సనా మారిన్: ఫిన్‌లాండ్ ప్రధాని పార్టీలో డాన్స్ చేసిన వీడియో లీక్... డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెర్లిన్ థామస్
- హోదా, బీబీసీ న్యూస్
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఫిన్‌లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ ఒక పాప్‌స్టార్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో బయటకు రావడం రాజకీయ దుమారానికి తెరతీసింది.
ఆ లీకైన వీడియోలో 36 ఏళ్ల సనా, మరికొందరు రాజకీయ నేతలతో కలిసి పార్టీలో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెకు మాదకద్రవ్యాల పరీక్ష (డ్రగ్ టెస్ట్) చేయాలని కొందరు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సనా మారిన్ శుక్రవారం హెల్సింకిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని తెలిపారు. ఈ టెస్ట్ ఫలితాలు వచ్చే వారం వస్తాయని చెప్పారు.
తాను ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదన్న మాటను ప్రధాని పునరుద్ఘాటించారు.
''నేను చట్టవ్యతిరేకమైన పని ఏదీ చేయలేదు. నేను టీనేజీ వయసులో కూడా ఎన్నడూ ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించలేదు. ఈ విషయంలో ఆందోళనలు, అనుమానాలను పారదోలటానికి నేను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నాను'' అని పేర్కొన్నారు.
ఈ విషయంలో తనను నిరపరాధిగా భావించాల్సి ఉంటుందన్న హక్కు తనకు ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

ఫొటో సోర్స్, TWITTER
ఫిన్లాండ్ ప్రధానమంత్రిగా 2019 డిసెంబర్ నుంచి పదవిలో ఉన్న సనా మారిన్.. 'అవసరమైన పక్షంలో ఆకస్మిక నిర్ణయం తీసుకోగలిగే పరిస్థితిలో ఉన్నారా?' అని విలేకరులు ప్రశ్నించారు.
''నాకు తెలిసినంత వరకూ.. నేను అర్థరాత్రి ఆకస్మికంగా స్టేట్ కౌన్సిల్ ప్యాలస్ (కేంద్ర పరిపాలనా భవనం)కు వెళ్లాల్సిన పరిస్థితి ఒక్కసారైనా తలెత్తలేదు'' అని ఆమె బదులిచ్చారు.
''నేను పనిచేసే సామర్థ్యం చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. నేను పార్టీ చేసుకుంటున్న రోజుల్లో నాకు తెలిసి ఎలాంటి సమావేశాలూ లేవు'' అని చెప్పారు.
ఆ పార్టీలో తనను వీడియో తీస్తున్న విషయం తనకు తెలుసునని ప్రధాని సనా చెప్పారు. అయితే ఆ దృశ్యాలను బహిరంగపరచటం తనను విచారానికి గురి చేసిందన్నారు.
''పని సమయం, విశ్రాంతి సమయం వేరుగా ఉంటాయన్న విషయం జనం అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నా'' అని ఆమె పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంతకుముందు ప్రపంచంలో అతి పిన్న వయసు ప్రభుత్వాధినేతగా ఉన్న (ఇప్పుడు చిలీ అధ్యక్షురాలు గాబ్రియెల్ బోరిక్ ప్రపంచంలో అతి పిన్న వయసు ప్రభుత్వాధినేతగా ఉన్నారు) సనా మారిన్.. తన పార్టీ విషయాలను గోప్యంగా దాచిపెట్టరు. ఆమె మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఫొటోలు తరచుగా కనిపిస్తుంటాయి.
సనా మారిన్ ''కూలెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్'' అని జర్మన్ వార్తా సంస్థ బిల్డ్ గత వారంలోనే అభివర్ణించింది.
ప్రధాని సనా పార్టీలో పాల్గొన్న దృశ్యాలను చూపుతూ రెండు వేర్వేరు వీడియోలు బయటకు వచ్చాయి.
మొదటి వీడియో గురువారం బహిర్గతమైంది. ఆ వీడియోతో సనా మారిన్ మీద తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.
సోషల్ మీడియా నుంచి సేకరించినట్లు కనిపిస్తున్న ఆ వీడియోలో.. ప్రధాని సనా, మరికొందరు సెలబ్రిటీలు ఒక ప్రైవేటు అపార్ట్‌మెంట్‌లో డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతున్న దృశ్యాలు ఉన్నాయి.
