కరోనావైరస్: 'భారత్‌లో జూన్-జూలై నాటికి కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం' - ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

దేశంలో వైరస్ విస్తరిస్తున్న తీరును బట్టి కేసుల సంఖ్య జూలై నాటికి మరింత తీవ్రంగా పెరిగే అవకాసం ఉందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,72,9367కు పెరిగింది. కోవిడ్-19 వల్ల ఇప్పటివరకూ మొత్తం 2.64 లక్షల మందికి పైగా మరణించారు. భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 52,952కి చేరింది.

లైవ్ కవరేజీ

  1. కరోనావైరస్ మహమ్మారికి సంబంధించి నేటి ముఖ్యాంశాలివీ...

    • భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు, నమూనీకరణ సమాచారాన్ని బట్టి.. జూన్, జూలై నెలల్లో దేశంలో కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి పెరిగే అవకాశముందని ఎయిమ్స్ దిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.
    • దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెప్పింది. వీటిలో 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1783కు చేరింది.
    • భారత్‌లో దేశ వ్యాప్తంగా విధించిన కరోనావైరస్ లాక్ డౌన్‌తో ఒక్క ఏప్రిల్ నెలలోనే 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఒక ప్రైవేట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.
    • ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 56 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1833కు చేరింది. గత 24 గంటల్లో ఇద్దరు మృతిచెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 38కి చేరింది.
    • తెలంగాణలో గురువారం 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,122కు పెరిగింది.
    • ముంబై ఆర్థర్ రోడ్ జైలులో 72 మంది ఖైదీలు, ఏడుగురు సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబయిలోని దాదాపు 250 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నగర పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఏఎన్ఐకు చెప్పారు.
    • భారత రైల్వే విభాగం దేశవ్యాప్తంగా 231 రైల్వే స్టేషన్లలో.. 5,231 రైలు బోగీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చినట్లు రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
    • లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకు రావటానికి ‘వందే భారత్ మిషన్’ గురువారం ప్రారంభమైంది.
    • కోవిడ్-19 హై రిస్క్ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆరోగ్య సిబ్బంది మీద ఆయుష్ ఔషధాలను ఉపయోగిస్తూ వైద్య ప్రయోగాలు గురువారం ప్రారంభమయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు.
    • బలహీన దేశాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి, లక్షలాది ప్రాణాలు కాపాడ్డానికి మరో 4.7 బిలియన్ డాలర్ల విరాళాలు అందించాలని ఐక్యరాజ్యసమితి దాతలను కోరింది.
    • పాకిస్తాన్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇంకా వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ఐదు వారాలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను శనివారం నుంచి దశల వారీగా ఎత్తివేయటం మొదలుపెట్టాలని ఆ దేశం నిర్ణయించింది.
    • అమెరికా వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలను దశల వారీగా తొలగిస్తున్నారు. దీంతో షాపింగ్ సెంటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి.
    • అమెరికాలో గత వారంలో దాదాపు 32 లక్షల మంది నిరుద్యోగులుగా నమోదు చేసుకున్నారు. దీంతో మార్చి చివరి నుంచి ఇప్పటి వరకూ నిరుద్యోగులుగా నమోదు సుకున్న వారి సంఖ్య 3.30 కోట్ల మందికి పెరిగింది.
    • అమెరికాలో ప్రతి ఐదు ఇళ్లకు గాను ఒకటి కన్నా ఎక్కువ ఇళ్లలో అవసరమైనంత ఆహారం కోసం కష్టాలు పడుతున్నారని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ తాజా పరిశోధనలో వెల్లడైంది.
    • రష్యా రాజధాని మాస్కోలో లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తున్నట్లు నగర మేయర్ సెర్గీ సొబియానిన్ ప్రకటించారు. అయితే 12వ తేదీ నుంచి పరిశ్రమలు, నిర్మాణ పనులు ప్రారంభించవచ్చునన్నారు. రాజధాని నగరంలో 3,00,000 పైగా కేసులు ఉంటాయని ఆయనపేర్కొన్నారు.
    • బ్రిటన్‌లో కరోనావైరస్ కారణంగా తెల్ల వాళ్ల కన్నా నల్ల వాళ్లు చనిపోయే అవకాశం దాదాపు రెట్టింపు ఉందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తాజా విశ్లేషణ చెప్తోంది.
  2. మాస్కోలో లాక్‌డౌన్ మే 31 వరకూ పొడిగింపు

    మాస్కో

    ఫొటో సోర్స్, af

    రష్యా రాజధాని మాస్కోలో కరోనావైరస్ ఆంక్షలను మే 31 వరకూ పొడిగిస్తున్నట్లు నగర మేయర్ సెర్గీ సొబియానిన్ ప్రకటించారు.

