‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’: హైదరాబాద్ నగరంలో భగభగ మండుతున్నట్లున్న వేడికి ఇదే కారణమా, నగరం రిస్క్ స్కోర్ ఎంతంటే...

2026 ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 మధ్య కాలంలో 47 రోజులపాటు హైదరాబాద్ నగరంలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత తీవ్రతకు ఇదొక నిదర్శనం.

నగరం విస్తరించే కొద్దీ పచ్చదనం తగ్గుతూ, కాంక్రీటు కట్టడాలు పెరుగుతున్నాయి. దీని ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

భవిష్యత్తులోనూ హైదరాబాద్ నగరం తీవ్రమైన వేడి పరిస్థితులు ఎదుర్కొనే ముప్పు ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం స్పష్టం చేసింది.

'అర్బన్ హీట్ ఐలాండ్' ప్రభావం హైదరాబాద్ నగరంపై తీవ్రంగా కనిపిస్తోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొత్తం 205 నగరాలపై అధ్యయనం

ప్రపంచవ్యాప్తంగా వేడి తీవ్రత ముప్పు ఉన్న నగరాలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. 10లక్షలకు పైబడి జనాభా ఉన్న 205 నగరాలపై అధ్యయనం చేసినట్లుగా పరిశోధకులు చెప్పారు.

పరిశోధనకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన నేత్మి జయరత్నే కరియవాసం, జీసస్ లిజాన, రాధిక ఖోస్లా నేతృత్వం వహించారు.

మొత్తం ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల ముప్పు ఉన్న 50 నగరాల జాబితాను విడుదల చేశారు.

హైదరాబాద్‌కు 31వ స్థానం

జాబితాలో హైదరాబాద్ 31 స్థానంలో నిలిచింది. మొత్తం భారత్ నుంచి 14 నగరాలు జాబితాలో ఉన్నాయి. ఈ నగరాలన్నీ అధిక ఉష్ణోగ్రత లేదా వేడి ముప్పు ఎదుర్కొనున్నట్లుగా అధ్యయన ఫలితాలు స్పష్టం చేశాయి.

ఈ పరిశోధన ఫలితాలు 'సైన్స్ డైరెక్ట్' ప్రచురించే ఎల్స్‌వేర్ జర్నల్లో ''మూవింగ్ బియాండ్ ఎక్స్ పోజర్ ; ఎ గ్లోబల్లీ కంపారబుల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ హీట్ రిస్క్ అసెస్మెంట్ ఇన్ సిటీస్'' పేరిట ఈ ఏడాది మే నెలలో ప్రచురితమయ్యాయి.

అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏయే రంగాలపై ప్రభావం పడుతుంది? ఏ వయసుల వారిపై ఎలా ఉంటుందనే వివరాలను పరిశోధకులు ప్రకటించారు.

‘‘ముసలివాళ్లు, పిల్లలు, అసంఘటిత రంగ కార్మికులు వంటివారిపై వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది వారి ఆర్థిక, జీవనశైలిపై ప్రభావం చూపుతుంది'' అని పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.

భారత్ నుంచి 14 నగరాలకు చోటు

హైదరాబాద్ సహా భారత్ నుంచి 14 నగరాలు అధిక ఉష్ణోగ్రతల ముప్పు బారిన ఉన్నట్లుగా పరిశోధకులు ప్రకటించారు.

మొత్తం 50 నగరాల జాబితాలో అహ్మదాబాద్ ప్రపంచవ్యాప్తంగా రెండోస్థానంలో ఉండగా, నాగ్‌పూర్ నాలుగో స్థానం, మదురై ఏడో స్థానం, భోపాల్ 15వ స్థానం, కాన్పుర్ 20 వ స్థానంలో ఉన్నాయి.

ఇవి కాకుండా పుణె, పట్నా, బెంగళూరు, కోల్‌కత్తా, జైపుర్, లఖ్‌నవూ, ముంబయి, చెన్నై నగరాలు ఉన్నాయి.

