గురువారం రాత్రి 8 గంటలకు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సమాచారం ప్రకారం దేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 694కు చేరింది. ఇప్పటివరకు 16 మంది మరణించారు. 45 మందికి వ్యాధి నయమైంది.
దేశంలో అత్యధికంగా 124 కేసులు నమోదయ్యాయి. ఒకరు డిశ్చార్జి కాగా, ముగ్గురు చనిపోయారు. కేరళలో 118 మందికి వైరస్ సోకింది. ఆరుగురికి వ్యాధి నయమైంది. ఈ రాష్ట్రంలో ఎవరూ చనిపోలేదు.
రాజస్థాన్‌లో 41, గుజరాత్‌లో 43, దిల్లీలో 36, ఉత్తరప్రదేశ్‌లో 41, తెలంగాణలో 44, కర్నాటకలో 55, పంజాబ్‌లో 33, ఆంధ్రప్రదేశ్‌లో 11 కేసులు నమోదయ్యాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకరికి కోవిడ్ వ్యాధి సోకినట్లు గురువారం వెల్లడైంది.
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 8.40 గంటలకు ప్రపంచవ్యాప్తంగా 4,92,603 మందికి కరోనావైరస్ సోకింది. 1,19,918 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 22,184కు చేరుకుంది.
ఇటలీలో 74,386 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,503 మంది చనిపోయారు. 9,362 మందికి వ్యాధి నయమైంది.
అమెరికాలో 69,246 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 619 మాత్రమే వ్యాధి నయమై డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 1,046 మంది చనిపోయారు.
స్పెయిన్‌లో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఇటలీ తరువాత అత్యధికంగా ఈ దేశంలో 4,089 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 7,015 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
జర్మనీలో 40,585, ఫ్రాన్స్‌లో 25,604, ఇరాన్‌లో 29,406 మందికి వైరస్ సోకింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 2,234కు చేరుకుంది.