పెట్రోలియం కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి 'గెలిచిన' తొమ్మిదేళ్ల బాలిక

ఫొటో సోర్స్, CHRISTIAN MONTERROSA
నల్లెలి కోబోకు తొమ్మిదేళ్ల వయసులో ఉబ్బసం, ముక్కు నుంచి రక్తం కారడం, తలనొప్పి లాంటి సమస్యలు మొదలయ్యాయి.
దక్షిణ లాస్ ఏంజలస్ ప్రాంతంలో ఆమె ఇంటి ముందున్న ఒక చమురు బావికి వ్యతిరేకంగా మొదలయిన పోరాటానికి అది ప్రారంభం.
ఆ తర్వాత కొంత కాలానికే నల్లెలి తల్లితో సహా ఆ చుట్టు పక్కల నివసించే వారు కూడా అనారోగ్యం బారిన పడటం మొదలైంది.
ఇక్కడ చాలా మంది అల్పాదాయ వర్గానికి చెందినవారే ఉంటారు. ఆ చమురు బావి మూసేవరకూ వీరంతా నిరసనలు చేశారు.
కోబో అంతటితో తన పోరాటాన్ని ఆపేయలేదు. ఆమె ఇతర ఉద్యమకారులతో, సంస్థలతో కలిసి చమురు వెలికితీతపై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ కేసులు వేశారు. ఈ కేసులో వారు విజయం సాధించారు.
ఆయిల్ కంపెనీ అల్లెన్కో చమురు బావులున్న ప్రాంతాన్ని నిర్వహించిన తీరుపై వేసిన కేసు 2021 మార్చి నెల చివరలో విచారణకు వస్తుంది. అయితే, దీని గురించి సంస్థ స్పందించలేదు. కానీ, నియంత్రణలకు కట్టుబడి ఉండేందుకు పెట్టుబడిని వెచ్చిస్తున్నట్లు గతంలో ప్రకటించింది.
స్థానికంగా నల్లెలికి దశాబ్ద కాలంగా పేరున్నప్పటికీ ఆమెను పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తో పోలుస్తారు.
అయితే, కోబోకి 19 ఏళ్ల వయసులో క్యాన్సర్ సోకడంతో తన ప్రచార కార్యక్రమాలను ఆపేశారు. ఆమె అనారోగ్యానికి కారణాలను డాక్టర్లు కనిపెట్టలేకపోయారు. మూడు శస్త్ర చికిత్సలు చేసిన తర్వాత ఆమె క్యాన్సర్ మహమ్మారిని జయించినట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, NALLELI COBO
ఇది కోబో కథ
''నేను దక్షిణ మధ్య లాస్ ఏంజలస్ యూనివర్సిటీ పార్కు ప్రాంతంలో పెరిగాను. మా ఇంటికి 30 అడుగుల దూరంలో 2009 నుంచి అల్లెన్కో సంస్థకు చెందిన చమురు బావి ఉండేది.
నేను, మా అమ్మ, నా ముగ్గురు తోబుట్టువులు, మా అమ్మమ్మ, తాతమ్మ అంతా కలిసి మొత్తం 8 మంది కుటుంబ సభ్యులం ఒకే ఇంట్లో నివసించే వాళ్ళం.
మా అమ్మ మెక్సికోకు చెందినవారు, మా నాన్న కొలంబియాకు చెందిన వారు. నాకు రెండేళ్లు ఉన్నప్పుడు ఆయనను దేశం నుంచి బహిష్కరించారు. మమ్మల్ని మా అమ్మే పెంచింది.
2010లో నాకు తొమ్మిదేళ్లు ఉండగా ఒక రోజు విపరీతమైన కడుపు నొప్పి, తల తిరగడం మొదలైంది. తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో నడవలేకపోయాను. మా అమ్మ నన్ను ఎత్తుకుని తీసుకువెళ్లాల్సి వచ్చేది. ముక్కులోంచి రక్తం విపరీతంగా కారడంతో కూర్చునే నిద్రపోవలసి వచ్చేది.
