You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఘాజియాబాద్: మురాద్‌నగర్ దుర్ఘటనలో 23కు పెరిగిన మృతుల సంఖ్య - BBC News Reel
ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్ జిల్లా మురాద్ నగర్‌లో ఒక స్మశానవాటిక పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో కనీసం 23 మంది మరణించారని, మరో 15 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
వీరంతా ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. గాయపడిన వారిని ఘాజియాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.
మరణించిన వారి బంధువులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని మీరట్ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
వర్షం పడుతుండటంతో తలదాచుకునేందుకు బాధితులంతా పైకప్పు కిందకు చేరారని, రాత్రి కూడా వర్షం పడి ఉండటంతో ఆ పైకప్పు బలహీనపడి, బాధితులపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ దుర్షటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్ దేశంలో రెండు గ్రామాలపై ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇస్లామిస్ట్ మిలిటెంట్ల చర్యగా అనుమానిస్తున్నారు.
ఈ దాడులలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోగా, 17మంది గాయపడ్డారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ రెండు గ్రామాలు కూడా నైజర్‌కు పశ్చిమాన మాలీ సరిహద్దులకు దగ్గరగా ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో మిలిటెంట్ గ్రూపులు అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయి.
శనివారం మాలిలో ఇద్దరు ఫ్రెంచ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఫ్రాన్స్ తెలిపింది.
సోమవారం మాలీలో మూడు ఫ్రెంచ్ ట్రూపులపై జరిగిన వేరే దాడిలో తమ హస్తం ఉందని అల్-ఖైదాతో సంబంధాలున్న ఒక గ్రూపు తెలిపింది.
కొన్నాళ్లుగా సహెల్ ప్రాంతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ నేతృత్వంలో వెస్ట్ ఆఫ్రికా, యూరోపియన్ కూటమి చర్యలు చేపడుతోంది.
అయినా కూడా ఆ ప్రాంతంలో మాదక ద్రవ్యాల రవాణా, మానవ అక్రమ రవాణా, జాతి హింస జరుగుతూనే ఉన్నాయి.
శనివారం నాడు దాడులు జరిగిన గ్రామాలకు సైనిక బలగాలను పంపించామని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి అల్కాచే అల్హదా తెలిపారు. అయితే, అక్కడ ఎంత ప్రాణ నష్టం జరిగిందనే వివరాలు అల్హదా తెలుపలేదు.
ఈ దాడులలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ఒక స్థానిక అధికారి తెలిపారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. 50మంది వరకూ చనిపోయారని స్థానిక జర్నలిస్ట్ ఒకరు తెలిపారు.
ఈ ప్రాంతాలలో గత కొన్నేళ్లుగా జిహాదీ దాడులు జరుగుతూనే ఉన్నాయి.
దిల్లీ సరిహద్దులో చలిని, వర్షాన్ని లెక్కచేయకుండా రైతుల నిరసన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనల 40వ రోజు కొనసాగుతోంది. దిల్లీ పరిసరాల్లో వర్షం కురుస్తున్నా, చలి తీవ్రంగా ఉన్నా లెక్కచేయకుండా రైతులు ఆందోళన కొనసాగుతున్నారు.
ఆదివారం ఉదయం వర్షం కురవడంతో సింగు సరిహద్దు వద్ద రోడ్డుపై నీరు నిలిచింది. రైతులు అక్కడే గుడారాలు వేసుకుని ఉన్నారు.
ట్రాక్టర్లపై పరదాలు కప్పి వాటి కింద తలదాచుకున్నారు.
ఇప్పటి వరకు రైతు సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య ఏడుసార్లు చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలు సఫలం కాలేదు.
దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు నిరసన తెలుపుతున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జో బైడెన్‌ను కిందకు లాగేందుకు రిపబ్లికన్ సెనేట్ల చివరి ప్రయత్నాలు
2020 నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ అంశంలో ఒక దర్యాప్తు కమిటీని నియమించేంతవరకూ జో బైడెన్ విజయాన్ని ఆమోదించేది లేదని కొందరు సెనేట్లు అంటున్నారు.
జనవరి 6న జరగాల్సిన ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్ల అధికారిక లెక్కింపును 10 రోజులు వాయిదా వేయాలని టెక్సస్ సెనేటర్ టెడ్ క్రూజ్ నేతృత్వంలోని 11 మంది సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, ఎన్నికల చట్టం అమలులో ఉల్లంఘనలు జరిగాయని వీరు ఆరోపిస్తున్నారు.
అయితే, వీరి డిమాండ్‌ను అమెరికా పార్లమెంట్ ఆమోదించే సూచనలు కనిపించట్లేదు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా బైడెన్ విజయాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తూ వచ్చారు. ఓట్ల లెక్కింపులో మోసం జరిగిందని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే, ఆయన చేసిన ఆరోపణలన్నిటినీ కోర్టు తోసిపుచ్చింది.
ఎలక్ట్రోరల్ కాలేజ్ ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ ఎలక్ట్రోరల్ ఓట్ల లెక్కింపులో లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ నెల 6న పార్లమెంట్‌లో రెండు గంటల పాటు చర్చ నిర్వహిస్తారు. ఆ తరువాత ఓటింగ్ ఉంటుంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అధికారికంగా పూర్తి అవుతుంది.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
నాన్సీ పెలోసీ, మిచ్ మెక్‌కానల్ ఇళ్లపై అల్లరిమూక దాడి
అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్‌కానల్ ఇళ్లపై అల్లరిమూక దాడి చేసింది.
కాలిఫోర్నియాలో పెలోసీ ఇంటిముందు నకిలీ రక్తపు మరకలు, ముక్కలుగా కోసిన పంది తల, గోడలపై రాతలు కనిపించాయని కథనాలు వచ్చాయి.
పిచ్చి గీతలతో పాటూ "నా డబ్బు ఎక్కడ (వేర్ ఈజ్ మై మనీ)" అని కెంటకీలోని మెక్‌కానల్ ఇంటి గోడలపై రాశారు.
కరోనావైరస్ ఉద్దీపన ప్యాకేజీ విషయంలో జరుగుతున్న రాజకీయ గొడవల నేపథ్యంలో అల్లరిమూకలు ఈ దాడికి పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు.
ఈ ప్యాకేజీలో భాగంగా అమెరికన్లకు అందిస్తున్న నగదు సాయాన్ని 600 డాలర్ల నుంచి 2,000 డాలర్లకు పెంచాలానే ప్రతిపాదనకు మంగళవారం అమెరికా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 40 మంది రిపబ్లికన్లు కూడా దీనికి ఆమోదం తెలుపడంతో డెమొక్రటిక్ నేతృత్వంలోని సభ ఈ బిల్లును పాస్ చేసింది.
అయితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పటికీ, రిపబ్లికన్లు మెజారిటీలో ఉన్న సెనేట్ దీనికి ఆమోదం తెలుపలేదు.
"రుణాలుగా తెచ్చిన సొమ్మును సహాయం అవసరం లేని డెమొక్రటిక్ శ్రేయోభిలాషుల చేతుల్లో పెట్టడానికి సెనేట్ అంగీకరించలేదు. ఈ విషయంలో సెనేట్ ఎలాంటి బెదిరింపులకు లొంగదు" అని మెక్‌కానల్ బుధవారం వ్యాఖ్యానించారు.
ఈ సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)