You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యా చమురును బహిష్కరించాలన్న జెలియెన్‌స్కీ.. ఆ ఊసెత్తని ఈయూ

రష్యా నుంచి దిగుమతులను బహిష్కరించాలని, ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు, చమురు ఉత్పత్తులను తిరస్కరించాలని జెలియెన్‌స్కీ పిలుపునిచ్చారు. యుక్రెయిన్ మీద దండయాత్రను రష్యా విరమించుకోలేదని, కాబట్టి రష్యా మీద కఠినమైన కొత్త ఆంక్షలను విధించాల్సిన అవసరముందని చెప్పారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. ‘యుక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా చర్చించండి’: పుతిన్‌కు మోదీ సూచన

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయని రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది.

    ‘‘యుక్రెయిన్, రష్యా బృందాల మధ్య చర్చల స్థితిగతులను ప్రధాని మోదీకి అధ్యక్షుడు పుతిన్ క్లుప్తంగా వివరించారు’’ అని తమ వివరాలు వెల్లడించని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీనిపై ప్రభుత్వ ప్రకటన వస్తుందని తెలిపాయి.

  2. రష్యా ప్రతిపాదించిన మార్గాలు ఆమోదనీయం కాదు: యుక్రెయిన్

    రష్యా ప్రతిపాదించిన ఆరు మానవతా మార్గాలు ‘‘ఆమోదనీయం’’ కాదని యుక్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఇర్యానా వెరెష్చుక్ పేర్కొన్నారు.

    రష్యా ప్రతిపాదించిన నాలుగు నగరాల్లో కేవలం మరియపూల్, సుమీ నగరాల తరలింపు మార్గాలు మాత్రమే.. అక్కడి ప్రజలను యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు తీసుకెళతాయి. మిగతా దారులన్నీ కూడా నేరుగా రష్యాకు కానీ, ఈ యుద్ధంలో రష్యా మిత్రపక్షమైన బెలారుస్‌కు కానీ దారితీస్తాయి.

    ‘‘ఇది మానవతా మార్గాలను తెరిచే పద్ధతి కాదు. మా జనం కీయెవ్ నుంచి బెలారుస్‌కి, ఆ తర్వాత విమానంలో రష్యన్ ఫెడరేషన్‌కి వెళ్లరు’’ అని ఇర్యానా స్పష్టంచేశారు.

    రష్యా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల నుంచి.. జనం ఆయా నగరాలను విడిచి వెళ్లటానికి వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణ అమలు చేస్తామని ప్రతిపాదిస్తూ రష్యా ఆదివారం రాత్రి ఒక లేఖ పంపించింది.

    దీనికి యుక్రెయిన్ స్పందిస్తూ.. ఆయా మార్గాలకు సంబంధించి తన నిబంధలను పంపించింది. ముఖ్యంగా.. తరలించే జనం రష్యాకు దూరంగా యుక్రెయిన్‌లో పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేలా కారిడార్లను తెరవాలని షరతులు పెట్టింది.

    ఆ కారిడార్లను ఏర్పాటు చేయటానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల సాయం కోరారు ఇర్యానా.

  3. రష్యా ప్రతిపాదించిన మానవతా మార్గాల వివరాలివీ...

    రష్యా ప్రకటించిన కాల్పుల విరమణ మార్గాల్లో కొన్ని రష్యా, బెలారుస్‌లకు దారితీస్తున్నాయి.

    మొత్తం నాలుగు నగరాల్లో చిన్న నగరాలైన మరియుపూల్, సుమీ నగరాల నుంచి తరలింపు మార్గాలు మాత్రమే యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు తీసుకెళతాయి.

    మొత్తం మార్గాల జాబితాను రష్యా వార్తా సంస్థ రియా ప్రచురించింది. హ్యుమానిటేరియన్ రెస్పాన్స్ ఇన్ యుక్రెయిన్ కోసం ఇటీవల ఏర్పాటైన ఇంటర్‌డిపార్ట్‌మెంటల్ కోఆర్డినేటింగ్ హెడ్‌క్వార్టర్స్ ఈ వివరాలు తెలిపినట్లు చెప్పింది.

