్యూస్ యుక్రెయిన్‌లోని మా సహచరులు.. ఉత్తరాదిన చెర్నిహియెవ్‌ నగరంలోని ఓ వైద్యుడు ఒలెగ్ రెవ్కోతో మాట్లాడారు. ఈ నగరంపై రష్యా బలగాలు భారీ కాల్పులు జరిపాయి.

    పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని రష్యా తిరస్కరిస్తోంది. కానీ ఈ యుక్రెయిన్ డాక్టర్ వేరే కథ చెప్తున్నారు. తన ఆస్పత్రితో పాటు, నగరంలోని మరో ఆస్పత్రి మీద కూడా షెల్లింగ్ దాడి జరిగిందని ఒలెగ్ తెలిపారు.

    ‘‘మిగతా అన్నింటి మీద లాగానే ఆస్పత్రుల మీదా దాడులు చేశారు. వారికేమీ పట్టదు’’ అన్నారాయన.

    రష్యా దండయాత్ర మొదలయ్యాక కొన్నిరోజుల పాటు ఆయన తన ఇంటి బేస్‌మెంట్‌లో గడిపారు. ఆయన ఇంటి నుంచి నగర శివార్లలోని వైమానిక స్థావరం కిలోమీటరు దూరం కూడా లేదు. అక్కడ భీకర పోరాటం జరుగుతోంది.

    ‘‘మా ఇల్లు సరిగ్గా రష్యా కాల్పుల దారిలో ఉంది. షెల్లింగ్ నుంచి తప్పించుకోవటానికి నేను మరో ఎనిమిది మంది పొరుగు వారితో కలిసి నాలుగు రోజుల పాటు బేస్‌మెంట్‌లో దాక్కున్నా. టాయిలెట్‌గా ఒక బకెట్‌ను ఉపయోగించాం’’ అని ఒలెగ్ వివరించారు.

    కాల్పులు కొంతసేపు ఆగినపుడు ఆయన బయటకు వచ్చి నగరం మధ్యలో ఉన్న తన ఆస్పత్రికి చేరుకోగలిగారు. ఆ తర్వాత దాడులు మరింతగా పెరిగాయి.

    ‘‘గాయపడిన వారిని మా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. కొందరికి కాళ్లు, కొందరికి చేతులు తెగిపోయాయి. కొందరి పేగులు బయటకు వేలాడుతూ వచ్చారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది’’ అని చెప్పారాయన.

    తనకు సాధ్యమైనంత వరకూ ఆస్పత్రిలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

    ‘‘చివరి వరకూ ఆస్పత్రిలోనే ఉంటాను. ఇది నా విధి. ఈ నగరం ఇంకెంత కాలం నిలబడుతుందో తెలీదు. కానీ నా జనంతో నేను ఇక్కడే ఉంటాను’’ అని పేర్కొన్నారు.

  4. రష్యా మీద చమురు ఆంక్షల ఊసెత్తని ఈయూ, కాత్యా ఆడ్లర్, యూరప్ ఎడిటర్

    యూరోపియన్ యూనియన్.. తమ సహజ వాయువులో 40 శాతాన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈయూ దేశాలకు దిగుమతయ్యే చమురులో నాలుగో వంతు రష్యా నుంచే వస్తుంది.

    చమురు, గ్యాస్ ఎగుమతులతో రోజు వారీ ప్రాతిపదికన వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ ఖజానా నిండుతోంటే.. రష్యా మీద ఈయూ ఆర్థిక ఆంక్షలు విధించటం వల్ల ఉపయోగమేమిటి? అని మీరు అడగొచ్చు.

    కనీసం రష్యా నుంచి చమురు దిగుమతులనైనా నిషేధించాలని అమెరికా, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీలు.. ఈయూను కోరుతున్నారు.

    బాల్టిక్ దేశాల తరహాలోనే తూర్పు ఈయూ దేశాలు దీనితో బలంగా ఏకీభవిస్తున్నాయి. రష్యా నుంచి తమకూ ముప్పు ఉందని ఆ దేశాలు భావిస్తున్నాయి.