''మూడు అంశాల ఆధారంగా ఉష్ణోగ్రతల ప్రభావం, పెరుగుదలపై అధ్యయనం జరిగింది. ప్రజలపై పడే ప్రమాద తీవ్రత, వేడి తీవ్రతకు గురవడం, విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం అంశాల ఆధారంగా రిస్క్ స్కోర్ సిద్ధం చేశాం'' అని పరిశోధన పత్రంలో పరిశోధకులు పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో వేడి తీవ్రత విషయంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ జీఎన్ఎస్ఎస్ శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడారు.

''గత కొన్నేళ్లలో నగర విస్తీర్ణం రెండు, మూడింతలు పెరిగింది. లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్‌హౌస్ వాయవులు (CO2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి) బాగా విడుదల అవుతున్నాయి. ఈ వాయువులు వాతావరణంలోని వేడిని బయటకు వెళ్లనివ్వవు. పరిశ్రమలు, వాహన కాలుష్యం కలిసి వేడిని మరింత పెంచుతున్నాయి" అని శ్రీనివాసరావు చెప్పారు.

చెరువుల సంఖ్య తగ్గిపోవడం కూడా అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావానికి కారణంగా కనిపిస్తోందని సామాజిక ఉద్యమకారిణి లుబ్నా సార్వత్ అన్నారు.

''ఒకప్పుడు హైదరాబాద్ అంటే చెరువులు ఎక్కడ చూసినా కనిపించేవి. అవి రానురాను కనుమరుగు అవుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా చెరువు మాయం అయ్యాయి. ఉన్న చెరువులు కూడా కబ్జాల బారిన పడ్డాయి. ఇది విపత్తులకు దారితీస్తోంది" అని చెప్పారామె.

అయితే, చెరువుల ఆక్రమణలను అడ్డుకునేందుకు హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

భారత్ నుంచి మిగిలిన నగరాలు ఏవి?

ప్రపంచవ్యాప్తంగా వేడి తీవ్రత ముప్పు ఉన్న 50 నగరాల గురించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన జాబితాలో ఇరాక్ లోని అల్ బస్రా మొదటిస్థానంలో నిలిచింది. ఆయా రిస్క్ కారణాల ఆధారంగా ఈ నగారానికి సమగ్ర రిస్క్ స్కోర్ 0.83గా వచ్చింది.

రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్ కు 0.79గా వచ్చింది. ఇక హైదరాబాద్ కు 0.68గా రిస్క్ స్కోర్ వచ్చింది.

ఈ రిస్క్ స్కోర్ అంచనా ఆధారంగా మున్ముందు వేడి తీవ్రత తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

''మా అధ్యయనంలో అధిక హీట్ రిస్క్ ఉన్న నగరాలు సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియా, సబ్ సహరన్ (సహరా ఎడారికి దక్షిణ ప్రాంతం) ఆఫ్రికా ప్రాంతంలోనే 95శాతం ఉన్నాయి'' అని పరిశోధనా పత్రంలో పరిశోధకులు పేర్కొన్నారు.

''వేడితో సంబంధం ఉన్న ఆరోగ్య, సామాజిక ప్రభావాల వంటి ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల వాస్తవ ప్రభావాలను మరింత కచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల వాతావరణ మార్పులకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించడానికి సహాయపడుతుంది'' అని ఆ రిసర్చ్ పేపర్‌లో ఉంది.

ప్రణాళికబద్ధ అభివృద్ధి జరగాలి- పురుషోత్తం రెడ్డి

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని అంటున్నారు పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి.

''గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో అనియంత్రిత పట్టణీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రకృతి వనరులు ధ్వంసం అవుతున్నాయి. ప్రణాళిక బద్దమైన అభివృద్ధి జరగడం లేదు. ఆ ప్రభావమే ఉష్ణోగ్రతలపై పడుతోంది'' అని చెప్పారు.

పచ్చదనాన్ని తిరిగి పెంపొందించడం, పట్టణీకరణను ప్రణాళికబద్ధంగా చేపట్టడం, చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని ఆయన సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)