You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో 31,787కి చేరిన కేసులు, వలస కార్మికుల తరలింపుపై కేంద్రం మార్గదర్శకాలు

లాక్‌డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, యాత్రికులు, వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

లైవ్ కవరేజీ

  1. ఈ LIVE పేజీ ఇక్కడితో ముగిసిపోయింది.

    ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దాదాపు 32 లక్షల కరోనావైరస్ బాధితుల్లో 2.27 లక్షల మంది చనిపోయారు.

    అమెరికాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. మృతుల సంఖ్య 60 వేలు దాటింది. పది లక్షల మందికి వైరస్ సోకింది.

    భారత్‌లో 31,787 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 8 వేల మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

    తాజా సమాచారం ప్రకారం ఎబోలా వైరస్ బాధితుల చికిత్సకు ఉపయోగించిన రెమిడిస్వియర్ మందు కోవిడ్ రోగులపై పని చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని అమెరికా తెలిపింది.

  2. ప్రపంచవ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్

    జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,42,942కు చేరింది. మొత్తం 2,18,727 మంది కరోనా రోగులు మృతిచెందారు.

    • అమెరికాలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 10,15,289కు పెరిగింది. అగ్రరాజ్యంలో మొత్తం 58,529 మంది చనిపోయారు.
    • స్పెయిన్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,36,899కు చేరింది. దేశవ్యాప్తంగా 24,275 మంది కరోనా రోగులు మృతిచెందారు.
    • ఇటలీలో ధ్రువీకరించిన కరోనా కేసులు 2,01,505కు చేరింది. దేశంలో మొత్తం 27,359 మంది చనిపోయారు.
    • ఫ్రాన్స్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,053. ఇక్కడ23,694 మంది మృతిచెందారు.
    • బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 1,62,353కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 21,745 మంది మరణించారు.
    • భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,787కు పెరిగాయి. మొత్తం మృతుల సంఖ్య 1008కి చేరింది.
    • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సంఖ్య 1332కు పెరిగాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్య 31 దగ్గరే ఉంది.
    • తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1016కి చేరింది. మృతుల సంఖ్య 25 దగ్గరే ఉంది.
  3. తెలంగాణలో 7 కొత్త కేసులు నమోదు

    తెలంగాణలో ఈరోజు 7 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 582కు చేరింది.

    ఈరోజు మరణాలు ఏవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 25 దగ్గరే ఉంది.

    ఇప్పటివరకూ రాష్ట్రంలో 409 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    కొత్తగా 7 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది.

    రాష్ట్రంలో 11 జిల్లాల్లో యాక్టివ్ కేసులు జీరోకు చేరినట్లు ప్రకటించారు.

    కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన 45 రోజుల బాలుడిని ఈరోజు డిశ్చార్జ్ చేశారు.

    20 రోజుల వయసులో చిన్నారిని తన తండ్రితో కలిసి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

    చిన్నారి వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దేశంలో కరోనా వైరస్‌ సోకిన పిన్న వయస్కుడు ఇతడే కావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

  4. గినియా బిసావు ప్రధానికి కరోనా పాజిటివ్

    గినియా బిసావు ప్రధానికి కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

    గినీ-బిసావు ప్రధాని నునో గోమ్స్ నబియం, ఆయన క్యాబినెట్లోని మరో ముగ్గురికి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.

    మంగళవారం కరోనా ఉన్నట్టు తేలడంతో వీరందరినీ రాజధాన బిసావ్‌లో ఉన్న ఒక హోటల్లో క్వారంటైన్ చేశారని ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

  5. గుజరాత్‌లో 14 మంది కరోనా రోగుల డిశ్చార్జ్

    గుజరాత్‌లో ఈరోజు 14 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు.

    అహ్మదాబాద్‌లోని సర్దాయ్ వల్లభ్ భాయ్ పటేల్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ‌లో చికిత్స పొందుతున్న వీరికి రెండు సార్లు జరిగిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారని ఏఎన్ఐ చెప్పింది.

    గుజరాత్ ఇప్పటివరకూ మొత్తం 3774 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం 181 మంది చనిపోయారు.

    ఇప్పటివరకూ 434 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

  6. మహారాష్ట్రలో 400కు చేరిన కోవిడ్-19 మృతుల సంఖ్య

    కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వివరాల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం కోవిడ్-19 మృతుల సంఖ్య 400కు చేరింది.

    రాష్ట్రంలో మొత్తం 9318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    ఇప్పటివరకూ 1388 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    ధారావిలో కొత్తగా 14 కేసులు

    ముంబయిలోని ధారావి ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

    తాజాగా ఇక్కడ 14 కొత్తకేసులు నమోదైనట్లు బీఎంసీ అధికారులు చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    వీటితో కలిపి ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య 344కు చేరింది. ధారావిలో కొత్తగా మరణాలు ఏవీ నమోదు కాలేదు.