    కానీ.. జర్మనీ, ఇటలీ వంటి ఇతర పెద్ద ఈయూ దేశాలు.. తమ దేశాల్లో ఇంధన ధరలు పెరిగిపోతే మరింత ఇబ్బందులొస్తాయని ఆందోళన చెందుతున్నాయి.

    ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్.. మళ్లీ అధ్యక్షుడిగా పోటీకి నిలబడబోతున్నారు. ఆయన కూడా.. డ్రైవర్లకు, ఇళ్లలో వెచ్చదనం కోసం ఇంధనం ఉపయోగించే ప్రజలకు ఆగ్రహం తెప్పించే చర్యలు చేపట్టటానికి జంకుతున్నారు.

    దీంతో.. యూరోపియన్ యూనియన్ ఈ రోజుకు ఇంధన ఆంక్షల గురించి మాట్లాడకుండా దాటవేసింది. దానికి బదులుగా.. తమ ఇంధన అవసరాలకు రష్యా మీద ఆధారపడటాన్ని సాధ్యమైనంత వేగంగా తగ్గించుకునే తమ ప్రణాళికలను మళ్లీ చెప్పింది. ప్రత్యామ్నాయ సరఫరాదారులను వెదుక్కోవటం, పునరుత్పాదక ఇంధన వనరుల కోసం కృషి చేయటం ఆ ప్రణాళికలు.

    కానీ ఈ ఆకాంక్షను వాస్తవంగా మలచుకోవటానికి చాలా టైం పడుతుంది. యుక్రెయిన్‌కి ఆ టైమ్ లేదు.

  5. పారిపోయేటపుడు మీ వెంట ఏం తీసుకెళతారు?

    ఈ ప్రశ్నకు జవాబు.. చాలా తక్కువ. ఒక బ్యాగులో ఎన్ని మోయగలిగితే అన్ని.

    యుక్రెయిన్ శరణార్థులు కాలినడకన సరిహద్దులు దాటి వెళుతుండటం గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం.

    వారు తమ వస్తువులను సూట్‌కేసుల్లో కుక్కుకుని వెంట తీసుకెళుతున్నారు.

  6. ఇర్పిన్ నుంచి ప్రజల తరలింపు కొనసాగుతోంది: మేయర్

    కీయెవ్ సమీపంలోని ఇర్పిన్ పట్టణం నుంచి ప్రజల తరలింపు కొనసాగుతోందని ఆ పట్టణ మేయర్ ఒలెక్సాండ్ర మార్కుషిన్ చెప్పారు.

    ఆయన యుక్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ప్రజల తరలింపు శాంతియుతంగా జరిగిందని, దాదాపు 1,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు.

    కానీ ఇర్పిన్ మీద రష్యా బలగాలు షెల్లింగ్ కొనసాగిస్తున్నాయని మార్కుషిన్ చెప్తున్నారు. రష్యా బలగాల దాడిని యుక్రెయిన్ బలగాలు తిప్పికొట్టాయని.. రష్యా బలగాలు పట్టణం శివార్లకు తిరిగి వెళ్లాయని ఆయన వివరించారు.

    వాయువ్యంలో హోస్టోమెల్, వోర్జెల్ వంటి ఇతర నగారలు ఇప్పుడు రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లాయని.. పరిస్థితి విషమంగా ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారు ఒకరు చెప్తున్నారు.

    కీయెవ్‌కు వాయువ్యంగా 20 కిలోమీటర్ల దూరంలోని ఇర్పిన్‌లో సుమారు 60,000 మంది జనాభా ఉన్నారు.

  7. యుక్రెయిన్ - రష్యా యుద్ధానికి పశ్చిమ దేశాలు ఆజ్యం పోశాయా?