మా ఇంట్లోనే నిశ్శబ్దంగా నాపై విషప్రయోగం జరిగింది.
కానీ, నా ఒక్కరి ఆరోగ్యం మాత్రమే కాకుండా ఇంట్లో మిగిలిన వారి ఆరోగ్యం కూడా పాడయ్యిందని నెమ్మదిగా అర్థమైంది.
మా అమ్మకు 40 ఏళ్లకు, మా అమ్మమ్మకి 70 ఏళ్ళకి ఉబ్బసం వచ్చాయి. మా సోదరికి ఫైబ్రాయిడ్ సమస్యలు వచ్చాయి. మా సోదరునికి కూడా ఉబ్బసం సమస్య తలెత్తింది.
మా ఇంట్లో వాళ్లకి మాత్రమే కాకుండా మా చుట్టు పక్కల ఉండే ప్రతి ఇంట్లోనూ ఏవో ఒక ఆరోగ్య సమస్యలున్నాయని అర్ధమైంది. దీంతో అక్కడేదో సమస్య ఉందని అనిపించింది.
మాకు గాలిలోంచి కుళ్ళిన గుడ్ల వాసన వచ్చేది. ఆ వాసన ఇంటి లోపలకు చేరి చాలా సేపు ఉండిపోయేది. ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడినా, ఫ్యాన్లు వేసినా అది బయటకు వెళ్ళేది కాదు.
కొన్నిసార్లు కృత్రిమంగా జామకాయ, చాక్లెట్ వాసనలు వచ్చేవి.
మొదట్లో మా భవంతిలో ఏదైనా లీక్ అయిందేమో అని వెతికేవాళ్ళం. కానీ, కొంత మంది టాక్సికాలజిస్టులు మా ప్రాంతానికి వచ్చి మాట్లాడేవరకు మేము ఆ వాసనలేమిటో గ్రహించలేకపోయాం.
చమురు వెలికితీతకు వాడే కొన్ని రసాయనాలను, ఉద్గారాలను ఎక్కువ కాలం పీల్చడం వలన ఆరోగ్యం దెబ్బతింటుందని వారు వివరించారు.
దాంతో పీపుల్ నాట్ పోజోస్ అనే ప్రచారాన్ని ప్రారంభించాం. (పోజోస్ అంటే స్పానిష్ భాషలో బావులు అని అర్థం).
ఇంటింటికీ వెళ్లి సమస్య గురించి వివరించాం.
దాంతో, అందరూ ముందుకొచ్చి తమ ఇబ్బందుల గురించి చెప్పడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, NALLELI COBO
నేను కూడా చిన్న చిన్న నోట్స్ రాసుకుని నా బాధల గురించి వినిపించడం మొదలుపెట్టాను. అందరి ముందు బహిరంగంగా గొంతెత్తి మాట్లాడేదాన్ని.
మా గురించి లాస్ ఏంజలస్ టైమ్స్ పత్రిక ప్రచురించడంతో ఈ విషయం కాలిఫోర్నియా సెనేటర్ బార్బరా బాక్సర్ దృష్టికి వెళ్ళింది.
ఆమె ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి విచారణాధికారులను వెంటపెట్టుకుని పత్రికా సమావేశానికి వచ్చారు. వాళ్ళు చుట్టు పక్కల ప్రాంతాన్ని పరిశీలించారు.
అక్కడ వచ్చే వాసన భరించలేక వారు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయారు.
స్థానిక అధికారులు, ఫెడరల్ అధికారులు విచారణ చేపట్టిన తర్వాత అల్లెన్కో ఆయిల్ బావులను తాత్కాలికంగా మూసివేయడానికి అంగీకరించింది.
ఈ కంపెనీపై లాస్ ఏంజలస్ నగర అధికారులు వేసిన కేసులో 2016లో విజయం సాధించారు. ఆ సంస్థ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలంటే కఠినమైన నియంత్రణ చర్యలు పాటించాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది.
