కరోనావైరస్: భారత్‌లో 29,974కి చేరిన కేసుల సంఖ్య, 937 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. 2,12,345 మంది మరణించారు.
లైవ్ కవరేజీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 30,63,814కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 2,12,345మంది మృతిచెందారు.
- అమెరికాలో కోవిడ్-19 కేసుల సంఖ్య 9,90,135కు పెరిగింది. మృతుల సంఖ్య 56,475కు పెరిగింది.
- స్పెయిన్‌లో కరోనా పాజిటివ్ కేసులు 2,32,128కు చేరాయి. మొత్తం మృతుల సంఖ్య 23,822.
- ఇటలీలో కోవిడ్-19 కేసులు 1,99,414కు చేరాయి. ఇక్కడ మృతుల సంఖ్య 26,977కు పెరిగింది.
- ఫ్రాన్స్ లో కరోనా పాజిటివ్ కేసులు1,66,036కు చేరుకుంది. మృతుల సంఖ్య 23,327కు పెరిగింది.
- బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 1,58,353కు పెరిగింది. మొత్తం 21,158 మంది చనిపోయారు.
- భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,974కి చేరింది. దేశంలో కోవిడ్‌తో మొత్తం 937 మంది చనిపోయారు.
- తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1009కి చేరింది. మృతుల సంఖ్య 25 దగ్గరే ఉంది.
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు 1259కి చేరాయి. మృతుల సంఖ్య 31 దగ్గరే ఉంది.

'వంద కోట్ల మంది ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది', అంతర్జాతీయ సంస్థ హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం బలహీనమైన దేశాలకు అత్యవసర సహాయం అందించకపోతే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడే ప్రమాదముందని అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ (ఐఆర్‌సీ) హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆర్థికపరమైన, మానవతా సహాయం అవసరమని తెలిపింది.
అఫ్గానిస్థాన్, సిరియా లాంటి "బలహీన దేశాలకు అత్యవసర నిధులు" అవసరమని ఆ సంస్థ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 బారిన పడి ఇప్పటికే 2,00,000 మందికి పైగా మరణించారు.
మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలు దాటిపోయిందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇంపీరియల్ కాలేజ్ లండన్‌ల నుంచి సేకరించిన నమూనాలు, డేటా ఆధారంగా ఐఆర్‌సీ ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా 50 నుంచి 100 కోట్ల మంది ఈ అంటు వ్యాధి బారిన పడే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది.
అస్థిర, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశాలలో 30 లక్షలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
ఫ్రాన్సులో లాక్‌డౌన్ 'నెలలో 62,000 మంది ప్రాణాలను కాపాడింది'

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్సులో లాక్‌డౌన్ విధించడం వల్ల నెల రోజుల్లో 62,000 మంది ప్రాణాలను కాపాడగలిగామని ఆ దేశ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్ అన్నారు.
మే 11 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలించాలని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 1,65,842 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో దాదాపు 23,300 మంది చనిపోయారు.
తెలంగాణలో 6 కొత్త కేసులు, 42 మంది డిశ్చార్జ్

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో కొత్తగా ఆరు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరింది.
ఈ ఆరు కొత్త కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరన్ సోకి 25 మంది మృతిచెందారని, 374 మంది కోలుకున్నారని తెలిపారు.
ఇవాళ ఒక్క రోజే 42 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, 610 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి వెల్లడించారు.
నెల్లూరు కోవిడ్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న రోబో

ఫొటో సోర్స్, V Shankar
నెల్లూరు జి.జి.హెచ్ కోవిడ్ ఆస్పత్రిలో ఆధునాతన రోబో అందుబాటులోకి వచ్చింది.
"నెల్ బాట్" అని పిలిచే ఈ రోబోను, ఏపీఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు సయ్యద్ నిజాముద్దీన్, పర్వేజ్ హుస్సేన్, జాయింట్ కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్‌కు అందించారు.
ఈ రోబో ఐసోలేషన్ వార్డులో ఏ విధంగా పనిచేస్తుందో డెమో చేసి చూపించారు.
ఇది చాలా చక్కగా పనిచేస్తోందని, ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వారికి ఈ రోబో ద్వారా మందులు, వార్తా పత్రికలు, ఆహార పదార్థాలు అందించవచ్చని జాయింట్ కలెక్టర్ చెప్పారు.
ఈ రోబో అందుబాటులో ఉంటే, ప్రతి చిన్న పనికి వైద్యులు, నర్సులు లోపలికి వెల్లనవసరం లేదని, రోగులకు అవసరమైన వస్తువులను, పదార్థాలను ఐసోలేషన్ వార్డులోకి ఈ రోబో తీసుకెళ్తుందని వివరించారు.
రోగులతో వారి బంధువులు మాట్లాడాలి అనుకున్నా, ఈ రోబోలో వీడియో కాల్ చేయగలిగే సదుపాయం కూడా ఉందని, దీని ద్వారా రోగి వద్దకు వెల్లకుండానే వారితో మాట్లాడవచ్చని జేసీ తెలిపారు.
భారత్‌లో 24 గంటల్లో 1,543 కొత్త కేసులు

ఫొటో సోర్స్, ANI
దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,543 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది.
దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 29, 435కు చేరింది.
నిన్నటి నుంచి ఇప్పటి వరకు 684 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం రికవరీ రేటు 23.3 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
రికవరీ రేటులో పెరుగుదల ఉందని, ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు.
కరోనా యుద్ధవీరులకు నివాళి

ఫొటో సోర్స్, PA Media
బ్రిటన్‌లో కరోనా కట్టడి కోసం తమ ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తూ ఈ పోరాటంలో మృత్యువు ఒడికి చేరిన 114 మంది నేషనల్ హెల్త్ సర్వీస్ సిబ్బందికి నివాళిగా యూకేలో దేశవ్యాప్తంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించడం ద్వారా వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాని బోరిస్ జాన్సన్, మంత్రులతో పాటు దేశవ్యాప్తంగా అనేకమంది వైద్య సిబ్బంది, ప్రజలు వారికి నివాళులర్పించారు.
వివిధ ఆసుపత్రుల ముందు సిబ్బంది తమ సహచరులకు మౌనం పాటించడం ద్వారా అంజలి ఘటించడం కనిపించింది.

ఫొటో సోర్స్, PA Media
చైనా ర్యాపిడ్ కిట్లలో లోపాలు- ఆర్డర్‌ను రద్దు చేసిన భారత్

ఫొటో సోర్స్, Science Photo Library
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం చైనా నుంచి దాదాపు 50 లక్షల కరోనావైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకునేందుకు ఇచ్చిన ఆర్డర్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కిట్లలో లోపాలు ఉన్నాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటికే పలు రాష్ట్రాలలో వాడుతున్న ఈ కిట్లను ఇక వాడరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
రక్తంలో ఉన్న యాండీబాడీలను, వైరస్‌లను కేవలం 30 నిమిషాల్లో ఈ కిట్ల ద్వారా కనుక్కోవచ్చని చెబుతున్నారు. ఒక ప్రాంతంలో వైరస్ ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోడానికి ఈ కిట్లు అధికారులకు ఉపయోగపడతాయని భావించారు.
అయితే, ఆర్డర్ రద్దు చేయడానికి భారత్ చెబుతున్న కారణాలను చైనా ఖండిస్తోంది.
‘‘చైనా నుంచి ఎగుమతి అయ్యే వైద్య పరికరాలలో అత్యధిక నాణ్యత ఉండేలా చూస్తాం. కానీ కొందరు మనసులో ఏదో పెట్టుకుని చైనా సరుకులు నకిలీవని, సరిగా పని చేయవని ప్రకటనలు చేస్తుంటారు. ఇది సరికాదు’’ అని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కరోనాను గుర్తించలేవని తేలింది. వాటి పని తీరుపై ఇప్పటికే అనేకమంది నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఒక పక్క అధికారులు, సిబ్బంది సరిపడే స్థాయిలో పరీక్షలు నిర్వహించలేకపోతుండటంతో... ఈ కిట్లను ఉపయోగించడానికి అనుమతించాల్సిందిగా వివిధ రాష్ట్రాలు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్ )ను ఒత్తిడి చేశాయి.
మొదట్లో ఐసీఎంఆర్ విముఖత వ్యక్తం చేసినప్పటికీ, చైనాకు చెందిన రెండు కంపెనీల నుంచి ఈ కిట్లను దిగుమతి చేసుకోడానికి అంగీకరించింది. అయితే, ఆ తరువాత వాటి పనితీరు బైటపడింది. కేవలం 5 శాతం మేరకే కచ్చితమైన ఫలితాలను చూపించగలుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి వీటితో పరీక్షలు చేసినప్పుడు నెగెటివ్ ఫలితాలు వచ్చాయి.
ఆ తర్వాత ఐసీఎంఆర్ కూడా వాటిని వాటిని పరిశీలించి, లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లకు అవసరమైన దానికి ఎక్కువ ధర పెట్టి కొన్నారన్న దిల్లీ హైకోర్టు, వీలైనంత తక్కువ ధరకే ఈ టెస్టులు జరపాలంటూ ఆదేశించడంతో సమస్య మరింత ముదిరింది.
అయితే, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. కిట్ల కోసం ముందుస్తు చెల్లింపులేవీ జరపలేదని, ఇప్పుడు ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేశామని చెప్పారు అధికారులు.
కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకింది. ఈ మహమ్మారి బారిన పడి రెండు లక్షల మందికి పైగా మరణించారు.
భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. తొమ్మిది వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో అత్యధికంగా కోవిడ్ బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. 56 వేల మందికి పైగా చనిపోయారు.
మరి, ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని లక్షణాలను ఎలా గుర్తించాలి?
55 ఏళ్లు దాటిన పోలీసులు లాక్ డౌన్ ముగిసే వరకు ఇళ్లకే పరిమితం - ముంబయి పోలీస్
ముంబయి నగరంలో ముగ్గురు పోలీసులు కరోనావైరస్ సోకి మృతి చెందారు. వీరిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు కాగా, మరొకరు కానిస్టేబుల్.
ఈ నేపథ్యంలో 55 ఏళ్లు దాటిన పోలీసులంతా ఇళ్లల్లోనే ఉండాలని నగర పోలీసు అధికారులు సూచించారు.
లాక్ డౌన్ ముగిసే వరకూ వయసు పైబడిన పోలీసులంతా ఇళ్లల్లోనే ఉంటారని ముంబయి పోలీసు విభాగం అధికారులు వెల్లడించారు.
కోవిడ్-19 చికిత్స పొందుతున్న 56 ఏళ్ల పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఒకరు సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు ట్విటర్‌లో ధృవీకరించారు.
గత 24 గంటల్లో మహారాష్ట్రలో 500 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8500 దాటింది.
కాగా, పోలీసుల మృతి నేపథ్యంలో సినీ నటుడు అక్షయ్ కుమార్ ముంబయి పోలీసు ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ‘రహదారులు తవ్వేస్తున్న ఒడిశా’.. తిరిగి పూడ్చిన అధికారులు
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో సరిహద్దు రాష్ట్రం ఒడిశాలోని ప్రజలు అంతరాష్ర్ట రహదారులను తవ్వేస్తున్నారని, దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇటీవల 4 కరోనా పాజీటివ్ కేసులు నమోదయ్యాయి. పాతపట్నం.. ఒడిశాలోని గజపతి జిల్లాను ఆనుకొని ఉంటుంది. నిత్యం ఇరు రాష్ట్రాలకు చెందిన వారు అటూ ఇటూ రాకపోకలు సాగిస్తుంటారు. ఐతే పాతపట్నంలో కరోనా కేసులు వెలుగు చూడ్డంతో సరిహద్దు రోడ్లను తవ్వేశారు.
ఇదే సమయంలో కొత్తూరు మండలం అల్తి పంచాయితీ దిగువరాయిగూడకు చెందిన ఒక గర్భిణికి సోమవారం పురిటినోప్పులు రావడంతో కుటుంబ సభ్యులు డోలీలో హాస్పిటల్ కు తరలిస్తుండగా.. రోడ్డును తవ్వేసిన కారణంగా అతికష్టంమీద రోడ్డు దాంటించాల్సి వచ్చింది. ప్రధాన రహదారి వరకూ గర్భిణిని డోలీలో తీసుకెళ్లి అక్కడ నుంచి మరో వాహనంలో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుకున్న పాలకొండ ఐటీడీఏ అధికారులు వెంటనే ఒడిశా అధికారులతో మాట్లాడి, గుంతలు పూడ్చి ఆ రహదారిని తిరిగి వాడుకలోకి తెచ్చారని కొత్తూరు ఎండీవో సత్యం బీబీసీకి తెలిపారు.
కాగా, ఒడిశా ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ప్రజలు ఈ రోడ్లను తవ్వేస్తున్నారని ఏపీ అధికారులు అంటున్నారు.
దీనిపై ఒడిశావైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.



30 వేలకు చేరువలో భారతదేశంలో కరోనా కేసులు
భారతదేశంలో కరోనా కేసులు 30 వేలకు చేరువలో ఉన్నాయి.
28వ తేదీ మంగళవారం ఉదయానికి దేశంలో 29,435 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇందులో యాక్టివ్ కేసులు 21,632 6868 మంది కోలుకోగా, 934 మంది మరణించారని, ఒకరు వేరే దేశానికి వెళ్లిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టండి – కేంద్రానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సూచన
కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలను వారి స్వరాష్ట్రాలకు, స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని నవీన్ పట్నాయక్ ప్రస్తావించారని సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, యాత్రికులు, రోగులు, నిపుణులను తిరిగి వారి ప్రాంతాలకు చేర్చుందుకు జాతీయ స్థాయిలో ప్రామాణిక కార్యాచరణ విధానం (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్-ఎస్ఓపీ)ని తయారు చేయాలని సీఎం కోరారు.
కాగా, అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్-19 నిర్థరణ పరీక్షలు పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచాలని కూడా సూచించారు.
కాగా, కోవిడ్-19 సోకి జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి రూ.15 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని నవీన్ పట్నాయక్ నిర్ణయించారని ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులంతా నిబద్ధతతో పనిచేస్తున్నారని సీఎం చెప్పినట్లు సీఎంఓ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, twitter/Naveen_Odisha
ఫొటో క్యాప్షన్, నవీన్ పట్నాయక్ పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నైజీరియాలో లాక్‌డౌన్ పొడిగింపు.. కనో రాష్ట్రంలో అంతుపట్టని మరణాలపై దర్యాప్తుకు ఆదేశం
ఈనెల 27వ తేదీ సోమవారంతో ముగియాల్సిన లాక్ డౌన్‌ను మే 4వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ప్రకటించారు.
అయితే, రాజధాని నగరం అబూజా, అతిపెద్ద నగరం లాగోస్‌ల్లో మాత్రం లాక్ డౌన్ నిబంధనలు క్రమంగా సడలిస్తామని తెలిపారు.
ఈ మేరకు దేశవ్యాప్తంగా కరోనావైరస్ పై పోరాడేందుకు తీసుకోవాల్సిన సరికొత్త మార్గదర్శకాలను ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తారు. ప్రజలంతా తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
మార్చి 30వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్‌లో ఉన్నారు.
ఆఫ్రికా ఖండంలో అత్యధిక (20 కోట్లకు పైగా) జనాభా, ఆర్థిక వ్యవస్థ కలిగిన నైజీరియాలో ఇప్పటి వరకూ 1,273 కరోనావైరస్ కేసులు నమోదు కాగా, అందులో 40 మంది మరణించారు.
మిస్టరీ మరణాలు..
కాగా, ఉత్తర నైజీరియాలోని కనో రాష్ట్రంలో అంతుపట్టని మరణాలు నమోదవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణం కంటే అధిక స్థాయిలో తాము మృతదేహాలను ఖననం చేస్తున్నామని రాష్ట్ర స్మశానవాటికల్లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు.
అయితే, అధికారులు మాత్రం ఈ మరణాలన్నీ కరోనావైరస్‌కు సంబంధించినవి కాదని, సాధారణ మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయని వివరించారు.
దీనిపై దేశాధ్యక్షుడు బుహారీ స్పందిస్తూ.. ఈ అంతుబట్టని మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. వీటిపై దర్యాప్తు చేసేందుకు ఒక బృందాన్ని పంపిస్తున్నామని ప్రకటించారు.

ఫొటో సోర్స్, AFP
ఫొటో క్యాప్షన్, సాధారణం కంటే అధిక స్థాయిలో తాము మృతదేహాలను ఖననం చేస్తున్నామని కనో రాష్ట్ర స్మశానవాటికల్లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. ‘వైసీపీ రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా పరీక్షలపై లేదు’ - ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు.
ఒక అసాధారణ, సంక్లిష్ట పరిస్థితిలో దేశం, రాష్ట్రం ఉన్నాయని, మానవ జాతి చరిత్రలో, నాగరిక సమాజం ఎదుర్కొన్న పెను విపత్తులలో కరోనా సంక్షోభం కనీవినీ ఎరుగనిదని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
గత వారం రోజుల్లోనే రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వ లెక్కలే వెల్లడిస్తున్నాయని, కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నామని తెలిపారు.
‘‘కరోనా వైరస్ కువ్యాక్సిన్ కనుక్కోవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. అప్పటిదాకా ముందు జాగ్రత్తలే దీనికి మందు. భౌతిక దూరం పాటించడం, పదేపదే చేతులు శుభ్రపర్చుకోడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక శుభ్రత పాటించాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎక్కడా గుంపులుగా గుమికూడరాదు. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలి’’ అని సూచించారు.
కరొనా మహమ్మారి భయోత్పాతంప్రజల జీవితాలతో పాటు, వారి జీవనోపాధిని కూడా ప్రమాదంలోకి నెట్టిందని, వలస కార్మికులు, చేతివృత్తులవారు, ఇతర అసంఘటిత కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని వివరించారు.
రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని పేర్కొన్నారు.
విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బయటపడుతుందని, క్షేత్ర స్థాయిలో ఉపశమన చర్యలు తీసుకోవడంతోపాటు యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా సహాయ, పునరావాస చర్యలను వేగిరపర్చడమే నాయకత్వ లక్షణం కాగా, ఈ వ్యవహారాల్లో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా పని చేస్తోందని, రైతులు, పేదల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు ఇళ్లలోనే 12గంటల నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు.
అయితే అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కనీసం కంటైన్ మెంట్ జోన్లలో కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, అందువల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూఉధృతం అయ్యిందని ఆరోపించారు.
‘‘మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనం బైటపెట్టడం పాలకుల లక్షణం కాదు. అప్పుడు ‘‘కరోనా వస్తుంది, పోతుంది, పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’’ అని తేలిగ్గా వ్యాఖ్యలు, ఇప్పుడు ‘‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’’ అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బైటపెట్టాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్ని ఎక్కువ టెస్ట్ లు జరిపితే కరోనా వైరస్ ను అంతగా కట్టడి చేయగలమనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన అంశం కాగా,రాష్ట్రంలో మాత్రం టెస్టింగ్ లను నిర్లక్ష్యం చేయడమే పెను విషాదం అయ్యిందని అభివర్ణించారు.
ప్రాణాలు కాపాడే డాక్టర్లు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం, నాసిరకం పిపిఈలతో కరోనా వైరస్ పై యుద్దానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశమే అవుతోందన్నారు.
ఒక ఎంపి కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకడం, వారిలో నలుగురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్ భవన్ లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అని ఆరోపించారు.
రాజధాని తరలింపుపై ఉన్న శ్రద్ద, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలపై లేకుండా పోయిందని, ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయడంలో చూపే ఆసక్తి, ప్రజలకు వైరస్ టెస్టింగ్ లు నిర్వహించడంలో లేకపోవడం మన రాష్ట్రంలో పాలకుల ప్రాధాన్యాలకు ప్రత్యక్ష రుజువు అని విమర్శలు చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే ముందుకొచ్చి తమ పౌర బాధ్యతలు నెరవేర్చాలని, సమాజాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
‘‘కష్టాలు కల కాలం ఉండవు. అందుకే అందరూ ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో భవిష్యత్ వైపు దృష్టి సారించాలి. కరోనా నేర్పిన పాఠాలతో, ఆరోగ్యంలో ముందు జాగ్రత్తలు పాటిస్తూ, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ధృడత్వాన్ని పెంచుకోవాలి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటూ, సామాజిక బంధాలను పరిరక్షించుకుంటూ, మనందరం ఆరోగ్యంగా, క్షేమంగా ఉందాం.. సమాజాన్ని సురక్షితంగా ఉంచుదాం’’ అని చంద్రబాబు ఈ లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు.. 1259కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రకటించింది.
ఈమేరకు 28వ తేదీ మంగళవారం బులెటిన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు 1259. వీరిలో 258 డిశ్చార్జ్ కాగా, మరో 31 మంది మరణించారు.
జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కర్నూలులో 332 కేసులు, గుంటూరులో 254 కేసులు, కృష్ణాలో 223 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
గడచిన 24 గంటల్లో 5783 శాంపిల్స్ పరీక్షించగా 82 మందికి కోవిడ్ సోకినట్లు నిర్థరణ అయ్యిందని ప్రభుత్వం తెలిపింది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కోవిడ్ అస్పత్రుల్లో పనిచేసేందుకు కొత్తగా 1170 మంది డాక్టర్లను నియమించామని వెల్లడించింది.

