పాకిస్తాన్ కొత్త చట్టం: అత్యాచార దోషులను 'నపుంసకులు'గా మార్చేలా కఠిన నిబంధన : BBC Newsreel

ప్రచురణ

అత్యాచారం కేసులు తగ్గించడానికి పాకిస్తాన్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. కేసులను త్వరగా విచారించి, కఠిన శిక్షలు విధించే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు.

అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి విధించే కఠిన శిక్షల్లో 'కెమికల్ కాస్ట్రేషన్' (దోషిని రసాయనాల ద్వారా నపుంసకుడుగా మార్చడం) నిబంధన కూడా ఉంది.

పాకిస్తాన్ అధ్యక్షుడు మంగళవారం ఈ కొత్త అత్యాచార నిరోధక చట్టానికి ఆమోదముద్ర వేశారు.

ఈ ఆర్డినెన్స్ ప్రకారం, లైంగిక నేరాల్లో ప్రమేయం ఉన్న వారికి ఒక నేషనల్ రిజిస్టర్ రూపొందిస్తారు. అత్యాచార బాధితురాలి గుర్తింపు రహస్యంగా ఉంచాలని నిర్ణయించారు. వీటితోపాటూ కొంతమంది నేరస్థులకు మందులు ఇచ్చి వారిని నపుంసకులుగా మార్చే నిబంధనను చేర్చారు.

అత్యాచార కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఈ కోర్టుల్లో నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి, తీర్పు ఇస్తారు.

లాహోర్‌లో దారుణ ఘటన

లాహోర్ శివార్లలో ఒక మహిళపై గ్యాంగ్ రేప్‌ జరగడంతో, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో లాహోర్ వైపు వస్తున్నప్పుడు, హైవే పక్కనే ఆమెపై అత్యాచారం చేశారు. ఇది జరుగుతున్నప్పుడు మహిళ పిల్లలు అక్కడే ఉన్నారు.

"ఈ గ్యాంగ్ రేప్ జరగడానికి ఒక విధంగా బాధితురాలు కూడా కారణమే" అని ఘటన జరిగిన తర్వాత రోజు లాహోర్‌లోని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ఆయన వ్యాఖ్యలు పాకిస్తానీలకు మరింత ఆగ్రహం తెప్పించాయి.

ఆ తర్వాత ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీంతో, అత్యాచారాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది.

కొత్త చట్టంపై విమర్శలు

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన క్యాబినెట్ గత నెలలో ఈ ఆర్డినెన్సుకు ఆమోదముద్ర వేశారు. దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ మంగళవారం దీనిపై సంతకం చేశారు.

ఇమ్రాన్ ఖాన్ పాలనకు ఇక 120 రోజులే మిగిలుంది. ఆలోపు ఆయన ఈ చట్టాన్ని పార్లమెంటులో పాస్ చేయించాలి. అలా, దీనికి శాశ్వత చట్టం హోదా వస్తుంది. అప్పటివరకూ ఈ చట్టం అమల్లో ఉంటుంది.

అయితే, పాకిస్తాన్‌లో కొంతమంది కొత్త చట్టంపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని, దీనికి సిద్ధమయ్యే ముందు ప్రభుత్వ అధికారులు చట్టంపై తగిన చర్చ జరపలేదని అంటున్నారు.

కెమికల్ కాస్ట్రేషన్

కొన్ని దేశాల్లో 'కెమికల్ కాస్ట్రేషన్(మందులతో నపుంసకుడుగా మార్చడం) నిబంధన ఉంది.

లైంగిక నేరాల కేసుల్లో దోషులకు మందుల ద్వారా టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను తగ్గించి నపుంసకుడుగా మారుస్తారు.

ఇండోనేషియాలో చిన్నారులపై లైంగిక నేరానికి పాల్పడేవారికి కెమికల్ కాస్ట్రేషన్ విధించే నిబంధనను 2016లో తీసుకొచ్చారు.

పోలెండ్‌లో పిల్లలపై అత్యాచారం చేసేవారికి 2009 నుంచీ ఈ శిక్షను అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)