డోరతీ బట్లర్ గిలియమ్: 'నేను పనిమనిషిని కాదు, వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రిపోర్టర్‌ను'

ఫొటో సోర్స్, HARRY NALTCHAYAN, WASHINGTON POST
సమాజంలో జాతి వివక్ష అధికంగా ఉన్న సమయంలోనే డోరతీ బట్లర్ గిలియమ్ యూఎస్‌లోని ప్రధాన వార్తాపత్రికలో నల్లజాతి మహిళా జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. శ్వేతజాతీయుల ప్రపంచంలో ఓ నల్లజాతి మహిళగా తన ఉద్యోగ జీవితం ఎలా సాగిందో డోరతీని బీబీసీకి చెందిన ఫర్హానా హైదర్ అడిగి తెలుసుకున్నారు.
సంపన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ 100వ పుట్టినరోజు వేడుకకు డోరతీ బట్లర్ గిలియమ్ వెళ్లగా సెక్యూరిటీ గార్డు ఆమెను ఆపారు. 'ప్రధాన దారి నుంచి నువ్వు వెళ్లేందుకు వీలులేదు. పనిమనుషుల కోసం వెనుకవైపు మరో దారి ఉంది' అని చెప్పారు.
'నేను పనిమనిషిని కాదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రిపోర్టర్‌ను' అని ఆమె జవాబిచ్చారు.
డోరతీ 1961లో వాషింగ్టన్ పోస్ట్‌లో చేరారు. ఆ కాలంలో ఆమే తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా రిపోర్టర్. ఆ తర్వాత 3 దశాబ్దాలు పాటు ఎడిటర్‌గా, కాలమిస్టుగా పనిచేశారు. ఈ సమయంలోనే అమెరికా సమాజంలో, మీడియాలో వచ్చిన పెను మార్పులను ఆమె ప్రత్యక్షంగా చూశారు.

ఫొటో సోర్స్, DOROTHY BUTLER GILLIAM
డోరతీ అనుకోకుండా జర్నలిజంలోకి వచ్చారు. కాలేజీలో తొలి ఏడాది చదువుతున్నప్పుడు ఆమె 'లూయిస్‌విల్లే డిఫెండర్' అనే నల్లజాతీయుల వారపత్రికకు కార్యదర్శిగా పనిచేశారు. ఒకరోజు ఆ పత్రిక ఎడిటర్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన పనిని డోరతీ పూర్తి చేయాల్సి వచ్చింది. ఎలాంటి పాత్రికేయ అనుభవం లేకుండానే డోరతీ ... అకస్మాత్తుగా కెంటకీ నగరంలోని మధ్యతరగతి నల్లజాతీయలపై నివేదికను తయారుచేయడానికి వెళ్లాల్సి వచ్చింది.
'అక్కడికి రిపోర్టింగ్‌కు వెళ్లడంతో నాకు కనువిప్పు కలిగింది. జర్నలిజం ఎలాంటి వృత్తి అంటే నేను ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత బాగా పని చేయగలను అని నాకు తెలిసొచ్చింది. ఈ వృత్తి నన్ను కొత్త ప్రపంచానికి పరిచయం చేస్తుంది అని అర్థమైంది.' అని ఆమె చెప్పారు.
కాలేజీ చదువయ్యాక డోరతీ ప్రముఖ మ్యాగజీన్లు జెట్, ఎబోనీలకు పనిచేశారు. కానీ దినపత్రికలో పనిచేయాలనేది ఆమె లక్ష్యం. దానికి తగినట్లుగానే న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రోగ్రామ్‌లో ఆమెకు సీటు లభించింది. ఆ కోర్సులో చేరిన ఏకైక ఆఫ్రికన్ ఆమెరికన్ విద్యార్థి డోరతీనే. కోర్సు ముగిశాక 24 ఏళ్ల వయస్సులో ఆమెకు వాషింగ్టన్ పోస్ట్‌లో ఉద్యోగం వచ్చింది.
దినపత్రికకు తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా రిపోర్టర్‌గా పనిచేయడం పెద్ద సవాలుగా మారింది.
ఆమెను చూసి టాక్సీలు ఆగకపోయేవి. 'నేను ఆఫీసు బయట నిలబడి టాక్సీ కోసం వేచి చూసేదాన్ని. దూరం నుంచి నెమ్మదిగా వచ్చే టాక్సీలలోని డ్రైవర్లు నా నలుపు రంగు ముఖాన్ని చూసి ఆపకుండా వేగంగా వెళ్లిపోయేవారు.'
ప్రజలు ఆమెను రిపోర్టర్ అని నమ్మకపోయేవారు. ఆఫీసులోని సమావేశాల్లో కూడా ఆమె జాత్యహంకారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
''నేను పోస్ట్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడ చాలా ఛాందస భావాలున్న ఎడిటర్లు ఉండేవారు. వారిప్పటికీ అక్కడే ఉన్నారు. 'అందులో ఒకరు నాతో మేం నల్లజాతీయుల హత్యల గురించి రాయం. ఎందుకంటే అవి చాలా హీనమైన మరణాలు' అని అన్నారు. అప్పుడు నాకు గట్టిగా అరిచి అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కానీ ఇది ఒక రకమైన భావజాలం. నేను ఇక్కడే పనిచేయడం ద్వారా దీన్ని రూపుమాపవచ్చు అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా'' అని డోరతీ వివరించారు.