ప్రధానమంత్రి మీద ‘అనుమానపు నీడలు’ కమ్ముకున్నాయని, కాబట్టి ఆమె స్వచ్ఛందంగా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రతిపక్ష పార్టీ నేత రిక్కా పుర్రా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సనా మారిన్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సెంటర్ పార్టీ ఎంపీ మిక్కో కర్నా.. ప్రధాని ‘‘స్వచ్ఛందంగా డ్రగ్ చేయించుకోవటం మేలు’’ అని ట్వీట్ చేశారు.
దీనికి ప్రధాని గురువారం నాడు స్పందిస్తూ.. ‘‘నేను డ్యాన్స్ చేశాను. పాడాను. పార్టీ చేసుకున్నాను. అన్నీ నిఖార్సుగా చట్టబద్ధమైన పనులే. వేరే విషయాల్లో (మాదకద్రవ్యాల వినియోగంలో) నేను ఎన్నడూ లేను. అలాంటి వాటిలో నన్ను ఎన్నడూ చూడలేదు’’ అని చెప్పారు.
‘‘నేను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదు. డ్రగ్ టెస్ట్ చేయించుకోవటానికి తనకు అభ్యంతరమేమీ లేదని ఆమె విలేకరులతో చెప్పారు.
‘‘నాకు కుటుంబ జీవితం ఉంది. నాకు వృత్తి జీవితం ఉంది. నా స్నేహితులతో గడపటానికి నాకు ఖాళీ సమయం ఉంది. నా వయసులోని చాలా మందికి ఉన్నట్లుగానే నా జీవితం ఉంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
శుక్రవారం నాడు మరొక వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోలో ఫిన్లండ్ పాప్‌స్టార్ ఒలావి యుసివిర్టాతో ఆమె సన్నిహితంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
ఈ నేపథ్యంలో సనా శుక్రవారం కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ వీడియోలో ప్రధాని సనా మెడ మీద సదరు పాప్ స్టార్ ముద్దు పెట్టారని ఒక రిపోర్టర్ వాదించగా, దానిని ప్రధానమంత్రి తోసిపుచ్చారు.
''నా మెడ మీద ముద్దు పెట్టారని నేను అనుకోవటం లేదు. నాతో ఏదో చెప్పారు. నేను ఫ్రెండ్స్‌ను ఆలింగనం చేసుకుని, బుగ్గ మీద ముద్దాడాను. అది అనుచితమని భావించేట్లయితే.. అది అనుచితమని భావిస్తారు'' అని ఆమె స్పందించారు.
''ఒకవేళ ఎవరైనా నా బుగ్గ మీద ముద్దు పెట్టినట్లయితే అందులో అనుచితమేదీ లేదు. అది నా భర్తకు నేను చెప్పలేని విషయమేమీ కాదు'' అని సనా మారిన్ వ్యాఖ్యానించారు.
ఈ వీడియోల విషయంలో ఫిన్లండ్ మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ కథనాల్లో సదరు వీడియోలను ఉపయోగించటం ను ప్రజాప్రయోజనాల రీత్యా సబబేనని ఆ మీడియా సంస్థలు సమర్థించుకున్నాయి.
అయితే.. దేశంలో మరింత ముఖ్యమైన అంతర్గత సమస్యల గురించి కాకుండా.. పార్టీ చేసుకోవటం గురించి మాట్లాడుతుండటంపై ప్రధానమంత్రిని, మీడియాను ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.
ఈ వీడియోల్లోని దృశ్యాలు.. రాజకీయ నాయకుల ప్రవర్తన మీద, వారికి గల ప్రైవసీ ఎంత అనే దాని మీద ఫిన్లండ్‌లో తీవ్ర చర్చ రాజేశాయి.
సనా మారిన్ గత ఏడాది కోవిడ్-19 సోకిన ఒక వ్యక్తిని కలిసిన అనంతరం.. క్లబ్‌కు వెళ్లినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- అఫ్గానిస్తాన్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి ఏమిటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























