ఇండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం.. మూడు రోజుల్లోనే ముగిసిన మొదటి టెస్ట్

ఆస్ట్రేలియా జట్టు

ఫొటో సోర్స్, EPA

ప్రచురణ

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య అడిలైట్‌లో జరుగుతున్న మొదటి డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది.

8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఈ టెస్టును గెలిచి, నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

ఆస్ట్రేలియా జట్టు 21 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి ఐదు రోజుల మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించింది.

ఓపెనర్లు జో బర్న్స్ 51 పరుగులు, మాథ్యూ వేడ్ 33 పరుగులు చేశారు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయిన భారత్

భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇది.

1974లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌పై 17 ఓవర్లలో 42 పరుగులకు ఆలౌట్ అయినదే ఇప్పటి వరకూ భారత జట్టుకు అత్యల్ప స్కోరుగా ఉండేది. 46 ఏళ్ల తర్వాత కోహ్లీ జట్టు ఈ రికార్డును తిరగరాసింది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 74 పరుగులు, చటేశ్వర్ పుజారా 43 పరుగులు, అజింక్య రహానే 42 పరుగులు చేశారు.

బదులుగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో టిమ్ పైన్ అత్యధికంగా 73 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు కూల్చారు.

తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం సాధించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 21.2 ఓవర్లు మాత్రమే ఆడి 36 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఒక్క బ్యాట్స్‌మన్ కూడా రెండంకెల స్కోరును చేరుకోలేదు.

ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే ఈ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు. ఆ తర్వాత హనుమ విహారి 8 పరుగులు చేయగా, పృథ్వి షా, విరాట్ కోహ్లీ, వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్ తలో 4 పరుగులు, బుమ్రా 2 పరుగులు, షమీ ఒక పరుగు చేశారు. పుజారా, రహానే, అశ్విన్ డకౌట్ అయ్యారు.

ఆస్ట్రేలియా తరపున ముగ్గురు బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేయగా.. వారిలో హేజీవుడ్ 5 వికెట్లు, పాట్ కమిన్స్ 4 వికెట్లు కూల్చారు.

ఇండియా vs ఆస్ట్రేలియా మొదటి పింక్ బాల్ టెస్ట్

ఫొటో సోర్స్, EPA

15 పరుగుల వద్ద నాలుగు వికెట్లు ఔట్..

తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగుల వద్ద పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. దీంతో బుమ్రా నైట్ కీపర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు.

రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు రెండో ఇన్సింగ్‌లో 1 వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది.

మూడో రోజు మరో 27 పరుగులకే మిగతా 9 వికెట్లూ కోల్పోయింది.

జట్టు స్కోరు 15 పరుగుల వద్ద బుమ్రా, పుజారా, మయాంక్ అగర్వాల్, అజింక్య రహానేల వికెట్లు కోల్పోయింది.

19 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్ కాగా, 26 పరుగలు వద్ద సాహా, అశ్విన్ ఔటయ్యారు.

31 పరుగుల వద్ద హనుమ విహారి వెనుదిరగగా, 36 పరుగల వద్ద షమీ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)