వైరల్ మెసేజ్‌లు 70 శాతం తగ్గాయి – వాట్సాప్
కరోనావైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వైరల్ మెసేజ్‌లు 70 శాతం తగ్గిపోయాయని వాట్సాప్ సంస్థ తెలిపింది.
రెండు వారాల కిందట వాట్సాప్ సంస్థ ఈ సోషల్ మెసేజింగ్ యాప్‌లో నిబంధనలను మార్చింది. ఒక మెసేజ్‌ను వ్యక్తిగత యూజర్లు ఒకేసారి ఐదుగురికి, గ్రూపులో అయితే ఒక్క గ్రూపుకు మాత్రమే పంపించగలిగేలా మార్పులు చేసింది.
అయితే, తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా వాట్సాప్ చేయాల్సింది చాలా ఉందని, ఇప్పుడు చేసింది చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
అయితే, వైరల్ మెసేజ్‌లను నిరోధించేందుకు తాము తమవంతు పాత్ర పోషించేందుకు కట్టుబడి ఉన్నామని వాట్సాప్ అధికార ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యూట్యూబ్‌లో సినిమాల పండుగ.. పది రోజులు ఫ్రీగా సినిమాల ప్రదర్శన.. ఏకమైన ప్రధాన ఫిల్మ్ ఫెస్టివల్స్
కరోనావైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సినిమాల ప్రదర్శనలు నిలిచిపోయాయి. అలాగే ప్రతి ఏటా జరిగే కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అయితే, యూట్యూబ్ వేదికగా సినిమాలను ప్రదర్శించేందుకు ప్రధాన ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వాహకులు ముందుకొచ్చారు.
వి ఆర్ వన్: ఎ గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట మే 29వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు జరిగే ఈ సినిమాల పండుగకు యూట్యూబ్ వేదిక కానుంది.
ఇందులో ప్రదర్శించే సినిమాలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉచితంగా చూడొచ్చని వి ఆర్ వన్ యూట్యూబ్ చానెల్ తెలిపింది.
బెర్లిన్, కేన్స్, టొరంటో, వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌తో పాటు ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, జెరూసలెం ఫిల్మ్ ఫెస్టివల్ వంటి మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి 20 ఫిల్మ్ ఫెస్టివల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.
10 రోజుల పాటు జరిగే ఈ డిజిటల్ సినిమా ప్రదర్శనల ద్వారా వచ్చే సొమ్ము ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) కోవిడ్ -19 సంఘీభావ స్పందన నిధికి వెళ్తుంది.
కాగా, ఏ రోజు ఏఏ సినిమాలను విడుదల చేస్తున్నారన్న షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు.

ఫొటో సోర్స్, We Are One
సెప్టెంబర్ 1వ తేదీ వరకు అన్ని విమాన ప్రయాణాలు రద్దు చేసిన అర్జెంటీనా
కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో అన్ని జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలను సెప్టెంబర్ 1వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అర్జెంటీనా ప్రకటించింది.
రాబోయే నాలుగు నెలల పాటు విమానయాన సంస్థలు టికెట్లను కూడా విక్రయించరాదని ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఈ పరిణామంతో లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని విమానయాన రంగ వర్గాలు చెబుతున్నాయి.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకా ప్రకారం చూస్తే.. అర్జెంటీనాలో ఇప్పటి వరకూ దాదాను 4 వేల కరోనా కేసులు, 192 మరణాలు సంభవించాయి.
చాలా దక్షిణ అమెరికా దేశాలు కూడా విమానాలను రద్దు చేశాయి. అయితే, అవేవీ కూడా అర్జెంటీనాలాగా సుదీర్ఘకాలం పాటు రద్దు చేయలేదు.
అర్జెంటీనా మార్చి 20వ తేదీ నుంచి లాక్ డౌన్‌ను అమలు చేస్తోంది. అప్పటి నుంచి చాలా విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