    ఆ మార్గాల వివరాలివీ:

    మరియుపూల్

    • రూట్ 1: నొవోయాజోవ్స్క్, తాగాన్రాగ్, రోత్సోవాన్ డాన్ (రష్యా), ఆపైన విమానం, రోడ్డు లేదా రైలు ద్వారా ఎంచుకున్న ప్రాంతానికి కానీ, తాత్కాలిక ఆశ్రయానికి కానీ తరలింపు
    • రూట్ 2: పోర్టివ్స్కీ, మాంగుష్, రెస్పుబ్లికా, రోసివ్కా, బిల్మాక్, పొలోహి, ఒర్ఖియెవ్, జపోరిఝ్యా (యుక్రెయిన్)

    ఖార్కియెవ్

    • నెఖోటెయెవ్కా, బెల్గోరాడ్ (రష్యా), ఆపైన విమానం, రోడ్డు లేదా రైలు మార్గం

    సుమీ

    • రూట్ 1: సుద్ఝా, బెల్గొరాడ్, ఆపైన ఏదైనా రవాణా మార్గం
    • రూట్ 2: సుమీ, గొలుబివ్కా, రోమ్నీ, లోఖ్విత్స్యా, లుబ్నీ, పోల్తావా (యుక్రెయిన్)

    కీయెవ్

    • హోస్తోమెల్, రకీవ్కా, సొస్నోవ్కా, ఇవాన్‌కీయెవ్, ఒరేన్, చెర్నోబిల్, గ్డెన్, గోమెల్ (బెలారుస్) ఆ పైన వాయుమార్గంలో రష్యాకు

    ఈ తరలింపు కార్యక్రమాన్ని రష్యా సైన్యం డ్రోన్ల సాయంతో నియంత్రిస్తుందని కూడా ఆ ప్రకటన చెప్పింది.

  4. మరియుపూల్ వీడి వెళ్లే మార్గంలో మందుపాతరలున్నాయి: రెడ్ క్రాస్

    ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ (ఐసీఆర్‌సీ) ఆపరేషన్స్ డైరెక్టర్ డొమినిక్ స్టిల్‌హార్ట్ బీబీసీ రేడియో 4తో మాట్లాడుతున్నారు.

    రష్యా చెప్తున్న మానవతా మార్గాలతో సమస్యేమిటని అడిగినపుడు.. ఇరు పక్షాలతో తాము రోజుల తరబడి మాట్లాడుతున్నామని, కానీ బాంబుదాడులు జరిగిన నగరాల నుంచి జనం బయటకు వెళ్లటానికి అనుమతించటం కోసం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖరారు చేయటం సమస్యగా ఉందని ఆయన బదులిచ్చారు.

    నిర్దిష్టమైన, ఆచరించగల, కచ్చితమైన ఒప్పందం కుదిరేలా ఇరు పక్షాలనూ ఒప్పించటం సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

    ఇప్పటివరకూ సూత్రప్రాయంగానే అంగీకారాలు జరిగాయని, కానీ ఏఏ మార్గాలు ఉపయోగించవచ్చు, ఎవరు ఉపయోగించవచ్చు అనే అంశాలపై నిర్దిష్టత లేకపోవటం వల్ల ఆ అంగీకారాలు వెంటనే విఫలమయ్యాయని వివరించారు.

    ఒక ఉదాహరణ చెప్తూ.. ఆదివారం నాడు రెడ్ క్రాస్ సిబ్బంది కొందరు మరియుపూల్ నుంచి అంగీకరించిన మార్గం గుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని.. కానీ వారికి సూచించిన రోడ్డులో నిజానికి మందుపాతర్లు పాతారని వెంటనే అర్థమైందని డొమినిక్ తెలిపారు.

    ‘‘అందుకే ఇరు పక్షాల మధ్య కచ్చితమైన ఒప్పందం కుదరటం అవసరం. అప్పుడు దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయగలం’’ అని చెప్పారాయన.