    ఆయన తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఈ విషయం చెప్తూ.. మే 12 నుంచి పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించటం సహా కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు తెలిపారు.

    అయితే.. థియేటర్లు, రెస్టారెంట్లు, క్రీడా ప్రాంగణాలను తెరిచే సమయం ఇంకా రాలేదన్నారు.

    రష్యాలో 1,77,160 కేసులు నమోదవగా అందులో 92,676 కేసులు మాస్కోలోనే ఉన్నాయి. దేశంలో మొత్తం 1,625 మంది కరోనా వల్ల చనిపోగా అందులో 900 మంది మాస్కో పౌరులే ఉన్నారు.

    రాజధాని నగరంలో కరోనావైరస్ సోకిన వారి వాస్తవ సంఖ్య 3,00,000 లక్షల వరకూ ఉంటుందని మేయర్ ఇంతకుముందు పేర్కొన్నారు.

  3. తెలంగాణలో 15 కొత్త కేసులు.. మొత్తం కేసుల సంఖ్య 1,122

    తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,122కు పెరిగింది.

    వారిలో 693 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 400 మంది చికిత్స పొందుతున్నారు.

    ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనావైరస్ కారణంగా 29 మంది చనిపోయారు.

    గురువారం కొత్తగా హైదరాబాద్‌ పరిధిలో 12 కేసులు, ముగ్గురు వలసలు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం చెప్పింది.

    ‘‘ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి వస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తున్నాం.. అందులో భాగంగా ఈ రోజు ముంబై నుండి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది’’ అని సర్కారు పేర్కొంది.

    అలాగే.. ఇంతవరకూ వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కూడా నమోదు కాలేదని తెలిపింది.

    తెలంగాణ కేసులు
  4. కరోనావైరస్: విదేశాల్లోని భారతీయుల తరలించేందుకు 'వందే భారత్ మిషన్' ప్రారంభం

    ఎయిర్ ఇండియా

    ఫొటో సోర్స్, Getty Images

    లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ఇవాళ ప్రారంభం అవుతోంది.

    వచ్చే వారం రోజుల్లో 12 దేశాల నుంచి 60కి పైగా ప్రత్యేక విమానాలలో దాదాపు 15,000 మందిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

    అమెరికా, బ్రిటన్‌ దేశాల నుంచి వచ్చే విమానాలు గురువారమే భారత్ చేరుకోవాల్సి ఉంది. కానీ, విమాన సిబ్బందికి కోవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయడంలో ఆలస్యం కావడం వల్ల షెడ్యూలులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

    సింగపూర్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు గురువారం రాత్రి 11:15 గంటలకు దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం వెళ్లనుంది. అది సింగపూర్ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 11:35 గంటలకు దిల్లీ చేరుకోనుంది.

    కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ నిలిపివేసింది. దాంతో, వేల మంది భారతీయులు విదేశాల్లోనే ఉండిపోయారు.

    కొన్ని విమానాలతో కొంతమందిని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు 'వందే భారత్' మిషన్ పేరుతో వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

    ఈ మిషన్‌లో భాగంగా దాదాపు 2,00,000 మందిని వెనక్కి తీసుకురానున్నారని అంచనా.

  5. దిల్లీలో మద్యం కొనుగోళ్లకు ఈ-టికెట్ల పద్ధతి అమలు

    దేశ రాజధానిలో మద్యం దుకాణాల దగ్గర రద్దీని తగ్గించటానికి దిల్లీ ప్రభుత్వం ఈ-టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది.

    దుకాణాల దగ్గర సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా ఈ పద్ధతిని ప్రారంభించామని చెప్పింది.

    ఇందుకోసం ఒక వెబ్ లింక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ముంబై ఆర్థర్ రోడ్ జైలులో 72 మంది ఖైదీలకు కరోనా

    ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 72 మంది ఖైదీలకు, ఏడుగురు సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మహారాష్ట్ర జైలు అధికారులు తెలిపారు.

    పాజిటివ్ ఖైదీలను శుక్రవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య జీటీ హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్‌కు తరలిస్తామని చెప్పారు.

    వైరస్ సోకిన సిబ్బందిని వేరేగా ఆస్పత్రులకు పంపిస్తామన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. దుబాయ్ నుంచి 177 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం

    యూఏయీ సహా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన భారీ ఆపరేషన్ వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి తొలి విమానం బయలుదేరింది.

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నుంచి 177 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కేరళలోని కోజికోడ్‌కు పయనమైంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. యాంటీ-వైరల్ డ్రగ్ రెమిడిసివిర్‌కు జపాన్ ఆమోదం

    జపాన్

    ఫొటో సోర్స్, ge

    కరోనావైరస్ రోగులకు చికిత్స చేయటానికి యాంటీ-వైరల్ డ్రగ్ రెమిడిసివిర్‌ను ఉపయోగించటానికి జపాన్ ఆమోదం తెలిపింది.

    మరో ఔషధం అవిగన్‌ను వినియోగించటానికి కూడా ఈ నెలలో ఆమోదించే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.

    కరోనావైరస్ పేషెంట్లకు అత్యవసర పరిస్థితితుల్లో రెమిడిసివిర్‌తో చికిత్స చేయటానికి తొలుత గత వారంలో అమెరికా ఆమోదం తెలిపింది. ఆ మందుకు ఆమోదం తెలిపిన రెండో దేశం జపాన్.

    ఎబోలా వైరస్‌ వ్యాధికి చికిత్స చేయటానికి ఉపయోగించే ఈ ఔషధంతో.. కోవిడ్-19 రోగులు త్వరగా కోలుకుంటున్నారని ప్రయోగాత్మకంగా గుర్తించారు.

  9. బ్రిటన్‌లో నాటింగ్ హిల్ కార్నివాల్.. 50 ఏళ్ల చరిత్రలో మొదటిసారి రద్దు

    గత ఏడాది నాటింగ్ హిల్ కార్నివాల్‌‌లో 10 లక్షల మందికి పైగా జనం పాల్గొన్నారు

    ఫొటో సోర్స్, Getty Images

    బ్రిటన్‌లో అతిపెద్ద వార్షిక కార్యక్రమాల్లో ఒకటైన నాటింగ్ హిల్ కార్నివాల్‌లను.. 54 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా రద్దు చేశారు.

    ‘‘నాటింగ్ హిల్ వీధుల్లో ఈ ఏడాది కార్నివాల్ జరగదని బోర్డు నిర్ణయం తీసుకుంది’’ అని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

    అయితే.. నాటింగ్ హిల్ కార్నివాల్ 2020 స్ఫూర్తిని ప్రజల దగ్గరకు తీసుకెళ్లటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు.

  10. అమెరికాలో తెరుచుకున్న షాపింగ్ సెంటర్లు

    అమెరికా వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలను దశల వారీగా తొలగిస్తున్నారు. దీంతో షాపింగ్ సెంటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి.

    టెక్సస్ వంటి రాష్ట్రాల్లో మాల్స్‌ను 25 శాతం సామర్థ్యంతో నడిపించవచ్చు.

    కొనుగోలుదార్లకు సెక్యూరిటీ గార్డులు ఉచితంగా ఫేస్ మాస్కులు అందిస్తున్నారు. కొనుగోలుదార్లతో పాటు, షాపింగ్ సెంటర్ల యజమానులు కొన్ని భద్రతా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

    సామాజిక దూరం పాటించటం, ఉపరితలాలను శానిటైజ్ చేయటం వంటివి అందులో ఉన్నాయి.

  11. పాక్‌లో కేసులు తీవ్రంగా పెరుగుతున్నా.. లాక్‌డౌన్ ఎత్తివేతకు నిర్ణయం

    పాకిస్తాన్

    ఫొటో సోర్స్, AFP

    పాకిస్తాన్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇంకా వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ఐదు వారాలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను శనివారం నుంచి దశల వారీగా ఎత్తివేయటం మొదలుపెట్టాలని ఆ దేశం నిర్ణయించింది.

