కరోనావైరస్: బ్రిటన్‌లో మూడో వేవ్ మొదలైందని శాస్త్రవేత్తల హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేటీ రైట్
- హోదా, బీబీసీ న్యూస్
- ప్రచురణ
బ్రిటన్‌లో కరోనావైరస్ మూడో వేవ్ తొలి దశలో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరైన శాస్త్రవేత్త హెచ్చరించారు.
రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో పెరుగుదల కాస్త తక్కువగానే కనిపిస్తోందని, భారత్‌లో భారీగా విజృంభిస్తున్న కొత్త కోవిడ్ వేరియంటే ఇక్కడ కేసుల పెరుగుదలకు కారణమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రవీ గుప్తా వ్యాఖ్యానించారు.
ఇంగ్లండ్‌లో కోవిడ్ ఆంక్షలను జూన్ 21న ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆయన చెప్పారు.
ఆంక్షలను ఎత్తివేసే ఆలోచనను వాయిదా వేసే నిర్ణయాన్ని తాము పరిశీలిస్తున్నట్లు పర్యావరణ మంత్రి జార్జ్ యుస్టిస్ కూడా వ్యాఖ్యానించారు.
ఆదివారం బ్రిటన్‌లో 3,000కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు ఇలా 3,000కు మించడం వరుసగా ఇది ఐదో రోజు.
అక్టోబరు 12 తర్వాత మళ్లీ ఇప్పుడే కేసులు 3,000 మార్కును దాటాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘బ్రిటన్‌లో మూడో వేవ్ ఇప్పటికే మొదలైంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో నాలుగింట మూడొంతులకు భారత్‌లో విజృంభిస్తున్న కొత్త వేరియంటే కారణం’’అని బీబీసీ రేడియో 4 కార్యక్రమంలో ప్రొఫెసర్ గుప్తా చెప్పారు.
‘‘ప్రస్తుతానికి కేసులు కాస్త తక్కువగానే కనిపించొచ్చు. అన్ని వేవ్‌లూ మొదట్లో కేసులు తక్కువగా ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ లోలోపల కేసులు పెరుగుతూనే ఉంటాయి. ఒక్కసారిగా ఇవి పెరిగినట్లు కనిపిస్తాయి. ఆ సంకేతాలు ఇప్పటికే మనకు కనిపిస్తున్నాయి’’.
‘‘బ్రిటన్‌లో వ్యాక్సీన్ తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఈ వేవ్ చాలా నెమ్మదిగా పతకా స్థాయికి వెళ్తుంది’’.
‘‘ఆంక్షలను మరికొన్ని రోజులు పొడిగించాలి. అప్పుడే మరింత సమాచారం సేకరించేందుకు అవకాశం ఏర్పడుతుంది’’.
‘‘అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తే, లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించడమే మేలు’’.

ఫొటో సోర్స్, PA Media
జూన్ 21న ఆంక్షలను సడలించడం మంచిదికాదని మరో ప్రభుత్వ సలహాదారు, ప్రొఫెసర్ ఆడమ్ ఫిన్ హెచ్చరించారు.
‘‘చాలా మంది ఆ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, మొదట పరిస్థితులను అర్థం చేసుకోవాలి’’.
‘‘ప్రస్తుతం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలనూ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే, ఆంక్షలను సడలించాలి. అప్పుడు మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశం ఉండదు’’.
‘‘భారత్‌లో విజృంభిస్తున్న కొత్త వేరియంట్ కేసులు ఇక్కడా పెరుగుతుండటంతో కొందరు ఆందోళన చెందుతుంటే, మరో మూడు వారాల్లో ఆంక్షలు ఎత్తివేస్తారని మరికొందరు సంతోషపడుతున్నారు. ఆంక్షలను సడలించాలని మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది’’అని బీబీసీ పొలిటికల్ కరస్పాండెంట్ నిక్ ఎర్డ్‌లీ విశ్లేషించారు.
‘‘మంత్రులు మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు’’.
‘‘అయితే, జూన్ 21 సడలింపుల గడువును మరికొంత కాలం పొడిగిస్తే, చాలా మందికి రెండో డోసు వ్యాక్సీన్ ఇవ్వడం పూర్తవుతుంది. దీంతో వైరస్‌పై మెరుగ్గా పొరాడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు’’.
‘‘అయితే, జూన్ 21 తర్వాత ఆంక్షలను సడలించాలా? వద్దా? అనే అంశంపై తుది నిర్ణయాన్ని జూన్ 14న తీసుకుంటారు. ఆంక్షలను సడలించకపోతే, చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాపారవేత్తలు హెచ్చరిస్తున్నారు’’.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