    యుక్రెయిన్ మీద రష్యా దాడుల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీరుపై వస్తున్న విమర్శల మధ్యే, పశ్చిమ దేశాల నేతల విధానం గురించి కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

    దాడులకు సంబంధించిన కవరేజీలో పశ్చిమ మీడియా పక్షపాతం చూపిస్తోందంటూ పశ్చిమేతర దేశాలకు చెందిన చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    పశ్చిమ దేశాల నేతలు ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

    రష్యాను విలన్‌గా చేయడానికి పశ్చిమ దేశాల నేతలు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదని, ఇప్పుడు జరుగుతున్న దానిలో వారిది కూడా కొంత దోషం ఉందని అంటున్నారు.

    బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక్కడ చదవండి.

  8. యుక్రెయిన్ పౌరులకు వీసా నిబంధనల సడలింపులు లేవన్న బోరిస్ జాన్సన్

    యుక్రెయిన్‌లో యుద్ధం నుంచి పారిపోతున్న ఆ దేశ పౌరులకు బ్రిటన్ వీసా నిబంధనలను సడలించాలన్న పిలుపును బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తిరస్కరించారు.

    బ్రిటన్ ‘చాలా ఔదార్యమైన దేశమ’ని అభివర్ణించిన బోరిస్.. కానీ తమ దేశంలోకి ఎవరు వస్తున్నారనే దాని మీద తనిఖీలు కొనసాగించాలని కోరుకుంటోందన్నారు.

    ‘‘యుక్రెయిన్‌లో ఏం జరుగుతోంది అనే దాన్నిబట్టి.. బ్రిటన్‌లోకి ఎవరు వస్తున్నారని తనిఖీ చేసే కనీస సామర్థ్యం ఉండేలా చూడటం సరైనదేనని నేను భావిస్తున్నా’’ అన్నారాయన.

  9. క్రైమియాను రష్యా భూభాగంగా గుర్తించాలి: యుక్రెయిన్‌కు రష్యా డిమాండ్

    రష్యా షరతులను యుక్రెయిన్ అంగీకరించినట్లయితే.. తమ సైనిక చర్యలను ‘ఏ క్షణమైనా’ నిలిపివేయగలమని రష్యా చెప్పింది.

    క్రైమియాను రష్యా భూభాగంగా, దోన్యస్క్, లూహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా యుక్రెయిన్ గుర్తించి తీరాలని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.

    దీనితోపాటు.. యుక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించి, నాటో వంటి ఏదైనా బృందంలో చేరే అవకాశాన్ని తిరస్కరించి తీరాలని కూడా పెస్కోవ్ చెప్పారు.

    యుక్రెయిన్ నిస్సైనికీకరణను రష్యా పూర్తి చేస్తుందని, ఒకవేళ తమ షరతులను అమలు చేస్తే రష్యా సైనిక చర్య ‘ఒక్క క్షణంలో ఆగిపోతుంద’ని ఆయన వ్యాఖ్యానించారు.

    యుక్రెయిన్ భూభాగాన్ని మరింతగా స్వాధీనం చేసుకోవాలని రష్యా భావించటం లేదన్నారు.

    క్రైమియాను 2014లో రష్యా ఆక్రమించి తమ దేశంలో కలుపుకుంది. ఆ తర్వాత కొన్ని వారాలకు.. యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని దోన్యెస్క్, లూహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా అనుకూల వేర్పాటువాదులకు మద్దతిచ్చింది.

  10. యుక్రెయిన్‌పై అంతర్జాతీయ కోర్టు విచారణకు హాజరుకాని రష్యా, అన్నా హాలిగన్, బీబీసీ న్యూస్ హేగ్ కరెస్పాండెంట్

    తమ దేశం మీద రష్యా సైనిక దాడిని ఆపాలని కోరుతూ యుక్రెయిన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ (ఐసీజే)ను ఆశ్రయించగా.. కోర్టు విచారణకు హాజరవటానికి రష్యా తిరస్కరించింది.

    ఈ విచారణలో పాలుపంచుకునే ఉద్దేశం తమ దేశానికి లేదని హేగ్‌లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ షుల్గిన్ సూచించారు.

    రష్యా హాజరుకాకపోవటం పట్ల ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానమైన ఐసీజే ప్రధాన న్యాయమూర్తి విచారం వ్యక్తంచేశారు.

