కరోనావైరస్ లాక్ డౌన్: అమెరికాలో వ్యతిరేక నిరసనలకు కారణం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీమ్ మఖ్బూల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ప్రస్తుత సమయంలో ఒక్క చోట వందల సంఖ్యలో జనం, అదీ మాస్క్‌లు లేకుండా కనిపించడం కన్నా భయానక దృశ్యమేదైనా ఉంటుందా?
కానీ, అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో అదే జరుగుతోంది. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగుతూ అక్కడి వాళ్లు రోడ్ల మీదకు వస్తున్నారు.
వ్యాపారాలను మూసేవేయాలని, జనాలను ఇళ్లకే పరిమితం కావాలని రాష్ట్ర గవర్నర్ తన రాజ్యాంగ అధికారాలను మీరి ఆదేశాలు ఇచ్చినట్లు తాము భావిస్తున్నామని కాపిటల్ గ్రౌండ్స్‌లో నిరసన ప్రదర్శనల నిర్వాహకుల్లో ఒకరైన టైలర్ మిల్లర్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు అమల్లోకి వస్తున్న సమయంలోనే గత మార్చిలో వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్‌స్లీ అత్యవసర ప్రకటన చేశారు. రెస్టారెంట్లు, బార్లను మూసివేయాలని, ఎక్కువ మంది ఒక్క చోట చేరకూడదని ఆదేశాలు ఇచ్చారు.
అయితే, కొంతమంది ఇది రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు.
‘‘శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును ఎప్పటికీ కాలరాయకూడదని దేశ రాజ్యాంగం చెబుతోంది. గవర్నర్ ఇచ్చిన (అత్యవసర) ఆదేశాలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయి’’ అని మిల్లర్ అంటున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తాను కూడా అంగీకరిస్తున్నానని, ప్రజారోగ్య సంస్థల సూచనలకు వ్యతిరేకంగా తాము నిరసనలు చేయట్లేదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘‘ఆరంభంలోనే కొన్ని అనుమానిత లక్షణాలు నాలో కనిపిస్తే, నాకు నేనుగా 14 రోజులు క్వారంటీన్‌లో ఉన్నా. జనం గుమిగూడటం మంచిదని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ, అలా గుమిగూడటాన్ని అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదని నేను నమ్ముతున్నా’’ అని మిల్లర్ చెప్పారు.
మిల్లర్ అమెరికా నావికాదళంలో ఇంజినీరింగ్ నిపుణుడు. లాక్‌డౌన్ సమయంలోనూ ఆయన పనిచేయగలుగుతున్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గవర్నర్ అధికారాన్ని మీరి వ్యవహరించడం పట్లే తాను ఆగ్రహం చెందానని మిల్లర్ తెలిపారు.
అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఆంక్షలు ఒక్కోలా ఉన్నాయి. దాదాపు 20 రాష్ట్రాల్లో ఇలా లాక్‌డౌన్ చర్యలపై నిరసన ప్రదర్శనలు జరిగాయి. వీటిలో జనం పదుల నుంచి మొదలుకొని వేల మంది దాకా పాల్గొంటున్నారు.
కరోనావైరస్ సంక్షోభంలో అమెరికా కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
అమెరికాలో కోవిడ్-19 మరణాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. కానీ, ఆంక్షలు ఎత్తివేయాలని ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు సైతం ఈ డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, STAR TRIBUNE VIA GETTY IMAGES
‘‘కరోనావైరస్ విషయంలో మొదటి నుంచి అవసరానికి మించి అతి చేస్తూ వచ్చారు. తప్పనిసరి షట్‌డౌన్‌లు, పునరావాస శిబిరాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అతిగా స్పందించాయి’’ అని నార్త్ డకోటా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు రిక్ బెకర్ అభిప్రాయపడ్డారు. ఈ ఆంక్షలు ఉండగానే అమెరికా వ్యాప్తంగా వేల మంది మరణించారు.
ఆంక్షలు విధించకపోతే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువై ఉండొచ్చనే వాదనను రిక్ బెకర్ తిరస్కరించారు. ఆయన స్వయంగా వైద్యుడు కూడా.
