కరోనావైరస్: భారత్‌లో 31,787కి చేరిన కేసులు, వలస కార్మికుల తరలింపుపై కేంద్రం మార్గదర్శకాలు
లాక్‌డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, యాత్రికులు, వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
లైవ్ కవరేజీ
కరోనావైరస్ సంక్షోభంలోనూ 98ఏళ్ల డాక్టర్ సేవలు
వృద్ధులు సులభంగా కరోనా వైరస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
కానీ ఫ్రాన్స్‌కు చెందిన 98 ఏళ్ల డాక్టర్ క్రిస్టియన్ చెనె మాత్రం దీన్ని లెక్క చేయడం లేదు.
ఇంత పెద్ద వయసులో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో వైద్యుడిగా తన సేవలను అందిస్తున్నారు.
ప్రతివారం రిటైర్‌మెంట్ హోమ్‌లలో ఉన్న వృద్ధులకు సేవ చేయడానికి వెళ్తున్నారు.
ఫ్రాన్స్‌లో ఫ్యామిలీ డాక్టర్ల కొరత ఉందని అందువల్ల తనవంతుగా సేవలందించాలని నిర్ణయించుకున్నానని డాక్టర్ చెనె చెబుతున్నారు.
దేశంలో కరోనా కేసులు 31,332
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 31,332కు చేరుకుంది. ఇందులో 1007 మంది మరణించగా,
7695 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపినట్లు ఏఎన్ఐ
వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
‘లాక్ డౌన్ వల్ల నెల రోజుల్లో 62 వేల ప్రాణాలు కాపాడాం’ – ఫ్రాన్స్ ప్రధాన మంత్రి, మే 11వ తేదీ నుంచి లాక్‌డౌన్ సడలింపు, ఫేస్ మాస్కులు తప్పనిసరి
ఫొటో సోర్స్, EPA
దేశవ్యాప్తంగా మే 11వ తేదీ నుంచి లాక్ డౌన్‌ను సడలిస్తున్నామని ఫ్రాన్స్
ప్రధాన మంత్రి ఎడౌర్డ్ ఫిలిప్పె తెలిపారు.
లాక్‌డౌన్ విధించడం వల్ల నెల రోజుల్లో 62 వేల ప్రాణాలను కాపాడగలిగామని
పార్లమెంటులో ఆయన చెప్పారు. అయితే, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా
చూసేందుకు లాక్‌డౌన్‌ను సడలించాల్సిన సమయం వచ్చిందని వివరించారు.
‘‘వైరస్‌తో కలసి బతకడాన్ని మనం నేర్చుకోవాలి’’ అని ఆయన చెప్పారు. వ్యాక్సిన్
లేదా సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చే వరకూ ఇది తప్పదన్నారు.
జూన్ నెలాఖరు నాటికి ‘ఒక కొత్త సాధారణ పరిస్థితి’ వస్తుందని ఆయన ఆశాభావం
వ్యక్తం చేశారు.
మే 11వ తేదీ నుంచి నిత్యావసరాలు కాని వస్తువుల దుకాణాలను, మార్కెట్లను
తెరుస్తారు. అయితే బార్లు, రెస్టారెంట్లు మాత్రం మూసే ఉంటాయి.
అయితే, దుకాణాల్లో పనిచేసేవారంతా ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి అని
ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, దుకాణాలకు వచ్చే వారు కూడా ఫేస్ మాస్కులు
ధరించాలని, మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని వివరించింది.
దేశంలో పాఠశాలల్ని కూడా క్రమంగా తెరవనున్నారు. కిండర్ గార్డెన్లు, ప్రైమరీ
స్కూళ్లు తొలుత ప్రారంభమవుతాయి.
కాగా, 11 నుంచి 15 సంవత్సరాల వరకూ విద్యార్థులు ఫేస్ మాస్కులు ధరించడం
తప్పనిసరి కాదని ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే, లాక్ డౌన్ సడలింపు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు తమతమ ఇళ్ల నుంచి
బయటకు రావొచ్చు. దీనికి ఎలాంటి అనుమతీ అవసరం లేదు. అయితే తాము బయటకు ఎందుకు
వచ్చిందీ వారు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, పది మంది వరకూ ప్రజలు
కలుసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
చిన్న పిల్లల ఆలనాపాలనా చూసే క్రెచ్ లను ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం
అనుమతి ఇచ్చింది. అయితే ఒక్కో గ్రూపులో 10 మంది పిల్లలు మాత్రమే ఉండాలని
తెలిపింది.
ఫ్రాన్స్ లో 1,29,859 మందికి కరోనావైరస్ సోకింది. 23,660 మందికి పైగా
చనిపోయారు.
అమెరికాలో పది లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజులో 2200 మంది మృతి
అమెరికాలో కరోనావైరస్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం.. అమెరికాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 10,12,582. వీరిలో 58,355 మంది మరణించారు.
ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఒక్క రోజే 2200 మంది మృతి చెందారని ఏఎఫ్‌పీ వార్తా
సంస్థ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి, కోలుకున్నవారు 1,15,936
మంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 57,95,728 మందికి కరోనా పరీక్షలు
జరిపారు.
కరోనావైరస్ లాక్ డౌన్: అమెరికాలో వ్యతిరేక నిరసనలకు కారణం ఏంటి?
ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత సమయంలో ఒక్క చోట వందల సంఖ్యలో జనం, అదీ మాస్క్‌లు
లేకుండా కనిపించడం కన్నా భయానక దృశ్యమేదైనా ఉంటుందా?
కానీ, అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో అదే
జరుగుతోంది. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగుతూ అక్కడి వాళ్లు
రోడ్ల మీదకు వస్తున్నారు.
నిత్యావసరాలు, మెడికల్ సామాగ్రి సరఫరా చేస్తున్న విమానాలు
లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాలు, మెడికల్ సామాగ్రిని
అందుబాటులో ఉంచేందుకు లైఫ్ లైన్ ఉడాన్ విమానాల సేవలు వినియోగించుకుంటున్నట్లు
కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది.
ఇందులో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ వరకు ప్రభుత్వ రంగానికి చెందిన 403
విమానాలను నడిపారు. ఇందులో 203 విమానాలు ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ సంస్థలవి
కాగా, మిగతా 200 విమానాలు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు.
ప్రైవేటు రంగంలో స్పైస్ జెట్, బ్లూ డార్ట్, ఇండిగో, విస్తారా విమానయాన
సంస్థలకు చెందిన విమానాలు సేవలు అందించాయి.
వీటిలో కొన్ని విమానాలు విదేశాల నుంచి భారత్‌కు అవసరమైన సామాగ్రిని
తీసుకురాగా, మరికొన్ని విమానాలు భారత్ నుంచి విదేశాలకు సామాగ్రిని తీసుకెళ్లాయి.
మార్చి 24వ తేదీ అర్థరాత్రి నుంచి భారత్‌లో లాక్ డౌన్ మొదలైంది. అప్పట్నుంచి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
లాక్‌డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో ఎరువుల అమ్మకాలు, కొనుగోళ్లు
దేశంలో కరోనావైరస్ విజృంభణ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో రికార్డు
స్థాయిలో ఎరువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ
తెలిపింది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రైతులకు 10.63 మెట్రిక్
టన్నుల ఎరువులను విక్రయించామని, గతేడాది ఇదేసమయంలో 8.02 మెట్రిక్ టన్నుల అమ్మకాలతో
పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ అని ప్రభుత్వం తెలిపింది.
అలాగే, ఇదే సమయంలో డీలర్లకు ఎరువుల అమ్మకాలు 15.77 మెట్రిక్ టన్నులుగా నమోదు
కాగా, గతేడాది 10.79 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఇది 46 శాతం ఎక్కువ అని
తెలిపింది.
లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల శాఖ, రైల్వేలు, రాష్ట్ర
ప్రభుత్వాలు, నౌకాశ్రయాలు ఉమ్మడి సహకారంతో దేశవ్యాప్తంగా ఎరువుల తయారీ, రవాణాకు
ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని వెల్లడించింది.
ఏపీలో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
ఫొటో క్యాప్షన్, కర్నూలు నుంచి గుంటూరుకు బయలుదేరిన వలస కూలీలు
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తిరిగి తమతమ
స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపాధి కోసం రాష్ట్రంలోనే వివిధ జిల్లాలకు వెళ్లిన వలస కూలీలు లాక్ డౌన్
కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. పనులన్నీ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని
వారు అధికారులకు వెల్లడించారు.
దీంతో వేరే జిల్లాల్లో ఉండి తమతమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీల కోసం
ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలోని గ్రీన్
జోన్‌లో ఉన్న వలస కూలీలను బస్సుల్లో కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లాలోని మల్లయపాలెం మండలం నుంచి 9 బస్సులు,
ప్రత్తిపాడు మండలం నుంచి 3 బస్సులు, మేడవారిపాలెం మండలం నుంచి 2 బస్సుల్లో వలస కూలీలు బయలుదేరి వెళ్లారు.
వీరందరికీ కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లక్షణాలు కనిపించిన
వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నామని, లక్షణాలు లేని వారిని వారివారి స్వస్థలాలు
గ్రీన్ జోన్‌లో ఉంటే ఇళ్లకు పంపిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
కరోనావైరస్‌పై బీబీసీ తెలుగు LIVE అప్‌డేట్స్ పేజీకి స్వాగతం
ఇప్పటివరకూ ఉన్న విశేషాలు...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్
కేసుల సంఖ్య 31,14,659కి చేరుకుంది. ఒక్క అమెరికాలోనే పది లక్షలు దాటాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 2,16,989. కోలుకున్న వారి
సంఖ్య 9,25,921.
భారతదేశంలో 22,010 యాక్టివ్ కేసులు ఉండగా, 937 మంది మరణించారు. 7026 మంది కోలుకున్నారు.
గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్
వద్ద చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు 3800 మందిని స్వరాష్ట్రానికి
తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్,
గుజరాత్ రాష్ట్రాల సహకారంతో బస్సుల్ని ఏర్పాటు చేశామని వివరించింది. ఉపాధి కోసం
వలస వెళ్లిన ఈ మత్స్యకారులు లాక్ డౌన్ నేపథ్యంలో గత 35 రోజులుగా అక్కడ
చిక్కుకుపోయారు.
పశ్చిమ బెంగాల్‌లో
నిత్యావసరాలు కాని వస్తువులను హోమ్ డెలివరీ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
అనుమతి ఇచ్చింది. అయితే డెలివరీ సందర్భంలో సిబ్బంది సామాజిక దూరం పాటించాలని, ఫేస్
మాస్కులు ధరించాలని, అన్ని రకాలుగా శుభ్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించింది.
గుజరాత్, మహారాష్ట్రల్లో
పలువురు పోలీసులకు కోవిడ్-19 సోకినట్లు ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
బ్రిటన్, ఐస్‌ల్యాండ్ దేశాల్లో
పలు విమానయాన సంస్థలు తమ సిబ్బంది సంఖ్యను తగ్గిస్తున్నారు. దీంతో వేలాది మంది
ఉపాధి కోల్పోతున్నారు.
కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ
చేస్తామని కర్ణాటక వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ ఏఎన్ఐ వార్తా
సంస్థతో చెప్పారు. తాము ఐసీఎంఆర్ నుంచి అనుమతి కూడా పొందామని ఆయన వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్నరోగి నుంచి ప్లాస్మాను సేకరించి దానిని కరోనాతో బాధపడుతున్న
రోగికి ఎక్కిస్తారు. తద్వారా రోగి శరీరంలోని వైరస్‌తో ఈ ప్లాస్మా పోరాడి, వైరస్‌ను
నాశనం చేస్తుందని సుధాకర్ చెప్పారు.