    ‘‘దేశంలో కేసుల సంఖ్య వంపు పై దిశగా పెరుగుతున్న సమయంలో మేం ఈ పని చేస్తున్నామని మాకు తెలుసు. కానీ.. మన జనం చాలా బాధలు పడుతున్నారు’’ అని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు.

    అయితే ప్రజా రవాణా, స్కూళ్లు మూసివేసే ఉంటాయి.

    పాక్‌లో గురువారం 1,523 కేసులు నమోదయ్యాయి. ఒక రోజు కేసుల్లో ఇదే అత్యధికం. లాక్‌డౌన్‌ సడలిస్తే దేశంలో కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతుందని డాక్టర్లు, నిపుణులు హెచ్చరించారు.

    ఇప్పటివరకూ పాకిస్తాన్‌లో 24,073 కరోనా కేసులు నమోదవగా, 564 మరణాలు సంభవించాయి.

  12. అమెరికాలో మార్చి నుంచి 3.30 కోట్ల మందికి పెరిగిన నిరుద్యోగులు

    అమెరికాలో నిరుద్యోగం

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలో గత వారంలో దాదాపు 32 లక్షల మంది నిరుద్యోగులగా నమోదు చేసుకున్నారు. దీంతో.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్‌డౌన్ మూసివేతలు మొదలైన మార్చి చివరి నుంచి ఇప్పటి వరకూ నిరుద్యోగులుగా నమోదు సుకున్న వారి సంఖ్య 3.30 కోట్ల మందికి పెరిగింది.

    అయితే.. ప్రతి వారం కొత్తగా నిరుద్యోగులుగా నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య గత కొన్ని వారాలుగా తగ్గుతోందని కార్మిక శాఖ గురువారం నాడు విడుదల చేసిన నివేదిక చెప్తోంది.

    కానీ.. ఈ నిరుద్యోగుల సంఖ్య అనూహ్యమైనదని, 2008 నాటి మాంద్యంతో పోల్చినా కూడా చాలా ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

    ఏప్రిల్ నెలలో నిరుద్యోగిత సంఖ్య శుక్రవారం తెలుస్తుంది.

  13. అమెరికా ఇళ్లలో ఆకలి కేకలు పెరిగాయ్

    అమెరికాలో ప్రతి ఐదు ఇళ్లకు గాను ఒకటి కన్నా ఎక్కువ ఇళ్లలో అవసరమైనంత ఆహారం కోసం కష్టాలు పడుతున్నారని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ తాజా పరిశోధనలో వెల్లడైంది.

    కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో కోట్లాది మంది నిరుద్యోగులుగా మారారు. దీంతో చాలా మంది ఆహారం కోసం, సాయం కోసం స్వచ్ఛంద సంస్థలు, ఆహార బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.

    ఏప్రిల్ చివరి నాటికి.. అమెరికాలో 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న ప్రతి ఐదు కుటుంబాల్లో రెండు కుటుంబాలకు ‘‘ఆహార భద్రత లేద’’ని వర్గీకరించినట్లు బ్రూకింగ్స్ అధ్యయనం చెప్తోంది.

    అంటే.. వారి ఇళ్లలో ఆహారం నిండుకున్నాయనో, ఆహారం కొనటానికి కావలసినంత డబ్బులు వారి దగ్గర లేదనో, కుటుంబానికి ఆహారం కొనేంత స్తోమత లేనందున పిల్లలు తగినంత ఆహారం తినటం లేదనో అర్థం.

    12 ఏళ్ల లోపు వయసు పిల్లలున్న ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబంలోని పిల్లలు తీవ్ర ఆహార అభద్రతలో ఉన్నారు.

    ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల 2008 నాటి తలెత్తిన మాంద్యం పరిస్థితుల్లో కన్నా ఇపుడు ఆహార అభద్రత మూడు రెట్లు అధికంగా ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

  14. దేశంలో కరోనా కేసులు జూన్, జూలై నెలల్లో తారాస్థాయికి పెరిగే అవకాశం: ఎయిమ్స్ డైరెక్టర్

    భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు, నమూనీకరణ సమాచారాన్ని బట్టి.. జూన్, జూలై నెలల్లో దేశంలో కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి పెరిగే అవకాశముందని ఎయిమ్స్ దిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.

    ‘‘అయితే.. లాక్‌డైన్‌ను పొడిగించటం ఎంతవరకూ ప్రభావవంతంగా ఉందనేది కాలంతో పాటు మాత్రమే మనకు తెలుస్తుంది’’ అని ఆయన గురువారం వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. కోవిడ్ కేర్ సెంటర్లుగా 5,231 బోగీలు.. 231 రైల్వే స్టేషన్లలో ఏర్పాటు

    రైల్వే కేర్ సెంటర్

    ఫొటో సోర్స్, PIB

    భారత రైల్వే విభాగం దేశవ్యాప్తంగా 231 రైల్వే స్టేషన్లలో.. 5,231 రైలు బోగీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చినట్లు రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు.. చాలా తక్కువ తీవ్రత ఉన్న కరోనా కేసులకు చికిత్స చేయటానికి ఈ కేర్ సెంటర్లను ఉపయోగించుకోవచ్చునని పేర్కొంది.

    కోవిడ్-19 సవాలును ఎదుర్కోవటానికి రైల్వే శాఖ 2,500 మందికి పైగా డాక్టర్లు, 35,000 మందికి పైగా పారామెడికల్ సిబ్బందిని మోహరించినట్లు చెప్పింది.

    అలాగే.. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటానికి కోవిడ్-19 రోగులకు చికిత్స అందించటం కోసం 17 రైల్వే ఆస్పత్రుల్లో 5,000 బెడ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

    ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రాలు తమకు అవసరమైన పక్షంలో ఈ బోగీలను కేర్ సెంటర్లుగా ఉపయోగించుకోవటానికి కోరవచ్చు. రైల్వేలు ఆమేరకు కేటాయించిన అవసరమైన రైల్వే స్టేషన్లలో ఈ రైలు బోగీలను ఏర్పాటు చేసి సంబంధిత రాష్ట్ర అధికారులకు అప్పగిస్తారు.

    రైల్వే కేర్  సెంటర్

    ఫొటో సోర్స్, PIB

  16. మాస్కోలో కరోనా కేసులు ‘‘చెప్తున్న దానికన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి’’

    రష్యా

    ఫొటో సోర్స్, Reuters

    రష్యా రాజధాని మాస్కో నగరం.. ఆ దేశంలో కరోనావైరస్ మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉంది. దేవంలో మొత్తం 1,77,160 కేసులను నమోదు చేస్తే.. మాస్కో నగరంలోనే 92,676 నిర్ధారిత కేసులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

    కానీ.. కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉందని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ పేర్కొన్నారు. రాజధాని నగరంలోనే దాదాపు 3,00,000 పైగా కేసులు ఉన్నాయని ఆయన చెప్పినట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

    ప్రపంచంలో అత్యధిక కరోనా కేసుల సంఖ్యలో రష్యా ఐదో స్థానంలో ఉన్నట్లు తాజా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 11,231 పెరిగాయి. రోజుకు 10,000 కన్నా ఎక్కువ కేసులు నమోదవటం వరుసగా ఇది ఐదో రోజు.

    అయితే దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,625గా చెప్తున్నారు. ఇది ప్రపంచంలో చాలా దేశాల కన్నా చాలా తక్కువ సంఖ్య. అతి తక్కువ కేసులు నమోదైన కొన్ని దేశాల్లో సైతం ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోయారు.

  17. ‘బ్రిటన్‌లో కరోనా వల్ల నల్ల వాళ్లు చనిపోయే అవకాశం రెండింతలు’

    బ్రిటన్‌లో కరోనావైరస్ కారణంగా తెల్ల వాళ్ల కన్నా నల్ల వాళ్లు చనిపోయే అవకాశం దాదాపు రెట్టింపు ఉందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తాజా విశ్లేషణ చెప్తోంది.

    2011 జనాభా లెక్కల్లో జాతుల సమాచారాన్ని, కోవిడ్-19 మరణాల వివరాలను కలిపి ఈ విశ్లేషణ చేశారు.

    వారి వారి వయసు, నివాస ప్రాంతం, పేదరికం, ప్రతికూలతలు, ఆరోగ్య పరిస్థితుల కొలమానాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాత.. తెల్ల వారి కన్నా నల్ల వారు 90 శాతం మరింత ఎక్కువగా చనిపోయే అవకాశం ఉందని విశ్లేషించారు.

    బ్రిటన్‌లో నివసించే భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల వారికి కూడా.. తెల్ల వారి కన్నా 30 నుంచి 80 శాతం ఎక్కువ ప్రమాదం ఉంది.