అయినప్పటికీ పని ప్రదేశంలో ఇలాంటి అనుభవాలు ఆమెకు తరచూ ఎదురవుతూనే ఉండేవి. అలాంటప్పుడు మద్దతు కోసం జెట్ మ్యాగజీన్ మాజీ సహచరులతో మాట్లాడేవారు. శ్వేతజాతి సహోద్యోగుల మధ్య నలిగిపోతున్నాననే భావన ఎదురైనప్పుడు ముఖ్యంగా తన క్రిస్టియన్ నమ్మకాలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని ఆమె చెప్పారు.
''ఆఫీసులో న్యూస్‌రూమ్‌లో ఉన్నప్పుడు సహోద్యోగుల్లో కొందరు హలో చెప్పేవారు. మరికొందరు మాట్లాడేవారు. కొందరేమో కేవలం తలాడించేవారు. కానీ, బయట కనిపించినప్పుడు మాత్రం వీరంతా నేనెవరో తెలియనట్లే ప్రవర్తించేవారు. అది చాలా అవమానకరంగా అనిపించేది. ఎందుకంటే ఇతర తెల్లజాతీయుల ముందు వారికి ఒక నల్లజాతీయురాలు తెలుసు అని అంగీకరించడానికి వారంతా ఇష్టపడకపోయేవారు.''
కానీ ఇలాంటి అవమానాల గురించి డోరతీ ఎప్పుడూ తన ఎడిటర్లతో చర్చించలేదు. ఎందుకంటే ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే ఇక నల్లజాతి జర్నలిస్టులను ఎంపిక చేయడానికి యాజమాన్యాలు వెనుకడుగు వేస్తాయని ఆమె ఆందోళన చెందారు.

ఫొటో సోర్స్, DOROTHY BUTLER GILLIAM
నల్లజాతి మహిళ అయినందున 1960లో అమెరికాలో ఆమెకు మధ్యాహ్న భోజనం దొరకడం కూడా చాలా కష్టంగా ఉండేది.
నలుపు, తెల్ల జాతుల మధ్య వివక్ష అత్యధికంగా ఉన్న రాష్ట్రంలోనే డోరతీ పెరిగారు. అక్కడ నల్లజాతీయులను ఓటు వేయకుండా అడ్డుకునేవారు. చదువు, ఉద్యోగ అవకాశాలు కూడా పరిమితంగానే ఉండేవి. ప్రాథమిక మానవ హక్కులు కూడా నల్లజాతీయులకు అందకపోయేవి.
వాషింగ్టన్‌లోని రెస్టారెంట్లలో కూడా ఈ వివక్ష ఉండేది. వాషింగ్టన్ పోస్ట్ కార్యాలయానికి దగ్గరగా ఉండే ఈ రెస్టారెంట్లలో ఆప్రికన్ అమెరికన్లకు భోజనాన్ని నిరాకరించేవారు. దీంతో డోరతీ దూర ప్రాంతంలో ఉన్న హోటల్‌కు నడిచి వెళ్లి తినేవారు. అక్కడ ఆమెకు కాస్త సౌకర్యంగా అనిపించేది.
నల్లజాతీయుల గురించి కొత్తగా చెప్పడంలో డోరతీ మంచి సమర్థతను కనబరిచేవారు. నల్లజాతీయులు తమ గొంతును బయటకు వినిపించకపోవడం వల్లే ప్రధాన వార్త సంస్థల్లో ఆఫ్రికన్ అమెరికన్ల గురించి చెడుగా వార్తలు వస్తున్నాయని ఆమె నమ్మారు.
''నల్లజాతి ప్రజలకు సంబంధించి వ్యతిరేక వార్తలు మాత్రమే రాయాలని నేను అనుకోలేదు. నల్లజాతిప్రజల పూర్తి జీవితాన్ని వార్తల్లో ఆవిష్కరించాలనుకున్నా.'' అని డోరతీ చెప్పారు.
పౌర హక్కులకు సంబంధించిన ప్రముఖ ఈవెంట్లను డోరతీ కవర్ చేశారు. అందులో భాగంగా 1962లో మిసిసిపి యూనివర్సిటీలో చెలరేగిన అల్లర్లు, నిరసనలను ఆమె ప్రచురించారు. యూనివర్సిటీలో తొలిసారి ఆఫ్రికన్ అమెరికన్ విద్యార్థి జేమ్స్ మెరెడిత్ చేరడంతో ఈ అల్లర్లు చెలరేగాయి.
యూనివర్సిటీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి నల్లజాతీయుల స్పందనను తెలుసుకునే పనిని డోరతీకి అప్పగించారు. జేమ్స్ మెరెడిత్ చేసిన పని ఆధారంగా తమ ఆశల గురించి, రానున్న కాలంలో యూనివర్సిటీలో మరింత మంది చేరుతారని వారు డోరతీతో చెప్పారు. అక్కడ ధైర్యంగా మాట్లాడిన యువతీ యువకుల గురించి డోరతీ వార్తలు ప్రచురించారు.
అదే ఈవెంట్‌పై తెల్లజాతి జర్నలిస్టులు తప్పుడు వార్తలు రాయడాన్ని డోరతీ గమనించారు. వారు యూనివర్సిటీలో నల్లజాతి విద్యార్థులు భయాందోళనల్లో ఉన్నట్లు ప్రచురించారు. ''కానీ అక్కడ వారు రాసినట్లు ఏం జరగలేదు'' అని డోరతీ చెప్పారు.
మిసిసిపిలో ఉన్న సమయంలో తెల్లజాతీయుల హోటళ్లు ఆమె ఉండేందుకు నిరాకరించాయి. దీంతో ఆమె నల్లజాతీయులకు చెందిన అంత్యక్రియలు నిర్వహించే ఇంటిలో ఉండిపోవాల్సి వచ్చింది. '' నేను చనిపోయినవారితో కలిసి నిద్రపోయా. వార్తా కథనాన్ని రాసేందుకు చేయాల్సిందంతా నేను చేశాను.''
తనకు మూడో బిడ్డ జన్మించాక, 1960 దశకం మధ్యలో డోరతీ వాషింగ్టన్ పోస్ట్ నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత ఆమె పార్ట్ టైమ్ ఉద్యోగంలో చేరారు. వారంలో నాలుగు రోజులు పనిచేసేవారు. 1972లో ఆమె స్టైల్ సెక్షన్ అసిస్టెంట్ ఎడిటర్ హోదాలో మళ్లీ వాషింగ్టన్ పోస్ట్‌లో చేరారు.
''అప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించింది. స్టైల్ సెక్షన్ ద్వారా నల్లజాతి ప్రజల సంస్కృతి సంప్రదాయాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే చాలామంది తెల్లజాతీయులకు నల్లజాతి ప్రజల గురించి పెద్దగా తెలియదు. కేవలం నల్లజాతీయులను పనివాళ్లుగా పెట్టుకున్న కొన్ని తెల్లజాతి సంపన్న కుటుంబాలకు మాత్రమే వారి గురించి తెలుస్తుంది. అందుకే వారి జీవన విధానాన్ని ఆవిష్కరించడమే నా ముందున్న కర్తవ్యం.''

ఫొటో సోర్స్, DOROTHY BUTLER GILLIAM
అసిస్టెంట్ ఎడిటర్ హోదాలో డోరతీకి జర్నలిస్టులను నియమించే అవకాశం లభించింది. నల్లజాతి ప్రజల అనుభవాల గురించి రాసే జర్నలిస్టులను ఆమె ఎంపిక చేశారు. 1979లో కాలమిస్టుగా మారారు. ఆ తర్వాత 19 ఏళ్ల పాటు విద్య, రాజకీయం, జాతివివక్ష అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన ఆమె 2003లో పోస్ట్ నుంచి రిటైరయ్యారు.
50 ఏళ్ల జర్నలిజం ఉద్యోగ జీవితంలో డోరతీ వైవిధ్యానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఆమె నల్లజాతి జర్నలిస్టుల జాతీయ సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. రాబర్ట్ సి మేనార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం ఎడ్యుకేషన్ సంస్థకు సహవ్యవస్థాపకురాలిగా, బోర్డు మెంబర్‌గా ఉన్నారు. ఈ సంస్థ ఇప్పటివరకు వేలాది మంది నల్లజాతీయులను జర్నలిస్టులుగా తీర్చిదిద్దింది.
'మీరు కేవలం ఒక గ్రూపు ప్రజల దృక్పథం నుంచే ఒక అంశాన్ని చెప్తున్నట్లయితే... మీరు ఎప్పటికీ నిజమైన వార్తను చెప్పలేరు, పూర్తి వార్తను అందించలేరు.''
''ప్రపంచాన్ని భిన్న కోణాల్లో చూసే వ్యక్తుల్ని మీరు కనిపెట్టలేక పోయినట్లయితే.... మీకు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికీ పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ''
డోరతీ బట్లర్ గిలియం ట్రయల్‌బ్లేజర్ అనే పుస్తకాన్ని రాశారు.
1968లో బ్రిటీష్ టీవీ, నల్లజాతి మహిళా రిపోర్టర్‌ను నియమించగా... చాలామంది వీక్షకులు ఆమెను నిరాకరించారు. దీంతో ఏడాదిలోగానే ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు, 50 ఏళ్లు తిరిగేసరికి ఆ నల్లజాతి మహిళ పేరు మీదే బ్రిటీష్ జర్నలిజం అవార్డును అందిస్తున్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే దేశం తనపట్ల ప్రవర్తించిన తీరు గురించి ఇప్పుడు బార్బరా బ్లేక్ హన్నా ఏం అనుకుంటున్నారు?
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు 'కాబుల్ కసాయి' హిక్మత్యార్ ఇచ్చిన సలహా ఏంటి?
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























