హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ప్రమాదంలో 8 మంది మృతి, రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ - Newsreel

నుజ్జునుజ్జయిన కార్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నుజ్జునుజ్జయిన కార్లు
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

నాగర్‌కర్నూలు జిల్లా చెన్నారం గేట్ ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జుకాగా వాటిలో ప్రయాణిస్తున్నవారిలో 8 మంది మరణించారు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

తక్షణమే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మోదీ

శ్రీశైలం రహదారి ప్రమాద బాధితులకు ప్రధాని మోదీ నష్ట పరిహారం ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున సహాయాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందించనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Reuters

టిబెట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన, రెండు రోజులుగా ఎందుకు రహస్యంగా ఉంచారు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ టిబెట్‌లో పర్యటించారు. గత 30 ఏళ్లలో చైనా అధ్యక్షుడు ఒకరు టిబెట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

జిన్‌పింగ్ బుధవారం నుంచి టిబెట్‌లోనే ఉన్నారు. అయితే భద్రతా కారణాలు, రాజకీయంగా సున్నితమైన వ్యవహారం కావడంతో ఆయన పర్యటన వివరాలు తొలుత రహస్యంగా ఉంచారు.

శుక్రవారం ఈ పర్యటన గురించి మీడియా వెల్లడించింది.

టిబెట్‌లోని గ్రామీణ ప్రజల సంస్కృతిని, మత విశ్వాసాలను.. మరీ ముఖ్యంగా బౌద్ధుల స్వేచ్ఛను అణగదొక్కుతుందని చైనాపై విమర్శలు ఉన్నాయి.

అయితే చైనా ప్రభుత్వం ఆ విమర్శలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది.

చైనా మీడియా సీసీ టీవీ విడుదల చేసిన ఫుటేజీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విమానం ఎక్కిన సంప్రదాయ వస్త్రాలు ధరించి, చైనా జాతీయ జెండాలు పట్టుకుని తనకు స్వాగతం పలుకుతున్నవారిని ఆయన పలకరించిన దృశ్యాలున్నాయి.

పర్యటనలో భాగంగా జిన్‌పింగ్ నైంగ్చీ ప్రాంతానికి వెళ్లారు. పట్టణాభివృద్ధి గురించి తెలుసుకునేందుకు పలు ప్రాంతాల్లో సందర్శించారు. అనంతరం రాజధాని నగరం లాసా చేరుకున్నారు.

లాసాలోని టిబెట్ బ‌హిష్కృత బౌద్ధ గురువు దలైలామా సాంస్కృతిక నివాసమైన పొటాలా ప్యాలెస్‌ను సందర్శించారు.

ఆయన పర్యటనకు ముందు 'లాసా నగరంలోని ప్రజల అసాధారణ కార్యకలాపాలు, వారి కదలికలను చైనా భద్రతా విభాగాలు పర్యవేక్షించాయి' అని గురువారం టిబెట్ అడ్వొకసీ గ్రూప్ ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ పేర్కొంది.

పదేళ్ల కిందట చైనా ఉపాధ్యక్షుని హోదాలో షీ జిన్‌పింగ్ ఈ రీజియన్‌లో పర్యటించారు.

చివరిసారిగా 1990లో చైనా దేశ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ టిబెట్‌లో అధికారిక పర్యటనకు వచ్చారు.

టిబెట్ సంస్కృతిని పరిరక్షించడానికి, అక్కడి జాతి, మతపరమైన అంశాలను కాపాడటానికి జరిగిన కృషి గురించి తెలుసుకునేందుకు జిన్‌పింగ్ స‌మ‌యాన్ని కేటాయించార‌ని జాతీయ మీడియా వెల్లడించింది.

మతపరమైన అణచివేతకు పాల్పడుతోందని, తమ సంస్కృతిని నాశనం చేస్తోందంటూ పలువురు టిబెటన్లు బీజింగ్‌పై ఆరోపణలు చేస్తున్నారు.

