యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర 12వ రోజున ఏం జరిగింది?
యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర మొదలై సోమవారానికి 12 రోజులైంది. ఈ సంఘర్షణలో సోమవారం నాడు జరిగిన కీలక పరిణామాలివీ...
- యుక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య మూడో విడత చర్చలు జరుగుతున్నాయి.
- క్రైమియాను రష్యా భూభాగంగాను;దోన్యస్క్, లూహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా యుక్రెయిన్ గుర్తించి తీరాలని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.
- అలాగే.. యుక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించి, నాటో వంటి ఏదైనా బృందంలో చేరే అవకాశాన్ని తిరస్కరించి తీరాలని కూడా పెస్కోవ్ చెప్పారు. ఈ షరతులను యుక్రెయిన్ అమలు చేస్తే తమ సైనిక చర్యలు ‘ఒక్క క్షణంలో’ నిలిచిపోతాయని రష్యా చెప్పింది.
- యుక్రెయిన్ నగరాల నుంచి ఆ దేశ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ, మానవతా కారిడార్ల ఏర్పాటు ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన అనైతికమని యుక్రెయిన్ విమర్శించింది.
- రష్యా ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం.. కీయెవ్ నుంచి తరలిపోయే ప్రజలు రష్యా మిత్రపక్షమైన బెలారుస్‌కు, ఖార్కియెవ్ నుంచి వెళ్లే వారిని రష్యాకు తరలించటం జరుగుతుంది.
- రష్యా బలగాల ముట్టడిలో ఉన్న మరియపూల్, సుమీ నగరాల నుంచి తరలిపోయే వారిని యుక్రెయిన్‌లోని ఇతర నగరాలకు, రష్యా నగరాలకు తరలిస్తారు.
- రష్యా బలగాలు ఆస్పత్రులు, నర్సరీలు, స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని, పౌరులు సైతం ఈ దాడుల బారిన పడుతున్నారని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
- పౌరులను లక్ష్యంగా చేసుకున్నామనే ఆరోపణలను రష్యా తిరస్కరిస్తోంది. యుక్రెయిన్ ‘జాతీయవాదులు, నయా-నాజీలు’ లక్ష్యంగా ప్రత్యేక సైనిక చర్యలు చేపడుతున్నామని చెప్తోంది.
- చమురు ధరలు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగిపోయాయి. బ్యారల్ ధర 139 డాలర్లకు చేరుకుంది. బ్రిటన్‌లో లీటరు పెట్రోల్ ధర సగటున 155 పెన్నీలకు పెరిగిపోయింది.
- రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా సూచించిన నేపథ్యంలో చమురు ధరలు ఇలా అమాంతం పెరిగిపోయాయి.
- రష్యా మీద మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించాలని, ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను నిషేధించాలని యూరప్ దేశాలకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ పిలుపునిచ్చారు.
- అయితే.. బ్రసెల్స్‌లో సమావేశమైన యూరోపియన్.. రష్యా చమురు దిగుమతులపై నిషేధం గురించి చర్చించలేదు. యూరప్ దేశాలు తమ సహజ వాయువులో 40 శాతాన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఆ దేశాలకు దిగుమతయ్యే చమురులో నాలుగో వంతు రష్యా నుంచే వస్తుంది.
- యూరప్ దేశాలు రష్యా చమురు, గ్యాస్ వినియోగాన్ని రాత్రికి రాత్రి ఆపివేయలేవని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు దిగుమతుల మీద ఆంక్షలు విధించేట్లయితే ఆ పని ‘జాగ్రత్త’గా చేయాలని నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రట్ చెప్పారు.
- యుక్రెయిన్‌కు సాయంగా బ్రిటన్ మరో 17.5 కోట్ల పౌండ్లు అందిస్తుందని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దీంతో యుక్రెయిన్‌కు బ్రిటన్ అందించే సాయం మొత్తం 40 కోట్ల పౌండ్లకు (సుమారు రూ. 4,043 కోట్లు) పెరుగుతుందని చెప్పారు.
- యుక్రెయిన్ మీద ‘అన్యాయమైన దండయాత్రలో భాగస్వామ్య’మున్న పది మంది రష్యా ప్రముఖుల మీద కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు.

ఇవి ఇప్పటివరకూ ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.






