    ‘‘రష్యా ప్రతినిధులు ఉండాల్సిన సీట్లు ఖాళీగా ఉండటం.. చాలా చెప్తోంది. వాళ్లు ఇక్కడ లేరు. వాళ్లు యుద్ధరంగంలో ఉన్నారు’’ అని యుక్రెయిన్ ప్రతినిధి ఆంటొన్ కొరినేవిచ్ కోర్టుతో పేర్కొన్నారు.

    రష్యా తన దండయాత్రను సమర్థించుకోవటానికి.. లేని జాతినిర్మూలనను ఉన్నట్లుగా సాకు చెప్తోందని.. అలా చేయటం ద్వారా జీనోసైడ్ కన్వెన్షన్‌ను అవమానిస్తోందని ఆయన ఆరోపించారు.

    ‘‘పుతిన్ అబద్ధాలు చెప్తున్నారు.. యుక్రెయిన్ పౌరులు చనిపోతున్నారు’’ అన్నారాయన.

    రష్యా తన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలంటూ ఐసీజే అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని, మరిన్ని పౌరుల మరణాలను నిరోధించాలని ఆయన కోరారు.

    రష్యా, యుక్రెయిన్ రెండు దేశాలూ ఈ కోర్టు సభ్యులు. ఇరు దేశాలూ జీనోసైడ్ కన్వెన్షన్ మీద సంతకాలు చేశాయి.

  11. రష్యా చమురును బహిష్కరించాలి: జెలియెన్‌స్కీ

    రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ పశ్చిమ దేశాలను కోరుతున్నారు.

    ఆయన సోమవారం వీడియోలో మాట్లాడుతూ.. యుక్రెయిన్ మీద దండయాత్ర విషయంలో రష్యా తన ఆలోచనను విరమించుకోలేదని, కొనసాగుతున్న సైనిక దాడులు చెప్తున్నాయని.. కాబట్టి రష్యా మీద కఠినమైన కొత్త ఆంక్షలను విధించాల్సిన అవసరముందని చెప్పారు.

    రష్యా నుంచి దిగుమతులను బహిష్కరించాలని, ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు, చమురు ఉత్పత్తులను తిరస్కరించాలని జెలియెన్‌స్క్సీ పిలుపునిచ్చారు.

  12. కీయెవ్‌లో స్మశాన నిశబ్దం.. బయటపడే దారులు వెదుకుతున్న జనం, కీయెవ్ నుంచి లీస్ డూసెట్, చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్

    ఇప్పుడు మానవతా మార్గాలు తక్షణం చాలా అవసరం.

    దక్షిణాది రేవు నగరమైన మరియుపూల్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టి ఉన్నాయి. అక్కడ విద్యుత్ సరఫరా లేదు. తాగు నీరు అందటం లేదు. జనం దగ్గర ఆహారం అయిపోయింది. వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయి.

    రాజధాని కీయెవ్ వెలుపలున్న ఇర్పిన్ సహా ఇతర ప్రాంతాల్లో.. రష్యన్ షెల్లింగ్ కొనసాగుతూనే ఉంది.

    కానీ.. జనం యుద్ధ నగరాలను వీడి వెళ్లటానికి రష్యా ప్రతిపాదించిన ఆరు మార్గాల్లో నాలుగు దారులు.. తూర్పున రష్యాకు కానీ, ఉత్తరాన దాని కీలకమిత్రపక్షమైన బెలారుస్‌కు కానీ తీసుకెళతాయి.

    ఇది పూర్తిగా అనైతికమని యుక్రెయిన్ ఖండించింది.

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర 12వ రోజుకు చేరుకుంది. రష్యా బలగాలు.. నల్లసముద్రం సమీపంలోని మరో దక్షిణాది నగరం మైకోలాయివ్‌లో జనావాస ప్రాంతాలపై షెల్లింగ్‌ చేస్తోంది.

    మరోవైపు.. తూర్పున చుహుయివ్ నగరాన్ని తాము తిరిగి స్వాధీనం చేసుకున్నామని యుక్రెయిన్ బలగాలు చెప్తున్నాయి.