టిబెట్‌కు విచిత్రమైన చరిత్ర ఉంది. ఇది కొంత కాలం పాటు స్వతంత్ర రాజ్యంగా పాలనను సాగించింది. ఆ తర్వాత శక్తిమంతమైన చైనీస్, మంగోలియన్ రాజవంశాల పాలన కిందకు వచ్చింది.

1950లో టిబెట్‌ను స్వాధీన పరుచుకునేందుకు చైనా వేలాదిమంది సైనికులను మోహరించింది. దాంతో కొన్ని ప్రాంతాలు చైనీస్ ప్రావిన్సులలో కలవగా... మరికొన్ని ప్రాంతాలు టిబెట్ స్వతంత్ర రీజియన్లుగా ఏర్పడ్డాయి.

తమ పాలనలో టిబెట్ గణనీయంగా అభివృద్ధి సాధించింద‌ని చైనా పేర్కొంటుంది. కానీ అక్కడి ప్రచార సంఘాలు మాత్రం చైనా ఇప్పటికీ తమ మానవ హక్కుల్ని అణచివేయడంతో పాటు, రాజకీయ, మత పరమైన స్వేచ్ఛను కాలరాస్తోందని ఆరోపిస్తున్నాయి.

టీకా

ఫొటో సోర్స్, Getty Images

ఫైజర్ వ్యాక్సీన్: 'రెండు డోసుల మధ్య 8 వారాల వ్యవధి ఉంటే మంచిది'

ఫైజర్ బయోటెక్ కోవిడ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే యాంటీ బాడీలను ఎక్కువగా ఉత్పత్తి చేయగలుగుతుందని యూకే పరిశోధకులు కనుగొన్నారు.

తొలుత రెండు డోసుల మధ్య వ్యవధిని 3 వారాలుగా నిర్ణయించారు. గత ఏడాది చివర్లో యూకే ఈ వ్యవధిని 12 వారాలకు పొడిగించింది.

యూకే తీసుకున్న ఈ నిర్ణయానికి తాజా పరిశోధన ఫలితాలు బలం చేకూర్చుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి రెండు డోసుల మధ్య 8 వారాల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు.

ఇంకా ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. దీనికి అధికారిక ఆమోదం రావాల్సి ఉంది.

18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాక దాదాపు అందరూ కనీసం తొలి డోసు టీకా వేయించుకున్నారు. ఇప్పుడు రెండో డోసు టీకాను 8 వారాల తర్వాత తీసుకోవాల్సిందిగా ప్రజలకు సూచిస్తున్నారు.

దీనిపై అధ్యయనం కోసం 2020 చివర్లో, 2021 తొలి నాళ్లలో వేర్వేరు వ్యవధుల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 503 మంది ఎన్‌హెచ్‌ఎస్ సిబ్బంది రోగ నిరోధక ప్రతిస్పందనలను పోల్చి చూశారు.

రెండో డోసు తీసుకున్న నెల రోజుల తర్వాత వారి రక్తంలోని యాంటీ బాడీల స్థాయిల్ని లెక్కించారు.

టీకా

ఫొటో సోర్స్, Getty Images

ఆ పరిశోధనలో ఏం తేలిందంటే....

1) ఫైజర్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా టీకా తీసుకున్న వారిలో శక్తివంతమైన ఇమ్యూనిటీ వ్యవస్థ ఏర్పడింది.

2) 3 వారాల వ్యవధిలో టీకా తీసుకున్న వారిలో 10 వారాల వ్యవధి తర్వాత టీకా తీసుకున్న వారికన్నా తక్కువ యాంటీబాడీలు ఏర్పడ్డాయి.

3) తొలి డోసు తీసుకున్న తర్వాత యాంటీబాడీలు నిస్తేజమైన సమయంలో శరీరంలోని ఇతర ఇమ్యూన్ కణాలైన టీ-కణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.

4) సుదీర్ఘ వ్యవధి తర్వాత రెండో టీకా తీసుకుంటే టీ-కణాల సంఖ్య తగ్గిపోయింది. కానీ అధిక శాతంలో ఏర్పడిన సహాయక టీ-కణాలు ఇమ్యూనిటీకి మద్దతుగా నిలిచాయి.

