బ్రెంట్ రీనార్డ్: యుక్రెయిన్‌లో కాల్పుల్లో చనిపోయిన జర్నలిస్ట్, ఫిల్మ్ మేకర్

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌లో పనిచేస్తోన్న ఒక అమెరికా జర్నలిస్ట్, రాజధాని కీయెవ్‌కు వెలుపల ఇర్పిన్ నగరంలో కాల్చివేతకు గురైనట్లు పోలీసులు చెప్పారు.
ఫిల్మ్ మేకర్, జర్నలిస్ట్ అయిన 50 ఏళ్ల బ్రెంట్ రీనార్డ్ అమెరికా న్యూస్ మ్యాగజీన్ 'టైమ్'లో పనిచేస్తున్నారు.
రష్యన్ సైనికుల కాల్పుల్లో బ్రెంట్ మరణించినట్లు కీయెవ్ పోలీస్ చీఫ్ ఆండ్రీ నెబిటోవ్ చెప్పారు. గాయపడిన మరో ఇద్దరు జర్నలిస్టులను ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.
యుక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేస్తూ ఒక విదేశీ జర్నలిస్టు మృత్యువాత పడటం ఇదే తొలిసారి.
గాయపడిన ఇద్దరు జర్నలిస్టుల్లో ఒకరైన జువాన్ అరెడొండో ఇటాలియన్ రిపోర్టర్‌తో మాట్లాడుతూ కాల్పులు జరుగుతోన్న సమయంలో తాను, బ్రెంట్‌తోనే ఉన్నట్లు చెప్పారు.
''యుక్రెయిన్‌ను వదిలివెళ్తోన్న శరణార్థులను చిత్రీకరించడం కోసం మేం ఇర్పిన్‌లోని ఒక వంతెన పైకి వచ్చాం. కారులోకి ఎక్కాం'' అని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో జువాన్ పేర్కొన్నారు.
''ఎవరో మమ్మల్ని మరో వంతెన దగ్గరకు తీసుకెళ్తామని చెప్పారు. మేం చెక్ పాయింట్ దాటేశాం. అప్పుడే వారు మాపై కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే డ్రైవర్ పారిపోయారు. అప్పటికీ వారు మాపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. నా మిత్రుడు బ్రెంట్‌ను కాల్చారు. ఆయన మెడకు బుల్లెట్ తగలడం నేను చూశాను'' అని జువాన్ గుర్తు చేసుకున్నారు.
న్యూయార్క్ టైమ్స్ జారీ చేసిన రీనార్డ్ ప్రెస్ గుర్తింపు కార్డుకు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్నాయి.
రీనార్డ్ మరణవార్త తమను కలిచివేసిందని ఒక ప్రకటనలో 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది. కానీ ఆయన యుక్రెయిన్‌లో తమ వార్తాపత్రిక కోసం పనిచేయట్లేదని స్పష్టం చేసింది.
చివరిసారిగా 2015లో రీనార్డ్ తమ వార్తాపత్రిక కోసం పనిచేశారని, యుక్రెయిన్‌లో ఆయన వేసుకున్న ప్రెస్ ఐడీ కూడా కొన్నేళ్ల క్రితం జారీ చేసిందని వెల్లడించింది.
రీనార్డ్ మరణంపై 'టైమ్' ఎడిటర్ ఇన్ చీఫ్, సీఈవో ఎడ్వర్డ్ ఫెల్సెంథల్‌తో పాటు టైమ్ స్టూడియోస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఇయాన్ ఓర్‌ఫీస్ స్పందించారు. ఆయన మరణంతో కుంగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
''ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్‌మేకర్, జర్నలిస్ట్‌గా బ్రెంట్ ప్రపంచవ్యాప్తంగా పలు క్లిష్టమైన సందర్భాల్లో పనిచేశారు. తరచుగా ఆయన సోదరుడు క్రెగ్ రీనార్డ్‌తో కలిసి ఆయన పనిచేశారు'' అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్, ఇరాక్, హైతీల నుంచి కూడా బ్రెంట్ రిపోర్టింగ్ చేశారు. 2014లో చికాగో స్కూల్స్‌పై 'లాస్ట్ చాన్స్ హై' పేరుతో చేసిన సిరీస్‌గానూ ఆయన 'పెబడీ' అవార్డును గెలుపొందారు. కథా రచనలో విశేషమైన ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును అందజేస్తారు.
ఆయన సోదరుడు క్రెగ్ కూడా ఫిల్మ్‌మేకర్. వీరిద్దరూ తరచుగా కలిసి పనిచేసేవారు. అయితే యుక్రెయిన్‌కు బ్రెంట్‌తో పాటు క్రెగ్ కూడా వెళ్లారో లేదో ఇంకా తెలియరాలేదు.
కీయెవ్‌లోని టీవీ ట్రాన్స్‌మిషన్ టవర్‌పై జరిగిన షెల్లింగ్‌లో యుక్రెయిన్ టీవీ చానెల్ 'లైవ్'కు చెందిన కెమెరా ఆపరేటర్, యుక్రెయిన్ జర్నలిస్ట్ యెవ్‌హెనీ స్కావుమ్ మరణించిన రెండు వారాల కన్నా తక్కువ వ్యవధిలోనే బ్రెంట్ రూపంలో మరో జర్నలిస్ట్ చనిపోయారు.
కొన్ని రోజుల క్రితమే యుక్రెయిన్‌లో యుద్ధాన్ని కవర్ చేస్తోన్న బ్రిటిష్ జర్నలిస్ట్ కీయెవ్ కాల్పుల్లో గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- రోజువారి కూలీ యూట్యూబ్ స్టార్.. 8 లక్షల సబ్స్క్రైబర్లు, 10 కోట్లకు పైగా వ్యూస్.. ఇదంతా ఎలా సాధ్యమైందంటే..
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- ఒక్క రోజే 81 మందికి మరణ శిక్ష అమలు.. ఏడాది పొడవునా అమలు చేసిన వాటికంటే ఇదే ఎక్కువ
- విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వీసీ చాంబర్ వైసీపీ కార్యాలయంగా మారిందనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?
- రాధేశ్యామ్ రివ్యూ: రూపాయి కథకు... 99 రూపాయల హంగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