    అయితే ఈ విశ్లేషణ ప్రజల ప్రస్తుత ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోకపోవటం, ప్రస్తుతం మరింత ఇరుకు పరిస్థితుల్లో నివసిస్తున్నారా, వైరస్ నియంత్రణ పనుల్లో ముందు వరుసలో ఉన్నారా తదితర వివరాలను లెక్కలోకి తీసుకోలేదు. కాబట్టి జనాభా లెక్కల ఆధారంగా చేసిన ఈ విశ్లేషణ.. ఆయా జాతుల వారికి ఎక్కువ ముప్పు ఎందుకు ఉందనే కారణాలను పూర్తిగా వివరించజాలదు.

    రాబర్ట్ కఫ్

    బీబీసీ హెడ్ ఆఫ్ స్టాటిస్టిక్స్

  18. కోవిడ్-19: ఆరోగ్య సిబ్బంది మీద ఆయుష్ ఔషధాల ప్రయోగాలు ప్రారంభం

    కోవిడ్-19 హై రిస్క్ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆరోగ్య సిబ్బంది మీద ఆయుష్ ఔషధాలను ఉపయోగిస్తూ వైద్య ప్రయోగాలు గురువారం ప్రారంభమయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు.

    ‘‘దేశంలో ఒక చరిత్రాత్మక కృషి నేడు మొదలైంది. అశ్వగంథ, యష్టిమధు, గుడుచి పిప్పలి, ఆయుష్-64 వంటి ఆయుష్ ఔషధాలను.. ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది మీద ప్రయోగాత్మకంగా పరిశీలించే క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి’’ అని ఆయన దిల్లీలో విలేకరులతో చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఆయుష్ మంత్రిత్వశాఖ, ఆరోగ్యమంత్రిత్వశాఖ, సీఎస్ఐఆర్‌లు కలిసి.. ఐసీఎంఆర్ సాంకేతిక మద్దతుతో ఈ కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.

    రోగనిరోధక శక్తిని పెంపొందించటానికి ఆయుష్ సిఫారసు చేసిన ఔషధాల వినియోగం గురించి 50 లక్షల మంది ప్రజల నుంచి సమాచారం సేకరించటానికి ‘సంజీవని’ అనే పేరుతో ఒక యాప్ కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.

    దేశంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచటంతో రోగుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే.. మరణాల విషయంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 20 దేశాలకన్నా కూడా భారత్‌లో చాలా తక్కువగా ఉన్నాయని ఉటంకించారు.

    కరోనా మీద పోరాటంలో భారతదేశం విజయం దిశగా పయనిస్తోందన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. టూర్‌లో ఉన్నపుడు నాకు కోవిడ్-19 సోకింది: మడోనా

    మడోనా

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికన్ పాప్ ఐకన్ మడోనా.. తాను మేడేమ్ ఎక్స్ వరల్డ్ టూర్‌లో ఉండగా తనకు కరోనా వైరస్ సోకిందని బుధవారం ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పారు.

    అయితే తాను ప్రస్తుతం అనారోగ్యంతో లేనని వివరణ ఇచ్చారు. అయితే తనకు చేసిన కోవిడ్-19 యాంటీబాడీస్ నిర్ధారణ పరీక్ష పాజిటివ్‌గా తేలిందన్నారు.

    ‘‘యాంటీబాడీస్ టెస్టులో పాజిటివ్ వచ్చిందంటే.. వైరస్ సోకిందని అర్థం. నా టూర్ చివర్లో ఏడు వారాల కిందట ప్యారిస్‌లో ఉన్నపుడు నా షో లోని చాలా మంది కళాకారాలతో పాటు నేనూ అనారోగ్యం పాలయ్యాను. అప్పుడు మేమందరం తీవ్రంగా ఫ్లూ సోకిందని అనుకున్నాం’’ అని ఆమె వివరించారు. ఇప్పుడు అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.

    ఫ్రాన్స్ ప్రభుత్వం అన్నిరకాల సమావేశాలనూ నిషేధించటంతో మడోనా తన ప్రపంచ టూర్‌ను అర్థంతరంగా ముగించారు.

    ప్రస్తుతం 61 సంవత్సరాల వయసున్న ఈ పాప్ స్టార్.. కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన కోసం 10 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు.