వలస కార్మికులు, గ్రామీణ పేదలకు
అవసరమైన అత్యవసర సాయం అందించేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఈ సాయం అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఏ ఒక్క పేదవాడూ ఆకలితో చనిపోవడానికి
వీల్లేదు అని ఆమె స్పష్టం చేశారు.
“నెలకు 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల
గోధుమలు అందించాలని ఇప్పటికే నిర్ణయించాం. దీనికి అదనంగా మరో 5 కేజీలను వచ్చే మూడు
నెలలూ ఉచితంగా అందిస్తాం. దీంతోపాటు ప్రతి ఇంటికీ వారి అలవాట్ల ఆధారంగా ఒక కేజీ పప్పు
కూడా ఉచితంగా అందిస్తాం” అని నిర్మల తెలిపారు.
నగదు బదిలీకి సంబంధించి 8 నిర్ణయాలు
తీసుకున్నామని నిర్మల వెల్లడించారు.
రైతులు – పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
ద్వారా అందించే రూ.6000 లో మొదటి భాగం రూ.2000ను ఇప్పుడే విడుదల చేస్తున్నాం.
ఉపాధి హామీ పథకం – దీని ద్వారా
అందించే కూలీ మొత్తాన్ని పెంచుతున్నాం. దీని ద్వారా 5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం
కలుగుతుంది. ఈ పెంపు ద్వారా అదనంగా రూ.2000 ప్రతి కుటుంబానికీ అందుతుంది.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు –
రూ. 1000 ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ఇది 3 కోట్ల మందికి ప్రయోజనం
కలిగిస్తుంది.
జన్ ధన్ యోజన – 20 కోట్ల మంది మహిళా
జన్ ధన్ అకౌంటుదారులు రూ.500 ఎక్స్‌గ్రేషియాను వచ్చే 3 నెలలపాటు అందిస్తాం.
ఉజ్వల పథకం – పేదలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం
ద్వారా 8.3 కోట్ల మంది పేద మహిళలు లాభపడ్డారు. ఇప్పుడు ఈ మహిళలందరికీ మూడు నెలల
పాటు ఉచిత సిలిండర్లు అందించాలని నిర్ణయించాం.
స్వయం సహాయక సంఘాలు – దీన్ దయాళ్
యోజన లైవ్లీహుడ్ మిషన్ ద్వారా అందిస్తున్న కొలేటరల్ రుణాలను రెట్టింపు
చేస్తున్నాం. దీని పరిమితి రూ.20 లక్షలు. ఇధి 7 కోట్ల మంది కుటుంబాలకు ప్రయోజనం
కలిగిస్తుంది.
వ్యవస్థీకృతరంగ కార్మికులు– వీరికి సంబంధించి రెండు ప్రకటనలు చేస్తున్నాం.
1)
ప్రావిడెంట్ ఫండ్: ఉద్యోగి, సంస్థల నుంచి చెల్లించే ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఇది ఉద్యోగుల సంఖ్య 100లోపు ఉన్న కంపెనీలకు, ఉద్యోగి వేతనం రూ.15000కు
మించనివారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రయోజనం వచ్చే 3 నెలల పాటు కొనసాగుతుంది.
2) తిరిగి చెల్లించనవసరం లేని
అడ్వాన్స్‌ను అందించేందుకు పీఎఫ్ రెగ్యులేషన్ నిబంధనలను సవరిస్తాం. ఉద్యోగులు తమ
పీఎఫ్ మొత్తంలోని 75శాతం వరకూ లేదా 3 నెలల వేతనం.. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది
తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తాం. ఇది 80 లక్షల ఉద్యోగులు, 4 లక్షల సంస్థలకు ప్రయోజనం
చేకూరుస్తుంది.
భవన నిర్మాణ కార్మికులు – 3.5 కోట్లమంది రిజిస్టర్డ్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ
సంక్షేమ నిధి నుంచి సహాయం అందించేందుకు సంబంధిత శాఖలకు తక్షణం ఆదేశాలు జారీచేస్తాం.
డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ – అన్ని రకాల వైద్యపరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలు,
అవసరమైన ఇతర అన్ని పరీక్షలు చేయడానికి ఈ నిధిని ఉపయోగించాలని అన్ని రాష్ట్రాల
ప్రభుత్వాలకూ సూచిస్తున్నాం.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన
పథకం ద్వారా ప్రకటించిన ఈ ప్యాకేజీ ద్వారా పేదలెవరూ కూడా ఆకలితో మరణించకుండా
చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. ఈ ప్రయోజనాలకు సంబంధించిన నగదు పేదల
ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తామని ఆమె తెలిపారు.