ఈ ప్రకటన వెలువడినప్పుడు మేమంతా చాలా సంతోషించాం. మేము 2010లో ప్రచారం మొదలు పెడితే, 2013 నాటికి ఆ బావి మూత పడింది. ఇప్పుడు అది పూర్తిగా మూసివేయాలని మేము కోరుతున్నాం.

ఫొటో సోర్స్, Courtesy Nalleli Cobo
నేను సౌత్ సెంట్రల్ యూత్ లీడర్ షిప్ కొయలిషన్ లాంటి మరి కొన్ని సంస్థలకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఈ సంస్థలన్నీ కలిసి కాలిఫోర్నియా పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను లాస్ ఏంజలస్ నగర యంత్రాంగంపై 2015లో కేసు వేశాయి.
ఈ కేసులో వారు విజయం సాధించారు. ఎవరైనా కొత్తగా చమురు బావులు తెరవాలని అనుకుంటే కొత్త విధానంలో నమోదు చేసుకోవలసి ఉంటుంది.
మేము ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చేసినప్పటికీ నేను చమురు బావులకు స్కూళ్ళు, ఆసుపత్రులు, పార్కుల మధ్య 2500 అడుగుల దూరంలో ఆరోగ్య సురక్ష బఫర్ జోన్ ఉండాలని మేము ఉద్యమం చేస్తున్నాం.
అందరిలాగే నేనొక సాధారణ అమ్మాయిని. నాకు కూడా మేక్ అప్ వేసుకోవాలని ఉంటుంది. నేను డాన్స్ చేస్తాను. ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. నేను కాలేజీలో చదువుతున్నాను.
కాకపొతే నా ఆసక్తులను నేను తొందరగానే గుర్తించాను.
నాకు క్యాన్సర్ సోకిందని తెలిశాక, శస్త్ర చికిత్స చేయించుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో మాకర్థం కాలేదు. కానీ, క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బును సమకూర్చుకోగలిగాం.
రాడికల్ హిస్టరెక్టమి చేయించుకోవడం అన్నిటి కంటే శారీరకంగా, మానసికంగా కష్టమైన విషయం. మంచం మీద నుంచి లేవడానికే ఆరు వారాలు పట్టింది. మా అమ్మ నాకు స్నానం చేయించే వారు.
నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందో నా డాక్టర్ ఇప్పటికీ గుర్తించలేకపోయారు. అయితే, నాకు వైద్య పరీక్షలు చేసి ఇది జన్యుపరంగా వచ్చింది కాదని మాత్రం తేల్చారు.
ఈ ఏడాది జనవరి 18 నాటికి నేను క్యాన్సర్ నుంచి బయటపడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. నాకు చాలా ఉల్లాసంగా సంతోషంగా అనిపించింది.
నేనిప్పుడు పౌర హక్కుల న్యాయవాది అవ్వాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత రాజకీయాలలోకి వెళ్లాలని ఉంది.
నా దృష్టిలో లింగం, జాతి, సాంఘిక ఆర్ధిక పరిస్థితులు, ప్రాంతానికి అతీతంగా పరిశుభ్రమైన గాలి పీల్చుకోగల్గడమే పర్యావరణ న్యాయానికి సరైన నిర్వచనం.
పర్యావరణ న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. ఈ పోరాటమే సమాజాన్ని, నా ఇంటిని రక్షిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా: సరస్సులో ఈదుతుంటే మొసలి పట్టుకుంది.. చివరకు దాని దవడలు చీల్చి బయటపడ్డాడు
- హైదరాబాద్: ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’.. ఒంటరి మహిళలే టార్గెట్... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- తెలంగాణ: ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. అసలైనదా? అధికారులు సృష్టించిందా?
- మదనపల్లె హత్యలు: ‘కాళికనని చెబుతూ.. నాలుక కోసి..
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