ఒక్క డోసు కన్నా రెండు డోసుల టీకా తీసుకోవడం ఉత్తమం. కానీ పరిస్థితులకు అనుగుణంగా రెండో డోసు టీకా తీసుకునే సమయంలో వెసులుబాటు కల్పించుకోవాలి అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పిచ్ స్టడీ జాయింట్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ సుసానా డనచీ తన అధ్యయనంలో వెల్లడించారు.

'ప్రస్తుతం యూకేలో ఉన్న పరిస్థితి ప్రకారం 8 వారాల వ్యవధి సమంజసంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఇప్పుడక్కడ డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉంది' అని సుసానా పేర్కొన్నారు.

'దుర‌దృష్ట‌వ‌శాత్తు, ఈ వైరస్ అంతమవుతుందని నాకు అనిపించడం లేదు. కాబట్టి దాన్నినుంచి కాపాడుకునేందుకు మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ నివారణ ఉపాయాలను అనుసరించాలి' అని అన్నారు.

న్యూ కాసల్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్త డాక్టర్ రెబెక్కా పేన్ మాట్లాడుతూ 'రెండు డోసుల టీకా ఏ వ్యవధిలో తీసుకున్నా... సార్స్ కోవ్ 2 వైరస్‌కు వ్యతిరేకంగా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు కలుగజేస్తుందని మన అధ్యయనం రుజువు చేసింది.

ఈ అధ్యయనం అందించిన క్లినికల్ ప్రాముఖ్యతను మరింత బాగా అర్థం చేసుకునేందుకు మనం తదుపరి పరిశోధనలు నిర్వహించాలి' అని అన్నారు.

ఫైజర్ వ్యాక్సిన్ ఒక్క డోసు ... వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్యను, మరణాలను తగ్గించినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వాస్తవ డేటా ప్రకారం తెలుస్తోంది.

వీడియో క్యాప్షన్, కోవిడ్ వ్యాక్సీన్ సెక్స్ హార్మోన్లపై ప్రభావం చూపిస్తుందా?

మిమ్మల్ని మీరు కాపాడుకోండి

'పిచ్ స్టడీ అధ్యయనంలో వెల్లడైన అంశాలు కేవలం యూకేకు మాత్రమే కాకుండా ప్రపంచమంతటికీ చాలా ముఖ్యమైనవి.

కోవిడ్-19కు వ్యతిరేకంగా మన రోగనిరోధక శక్తి పనితీరును మరింత బాగా అర్థం చేసుకునేందుకు, రెండు డోసుల వ్యాక్సిన్ ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి' అని వ్యాక్సిన్ మినిస్టర్ నధీమ్ జహావి అన్నారు.

'వయోజనులందరికీ వ్యాక్సిన్ అందించే అంశంలో మేం 'జాయింట్ కమిటీ ఆన్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్' (జేసీవీఐ) సలహా ప్రకారం డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 8 వారాలకు కుదించాం.

డెల్టా వేరియంట్ నుంచి ప్రజల్ని రక్షించేందుకే ఈ చర్య తీసుకున్నాం. తాజా అధ్యయనాలు ఈ నిర్ణయం సరైనదేనని రుజువు చేస్తున్నాయి.

మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారిని కాపాడేందుకు వయోజనులందరూ రెండు డోసుల టీకా తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. సెప్టెంబర్‌లో బూస్టర్ జాబ్ డోస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం' అని జహావి వివరించారు.

యూకేలో కరోనాను అడ్డుకునేందుకు ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనికా, మోడెర్నా టీకాలతో పాటు ఫైజర్ వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తున్నారు.

రెండు డోసుల మధ్య తొలుత సిఫారసు చేసిన 3 వారాల వ్యవధిని మరింత కాలం పొడిగించాలని యూకే తీసుకున్న నిర్ణయానికి ఈ పరిశోధన ఊతమిచ్చినట్లయిందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)