‘‘ఏదైమైనా మీరు అదే మాట అంటారు. ‘ఒక్క ప్రాణం కాపాడినా సరే’ అనే వాదనను మీరు చేస్తున్నారు. ఒక వేళ నేను గంటకు 50 మైళ్లకు బదులుగా 20 మైళ్ల వేగంతో కారు నడిపాను అనుకోండి. ఎవరినీ చంపకుండా ఉండొచ్చు. మన జీవితంలోని అన్ని అంశాలను మనం అలా చూడొచ్చు. కానీ, ఆ జీవనశైలితో దేశం మనుగడ సాధించలేదు. పతనమవుతుంది. మనం అలా బతకలేం’’ అని రిక్ బెకర్ అన్నారు.
బెకర్ పక్క రాష్ట్రం సాత్ డకోటాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు బాబ్ గ్లేంజర్ కరోనావైరస్ బారినపడే చనిపోయారు.
‘‘ఆయన అందరికీ సాయం చేసే వ్యక్తి. ఎదుటివారి బాధలను వినేవారు. ఆయన లోటు కచ్చితంగా ఉంటుంది’’ అని గ్లేంజర్ సహచర సభ్యురాలు జీన్ హున్హాఫ్ అన్నారు.
గ్లేంజర్ అంతిమ యాత్రలో తాను, ఇతర సహచర సభ్యులు అమెరికా, సౌత్ డకోటా జెండాలతో ఎలా పాల్గొన్నది ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతిమ యాత్రలు, అంత్యక్రియల సమయంలో సామాజిక దూరం పాటించేలా నిబంధనలు అమలవుతున్నాయి. కానీ, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని రాష్ట్ర వ్యాప్త ఆదేశం ఇవ్వని అతికొన్ని రాష్ట్రాల్లో సౌత్ డకోటా కూడా ఒకటి.
‘‘గవర్నర్ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. ఆమె మార్గదర్శకాలు జారీ చేశారు. పాటించాలా, లేదా అన్ని నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు’’ అని జీన్ అన్నారు.
‘‘నేను రిజిస్టర్డ్ నర్సును. సమాచారం ఆధారంగానే నిర్ణయాలు ఉండాలని నేను నమ్ముతా. అదే చేశామని నేను అనుకుంటున్నా. బయట ఉండి, తప్పులు ఎంచడం చాలా తేలిక’’ అని జీన్ అన్నారు.
కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ విధించేందుకు సౌత్ డకోటా లాంటి రాష్ట్రాలు ముందుకు రాకపోవడంపై విమర్శలు వచ్చాయి.
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన ఆంక్షలను అమెరికన్లలో ఎక్కువ మంది సమర్థిస్తున్నట్లు పోల్స్ చెబుతున్నాయి. కొందరైతే లాక్‌డౌన్ వ్యతిరేక నిరసనలకు అడ్డుపడ్డారు కూడా.
మినెసోటాలోని ఓ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మేరీ టర్నర్ నర్స్ లీడర్‌గా పనిచేస్తున్నారు.
తాను, తన సహచరులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నామని, లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నవారి తీరు తమను నిరుత్సాహానికి గురిచేస్తోందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఈ నిరసనలు మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. సామాజిక దూరం పాటించరు. మాస్క్‌లు వేసుకోరు. ఆగ్రహంతో ఉన్నామని అంటారు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి సమస్య ఉందా అనే విషయమైతే నాకు తెలియదు’’ అని మేరీ అన్నారు.
కానీ, నిరసనల్లో పాల్గొంటున్నవారు మాత్రం ప్రజారోగ్యాన్ని మించి ఆందోళన చెందాల్సిన అంశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో ప్రభుత్వంపై ఉన్న సందేహించేతత్వం అప్పుడప్పుడూ బలపడుతూ, అప్పుడప్పుడూ బలహీనపడుతూ ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెడా స్కోక్పాల్ అన్నారు.
లాక్‌డౌన్ వ్యతిరేక నిరసనల వెనుకున్నది ఆర్థిక కారణాలు కాదని, రాజకీయ భావజాలాలే దీన్ని నడిపిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. సంక్షోభ సమయంలో ఇలాంటి స్పందన సహజంగా కనిపించేదేనన్న వాదనను ఆమె కొట్టిపారేశారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

‘‘ఈ నిరసనలకు యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వం వహించడం లేదు. భావజాల శక్తులు దీన్ని నడిపిస్తున్నాయి. ప్రొఫెషనల్‌గా నడుస్తున్న సంప్రదాయవాద సంఘాలు వీటి వెనుక ఉన్నాయి’’ అని స్కోక్పాల్ అన్నారు.