    ఈ రక్తపాతం నడుమ.. కీయెవ్ నగర కేంద్రంలో స్మశాన నిశబ్దం తాండవిస్తోంది. కానీ నగరం సరిహద్దుల్లో తీవ్ర పోరాటం కొనసాగుతోంది. నిరంతరం పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.

  13. రష్యా, అమెరికాలతో సంబంధాలు భారత్‌కు కత్తి మీద సాముగా మారాయా?

    యుక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల ఏదైనా ఒక దేశం అత్యంత సవాలు ఎదుర్కుంటోందంటే అది భారతదేశమే. ఇది విదేశీ, వ్యూహాత్మక అంశాల నిపుణులు చెబుతున్న మాట.

    ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఒక విధంగా కత్తి మీద సాము చేస్తోందని, అంటే రష్యా, అమెరికాలతో ఉన్న సంబంధాలను సామరస్యంగా కొనసాగించే సవాలును భారత్ ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు.

    ఇప్పటివరకూ భారత్ అలా రెండు దేశాలతో సామరస్యంగా ఉండండలో విజయవంతం అవుతూ వచ్చిందని, అయితే ఈ రెండు దేశాలతో సంబంధాలు కొనసాగించడానికి భారత్ ముందున్న సవాలు కూడా చాలా తీవ్రమైనదని మాజీ దౌత్య, విదేశీ వ్యవహారాల నిపుణులు నవతేజ్ సర్నా అన్నారు.

    బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక్కడ చదవండి.

  14. రెండు రోజుల్లో రష్యా, యుక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ

    రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లార్వోవ్ గురువారం నాడు టర్కీలోని అనటాల్యా నగరంలో యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబాతో భేటీ కానున్నారు.

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు.

    పలు నగరాల్లో జనావాస ప్రాంతాల మీద రాకెట్ దాడులు కొనసాగాయని యుక్రెయిన్ చెప్తోంది. రాజధాని కీయెవ్ నగరం మీద పూర్తిస్థాయి దాడి జరగవచ్చునని చెప్పింది.

    ఇదిలావుంటే.. యుక్రెయిన్, రష్యా ప్రతినిధులు కీయెవ్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటలకు మరో విడత చర్చలు జరుపనున్నట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

  15. యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ ఆహార వ్యవస్థకు పెను విపత్తు

    యుక్రెయిన్‌పై యుద్ధం ప్రభావం ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థ, ఆహార ధరలపై పడే అవకాశం ఉందని ప్రపంచంలోని అతిపెద్ద ఎరువుల కంపెనీల్లో ఒకదాని యజమాని చెప్పారు.

    యారా ఇంటర్నేషనల్ ఎరువుల కంపెనీ 60కి పైగా దేశాల్లో విస్తరించింది. రష్యా నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ముడి పదార్థాలను కొనుగోలు చేస్తుంది ఈ కంపెనీ.

    గ్యాస్ ధరలు పెరుగుతుండటం వల్ల ఇప్పటికే ఎరువుల ధరలు కూడా పెరిగాయి.

    ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని యారా ఇంటర్నేషనల్ కంపెనీ యజమాని సీయిన్ టోర్ హోల్‌స్థర్ హెచ్చరించారు.

    ''గంట గంటకూ పరిస్థితులు మారిపోతున్నాయి'' అని ఆయన బీబీసీతో అన్నారు.

    ''యుద్ధం కంటే ముందు నుంచే ఎరువుల కంపెనీలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు యుద్ధంతో సరఫరా గొలుసుకు అదనపు కష్టాలు తోడయ్యాయి. ఉత్తరార్థ గోళంలో ఈ సీజన్‌కు సంబంధించి చాలా కీలకమైన దశకు మేం చేరువ అవుతున్నాం. ఈ దశలో పెద్ద ఎత్తున ఎరువుల సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ సరఫరా గొలుసుపైనే యుద్ధం ప్రభావం చూపనుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

    రష్యా, యుక్రెయిన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఆహారం, వ్యవసాయంలో అతిపెద్ద ఉత్పత్తిదారులు.

  16. ‘యుక్రెయిన్ ప్రజల రక్తంతో రష్యా చమురు కొనలేం’: లిథువేనియా

    రష్యా చమురు విక్రయాల మీద ఆంక్షలు విధించాలని లిథువేనియా విదేశాంగ మంత్రి గాబ్రియేలియస్ లాండ్స్‌బెర్గిస్ పిలుపునిచ్చారు.

    విల్నీయస్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లిన్‌కెన్‌తో కలిసి మాట్లాడిన గాబ్రియేలియస్.. ‘‘మనం దిగుమతి చేసుకునే ఇంధన వనరులు.. రష్యా సైనిక చర్యకు డబ్బులు అందిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.

    ‘‘మనం యుక్రెయిన్ ప్రజల రక్తంతో చమురుకు, గ్యాస్‌కు చెల్లింపులు చేయజాలం’’ అని పేర్కొన్నారు.

    ఇంధనం కోసం తమ దేశం ప్రస్తుతం రష్యా మీద ఆధారపడుతున్న అంశంపై చర్చించటానికి ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ.. యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియెన్‌తో బ్రసల్స్‌లో భేటీ అవుతున్నారు.

    రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించినట్లయితే యూరోపియన్ దేశాల్లో ఇటలీ, జర్మనీల మీద అత్యధిక ప్రభావం పడుతుంది.

  17. బ్రిటన్‌లో తొలిసారిగా 157 రూపాయలు దాటిన లీటరు పెట్రోల్ ధర, కాటీ ఆస్టిన్, ట్రాన్స్‌పోర్ట్ కరెస్పాండెంట్

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి.

    బ్రిటన్‌లో లీటరు పెట్రోల్ సగటు ధర తొలిసారిగా 155 పెన్నీలను (1.55 పౌండ్లు) తాకిందని, ఒక గ్యాలన్ పెట్రోల్ ధర 7 పౌండ్లు దాటిపోయిందని మొటారింగ్ సంస్థ ఏఏ తెలిపింది.

    భారత కరెన్సీలో ఒక పౌండు విలువ ప్రస్తుతం 101.42 రూపాయలుగా ఉంది. అంటే.. బ్రిటన్‌లో లీటరు పెట్రోల్ సగటు ధర ఇప్పుడు 157 రూపాయలు దాటింది.

    ఏడాది కిందట 55 లీటర్ల ట్యాంకున్న కారుకు పెట్రోలు నింపటానికి 17 పౌండ్లు ఖర్చయితే.. ఇప్పుడది 68.60 పౌండ్ల నుంచి 85.59 పౌండ్లకు పెరిగిపోయిందని ఏఏ వివరించింది.

    ఆదివారం నాడు లీటరు పెట్రోల్ ధర 155.62 పెన్నీలకు పెరగగా, లీటరు డీజిల్ ధర 161.28 పెన్నీలకు పెరిగింది.

    ఈ ధరలు మరింతగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    రష్యా నుంచి ఇతర దేశాలకు పెట్రోలియం సరఫరాలపై నిషేధం విధించే అంశంపై చర్చిస్తున్నామని అమెరికా ఆదివారం నాడు ప్రకటించటంతో.. పెట్రోల్ ధరలు 2008 జూలై తర్వాత అత్యధిక స్థాయికి పెరిగిపోయాయి.

    బ్రెంట్ క్రూడ్ – ముడిచమురు – ధర బ్యారెల్‌కు 139 డాలర్లు దాటిపోయి.. ఆ తర్వాత 130 డాలర్లకు తగ్గింది.

    మార్కెట్‌కు అదనపు సరఫరాలు అందుబాటులోకి తేగలిగినా కూడా.. అది వేగంగా జరగదని పోర్ట్‌లాండ్ ఫ్యూయల్ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ స్పెన్సర్ పేర్కొన్నారు.

    ‘‘పెట్రోల్ ధరలు లీటరుకు 1.70 పౌండ్ల నుంచి 1.75 పౌండ్లు మించిపోతాయని’’ తాను భావిస్తున్నట్లు చెప్పారు.

  18. యుక్రెయిన్ సమాచార వ్యవస్థలపై రష్యా ఉద్దేశపూర్వక దాడి: బ్రిటన్ రక్షణ శాఖ

    యుక్రెయిన్ సమాచార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ సూచించింది.

    ‘‘యుక్రెయిన్ ప్రజలకు విశ్వసనీయమైన వార్తలు, సమాచారం అందకుండా నిరోధించటానికి.. యుక్రెయిన్ సమాచార మౌలిక సదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది’’ అని తన తాజా రక్షణ నిఘా సమాచార వివరాల్లో పేర్కొంది.

    ఆదివారం నాడు ఖర్కియెవ్‌లోని ఒక టీవీ టవర్ మీద దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. గత వారంలో కీయెవ్ నగరంలో కూడా ఇదే తరహా దాడి జరిగింది.

    ‘‘మౌలిక సదుపాయాల మీద రష్యా దాడుల ఫలితంగా.. యుక్రెయిన్ ఇంటర్నెట్ సదుపాయానికి కూడా అంతరాయాలు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.

    ‘‘మరియుపూల్, సుమీ, కీయెవ్, ఖార్కియెవ్‌లలో గత వారం రోజులుగా ఇంటర్నెట్ కూడా ఆగిపోతున్నట్లు వార్తలు వచ్చాయి’’ అని తెలిపింది.

  19. యుక్రెయిన్‌లో పెంపుడు పులులతో బేస్‌మెంట్‌లో జీవిస్తున్న తెలుగు వైద్యుడు

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వైద్యుడు తన రెండు పెంపుడు పులులతో కలిసి యుక్రెయిన్‌లోని ఒక ఇంటి బేస్‌మెంట్‌లోనే వారానికి పైగా రోజులుగా తలదాచుకుంటున్నారు.

    గిరికుమార్ పాటిల్, 20 నెలల క్రితం కీయెవ్‌ జూ నుంచి జాగ్వర్‌తో పాటు బ్లాక్ పాంథర్‌ పులులను తెచ్చుకొని పెంచుకుంటున్నారు. తన పెంపుడు పులులు లేకుండా అక్కడి నుంచి రాలేనని ఆయన అంటున్నారు.

    తూర్పు యుక్రెయిన్‌ దోన్బస్ రీజియన్‌లోని సెవెరోదోన్యస్క్ అనే చిన్న పట్టణంలో ఆయన ఆరు ఏళ్లకు పైగా నివసిస్తున్నారు.

    యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం పూట కర్ఫ్యూ సమయంలో తన పెంపుడు పులులకు ఆహారం కొనడం కోసం మాత్రమే ఆయన బయటకు వస్తున్నారు. ఆయన దగ్గర 20 నెలల వయస్సున్న మగ జాగ్వర్, 6 నెలల ఆడ పాంథర్ పులులు ఉన్నాయి.

  20. యుక్రెయిన్ శరణార్థులు ఎటు వెళుతున్నారు?

    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థి సంక్షోభం యుక్రెయిన్ శరణార్థి సంక్షోభమని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది.

    ఆ దేశం మీద రష్యా సైనిక దాడి మొదలైన తర్వాత ఇప్పటివరకూ 17 లక్షల మంది జనం యుక్రెయిన్ విడిచి పారిపోయారని పేర్కొంది.

    దాదాపు 40 లక్షల మంది జనం యుక్రెయిన్ విడిచి వెళ్లటానికి ప్రయత్నించవచ్చునని యూరోపియన్ యూనియన్ అంచనాగా చెప్తోంది.

    ఈ శరణార్థులు ఎక్కువగా పశ్చిమ సరిహద్దులోని పొరుగు దేశాలకు వెళుతున్నారు. ప్రధానంగా పోలండ్‌కు.. ఆ తర్వాత రొమేనియా, స్లొవేకియా, హంగరీ, మాల్దోవా దేశాలకు చేరుకుంటున్నారు.

    అతి కొద్ది మంది జనం రష్యా, బెలారుస్ దేశాలకు కూడా వెళ్లారు.