    మహిమ్‌లో కొత్తగా 3 కేసులు నమోదు కాగా, దాదర్‌లో కొత్త కేసులేవీ బయటపడలేదు.

  7. కోవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనకు 1.5 బిలియన్ పౌండ్స్ నిధులు-బ్రిటన్

    కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ కనుగొనాలనే అంతర్జాతీయ ప్రయత్నాలలో భాగంగా వచ్చే ఐదేళ్ల పాటు 1.5 బిలియన్ పౌండ్స్ నిధులు అందిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

    ఏడాదికి 330 మిలియన్ పౌండ్ల చొప్పున వచ్చే ఐదేళ్లపాటు గ్లోబల్ అలియన్స్ ఫర్ వాక్సిన్స్ అండ్ ఇమ్యునజైషన్-గవికి బ్రిటన్ నిధులు అందిస్తుందని ఎంపీ ఆన్-మేరీ ట్రెవెల్యాన్ చెప్పారు.

    తర్వాత మాట్లాడిన మంత్రి డామినిక్ రాబ్, "బ్రిటన్‌లో ఉన్న అందరికీ తమ ప్రభుత్వం వాక్సిన్ వేయాలనుకుంటోందని, అత్యంత బలహీన, పేద దేశాలకు అండగా నిలవాలనుకుంటోంది" అని చెప్పారు.

  8. పంజాబ్‌లో మే 17 వరకూ లాక్‌డౌన్

    లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు పంజాబ్ సీఎం ప్రకటించారు. అంటే రాష్ట్రంలో మే 17 వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది.

    గురువారం నుంచి కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11 వరకూ 4 గంటలపాటు షాపులు తెరిచి ఉంచుతామని, హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు మాత్రం మూసి ఉంటాయని ఆయన చెప్పారు.

    రెండు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి, కరోనా మహమ్మారి నియంత్రణలో ఉంటే లాక్‌డౌన్ సడలిస్తామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ వీడియో సందేశంలో చెప్పారు.

    గత 38 రోజులుగా కఠిన ఆంక్షలు ఎదుర్కుంటున్న వారిని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ సడలించాలని నిర్ణయించామని చెప్పారు.

  9. 150 కోట్ల మందికి పైగా కార్మికులకు జీవనోపాధి దూరం

    కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల్లో దాదాపు సగం మంది జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) హెచ్చరించింది. ఆ సంఖ్య 150 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది.

    ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మందికి కోవిడ్-19 వ్యాపించింది. దాదాపు 2,20,000 మంది ప్రాణాలు తీసింది.

    అసంఘటిత రంగాల కార్మికులు ఎక్కువ మంది ఇప్పుడు ప్రమాదంలో పడ్డారని, వారిలో చాలా మంది రిటైల్ సెక్టార్, తయారీ రంగం, ఆహార సేవల పరిశ్రమల్లో పనిచేస్తున్నారని ఐఎల్ఓ చెప్పింది.

    తమ ప్రాంతాల్లో మహమ్మారి వ్యాపించిన మొదటి నెలలోనే 200 కోట్ల మంది కార్మికులు తమ ఆదాయం పడిపోవడం చూశారు.

    “లక్షలాది కార్మికులకు ఆదాయం లేదు అంటే, వారికి తినడానికి తిండి, భద్రత, భవిష్యత్తు లేదని అర్థం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వ్యాపారాలు కొన ఊపిరిలో ఉన్నాయి” అని ఐఎల్ఓడైరెక్టర్ జనరల్ గే రైడర్ అన్నారు.

    “వారి దగ్గర పొదుపు గానీ, వారికి అప్పులు ఇచ్చేవారూ ఉండరు. శ్రామిక ప్రపంచంలో అసలైన వారు వీరే. మనం వారికి సాయం చేయకపోతే, వారు నశిస్తారు”అన్నారు.

  10. వలస కార్మికుల తరలింపుపై కేంద్రం మార్గదర్శకాలు

    లాక్‌డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, యాత్రికులు, వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి:

    • రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించి, వ్యక్తుల బృందాలను సొంత రాష్ట్రాలకు రప్పించడానికి, పంపించడానికి నియమిత ప్రొటోకాల్ అనుసరించాలి. నోడల్ అధికారులు వ్యక్తుల పేర్లను తమ రాష్ట్రాల్లో నమోదు చేయాలి.
    • చిక్కుకుపోయిన వారిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించడానికి వారిని పంపించే, రప్పించే రాష్ట్రాలు ఒకదానిని ఒకటి సంప్రదించాలి. రోడ్డు ద్వారా వారిని తరలించేందుకు పరస్పరం అంగీకరించాలి.
    • ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారికి స్క్రీనింగ్ చేయాలి. లక్షణాలు లేని వారిని ముందుకు వెళ్లడానికి అనుమతించాలి.
    • సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వారిని తరలించడానికి బస్సులను ఉపయోగించాలి. ఆ బస్సులను శానిటైజ్ చేయాలి. లోపల సామాజిక దూరం పాటించి, దూరం ఉండేలా కూర్చోపెట్టాలి.
    • బస్సులు వెళ్లే మార్గంలో వచ్చే రాష్ట్రాలు, వారు తమ సొంత రాష్ట్రాలకు చేరుకోడానికి అనుమతించాలి.
    • వ్యక్తుల బృందం గమ్యానికి చేరుకున్న తర్వాత, వారిని స్థానిక వైద్యులు పరీక్షించాలి. క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం లేదని భావిస్తే, వారిని హోం క్వారంటైన్లో ఉంచాలి. అప్పుడప్పుడూ పరీక్షలు చేస్తూ వారి ఆరోగ్య పరిస్థితి గమనించాలి. వారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఆరోగ్య సేతు యాప్ వేసుకోమని ప్రోత్సహించాలి.
  11. భారత్‌లో కరోనావైరస్: మరణాలు తక్కువగా ఉండటం వెనకున్న రహస్యం ఏంటి?

    దేశంలో నమోదవుతున్న కోవిడ్-19 మరణాలపై అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాలు కొంత ఉపశమనాన్ని, కొంత అనుమానాన్ని కలిగిస్తున్నాయి.

    కరోనావైరస్ కేంద్రీకృతమైన ప్రపంచంలోని ఇతర నగరాలతో పోల్చి చూస్తే భారత్‌లో నమోదవుతున్న మరణాల సంఖ్య తక్కువగా ఉంటోందని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.

    దేశంలో కోవిడ్-19 తొలి కేసు నమోదు అయినప్పటి నుంచి ఏప్రిల్ 29 వరకు 31 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో వెయ్యి మందికి పైగా మరణించారు.

    మరణాల రేటుని తెలుసుకోవాలంటే మరణాల సంఖ్య రెట్టింపు కావడానికి ఎన్ని రోజులు పడుతుందో అర్ధం చేసుకోవడం అవసరం.

    భారత్‌లో ప్రస్తుతానికి ఇది 9 రోజులుగా ఉంది. ఏప్రిల్ 25వ తేదీ నాటికి 825 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ 16 నాటికి అందులో సగం సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.

  12. 11.3 రోజులకు కరోనా కేసులు రెట్టింపు-మంత్రి హర్షవర్ధన్

    దేశంలో కేసులు రెట్టింపు అవుతున్న రేటు 11.3 రోజులుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షనర్ధన్ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 7 శాతం ఉన్నా, భారత్‌లో అది 3 శాతానికి దగ్గరగా ఉందని ఆయన చెప్పారు.

    దేశంలో 0.33 శాతం మంది రోగులు మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని, 1.5 శాతం రోగులు ఆక్సిజన్ సపోర్టుపై, 2.34 శాతం రోగులు ఐసీయూలో ఉన్నారని హర్షవర్ధన్ చెప్పారని ఏఎన్ఐ పేర్కొంది.

  13. కేరళలో ముగ్గురు వైద్య సిబ్బంది, ఒక జర్నలిస్టుకు కరోనా

    కేరళలో ఈరోజు 10 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు వైద్య సిబ్బంది, ఒక జర్నలిస్ట్ ఉన్నారని ఏఎన్ఐ చెప్పింది.

    వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 495కు చేరాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వీటిలో 123 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  14. భారత్‌లో 31,787కు పెరిగిన మొత్తం కేసులు

    గత 24 గంటల్లో 1813 కేసులతోపాటూ మరో 71 కొత్త కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 31,787కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    వీటిలో 22,982 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ దేశంలో 1008 మంది కరోనా రోగులు మృతిచెందారు.

    దేశవ్యాప్తంగా 7797 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

  15. కరోనా మహమ్మారిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి-ఆస్ట్రేలియా

    కరోనా మహమ్మారి గురించి ఒక స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మరోసారి అన్నారు.

    ఈ మహమ్మారి ఎలా వ్యాపించిందో ప్రపంచం తెలుసుకోవాలనుకోవడం పూర్తిగా సమంజసమే అని ఆయన చెప్పారు.

    ఆస్ట్రేలియాలో చైనా రాయబారి ఆయన డిమాండును తోసిపుచ్చారు. చైనా ఆస్ట్రేలియా ఉత్పత్తులను బహిష్కరిస్తుందని హెచ్చరించారు.

  16. సంగారెడ్డిలో వలస కార్మికుల ఆందోళన

    ఐఐటీ హైదరాబాద్ దగ్గర నిర్మాణ పనుల్లో ఉన్న 2400 మంది వలస కార్మికులు తమను తిరిగి సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ ఈరోజు ఆందోళనలకు దిగినట్లు సంగారెడ్డి పోలీసులు తెలిపారని ఏఎన్ఐ చెప్పింది.

    వలస కార్మికుల్లో కొంతమంది పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో ఒక పోలీసు గాయపడ్డాడు. పోలీస్ వాహనం కూడా ధ్వంసమైందని సంగారెడ్డి రూరల్ పోలీసులు ఏఎన్ఐకు చెప్పారు.

  17. మనవలు, మనవరాళ్లను హత్తుకోడానికి వృద్ధులకు స్విట్జర్లాండ్‌ అనుమతి

    వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి, సామాజిక దూరంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వృద్ధులను వారి మనవలు, మనవరాళ్ల నుంచి దూరంగా ఉంచారు..

    అలా చేయడం చాలా కుటుంబాల్లోని వృద్ధులకు, పిల్లలకు కష్టంగా ఉంది.

    స్విట్జర్లాండ్ లాక్‌డౌన్ సడలించడం ప్రారంభించింది. దేశంలో పదేళ్ల పిల్లలు తమ ఇళ్లలోని వృద్ధులను హత్తుకోవడాన్ని ఇప్పుడు సురక్షితంగా భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

    పిల్లల వల్ల వైరస్ వ్యాపించదని శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారని ఆ దేశ ఆరోగ్య శాఖ చీఫ్ డేనియెల్ కోచ్ చెప్పారు.

    స్విట్జర్లాండ్‌లో 1699 మంది చనిపోయారు

  18. కరోనావైరస్: మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందా?

    ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మృతులకు సంబంధించి విషాదకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారి కోసం విలపించే ఆత్మీయులు ఎవరూ వారి మృతదేహాల సమీపంలో కనిపించటం లేదు.

    ఆ దృశ్యాలు మరణం గురించి మాత్రమే కాదు.. మృతుల గురించి కూడా భయాలను రాజేస్తున్నాయి. వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచి కూడా వైరస్ సోకుతుందన్న భయాలు అవి.

    కోవిడ్-19 బాధితుల మృతదేహాల నుంచి వైరస్ సంక్రమిస్తుందా? అంత్యక్రియలు నిర్వహించటం సురక్షితమేనా? వైరస్ మృతులను ఖననం చేయాలా? దహనం చేయాలా?

    కోవిడ్-19 మృతదేహాల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందనే భయం అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.

  19. కరోనా రిపోర్ట్స్ కోసం హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ సిబ్బంది ఎదురుచూపులు

    పరీక్షల ఫలితాల కోసం వేచిచూస్తున్న విమానవాహక నౌక సిబ్బంది

    యుద్ధవిమాన వాహక నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్‌లో ఉన్న 800 మంది నావికులు ప్రస్తుతం కోవిడ్-19 పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

    పోర్ట్స్ మౌత్ నుంచి అది మళ్లీ సముద్రంలోకి వెళ్లడానికి అధికారులు అనుమతించాలంటే ఈ ఫలితాలు చాలా కీలకం.

    ఈ విమానవాహక నౌక ఈ వారం మొదట్లో వెళ్లిపోయి ఉండాల్సింది. కానీ సిబ్బందికి కోవిడ్-19 పరీక్షలు చేయడంతో అది ఆలస్యం అయ్యింది.

    అమెరికా, ఫ్రాన్స్ యుద్ధనౌకలో ఉన్న సిబ్బందిలో చాలా మందికి కరోనా వైరస్ రావడంతో దీనిలోని నావికులకు కూడా పరీక్షలు నిర్వహించారు.

  20. మొరాకోలో 300 మందికి పైగా ఖైదీలకు కరోనా

    ఆఫ్రికా దేశం, మొరాకో జైళ్లలో 300 మందికి పైగా ఖైదీలు కరోనా పాజిటివ్‌గా తేలారు.

    వీరిలో ఎక్కువగా వివిధ వ్యాధులతో ఉన్న ఖైదీలే ఉన్నారు. కానీ కొందరు జైలు సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చింది.

    గత వారం ఒక జైల్లోని ఖైదీకి పాజిటివ్ రావడంతో లోపల ఉన్నవారికి భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించారు.

    మొరాకో జైళ్లలో దాదాపు 80 వేల మంది ఖైదీలు ఉన్నరు.

    ఈ నెల మొదట్లో జైళ్లలో వైరస్ వ్యాపించకుండా మొరాకో రాజు 5500 మంది ఖైదీలను విడుదలచేశారు.

    మొరాకోలో ప్రస్తుతం 4252 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల 165 మంది చనిపోయారు.