కశ్మీర్: రాజౌరీలో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్‌తో దాడి, ఒకరి మృతి -Newsreel

జస్బీర్ సింగ్

ఫొటో సోర్స్, Facebook/Jasbir Singh

ప్రచురణ

స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందు, జమ్మూకశ్మీర్‌ రాజౌరీలోని బీజేపీ నాయకుడు జస్బీర్ సింగ్‌ ఇంటిపై దుండగులు గ్రెనేడ్‌తో దాడిచేశారు.

గురువారం రాత్రి జరిగిన ఈ దాడిలో జస్బీర్ మేనల్లుడు (3) మరణించాడు. మిగతా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. రాత్రి 9.30 గంటలకు జస్బీర్ ఇంటిలో అందరూ వరండాలో కూర్చున్నప్పుడు ఈ దాడి జరిగింది.

ఘటన స్థలంలో గ్రెనేడ్ పిన్ను దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.

బీజేపీ నాయకుడి ఇంటిపై దాడి

ఫొటో సోర్స్, Mohit Kandhari

జస్బీర్, ఆయన సోదరుడు బల్బీర్, వీరి తల్లిదండ్రులతోపాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులను రాజౌరీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

జస్బీర్, బల్బీర్‌లతోపాటు వీరి తండ్రి కూడా భారత సైన్యంలో పనిచేశారు.

ఖాండ్లి బ్రిడ్జికి సమీపంలోని జస్బీర్ ఇంటిపై ఈ దాడి జరిగినట్లు జమ్మూ అదనపు డీజీపీ ముఖేశ్ సింగ్ స్పష్టంచేశారు.

బీజేపీ నాయకుడి ఇంటిపై దాడి

ఫొటో సోర్స్, Mohit Kandhari

అయితే, క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించడంలో వైద్యులు విఫలమయ్యారని జస్బీర్ మద్దతుదారులు ఆసుపత్రి బయట నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్ ఐజీ వివేక్ గుప్తా జోక్యం చేసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

''జస్బీర్ కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. తను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అందిస్తుండగా అతడు మరణించాడు. మరోవైపు ఏడు నెలల బాలిక కూడా గాయపడింది. తనను మెడికల్ కాలేజీ ప్రధాన ఆసుపత్రికి తరలించాం''అని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మజూర్ హుస్సేన్ బీబీసీతో చెప్పారు.

బ్రిటన్‌లో సాయుధుడి కాల్పులు.. ఆరుగురు మృతి

బ్రిటన్‌లో కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్‌లోని ప్లైమౌత్‌లో గురువారం కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. వీటిలో ఆరుగురు మరణించారని వివరించారు.

‘‘మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెందాడు. వీరంతా బుల్లెట్ గాయాల వల్లే మరణించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ వివరాలు తెలియజేశాం’’అని పోలీసులు తెలిపారు.

మరణించిన వారిలో ఒకరి వయసు పదేళ్లలోపే ఉందని, మరికొంత మంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్లైమౌత్ ఎంపీ ల్యూక్ పొలార్డ్ చెప్పారు.

‘‘మొదట ఓ ఇంటి తలుపుకొట్టిన సాయుధుడు, బయటకు వచ్చిన వారిపైకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పరిసరాల్లోని పార్క్ దగ్గర మరికొంత మందిపై అతడు కాల్పులు జరిపాడు’’అని ప్రత్యక్ష సాక్షి షారన్ తెలిపారు.

బ్రిటన్‌లో కాల్పులు

ఫొటో సోర్స్, PA Media

ఘటనకు ఉగ్రవాదంతో సంబంధంలేదని ప్లైమౌత్ మూర్ ఎంపీ జానీ మెర్సెర్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ‘‘దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన వల్ల పరిసరాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొంత సేపటివరకు రహదారులపై ప్రయాణ ఆంక్షలు కొనసాగుతాయి’’అని పోలీసులు తెలిపారు.

ఘటనకు సంబంధించిన దృశ్యాలు లేదా చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని పోలీసులు అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి: