పెట్రోల్‌తో దాడి: ''ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సర్పంచ్'' - Newsreel

ఉపాధి హామీ పనులపై మొదలైన వివాదం పెట్రోల్‌తో దాడి వరకు వెళ్లింది.
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఈజీఎస్ (ఉపాధిహామీ) కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
''బధిరుడైన టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై ఉపాధిహామీ కార్యాలయంలోనే సాంవ్లీ గ్రామ సర్పంచ్ లాయేవార్ సాయినాథ్ పెట్రోలు పోసి హత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నాం''అని భైంసా రూరల్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.
నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
కాలిన గాయాలైన రాజును స్థానికులు భైంసా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు.
''ఏం జరిగిందో తెలియదు సర్. మీ ఆయనపై ఎవరో పెట్రోల్ పోసి నిప్పు అంటించారని ఫోన్ వచ్చింది. వెంటనే వచ్చేసరికి ఆయన కాలిన గాయాలతో ఉన్నారు''అని రాజు భార్య అంకిత తెలిపారు.
కోవిడ్-19: భారత్‌లో తొలి కరోనా రోగికి మళ్లీ సోకిన కోవిడ్

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో అధికారికంగా నమోదయిన తొలి కోవిడ్ రోగికి తిరిగి కరోనా సోకింది. ఆమె కేరళకు చెందిన ఒక వైద్య విద్యార్థిని. 2020లో మెడిసిన్ చేయడానికి చైనాలోని వూహాన్‌కు వెళ్లారు.
తాజాగా ఆమెకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ రాగా, యాంటిజెన్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపినట్లు పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.
అయితే ఆమెకు కోవిడ్ లక్షణాలేవీ కనిపించటం లేదని త్రిస్సూర్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ కేజె రీనా తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రఫియా (అసలు పేరు కాదు) 2020లో ఆమె చైనాలోని వుహాన్‌లో మెడిసిన్ చదివారు.
వుహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ఆమె భారతదేశానికి వచ్చారు. కరోనా సోకిన తర్వాత ఆమె పడిన ఇబ్బందులను గతంలో ఆమె బీబీసీకి వివరించారు.
అప్పుడేం జరిగింది
మొదటిసారి తనకు కరోనా సోకిన విషయం టీవీ వార్తాలు చూసినప్పుడే తెలిసిందని అప్పట్లో ఆమె వివరించారు. ఆమెతోపాటు నలుగురు కరోనా పేషెంట్లు ఆసుపత్రిలో చేరారు. తర్వాత వారంతా డిశ్ఛార్జ్ కాగా, ఆమె మాత్రం ఆసుపత్రి నుంచి బైటికి రాలేదు.
‘‘ టెస్ట్ రిపోర్టులు ఆలస్యమవుతున్నాయంటూ నన్ను ఆపారు. అసలేం జరుగుతుందో అర్ధం కాలేదు. ఎవరూ ఏమీ చెప్పలేదు’’ అని రఫియా అప్పట్లో వెల్లడించారు.
’’నన్ను ఎవరూ లేని ప్రదేశంలో కూర్చోబెట్టారు. అప్పుడే నా ఫ్రెండ్ నుంచి నాకు ఒక న్యూస్ క్లిప్ వచ్చింది. వూహాన్ నుంచి వచ్చిన ఒక మెడికల్ విద్యార్ధిని కరోనా సోకిందని అందులో చెబుతున్నారు. ఆ టీవీ క్లిప్ చూశాక, ఆ కోవిడ్ వైరస్ బాధితురాలిని నేనేనని నాకు అర్ధమైంది’’ అని ఆమె వెల్లడించారు.
జనవరి 30న ఆమెను దేశంలో తొలి కరోనా రోగిగా ప్రకటించారు. ఆ వెంటనే అధికారులు ఆమె తల్లిని కూడా త్రిస్సూర్‌లోని ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు.
తల్లీ కూతుళ్లు ఒకే ఆసుపత్రిలో ఉన్నా ఒకరినొకరు కలుసుకునే పరిస్థితి లేదు.
‘‘కోల్‌కతా, కోచి ఎయిర్ పోర్టులలో నాకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. కానీ, అప్పుడే ఏమీ తెలియలేదు’’ అన్నారామె.
పరిస్థితులు చక్కబడ్డాక తన మెడికల్ కోర్సును పూర్తి చేయడానికి తిరిగి వూహాన్ వెళతానని రఫియా అన్నారు.

కోవిడ్ వ్యాక్సీన్: రెండు వేర్వేరు కంపెనీల టీకాలు తీసుకోవడం ప్రమాదకరమన్న WHO
ఒక డోసు ఒక కంపెనీ టీకా, రెండో డోసుగా మరో కంపెనీ వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్న వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. ఇలా వ్యాక్సీన్‌లు తీసుకోవడం ప్రమాదకరమని డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు.
సోమవారంనాడు ఆన్‌లైన్ బ్రీఫింగ్‌లో మాట్లాడిన ఆమె ''ఇది ప్రమాదకర ధోరణిగా మారుతోంది. వివిధ టీకాలను కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయన్న దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు, డేటా అందుబాటులో లేవు'' అన్నారు.
రెండు డోసులు, మూడు డోసులు, నాలుగు డోసులు అంటూ ఎన్ని డోసులు వేసుకోవాలో సామాన్యులే నిర్ణయిస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
ఇరాక్: కోవిడ్ వార్డులో అగ్నిప్రమాదం, 50మందికి పైగా మృతి
ఇరాక్‌లోని నసిరియా నగరంలోని ఓ కోవిడ్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో అగ్నిప్రమాదం జరగడంతో 50 మందికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదానికి కారణాలు అధికారికంగా తెలియరాలేదు.
కానీ ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
బాధితుల కుటుంబ సభ్యులు న్యాయం కోరుతూ ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు.
ఆసుపత్రి యజమానిని అరెస్ట్ చేయాల్సిందిగా ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ ఖదెమి ఆదేశించారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రమాదం జరిగిన కోవిడ్ వార్డును 70 బెడ్ల సామర్థ్యంతో 3 నెలల కిందటే నిర్మించినట్లు అసోసియేట్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీకి ఇరాక్ వైద్యాధికారులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన సమయంలో 63మంది రోగులు వార్డులో ఉన్నట్లు అక్కడి ప్రాంతీయ ఆరోగ్య అధికారి తెలిపారు.
'కరోనా వార్డు లోపల పెద్ద పేలుడు శబ్ధాన్ని నేను విన్నాను. ఆ వెంటనే మంటలు చెలరేగాయి' అని ఆసుపత్రి గార్డు తెలిపినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
'ఇరాక్ ప్రజల ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. ఇలాంటి వైఫల్యాలకు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయం' అని ఇరాక్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ అల్ హల్బసీ ట్వీట్ చేశారు.
దేశ రాజధాని బాగ్దాద్‌లో ఏప్రిల్ నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలడంతో మంటలు చెలరేగి 82 మంది కన్నుమూశారు.
ఈ ఘటన తర్వాత ఆరోగ్య మంత్రి హసన్ అల్ తమిమీ పదవికి రాజీనామా చేశారు.
ఏళ్ల తరబడి యుద్ధాలు, నిర్లక్ష్యం, అవినీతితో సతమతమవుతోన్న ఇరాక్ హెల్త్ సర్వీస్‌ను కరోనా మహమ్మారి మరింత కుంగదీసింది.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం ఇరాక్‌లో ఇప్పటివరకు 14లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 17,000 మంది వైరస్‌కు బలయ్యారు.
దాదాపు 4కోట్ల జనాభా ఉన్న ఇరాక్ ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా ప్రజానీకానికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్‌ను అందించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
- శిరీష బండ్ల, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్: అంతరిక్షాన్ని గెలుస్తున్న భారతీయ మహిళలు
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























