You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా ఎన్నికలు: ఎలక్టోరల్ కాలేజ్ నిర్ధరణ తరువాత బైడెన్‌ను అభినందించిన పుతిన్ - BBC Newsreel
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా అభినందనలు తెలిపారు. అయితే, బైడెన్‌ను చాలా ఆలస్యంగా అభినందించిన నేతల్లో పుతిన్ కూడా ఒకరు.
నవంబరులోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పటికీ అధికారికంగా ఫలితాలు తేలిన తరువాతే బైడెన్ విజయాన్ని గుర్తిస్తామని రష్యా గతంలో తెలిపింది.
బైడెనే విజేత అని సోమవారం ఎలక్టోరల్ కాలేజ్ నిర్ధరించింది. నవంబరు 3న అధ్యక్ష ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే చాలామంది ప్రపంచ నేతలు బైడెన్‌ను అభినందించారు.
బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి పుతిన్‌కు, ఆయనకు మధ్య సంబంధాలు అంత బాగా లేవు.
నవంబరు 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థిగా పోటీ చేసిన బైడెన్‌కు 306 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు రాగా రిపబ్లికన్ నేత డోనల్డ్ ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి.
సోమవారం ఎలక్టోరల్ కాలేజ్ బైడెన్ విజయాన్ని నిర్ధరించడంతో ఆయన అధ్యక్ష పదవి చేపట్టడానికి దారులు పూర్తిగా తెరుచుకున్నాయి.
బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజ్ నిర్ధరిస్తే తాను జనవరిలో అధ్యక్ష కార్యాలయాన్ని వీడుతానని గత నెలలో ట్రంప్ తెలిపారు.
కాగా 'విజయం సాధించినందుకు అభినందనలు. మీతో సహకారం, సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నాం' అని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నట్లు రష్యా వెల్లడించింది.
ప్రపంచ భద్రత, స్థిరత్వం విషయంలో బాధ్యత ఉన్న రష్యా, అమెరికాల మధ్య విభేదాలున్నా కూడా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి సహాయపడగలవని పుతిన్ విశ్వాసం కనబరిచారని రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రకటన తెలిపింది.
అయితే, పుతిన్‌ను ఆటోక్రాట్‌గా అభివర్ణించే బైడెన్ రష్యాపై కఠినంగా వ్యవహరించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.2016 నాటి ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించేందుకు రష్యా అమెరికా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుందన్న ఆరోపణలున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్.. ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లోనూ గెలుపు
సోమవారం జరిగిన చివరి యూఎస్ ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు అధిక మెజారిటీ లభించడంతో ఆయనకు అమెరికా అధ్యక్ష పదవి ఖాయమయ్యింది.
ఈ సందర్భంగా "ప్రజల అభీష్టం నెరవేరింది" అంటూ జో బైడెన్ హర్షం వ్యక్తం చేసారు.
ఈ ఫలితాల ప్రకటన తరువాత బైడెన్ మాట్లాడుతూ "యూఎస్‌లో ప్రజాస్వామ్యం గట్టి పరీక్షకు గురయ్యిందని, చివరికి విజయం సాధించిందని" అన్నారు.
ఎన్నికల ఫలితాలను సవాలు చేసిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చర్యలను విమర్శిస్తూ "పేజీ తిప్పాల్సిన సమయం ఆసన్నమైందని" అన్నారు.
బైడెన్, యూఎస్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో విజయం సాధించడం కీలకం.
అమెరికా ఎన్నికల ప్రక్రియలో మొదట ఓటర్లు 'ఎలక్టర్స్'ను ఎన్నుకుంటారు. తరువాతి దశలో ఈ ఎలక్టర్స్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. సాధారణంగా బ్యాలెట్ ఓట్ల ఎన్నికలు జరిగిన కొన్ని వారాల తరువాత ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే అధ్యక్ష పదవి ఖాయమైనట్టే.
ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో బైడెన్ 306 ఓట్లు సాధించగా, ట్రంప్ 232 ఓట్లు సాధించారు.
తరువాత ఏం జరుగుతుంది?
ఓటింగ్ ప్రక్రియ ఫలితాలు వాషింగ్టన్ డీసీకి పంపిస్తారు. జనవరి 6వ తేదీన ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అధ్యక్షతన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో అధికారికంగా లెక్కిస్తారు. దాంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
తరువాత జనవరి 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
ప్రముఖ శాస్త్రవేత్త రొద్దం నరసింహ కన్నుమూత
ప్రముఖ ఏరోస్పేస్ సైంటిస్ట్, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత రొద్దం నరసింహ (87) సోమవారం నాడు బెంగళూరులో తుది శ్వాస విడిచారు.
డిసెంబర్ 8న బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఆయన్ను బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
"ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి తీవ్రంగా ఉందని, మెదడులో రక్తం లీక్ అవుతూ ఉందని" రామయ్య మెమొరియల్ హాస్పిటల్ న్యూరోసర్జన్ తెలిపారని పీటీఐ వెల్లడించింది.
డాక్టర్ నరసింహ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లోనూ, జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జెఎన్‌సిఎఎస్ఆర్)లోనూ ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ డైరెక్టర్‌గా పనిచేసారు.
2013లో డాక్టర్ నరసింహకు పద్మ విభూషణ్ అవార్డ్ లభించింది.
రొద్దం నరసింహ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)