ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిపై చర్చ జరిపేందుకు సోమవారం ఒక
ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది.
ఈ సమావేశం పాకిస్తాన్ భారత్‌పై తీవ్ర ఆరోపణలు
చేసింది.
నిజానికి, ఈ సమావేశానికి
పాకిస్తాన్ కూడా హాజరు కావాలని కోరుకుంది. అయితే, పాకిస్తాన్‌కు అనుమతి లభించలేదు.
అఫ్గానిస్తాన్ అంశంపై
భద్రతామండలి గత వారం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్‌కు
అనుమతి లభించలేదు.
ఐక్యరాజ్యసమితి భద్రతా
మండలిలో అధ్యక్ష పదవిలో భారత్ ఉన్నందువల్లే తమకు అవకాశం ఇవ్వడం లేదని పాకిస్తాన్
ఆరోపించింది.
ఆగస్టులో భారత్ అధ్యక్ష
బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 రోజుల్లో అఫ్గానిస్తాన్
అంశంపై భద్రతా మండలి రెండోసారి అత్యవసర సమావేశం నిర్వహించింది.
పాకిస్తాన్ ఆరోపణలపై
భారత్ మౌనం వహిస్తోంది. పాకిస్తాన్ మాత్రం భారత్‌పై ఆరోపణలు చేస్తోంది.
సోమవారం కౌన్సిల్
సమావేశం తరువాత, ఐక్యరాజ్యసమితిలో
పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌పై చర్చల్లో
తమను పాల్గొనడానికి భారత్ అనుమతించడం లేదని ఆరోపించారు.
అఫ్గానిస్తాన్ శాంతి
ప్రక్రియలో పాకిస్తాన్‌ది ముఖ్యమైన పాత్ర అని, అఫ్గానిస్తాన్‌పై మాట్లాడటానికి భారతదేశం
ఉద్దేశపూర్వకంగానే తమని అనుమతించడం లేదని అక్రమ్ అన్నారు.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి కూడా మరోసారి భారత్‌పై విమర్శలు గుప్పించారు.
అఫ్గానిస్తాన్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ట్వీట్ చేశారు. శాంతి స్థాపన లక్ష్యంగా ఏర్పాటైన ఈ వేదికను భారత్ రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు.
అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని, మరోసారి ఈ ప్రాంతం తీవ్రవాదులకు నిలయంగా మారడానికి అనుమతించవొద్దని భద్రతా మండలి సమావేశంలో తాలిబాన్లను విజ్ఞప్తి చేశారు.
మహిళలు, పిల్లలు, మైనారిటీల మానవ హక్కులను పూర్తిగా కాపాడేలా పరిష్కారం ఉండాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు.
ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి చైనా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌కు ఈ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంపై చైనా శాశ్వత ప్రతినిధి జాంగ్ జున్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో యుద్ధం అంతం కావాలని అఫ్గాన్ ప్రజలు మాత్రమే కోరుకోవడం లేదని, అంతర్జాతీయ సమాజం మొత్తం అదే కోరుకుంటోందని ఆయన అన్నారు.