ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై రేపే అవిశ్వాస తీర్మానం, ఏం జరగబోతోంది

ప్రచురణ

పాకిస్తాన్ రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగాయి. నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి గత ఆదివారం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పాకిస్తాన్ సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది.

నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడిని కోరలేరని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. శనివారం(ఏప్రిల్ 9న) అసెంబ్లీని సమావేశ పరచాల్సిందిగా సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. దీంతోపాటు అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.

కట్టుదిట్టమైన భద్రత

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒమర్ అటా బండియాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. గురువారం సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించడానికి ముందు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు బయట అల్లర్లు జరకుండా బలగాలను మోహరించారు.

డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి అవిశ్వాస తీర్మానం రద్దు నిర్ణయంలో లోపాలు ఉన్నాయని అంతకు ముందు కోర్టులో విచారణ సందర్భంగా పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

"ఈ ఆర్డర్ సరైనది కాదని స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత ఏంటన్నది చూడాలి'' పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ అన్నారు.

గత ఆదివారం ఖాసీం ఖాన్ సూరి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ విమర్శించారు.

ఎన్నికల కమిషనర్‌కు పిలుపు

సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే, పాకిస్తాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు కోర్టు సమన్లు ​​జారీ చేసింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు తీర్పు కేవలం పాకిస్తాన్ రాజ్యాంగాన్నే కాక.. పాకిస్తాన్ ప్రజలను కూడా కాపాడిందని ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశారు. ఈ తీర్పు పార్లమెంటు ఔన్నత్యాన్ని పునరుద్ధరించిందన్నారు.

కోర్టు తీర్పు అనంతరం మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రతీకారమంటూ ట్వీట్ చేశారు.

'ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రతీకారం, జియా భుట్టో, జియా అవాం, పాకిస్తాన్ జిందాబాద్' అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇది రాజ్యంగ విజయమని మరియం నవాజ్ షరీఫ్ అభివర్ణించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వారి కథ ముగిసిందని వ్యాఖ్యానించారు. అధికార పీటీఐ పార్టీ నేత జావేద్ ఖాన్.. ఇమ్రాన్ ఖాన్ ప్రజల కోసం గట్టిగా పోరాడుతారని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ త్వరలో ప్రకటన చేస్తారని ట్వీట్ చేశారు.

అసలేం జరిగింది?

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆదివారం (ఏప్రిల్ 3, 2022) అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ దానిని ఓటు వేయకుండా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దానిని రద్దు చేశారు.

ఇందుకోసం ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 5ని ఉదహరించారు. అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా ఏ విదేశీ శక్తి కోసమో కూలదోయడానికి అనుమతించలేమని డిప్యూటీ స్పీకర్ ఖాసీంఖాన్ సూరి అన్నారు.

వెంటనే, పార్లమెంటును రద్దు చేయాలని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడిని అభ్యర్థించారు. దానిని రాష్ట్రపతి ఆమోదించి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్‌ను రద్దు కావడంతో ఇమ్రాన్‌ఖాన్‌ తాత్కాలిక ప్రధాని అయ్యారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపకూడదని స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమైనదా కాదా అని కోర్టు నిర్ణయించాల్సి వచ్చింది.

ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెట్టేనాటికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి అవసరమైన ఆధిక్యం లేదు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)కు చెందిన కొందరు ఎంపీలు కూడా విపక్షంవైపు వెళ్లిపోయారు.

342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌కు 155 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. కొన్ని పార్టీలు కూడా ఇమ్రాన్ ఖాన్ సంకీర్ణాన్ని వీడి వెళ్లిపోయాయి.

బలం లేని ఇమ్రాన్

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే, విపక్షాలు పైచేయి సాధించి ఉండేవి. వారి దగ్గర ఆధిక్యానికి అవసరమైనంత మంది ఎంపీలున్నారు. మరోవైపు ఇమ్రాన్‌కు ఓటమి తప్పదని మీడియాలో విశ్లేషణలు కూడా వచ్చాయి.

పార్లమెంటును రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ భావించారు. పార్లమెంటు రద్దయితే 90 రోజుల్లోనే ఎన్నికలు జరిగే అవకాశముందని పాకిస్తానీ మీడియా పేర్కొంది.

అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ పాకిస్తాన్ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు.

''అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడాన్ని స్వాగతిస్తున్నా. పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఎలాగైనా మార్చేయాలని విదేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వెన్నుపోటుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి కుట్రలు విజయం సాధించడాన్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. అసెంబ్లీని రద్దు చేయాలని నేను అధ్యక్షుడికి సిఫార్సు చేశాను''అని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఊహించని రీతిలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు చేశారు. దీంతో నేషనల్ అసెంబ్లీని ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు.

''నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనకు పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ అంగీకారం తెలిపారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 58 (1), ఆర్టికల్ 48 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు''అని పాక్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)