‘‘అమెరికన్లు ప్రభుత్వంపై మరీ ఎక్కువ విశ్వాసం పెంచుకోకుండా చేయడం వారి లక్ష్యం. క్షేత్ర స్థాయిలో జనాల ఉద్దేశాలు, తమ ఉద్దేశాలు ఒకటేనా అని వాళ్లు పట్టించుకోరు. నిరసనల్లో పాల్గొంటున్నవారిలో చాలా మంది డోనల్డ్ ట్రంప్‌ను గట్టిగా సమర్థించేవారే’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
లాక్‌డౌన్ వల్ల నష్టపోతున్న కారణంగానే నిరసనల్లో పాల్గొంటున్నామని కొందరు చెబుతున్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని నినాదాలున్న జెండాలు, టోపీలు, చొక్కాలు ఈ నిరసనల్లో అంతటా కనిపిస్తున్నాయి. డెమొక్రటిక్ గవర్నర్లున్న రాష్ట్రాల్లో ఈ తీరు ఇంకా ఎక్కువగా ఉంది. అక్కడి నిరసనలు ట్రంప్ ర్యాలీలను తలపిస్తున్నాయి.
లాక్‌డౌన్ ఎత్తివేయాలని గట్టిగా మాట్లాడుతున్న నేతల్లో ప్రధానంగా డోనల్డ్ ట్రంప్ (రిపబ్లికన్) పార్టీ వాళ్లే ఉంటున్నారు. ఇక లాక్‌డౌన్ అమలు చేయని రాష్ట్రాల గవర్నర్లు కూడా ఆ పార్టీ నేతలే.
ట్రంప్ వైఖరిని అనుసరిస్తూనే చాలా మంది నేతలు, జనాలు లాక్‌డౌన్ వ్యతిరేక నిరసనలకు దిగుతున్నారని ప్రొఫెసర్ స్కోక్పాల్ అంటున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
‘‘తన ఆలోచనలేంటన్నదానిపై ట్రంప్ ఏమీ గోప్యత పాటించడం లేదు. కరోనావైరస్ విషయంలో మొదట్లో వ్యవహరించిన తీరు, దాని పరిణామాలు, ఆర్థిక ప్రభావం కలిసి తన అధ్యక్ష పదవికి ఎసరు రావొచ్చని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘ఆయన, ఆయన పార్టీ, ఆయన సమర్థకులు ఊరికే కూర్చుంటారనుకుంటే పొరపాటే. వాళ్ల దగ్గర వేరే ప్రణాళికలు ఉంటాయి. అవి ఒబామా మొదలు చైనా, డబ్ల్యూహెచ్ఓ... ఆఖరికి ఆంక్షలు విధించినవారిని కూడా నిందించడం కావొచ్చు’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
లాక్‌డౌన్ వ్యతిరేక నిరసనకారులను ట్రంప్ ఇటీవల బహిరంగంగానే సమర్థిస్తున్నారు.
అయితే, అధ్యక్ష కార్యాలయం నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. డెమొక్రటిక్ ప్రభుత్వాలున్న కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయాలని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ ఇదివరకు సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో రిపబ్లికన్ గవర్నర్ ఉన్న జార్జియాలో లాక్‌డౌన్ ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ‘అసంతృప్తి’ వ్యక్తం చేశారు.
రోజూ వందల సంఖ్యలో జనాన్ని కరోనావైరస్ బలి తీసుకుంటున్న సమయంలో ప్రజా సంక్షేమం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన కఠిన సవాలును గవర్నర్లు ఎదుర్కొంటున్నారు.
కరోనావైరస్‌కు తోడు ఆర్థిక, రాజకీయపరమైన ఒత్తిడి ఇప్పుడు వారికి మరింత భారంగా మారుతోంది.
అదనపు రిపోర్టింగ్: ఇవా ఆర్టెసోనా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి.
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్‌కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
- కరోనావైరస్: 'కశ్మీర్లో 7 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేదు, వైరస్ వార్తలు, జాగ్రత్తలు తెలుసుకునేదెలా?'
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