  5. రష్యా మానవతా మార్గాల ప్రతిపాదన అనైతికం: యుక్రెయిన్

    శరణార్థులను బెలారస్ లేదా రష్యా తరలించటానికి మానవతా మార్గాలను ఏర్పాటుచేస్తామన్న రష్యా ప్రతిపాదన ‘పూర్తిగా అనైతికమ’ని యుక్రెయిన్ విమర్శించింది.

    యుక్రెయిన్ ప్రజలు యుక్రెయిన్ భూభాగం నుంచే తమ ఇళ్లు వదిలి వెళ్లటానికి వీలుండాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు.

    ‘‘ఇదంతా ఓ అనైతిక కథ. ప్రజల కష్టాలను తాము కోరుకున్న టెలివిజన్ దృశ్యాన్ని సృష్టించటానికి ఉపయోగించుకున్నారు’’ అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    ‘‘వీళ్లు యుక్రెయిన్ పౌరులు. వీరు యుక్రెయిన్ భూభాగానికి తరలివెళ్లే హక్కు వీరికి ఉండాలి’’ అని పేర్కొన్నట్లు చెప్పింది.

  6. యుక్రెయిన్‌కు మానవతా సహాయం అందిస్తామని ప్రకటించిన చైనా

    దౌత్యపరమైన చర్చలు కొనసాగాలని పిలుపునిస్తూ యుక్రెయిన్‌కు మానవతా సహాయం అందచేయనున్నట్లు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఇయీ తెలిపారు.

    రష్యాతో తమ సంబంధాలు దృఢంగా ఉన్నాయని చెబుతూ, ఇరుదేశాలకు పరస్పర సహకారం అందించుకునే అవకాశాలుఎక్కువగా ఉన్నాయని అన్నారు.

    రష్యా చర్యలను ఖండించమని చెబుతూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కోరిన కొంత సేపటికే చైనా ఈ ప్రకటన చేయడం విశేషం.

    రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడులను ఇప్పటి వరకు చైనా ఖండించడం గాని, విమర్శించడం గాని చేయలేదు. ఈ దాడులను ఆక్రమణ అని కూడా వ్యాఖ్యానించలేదు.

    అయితే, కాల్పుల విరమణ చేపట్టేందుకు మధ్యవర్తిత్వం వహించే పాత్రను పోషించేందుకు చైనా సిద్ధంగా ఉందని ఇయీ ఈ వారం మొదట్లో సంకేతాలిచ్చారు.

  7. యుక్రెయిన్ లో ఇంతవరకు ఏం జరిగింది?

    మీరిప్పుడే లైవ్ పేజీ చూస్తున్నట్లైతే, గత కొన్ని గంటల్లో యుక్రెయిన్ లో ఏమి జరిగిందో చూడండి

    యుక్రెయిన్‌లో వివిధ నగరాల్లో సాధారణ పౌరులు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లేందుకు వీలుగా కొత్త మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత కూడా దాడులను కొనసాగించిందని యుక్రెయిన్ అధికారులు ఆరోపించిన తర్వాత రష్యా తిరిగి ఈ ప్రకటన చేసింది.

    రష్యా సాధారణ పౌరులను హతమారుస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ ఆరోపించారు. ఆదివారం రష్యా చేసిన దాడిలో ఇర్పిన్ పట్టణంలోని ఒక కుటుంబం ప్రాణాలు కోల్పోయారు.

    యుక్రెయిన్ సైనికులు చుహియెవ్ నగరాన్ని రష్యా సేనల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు.

    యుక్రెయిన్ దక్షిణ ప్రాంత రేవు పట్టణం మికోలియెవ్‌లో రష్యా దాడులు మళ్లీ మొదలయ్యాయి.

    రష్యాతో పాటు దాని మిత్ర దేశాల ఇంధన సరఫరాల‌పై ఎంబార్గో విధించేలా చర్చలు జరుపుతున్నట్లు అమెరికా వెల్లడించడంతో చమురు ధరలు అమాంతం పెరిగాయి.2008 తర్వాత ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.

  8. రష్యా టీవీ స్టేషన్ లను హ్యాక్ చేశామని చెబుతున్న హ్యాకింగ్ సంస్థ అనానిమస్

    యుక్రెయిన్‌లో యుద్ధ దృశ్యాలను ప్రసారం చేసేందుకు రష్యన్ ప్రభుత్వ టీవీ ప్రసారాలను హ్యాక్ చేసినట్లు హ్యాకింగ్ కలెక్టివ్ అనానిమస్ చెబుతోంది.

    రష్యా స్ట్రీమింగ్ సర్వీస్ లైన వింక్, ఐవీలతో పాటు రష్యా 24, చానెల్ వన్, మాస్కో 24 చానెళ్లను కూడా హ్యాక్ చేసినట్లు ట్వీట్ చేసింది.

    ఈ వాదనలను బీబీసీ ధ్రువీకరించలేదు.

    ఇది అనానిమస్ ఇంత వరకూ ఎన్నడూ చేపట్టనంత పెద్ద ఆపరేషన్ అని మరొక పోస్టులో ఈ గ్రూపు పేర్కొంది. ఈ ఆపరేషన్‌ను ముప్పుగా పరిగణించి కొన్ని ప్రభుత్వాలు ఈ ఆపరేషన్ జరగలేనట్లు చూపించే ప్రయత్నాలు చేస్తాయనే ఆందోళనను వ్యక్తం చేసింది.

    "వివిధ శక్తులు మా వైపు దృష్టిని కేంద్రీకరించినప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకోండి. ప్రపంచాన్ని మంచి కోసం మార్చడమే మా ఉద్దేశం" అని అనానిమస్ పేర్కొంది.

  9. రష్యా సెంట్రల్ బ్యాంకుతో లావాదేవీలను నిలిపేసిన దక్షిణ కొరియా

    రష్యా సెంట్రల్ బ్యాంకుతో లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.

    మాస్కో పై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న పశ్చిమ దేశాల ప్రయత్నాలకు దక్షిణ కొరియా కూడా తోడైనట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.

    రష్యా కేంద్ర బ్యాంక్, ఆర్ధిక శాఖ, ఇతర సార్వభౌమ నిధుల నుంచి జరిగే లావాదేవీలను అమెరికా ఇప్పటికే నిషేధించింది.

    యూరోపియన్ యూనియన్ కూడా ఆర్ధికపరమైన ఆంక్షలను విధించిన దేశాల జాబితాలో ఉంది.

  10. బ్రేకింగ్ న్యూస్, పౌరులు సురక్షితంగా తరలివెళ్లేందుకు వీలుగా కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

    యుక్రెయిన్‌లో వివిధ నగరాల్లో సాధారణ పౌరులు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లేందుకు వీలుగా కొత్త మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది.

    ఉదయం 10 గంటల(రష్యా కాలమానం ప్రకారం) నుంచి కాల్పుల విరమణ అమలు చేస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.

    రాజధాని కీయెవ్ , ఖార్కియెవ్, మరియుపూల్‌‌, సుమీలలో పౌరులు సురక్షితంగా తరలివెళ్లేందుకు వీలు కల్పిస్తున్టన్లు చెబుతున్నారు.

    అయితే, ఈ విషయాన్ని యుక్రెయిన్ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

    వారాంతంలో మరియుపూల్‌‌లో పౌరులను తరలించేందుకు రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

    రష్యా కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత కూడా దాడులను కొనసాగించిందని యుక్రెయిన్ అధికారులు ఆరోపించారు.

  11. చుహియెవ్‌ను తిరిగి కైవసం చేసుకున్నట్లు ప్రకటించిన యుక్రెయిన్ రక్షణ శాఖ

    యుక్రెయిన్ సైనికులు చుహియెవ్ నగరాన్ని రష్యా సేనల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు.

    ఈ నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ఇద్దరు అత్యున్నత స్థాయి రష్యా కమాండర్లను కూడా హతమార్చినట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

    అయితే, బీబీసీ స్వతంత్రంగా ఈ వాదనలను ధ్రువీకరించుకోలేదు.

    యుక్రెయిన్ లో రెండవ పెద్ద నగరం ఖార్కియెవ్ కు 23 మైళ్ళ దూరంలో చుహియెవ్ ఉంది.

    గత వారం రోజులుగా ఈ నగరం పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నగర జనాభా 31,000.

  12. యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు మతాధికారిని అరెస్ట్ చేసిన రష్యా

    యుక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకించిన మతాధికారిని అరెస్టు చేసినట్లు ఉద్యమకారులు చెబుతున్నారు. ఈ రోజు ఆయనను కోర్టులో హాజరుపరుస్తారు.

    ఫాదర్ జాన్ బర్డిన్ యుద్ధాన్నివ్యతిరేకిస్తూ రష్యాలోని కరబనోవో గ్రామంలో ఆదివారం ప్రసంగం చేసినట్లు బీబీసీ రష్యా ప్రతినిధి ఆండ్రీ జఖారోవ్ ట్వీట్ చేశారు.

    ఆయన చేసిన ప్రసంగంలో యుద్ధాన్ని వ్యతిరేకించారు. యుక్రెయిన్ నగరాలపై జరుగుతున్న దాడులు, వినాశనాన్ని వివరించారు.

    దీంతో పాటు, యుద్ధాన్ని వ్యతిరేకించే చిత్రాలను షేర్ చేస్తూ, యుద్ధానికి వ్యతిరేకంగా ఒక వెబ్ సైటులో విన్నపాన్నిసమర్పించారు.

    సైనిక చర్యలను తప్పు పట్టడాన్ని నేరంగా పరిగణిస్తూ గత వారం రష్యా ప్రభుత్వం తీర్మానం చేసింది.

    యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాలో వెల్లువెత్తుతున్న నిరసనలను తీవ్రంగా అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. అయినప్పటికీ వేలాది మంది వీధుల్లోకొచ్చి నిరసనలు చేసేందుకు వెనుకాడటం లేదు.

    యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 13,000 మందికి పైగా అరెస్టు చేసినట్లు స్థానిక ఎన్జీఓ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. ఒక్క ఆదివారం నాడే 4,600 మందిని పైగా అరెస్ట్ చేశారు.

  13. మికోలియెవ్‌లో మళ్లీ భారీగా షెల్లింగ్

    యుక్రెయిన్ దక్షిణ ప్రాంత రేవు పట్టణం మికోలియెవ్‌లో రష్యా దాడులు మళ్లీ మొదలయ్యాయి.

    యుక్రెయిన్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు షెల్లింగ్ మొదలైనట్లు స్థానిక మీడియా న్యూస్ - ఎన్ తెలిపింది.

    న్యూ యార్క్ టైమ్స్ ప్రతినిధి షర్ట్జ్ పోస్ట్ చేసిన వీడియోలో రాత్రి సమయంలో పేలుళ్లతో నిండిన గగనతలం కనిపిస్తోంది.

    నగరానికి తూర్పు వైపున షెల్లింగ్ అత్యధికంగా జరుగుతున్నట్లు షర్ట్జ్ ట్వీట్ చేశారు.

    476,100 మంది జనాభా గల ఈ నగరం పై రష్యా చేసిన దాడిని యుక్రేనియన్ సేనలు తిప్పికొట్టాయి.

    యుక్రెయిన్ సేనలు ఈ నగరంతో పాటు స్థానిక ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యా తన దాడులను తీవ్రం చేసింది.

  14. రష్యాకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్న సెర్బియన్‌లు

    సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో రష్యాకు అనుకూలంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.

    దాదాపు నాలుగు వేల మంది సెర్బియన్లు శుక్రవారం వీధుల్లోకి వచ్చి, రష్యా జాతీయ పతాకాలు పట్టుకుని నినాదాలు చేశారు.

    యుక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో రష్యా గెలవాలని వీరంతా ఆకాంక్షించారు.

    ఎన్నో శతాబ్దాలుగా రష్యాకు, సెర్బియాకు మతపరమైన, జాతి పరమైన, రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి.

  15. ఆయిల్ ధరలు - 13 సంవత్సరాల్లోనే అత్యధికం

    రష్యాతో పాటు దాని మిత్ర దేశాల ఇంధన సరఫరాల‌పై ఎంబార్గో విధించేలా చర్చలు జరుపుతున్నట్లు అమెరికా వెల్లడించడంతో చమురు ధరలు అమాంతం పెరిగాయి.

    ఆసియాలో ముడి చమురు బ్యారెల్ ధర 139 డాలర్లకు (సుమారు రూ. 10,000)) పెరిగింది.

    2008 తర్వాత ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.

    యుక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఇంధన మార్కెట్ లో ధరలు అమాంతం పెరిగాయి.

  16. జెలియెన్క్సీ - బైడెన్ తో మాట్లాడేందుకు సురక్షితమైన హాట్ లైన్ సౌకర్యం

    రష్యా చేస్తున్న డిజిటల్ దాడులు, కమ్యూనికేషన్ వ్యవస్థను అడ్డుకునేందుకు అమెరికా ఇంటెలిజెన్స్ బృందాలు పని చేస్తున్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం తెలిపింది.

    శాటిలైట్ చిత్రాలు, ఎలక్ట్రానిక్ సంకేతాల నుంచి సేకరించిన సమాచారాన్ని అమెరికా, జర్మనీలోనున్న యూఎస్ సైబర్ కమాండ్ సిబ్బందిప్రతీ గంట, రెండు గంటలకొకసారి యుక్రెయిన్ సైన్యానికి అందచేస్తున్నట్లు టైమ్స్ కథనం పేర్కొంది.

    యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్క్సీ సురక్షితమైన ఫోన్ లైన్ ద్వారా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడేందుకు ఎన్క్రిప్ట్ చేసిన కమ్యూనికేషన్స్ పరికరాలను సరఫరా చేసినట్లు కూడా తెలిపింది.

    జెలియెన్క్సీ బైడెన్ తో శనివారం 35నిమిషాల సేపు మాట్లాడారు.

    అమెరికా ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు యుక్రెయిన్ కు అందచేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి గురువారం తెలిపారు.

  17. కీయెవ్‌పై పూర్తిస్థాయి దాడికి సిద్ధమవుతున్న రష్యా - యుక్రెయిన్

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌పై పూర్తి స్థాయి దాడి చేసేందుకు రష్యా తన సేనలను సన్నద్ధం చేస్తున్నట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

    కీయెవ్‌పై దాడి చేసేందుకు రష్యా సేనలు వనరులను సమకూర్చుకుంటున్నారని యుక్రెయిన్ ఆర్మీ అధికారులు చెప్పారు.

    ఇప్పటికే క్షేత్రస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు ట్యాంకులు, సాయుధ వాహన శ్రేణులు ఇర్పిన్ పట్టణం వైపు కదులుతున్నట్లు సమాచారం అందింది.

    రష్యా కమాండర్లు చెర్నోబిల్ మీదుగా బెలారస్ నుంచి తెప్పిస్తున్న ఇంధనాన్ని కూడా తమ సేనలకు సరఫరా చేస్తున్నట్లు కూడా తెలిసింది.

    రష్యా సేనలు ఖార్కియెవ్ , చెర్నిహియెవ్, సుమీ, మికోలాయెవ్ నగరాలను చుట్టుముట్టేందుకు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

  18. యుక్రెయిన్‌పై పోరాటానికి సిరియన్ సేనలను నియమిస్తున్న రష్యా

    యుక్రెయిన్‌లో ప్రధాన నగరాలను కైవసం చేసుకునేందుకు రష్యా చేస్తున్న పోరాటాన్ని ముమ్మరం చేసేందుకు నిపుణులైన సిరియా సైనికులను నియమించుకుంటున్నట్లు అమెరికా అధికారులు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు చెప్పారు.

    అయితే, యుద్ధంలో పాల్గొనేందుకు ఎంత మంది సైనికులు అంగీకరించారనే విషయాన్ని చెప్పేందుకు మాత్రం ఇంటెలిజెన్స్ అధికారులు తిరస్కరించారు.

    కానీ, ఇప్పటికే కొంత మంది సైనికులు రష్యాకు ప్రయాణమై యుక్రెయిన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుతెలిపారు.

    యుక్రెయిన్‌లో ఆరు నెలల పాటు సైనికులుగా పనిచేసేందుకు వచ్చిన స్వచ్చంద సేవకులకు రష్యా, సిరియా 200 నుంచి 300 డాలర్లు (సుమారు రూ. 15,000 - 23,000) చెల్లిస్తున్నట్లు డీర్ ఇజార్ అనే పత్రిక పేర్కొంది.

    సిరియా పౌర యుద్ధంలో పాల్గొని బలోపేతమైన సేనలను యుక్రెయిన్ పంపడం ద్వారా కీయెవ్ లాంటి నగరాలను కైవసం చేసుకునేందుకు రష్యాకు మరింత బలం చేకూరుతుందని మాస్కోలో అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.

    యుక్రెయిన్ కోసం పోరాడేందుకు ఇజ్రాయెల్ మాజీ సైనికులు ముందుకొస్తున్నట్లు తెలిసింది.

  19. కూలింది రష్యా విమానమా? యుక్రెయిన్ విమానమా?

    ఖార్కియెవ్ గగనతలంపై విమానాన్ని కూల్చివేసినట్లు కనిపిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.

    ఈ వీడియోను బీబీసీ ధ్రువీకరించినప్పటికీ, ఆ విమానం కూలిన ప్రదేశాన్ని నిర్ధరించడం మాత్రం సాధ్యం కాలేదు.

    విమానం రష్యాకు చెందిందా లేదా యుక్రెయిన్‌కు చెందిందా అనే విషయంపైనా కూడా స్పష్టత లేదు.

    అయితే, యుక్రెయిన్ వాయుసేనలు రష్యాకు చెందిన ఎస్ యూ 25 ఎయిర్ క్రాఫ్ట్ ను కూల్చాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

    యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యాకుచెందిన 80 విమానాలను, హెలికాఫ్టర్లను కూల్చివేశామని యుక్రెయిన్ చెబుతోంది.

  20. ‘నో-ఫ్లై జోన్ ప్రకటిస్తే మూడో ప్రపంచ యుద్ధమే’

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ సహా మరికొందరు యుక్రెయిన్ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు నో-ఫ్లై జోన్ ప్రకటన చేసే విషయమై అమెరికాలో రాజకీయ నాయకులు చర్చలు చేస్తున్నారు.

    "నో-ఫ్లై జోన్ ప్రకటించడమంటే మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీసినట్లే" అని సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీలో అత్యున్నత స్థాయిలో ఉన్న రిపబ్లిక్ నాయకుడు సెనేటర్ మార్కో రూబియో సీఎన్ఎన్‌కు చెప్పారు.

    "నో-ఫ్లై జోన్ అంటే ఏమిటో ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన అవసరముంది. నో-ఫ్లై జోన్ అంటే ఎవరో నిబంధనలను జారీ చేస్తేమిగిలిన వారు వాటిని పాటించాలని అనుకోవడం కాదు. నో-ఫ్లై జోన్ ప్రకటించడమంటే రష్యా విమానాలను కూల్చేసేందుకు సమ్మతి తెలపడమే" అని అన్నారు.

    "రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా వస్తున్న ఆదాయాన్ని యుక్రెయిన్‌లో యుద్ధానికి నిధులను సమకూర్చేందుకు వాడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడంలో అర్ధం లేదు" అని అన్నారు.

    "నో-ఫ్లై జోన్ ప్రకటించడం అమెరికా, యూరోప్ దేశాల ఆసక్తి కాదని కనెక్టికట్ సెనేటర్ క్రిస్టోఫర్ మర్ఫీ అన్నారు.

    "అలా చేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు న్యూక్లియర్ దేశాలు ఒకదానితో ఒకటి నేరుగా యుద్ధానికి తలపడే అవకాశం ఉంది" అని అభిప్రాయపడ్డారు.

    అయితే, నో-ఫ్లై జోన్ ప్రకటనను పూర్తిగా తోసిపుచ్చడానికి లేదని మరో సెనేటర్ జో మాన్చిన్ అన్నారు.